STORYMIRROR

Ramana Venkat

Drama Classics Inspirational

4  

Ramana Venkat

Drama Classics Inspirational

నాన్న నేర్పిన జీవితం

నాన్న నేర్పిన జీవితం

3 mins
1

నా పేరు కార్తీక్. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఈ ఉద్యోగపు ఒత్తిడిని ఓర్వలేక, “ఉద్యోగం మానేసి సొంత ఊరిలో నాన్నతో పాటుగా పొలం పని చేసుకుంటూ గడిపేద్దాం” అని అమ్మ-నాన్నలకు చెప్పాలని ఊరికి బయల్దేరాను.

నేను మొదటిసారి ఈ లోకాన్ని చూసిన క్షణం నన్ను చూసి ఏ చిరునవ్వుతో చూశారో, నేను ఎప్పుడైనా ఇంటికి వచ్చినా అదే చిరునవ్వుతో అమ్మ-నాన్నలు నన్ను అలానే ఆహ్వానించారు. వచ్చిరాగానే మా అమ్మ— “రెండు రోజులు ఉండు… అప్పుడే అక్కడికి వెళ్లి పొడిచే పని ఏముంది?” అనే మాట అప్పుడే అనేసింది.

కానీ నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని చెప్పే మాట అమ్మను ఎంత బాధ పెడుతుందో నాకు అర్థమయ్యింది.

ఎట్టకేలకు రాత్రి అయ్యింది. అమ్మ-నాన్నలను దగ్గర కూర్చోపెట్టుకొని భయంతోనే మనసులో దాగిన ఆ మాటను చెప్పేశాను. నేను చెప్పిన మాటతో జీవితంలో మొదటిసారిగా మౌనం కూడా ఇంత భయంగా ఉంటుందని ఆ క్షణమే తెలిసింది.


కొద్దిసేపటికి నాన్న లేచి— “ఆలస్యం అయింది. అబ్బాయికి పక్క బట్టలు సర్దు… బస్సులో సరిగ్గా పడుకున్నాడో లేదో” అని చెప్పి వెళ్లిపోయాడు. భర్త మాటకు ఎదురుచెప్పని ఇల్లాలు కదా— అమ్మ కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది. సమాధానం దొరకని ప్రశ్నలతో అక్కడే నేను ఒంటరిగా మిగిలిపోయాను.

మరునాడు…

రాత్రి జరిగిన సంఘటనతో నిద్ర పట్టకపోయినా, త్వరగానే లేచి టిఫిన్ చేసేసి అరుగుపైన కూర్చుని ఉన్నాను. ఇంతలో నాన్న చేతికి ఓ పార ఇచ్చి— “రే నాన్న… ఈ రోజు సరదాగా నాతో పొలానికి రా” అంటూ తీసుకెళ్లాడు. ఆ చిన్న ప్రయాణం నాన్నతో నా చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసింది.


చివరికి మా పొలం దగ్గరకు చేరుకున్నాం. “మనది”, “మాది” అనే భావన మనిషికి ఎంత ధైర్యం ఇస్తుందో అప్పుడు అర్థమయ్యింది. “ఒరే నాన్న… ఈ క్యారేజీ పట్టుకొని ఆ చెట్టు కింద కూర్చో” అని చెప్పి నాన్న పనిలోకి వెళ్లిపోయాడు. ఏ తండ్రైనా తన కళ్ల ముందు కొడుకు కష్టాన్ని చూడలేడు కదా. అందుకే, అడిగినా నా చేత ఏ పని చేయనివ్వలేదు. అలా మధ్యాహ్నం వరకు ఆ చెట్టు కిందే కూర్చుని నాన్నను చూస్తూ గడిపేశాను.

భోజనం చేస్తూ నాన్న కాస్త చనువుగా అడిగాడు— “ఏరా నాన్న… మీకు వారానికి ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి?” ఈ సమయంలో ఈ ప్రశ్న ఎందుకు అడిగాడా అనే ఆలోచనతో ఇలా చెప్పాను— “రెండు రోజులు నాన్న. శనివారం, ఆదివారం.” “మరి జీతం ఏ రోజుకు పడుతుంది?” నాన్నకి తెలిసిన సమాధానాల్ని ఎందుకు ప్రశ్నలుగా అడుగుతున్నాడో తెలియక ఇలా చెప్పాను— “ఒకటవ తారీకు పడతాయి నాన్న. ముప్పై వేల వరకు వస్తుంది. అయినా ఇవన్నీ నీకు తెలుసు కదా నాన్న?” అయినప్పటికీ, చాలాసేపు నా పని గురించి, నా జీవనశైలి గురించి ప్రశ్నలు అడిగాడు.

చివరికి కాస్త వెక్కిలిగా నవ్వి గిన్నెలు కడగడానికి లేచాడు. ఆ నవ్వును చూసి ఉండబట్టలేక అడిగాను— “ఏంటి నాన్న, కొడుకు కష్టం వింటుంటే వెక్కిలిగా నవ్వుతున్నావు?” అప్పుడు నాన్న చిరునవ్వుతో ఇలా అన్నాడు— “ఒరేయ్ కార్తీక్… ఇది మన పొలం రా. నేను ఇందులో ఆరు నెలలుగా పని చేస్తున్నాను. నాకు సెలవులూ లేవు, పండగలూ లేవు. దారుణం ఏంటంటే, నా ఆరు నెలల కష్టానికి జీతం వస్తుందో రాదో కూడా తెలియదు. ఫలితం ఆశించకుండా ఇంత కష్టం పడుతున్న నేనే ఇంత ఆనందంగా ఉన్నానంటే, ఫలితం అనుభవిస్తున్న నువ్వెంత ఆనందంగా ఉండాలి రా. ఫలితం లేని కష్టం కన్నా గొప్ప బాధ కాదు కదా రా నీది.


ఆయన చెప్పిన మాటల్లో నిజం గ్రహించి కాస్త సందేహంగా అడిగాను— “మనిషికి ఎంత కష్టమైనా మనసుకి నచ్చితే ఆనందంగా చేస్తాడు కదా నాన్న?” అప్పుడు ఆయన నా భుజం మీద చేయి వేసి అన్నాడు— “నేను పొలం పనులు చేస్తూ నిన్ను కూడా అదే చేయిస్తే నా ఇన్నాళ్ల కష్టానికి అర్థం ఏముంటుంది రా? ఇంకా మనసుకి నచ్చని పని అంటావా? అలాంటి ఆలోచన వచ్చిన క్షణం ఒక్కసారి మీ అమ్మను జ్ఞాపకం తెచ్చుకోరా. ముక్కు మొఖం తెలియని నాతో పెళ్లి చేసుకొని, ఇప్పుడు నేనే సర్వస్వం అంటూ మన కోసం అనుక్షణం చాకిరిలు చేస్తూ ఆ నాలుగు గోడల మధ్య మిగిలిపోయింది రా.

నీ ఉద్యోగం కూడా అంతే రా. నిజాయితీగా మనసుపెట్టి చూడు— కష్టం కూడా కారుమబ్బుల్లో కలిసిపోతుంది.


ఆ మాటలు వింటూ నడుచుకుంటూ వెళ్తున్న నాన్నను చూసి మనసులో ఒక్క ఆలోచన మెదిలింది— ఒక మనిషి తన స్వార్థం కోరుకోకుండా నిజాయితీగా తన వారికోసం ఇంతటి కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఇలాంటి ఓ వ్యక్తి కోసం మన కష్టాన్ని ఎందుకు దాటలేము అని. అప్పుడే నాన్న ఆగి ఇలా అన్నాడు— “జీవితంలో ఒక్క మాట గుర్తుపెట్టుకో రా… ఇష్టం లేని తోడు, కష్టం లేని పని ఈ ప్రపంచంలో ఉండవు. కాలంతో పాటు, మనసుకి నచ్చినవారికోసం సర్దుబాటుతో ముందుకు సాగితే ఆకాశం కూడా నీ కాళ్ల ముందు కాపలా కాస్తుంది రా.


అలా ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నా మదిలో బలంగా నాటుకుపోయాయి. ఆ క్షణం నేను జీవితంలో తీసుకున్న ఒక్క నిర్ణయం— మనకోసం, మన ఆనందం కోసం కష్టపడుతున్న వారి ముందు నాకు వచ్చిన కష్టాన్ని కాటికైనా పంపగలను అనే విశ్వాసాన్ని నాలో పెరిగింది. అదే నమ్మకంతో తిరిగి నా జీవితపు ప్రయాణాన్ని ప్రారంభించాను.


Rate this content
Log in

Similar telugu story from Drama