సీతారాముల ప్రేమ
సీతారాముల ప్రేమ
రావణ సంహారం జరిగిన తరువాత, శ్రీరాముని పట్టాభిషేకం పూర్తయ్యాక— ఒకనాడు అంతఃపురం నుంచి బంగారు కాంతిలా మెరిసిపోతున్న సీతమ్మ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నిలుచున్నదట.
చప్పుడు లేకుండా, చంటిపిల్లాడిలా బుడిబుడి అడుగులు వేసుకుంటూ శ్రీరాముడు కూడా వెనక నుంచి వచ్చి మృదువుగా ఇలా అన్నాడట— “భూమాత పుత్రికైన సీతాదేవి, ఇంత దీర్ఘంగా భూమాత వైపే చూస్తోంది ఏమిటి?”
ఆ మాట విన్న సీతమ్మ తిరిగి — “స్వామీ… ఇలా రండి” అంటూ, రాముని చేతిని దగ్గరగా పట్టుకొని, ఆ పర్యావరణంలో కిలకిలారావాలతో ఆడుకుంటున్న ఒక పక్షుల జంటను చూపించి మురిసిపోయిందట.
ఆనందంతో మురిసిపోతున్న సీతమ్మను చూసి రాముడు కూడా అంతే మురిసిపోయాడు.
ఇంతలో— హఠాత్తుగా ఒక గ్రద్ద వచ్చి ఒక పక్షిని పట్టుకొని వెళ్లిపోయింది. మిగిలిపోయిన ఆ పక్షి వేదనను చూసి సీతమ్మకు బాధ కలగడంతో రామయ్య మనసు కూడా కాస్త వెలితి చెందిందని చెప్పాలి.
ఆ మిగిలిపోయిన పక్షి శోకానికి కృంగిపోయిన సీతమ్మ రాముడిని దీనంగా చూసి ఇలా అన్నదట— “స్వామీ ఇక్కడ ఈ పక్షిలా, ఆనాడు నన్ను రావణాసురుడు అపహరించినప్పుడు మీ మనసూ ఇలానే క్షోభించి ఉంటుంది కదూ…”
ఆ మాటకు రాముడ చిన్న చిరునవ్వుతో సీతమ్మను దగ్గరకు తీసుకొని ఇలా అన్నాడట—
“దేవీ… సూర్యుని నుంచి వెలుగును, చంద్రుని నుంచి చల్లదనాన్ని, అగ్నిలోని వేడిని, వెలుగు నుంచి ఏర్పడిన నీడను, చివరికి, ఈ భూదేవి నుంచి ఈ ప్రకృతిని ఎలా వేరుచేయలేరో, నా నుంచి నిన్ను కూడా ఎప్పుడు, ఎవరు వేరుచేయలేరు, సీత. ఆనాడు బౌతికంగా నువ్వు నానుంచి దూరంగా ఉండి ఉండవచ్చు. కానీ ఆత్మగా మాత్రం నువ్వు నాతో ఎప్పుడూ కలిసే ఉన్నావు, సీతా…”
ఆ మాటలు విన్న సీతమ్మ కన్నీరు దారగా కార్చింది. ఆ కన్నీటి బొట్టును గమనించిన రామయ్య టక్కున దానిని పట్టుకొని సీతమ్మకు చూపిస్తూ ఇలా అన్నాడట— “చూడు దేవీ… చివరికి నీ కన్నీటి నుంచి కూడా నన్నెవ్వరూ వేరు చేయలేరు.” అని అనగానే,
ఆ కన్నీటి వైపు చూసిన సీతమ్మ అందులో తేజోమూర్తుడైన శ్రీరాముని ప్రతిబింబాన్ని చూసి పొంగిపోయిందట. అలా ఆనందంతో, టక్కున సీతమ్మ రాముడిని హత్తుకుందట…
వెంకట రమణ....

