Lakshmikumar Goparaju

Romance Inspirational Others

4.5  

Lakshmikumar Goparaju

Romance Inspirational Others

రెండో భార్య

రెండో భార్య

11 mins
1.9K


              

ఒక మద్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్య గా వెళ్లి, తనకి ఏమాత్రం విలువలేని ఆ కుటుంబం లో తన స్థానాన్ని ఏవిధంగా నిలబెట్టుకుందో తెలియజేసేదే ఈ కధ.                                                   

“ పెళ్ళి అయిన ప్రతి ఆడపిల్లకు. భార్య స్ధానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కానీ సంధ్య విషయం లో మాత్రం భార్య స్ధానం చాలా భారం గా మారింది”. నాకే ఎందుకిలా జరగాలి? నేనేతప్పు చేయక పోయినా నాకెందుకీ శిక్ష.. ఒక మధ్య తరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్పా..భారం వదలించుకున్న తల్లిదండ్రులు, తనను భారం గా భావించే భర్త.. భగవంతుడా.. నాకేది దారి.. ఉదయం నుండి ఎన్ని సార్లు ఆలోచించిన  ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనస్సును గాయ పరుస్తున్నాయి.

సంధ్య, సాగర్ లకు పెళ్లి జరిగి నెలరోజులు గడిచింది. సాగర్ కు ఇది రెండో పెళ్లి కారణం గా ఆనవయితీ తప్పించాలని, ఫంక్షన్ హలో లో కాకుండా ఈ సారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయింది అనిపించి ఆ మూడుముళ్ళు వేయించారు.పెళ్ళిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు. సాగర్ ముభావం సంధ్య మనస్సు లో అలజడి రేపుతూనే ఉంది.మొదటి భార్య యాక్సడెంట్ లో చని పోయి రెండేళ్లయింది. ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా, నాకు రెండో పెళ్లి ఆసక్తి లేదు అని ఖచ్చితం గా చెప్పాడు.

         కానీ సాగర్ తల్లిదండ్రులు, నానమ్మ... నీ తరువాత ఇద్దరు తమ్ముళ్లు, నీ చెల్లెలకి పెళ్లిళ్లు చేయాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చ జెప్పడం తో తప్పని సరి అయి ఒప్పుకున్నాడు. సాగర్ రెండో పెళ్లి విషయం లో, నాన్నమ్మ నే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంధ్య నిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది.

                      * * *

సంధ్య పెళ్ళి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగు పెట్టింది. తరువాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ అత్తింట్లోనే జరిపించారు. అందరి ఆడపిల్లల లాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్ తో, సాగర్ గదిలోకి వెళ్ళింది. సాగర్ చాలా సీరియస్ గా తన ల్యాప్టాప్ లోవర్క్ చేస్తున్నాడు. సంధ్య లోపలకి రాగానే అప్రయత్నం గా ఆమె వైపు చూసి, మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు. సాగర్ ప్రవర్తన కొంచెం వింత గా అనిపించింది.. “ఐనా కొంచెం దగ్గరగా వచ్చి పాలుతీసుకోండి”..అంటూ పాల గ్లాస్ అందివ్వబోయింది. వెంటనే కొంచెం కోపం, చిరాకు తో.. “అక్కడ పెట్టు”.. అన్నాడు... కాసేపు ఏం చేయాలో అర్ధం కాక అలాగే నిలబడి, తరువాత అక్కడఉన్న చాప పరుచుకొని పడుకుంది.

                ఉదయం లేచిన తరువాత కూడా అదేపరిస్దితి.. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు, తను దగ్గరికొస్తేనే అసహ్యించు కొన్నట్లు చూస్తున్నాడు… ఇంక  సాగర్ ఇంట్లో తమ్ముళ్లు, చెల్లెలు ఎవరు తనను ఒక మనిషిగానే చూడడం లేదు, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు , వారితో సంధ్య ని పరిచయం చేసి నప్పుడు కూడా మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెపుతున్నారు. ఆ రెండో భార్య అనే పదం తనను చాలా భాధిస్తుంది. కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది. అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమి మాట్లాడదు, ఆమె కాలు నొప్పి కారణం గా తన గది దాటి రాదు. మావగారు, సాగర్ ఉదయం తొమ్మిది గంటలకే కంపెనీ కి వెళ్ళిపోతారు. “తన చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నా, తనకి ఒంటరిగానే ఉన్నాను అనిపిస్తుంది”. అప్పుడప్పుడు, అమ్మ, చెల్లెళ్ళ నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరట నిస్తుంది. ఎంతయినా తను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకు పోయినా కానీ ఆరోజు సాగర్ మాట్లాడిన మాటలు, మనస్సులో గుచ్చి గుచ్చి భాధిస్తున్నాయి, ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా మళ్ళా గుర్తొస్తుంది...

         అప్పటికే రెండు రోజులనుండి జ్వరం గా ఉంది, రాత్రి పాడుకోపోయే టప్పుడు మంచం పై ఉన్న దుప్పటి తీసుకో బోయి, కొంచెం తూలి, పట్టుకోసం రెండు చేతులు సాగర్ భుజాలపై ఆనిచ్చింది.

వెంటనే, సంధ్య చెంప చెల్లు మంది, సాగర్ కోపంతో ఊగి పోతూ ,..

" ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు, నేను అన్ని విషయాలు పెళ్ళికి ముందే మీ నాన్న కు మెసేజ్ చేసాను, మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు , అని చెప్పాడు, మళ్ళీ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావ్ ".. అన్నాడు

సంధ్య కి ఊహించని, దెబ్బ ఒకపక్క అర్ధం కాని సాగర్ మాటలు మరొక పక్క , దుఃఖం పొంగుకొచ్చింది. ఇంకేమి మాట్లాడకుండా బయటికెళ్లిపోయింది. చీకటిలో కావలసినంత సేపు ఏడ్చింది..ఎంత ఆలోచించినా తండ్రి తననుండి ఎం దాచాడో అర్ధం కాలేదు.

తనకు కేవలం రెండో పెళ్లి అని మాత్రం చెప్పాడు, ఆ విషయం చెప్పినప్పుడు తనతండ్రి కళ్ళలోని బాధ తను స్పష్టంగా చూసింది..

" సంధ్యా నేను నీకు పెద్ద చదువులు చెప్పించలేకపోయాను, చివరకు నీకు కడుపునిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో కూడా తెలియదమ్మా... కాని నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే, తిండికి, కట్టుకునే బట్టకు లోటు లేకుండా బతుకుతావు ,నీ చెల్లెళ్ళ జీవితాలకు కూడా ఒకదారి దొరుకుతుంది.. ఈ అసమర్ధత తండ్రి ఇంతకన్నా ఇంకేమి చేయలేడమ్మా " అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు...అవే పెళ్ళి ముందు తండ్రి చెప్పిన మాటలు. మరో మాట లేకుండానే తలవంచి తాళి కట్టించుకుంది. ఇది మాత్రమే తనకు తెలుసు.కానీ సాగర్ ఏంటీ ఏదో మెసేజ్ అంటున్నాడు... ఉదయం నుండి ఇదే ఆలోచన...

                   ****

సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్, చాలా హడావిడిగా ఉంది, ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే అవ్వడం తో అంతా హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నారు.సాగర్ కంపెనీ కి ఎం. డి ఐనా తన స్టాఫ్ తో చాలా సన్నిహితం గానే ఉంటాడు. ఏమాత్రం గర్వం లేని మంచి మనస్సే తనని ఈ స్ధాయి లో నిలబెట్టింది. తనకు ఆప్త మిత్రుడు ఐన హేమంత్.. రూమ్ లోకి వస్తూనే.." ఏంటి సార్ బిజీ నా..!" అందరూ బయట నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వుక్కిడ ఏం చేస్తున్నావ్.. కమ్ ఫాస్ట్..అంటూ ఎదురు సీట్ లో కూర్చున్నాడు. సాగర్ తల పైకెత్త కుండానే, " మీరు కంటిన్యూ చేయండి.. నేను తరువాత వస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు" .. అన్నాడు.

హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనస్సును అతి దగ్గరగా చూసినవాడు కావడం తో... ఇంక పార్టీ గురించి కాకుండా..

" సరే గాని సిస్టర్ ఎలా ఉంది, నీ దగ్గర బానే అడ్జస్ట్ యిందా" .. అంటూ టాపిక్ మార్చాడు.. కానీ సాగర్ నుండి ఏం సమాధానం లేదు.. "అరె నిన్నే అడిగేది..నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి, ఆమెను సంతోషం గా ఉంచే భాద్యత నీదే కదా!" అన్నాడు హేమంత్. ఆ మాటలకి సాగర్ మొఖం కోపం తో ఎర్రబడింది. ఓక్కసారి గా సీట్ లోనుండి పైకి లేచి ..

" ఎవరు రమ్మన్నారు? నన్ను నమ్ముకుని రమ్మని.. నేనేమైనా అడిగానా..? ఇంకొక సారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు.. నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటి కెళ్ళి, క్షేమ సమాచారలు కనుక్కో." అంటూ విసురుగా అక్కడ నుండి ల వెళ్ళిపోయాడు.

సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ ని విస్మయానికి గురించేసింది.. అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాల లోనే జీవిస్తున్నాడన్నమాట.! అంత మంది నచ్చ చెప్పినా తనలో మార్పు రాలేదు.. ఐనా ఇది మనస్సుకు సంబంధించిన విషయం, మరిచి పోవాలన్నా అంత ఈజీ గా జరిగే పనకాదు.. హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు వెళ్లాయి........

     

                      *******

అవును కరెక్ట్ గా రెండేళ్ల క్రితం సాగర్..” రమ్యను ప్రేమిస్తున్నాను” అని చెప్పి , నాకు చెప్పడానికి భయం గా ఉంది.. నీ హెల్ప్ కావలి అంటే.. తాను కూడా వాళ్లిద్దరూ ఒక్కటవ్వడానికి చాలానే కష్టపడ్డాడు. రమ్య గొప్పింటి పిల్ల ఐనా చాలా సింపుల్ గా చలాకిగా ఉండేది. అవసరం ఉన్న అందరికి సహాయం చేస్తూనే ఉండేది, ఆమె లో పరోపకార గుణమే సాగర్ మనస్సును ఆమెకి దగ్గర చేసింది. కానీ పెళ్లి అయి ఆరునెలలు కూడా కాకుండానే, మృత్యువు యాక్సిడెంట్ రూపంలో రమ్యని, సాగర్ నుండి దూరం చేసింది.

       అత్త,మామ లతో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ బలం గా ఢీ కొని, డ్రైవింగ్ సీట్ లో ఉన్న రమ్య అక్కడకక్కడే మరణించింది. వెనుక ఉన్న అత్త, మామలు దెబ్బలతో బయట పడ్డారు. రమ్య వియోగాన్ని భరించలేక సాగర్ మానసికం గా కుంగి పోయాడు. సాగర్ చాలా రోజులు ఒకే రూమ్ కి పరిమితమై పదే పదే రమ్య ఫోటో ల చూస్తూ కాలం గడిపేవాడు.కోలుకోవడానికి ఆరునెలలు పైనే పట్టింది. తండ్రి చొరవ తోకోలుకున్నా కానీ.... మనస్సులోగూడుకట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది.

" సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు " అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాలనుండి మళ్ళా ఈ లోకం లోకి వచ్చాడు హేమంత్. ఐనా మనస్సు ఇంకా సాగర్ గురించే ఆలోచిస్తుంది, ఒకసారి సాగర్ ఇంటికెళ్లి సంధ్య ను కలవాలి ఆమె పరిస్ధితి ఎలా ఉందో అనుకుంటూ, అప్పటికే మొదలైన పార్టీ లో తను జాయిన్ అయ్యాడు.

         ***


సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకు చేరింది. " సంధ్యా ఒకసారి ఇటు రా "  అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త ఉన్న రూమ్ కి వెళ్ళింది.

" సంధ్య ఈరోజు ఊరి నుండి మా అత్త గారు వస్తున్నారు. అదే అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు. ఆవిడ పెద్దావిడైన కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. నువ్వే దగ్గర ఉండి అవసరమైనవన్నీ చూసుకో. నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండరు. నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి ఈ కాలం నొప్పితో నడవలేక పోతున్నాను, లేకపోతే అన్ని నేనే చూసుకునే దాన్ని. ఇంట్లో అందరూ భయపడేది, గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు.. నువ్వు కూడా ఆవిడి దగ్గర జాగ్రత్తగా ఉండు" అని చెప్పింది. ఇప్పుడు సంధ్య కి అర్థమైంది. అంటే అన్నపూర్ణమ్మ గారు చెప్పారని సాగర్ తనని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట, అని మనసులోనే అనుకుని.. అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడనుండి వచ్చేసింది. కాసేపటికి అన్నపూర్ణమ్మగారి ని తన పెద్ద మరిది గౌతమ్ కారులో తీసుకు వచ్చాడు. ఆవిడ ఇంట్లోకి అడుగుపెడుతూనే..

"సంధ్య ఎలా ఉన్నావు"  అంటూ ఆప్యాయంగా పలకరించింది. బాగానే ఉన్నాను అమ్మమ్మ గారు.. రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులు తీసుకుంది.. సంధ్య చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మ గారికి తృప్తిని ఇవ్వలేదు.

      వాడిపోయిన సంధ్య ముఖాన్ని చూసి అక్కడి పరిస్థితి అర్థం చేసుకుంది.. సంధ్య మాత్రం అన్నపూర్ణమ్మగారి వెంటే ఉండి ఆమెకి కావలసినవన్నీ అందిస్తుంది.. ఆరోజు మధ్యాహ్నమే అన్నపూర్ణమ్మ గారు.. " సంధ్య ఇక్కడ దగ్గరలో శివుని గుడి ఉంది. సాయంత్రం అక్కడకు వెళ్లి వద్దాం. త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది”... అన్నపూర్ణమ్మ గారు అన్నట్లుగానే ఐదు గంటలకల్లా కార్లో గుడికి బయలుదేరింది. సంధ్య తో పాటు.. దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మంటపంలో ఇద్దరూ కూర్చున్నారు.. " ఏమ్మా సంధ్య..

సాగర్ నీతో ఎలా ఉంటున్నాడు". అని మళ్ళీ అడిగింది.

“బానే ఉంటున్నారు అమ్మమ్మ, మేమిద్దరం బానే ఉన్నాం” అంది సంధ్య.

" ఎందుకమ్మా నిజం దాస్తావ్, ఏడ్చి ఏడ్చి కమిలిపోయిన నీ కళ్ళు చూస్తే నాకు తెలియదా" .. అని ఆమె చేతిలోని సెల్ ఫోన్ తీసి సంధ్య కి ఇచ్చి, అందులో ఉన్న మెసేజ్ ని చదవమన్నట్లు గా సంధ్య వైపు చూసింది.. భయం భయం గా సంధ్య కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు పెడుతున్నాయి.

"రామకృష్ణ గారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకిచ్చి చేయాలనుకుంటే, ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు, ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య.. మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి. నేను నానమ్మను, నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక, పెళ్లికి సరే అన్నాను.మీరే ఏదో ఒక విధంగా ఈ పెళ్లిని ఆపండి." ఇది మెస్సెజ్ సారాంశం

చదవడం పూర్తయ్యే సరికి రమ్యకి కళ్ళు బైర్లు కమ్మాయి., తను అగాధంలో కూరుకుపోతూ ఉన్నట్లుగా అనిపించింది. కళ్ళ నీళ్ళతో అన్నపూర్ణమ్మ గారు వైపు చూసింది.

" ఎందుకమ్మా ఏడుస్తున్నావు.. దుఃఖం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది.. ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చాడు, కానీ నేనే నీకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాను, ఎందుకంటే సాగర్ గురించి నాకు బాగా తెలుసు,.

     సాగర్ తప్పక మారుతాడు అన్న నమ్మకం నాకు ఉంది.. అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు . మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ గురించే చెప్పే వాడు. అందుకే నా దృష్టిలో నీవే సాగర్ కి సరి అయిన భార్య అనిపించింది ఎందుకంటే.. ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు, ఒక్కొక్కరు ఒక్కొక్క గదికి పరిమితం ,ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఇంట్లో అంతమంది ఉన్నా ఇల్లంతా ఎప్పుడు నిశ్శబ్దమే,

కళాకాంతులు లేని ఇంటికి., ఆశాదీపం అయి వెలుగులు నింపుతావు అన్న నమ్మకం నాకు ఉంది.. సాగరకి రెండో పెళ్ళి చేయడానికి, ఎంతో మంది గొప్పింటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇవ్వడానికి పోటీ పడ్డారు.. బయట నా మనవడు కున్న గౌరవం అటువంటిది, కానీ వాళ్లందరి కాదని, నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా. నా నమ్మకాన్ని నిలబెట్టు".. అంటూ చెమ్మ గిల్లిన కళ్ళతో సంధ్య తల పై ప్రేమగా నిమిరింది. సంధ్య మాత్రం ఏమి సమాధానం చెప్పకుండా అన్నపూర్ణమ్మా గారినే చూస్తుంది.. మళ్ళీ ఆవిడే.. " ఆ సంధ్య నేను ఇలా చెప్పాను అని ఏమి బాధ పడకు, నా మనవడి మీద ప్రేమ నన్నిలా చెప్పిస్తుంది... ఐనా సాగర్ మారినా మారక పోయినా, వాడి కోసం నీ జీవితం నిస్సారం చేసుకోకు, నీ కోసం నువ్వు జీవించు, నీ మనస్సుకు నచ్చినట్లు నువ్వు నడుచుకో.. నీకు చదువంటే చాలా ఇష్టం అని తెలిసింది, ఆగిపోయిన డిగ్రీ మళ్ళా పూర్తి చేయమ్మా.. ఊర్లో అందరికి సహాయ పడుతుండేదానివి.. అలాగే ఇక్కడ కూడా నీ ఇష్ట ప్రకారం నడుచుకో... కానీ భార్య గా నీ భర్త కు నువ్వు చేయవలిసినవి మాత్రం, నిర్లక్ష్యం చేయకు".. అంటూ గీతోపదేశం చేసినట్లే చెప్పింది అన్న పూర్ణమ్మగారు. ఆవిడ చెప్పిన దాంట్లో “ నీ కోసం నువ్వు బ్రతకాలి “ అన్న మాటలు సంధ్య మనస్సుకు హత్తుకున్నాయి.. అవును సాగర్ కి నేను ఇష్టం లేకపోతే, ఇంక నాకు జీవితమే లేదా? తను పుట్టింది ఒక్క సాగర్ కోసమే కాదు. తను చేయవలిసింది ఇంకేదో ఉంది.. ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలా బాధ పడ్డాను.  తనలో తానే ఆలోచించింది. మరొక్కసారి పరమేశ్వరుడికి నమస్కరించింది, ఇప్పుడు దైర్యం గా లేచి, రండి అమ్మమ్మ గారు ఇంటికెళ్దాం అంటూ బయలు దేరింది. తరువాత రెండు రోజులకే అన్నపూర్ణ మ్మా గారు ఉరికెళ్లిపోయారు, కానీ వెళ్లేముంది సాగర్ ని పిలిచి.. పెళ్ళికి ముందు నీవు పంపించిన మెసేజ్ లు ఏమి సంధ్యకి తెలియవు, నీవు ఆ అమ్మయిని కనీసం ఒక మనిషిలా చూడు,అని కాస్త గట్టిగానే చెప్పింది. అలాగే సంధ్య చదువుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళింది.

      *****--

ఇప్పుడు సంధ్య చాలా బిజీగా మారిపోయింది. ఈ మార్పుకు మరి కొంత సహాయం చేసింది హేమంత్. ఒకరోజు హేమంత్ సంధ్య ని కలవడానికి ఇంటికి వచ్చాడు. సాగర్ మొదటి భార్య రమ్య గురించి చాలా విషయాలు చెప్పాడు. తను కూడా చాలా ఆసక్తిగా ఉన్నది. అలాగే తాను చేయాలనుకున్న పనుల గురించి కూడా చెప్పింది, హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సంధ్య కి ఇచ్చాడు.. ఇప్పుడు సంధ్య ఉదయం లేచిన దగ్గర్నుంచి తన రోజు మొత్తం టైమ్ సద్వినియోగం చేసుకొంటుంది. అత్తగారికి వేసుకోవలసిన మందులు తనే దగ్గర ఉండి ఇవ్వడం, డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడం మొదలు పెట్టింది.చిందర పందర గా ఉన్న మరుదుల రూమ్ లన్నీ పనివాళ్ళ సహాయం తో సర్ధించింది. మరుడులిద్దరూ తనని వ్యతిరేకించారు, వాళ్ళ రూమ్ లో అడుగు పెట్టొద్దన్నారు, ఐనా సంధ్య చిరునవ్వుతో ఇల్లు నీట్ గా ఉంచటం నా భాధ్యత అని చెప్పి, వాళ్ళని కొంచెం మార్చగలిగింది.ఇంక

తాను తెలుసుకున్న అనాధ శరణాలయాల కు వెళ్లి అక్కడ వాళ్లకు కావలసిన అవసరాలు ఒక బుక్ లో నోట్ చేసుకుని వచ్చేది. ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది, దాన్లో హేమంత్ చాలా మందిని జాయిన్ చేశాడు. అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆర్ ఫాన్స్ కి సహాయం చేసి ముందుకు వచ్చేవారు. ఆ సహాయాన్ని సంధ్య స్వయంగా తీసుకెళ్లి వాళ్ల అందించేది. ఇంకా తనకు ఇష్టమైన పని చదువు చెప్పడం.. అందుకోసం దగ్గరలో ఉన్న ఒక మురికివాడ ను ఎంచుకుంది. అక్కడ జీవించే వాళ్లందరూ కూడా రోజువారీ కూలీలు తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలే ఇళ్లకి కాపలా ఉండేవారు. వారికి ఎటువంటి స్కూల్ సహాయం లేదు. సంధ్య వాళ్లందరినీ ఒక చెట్టుకింద కూర్చోపెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించడం అవసరమైన వాళ్లకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వడం, చేసింది. ఈ పని సంధ్యకి చాలా సంతోషం ఇచ్చేది. అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు..

                                                 ఒక రోజు సంధ్య మరిది గౌతమ్ అదే దారి వస్తూ మురికివాడ దగ్గర ఆగి ఉన్న వాళ్ళ కారు చూసి, ఇక్కడికి ఎవరు వచ్చారు అబ్బ అని లోపలికి వెళ్ళి చూశాడు. అప్పటికే సంధ్య, పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఎంతో సంతోషంగా పాఠాలు చెప్తుంది. గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సంధ్య మీద ఇంట్లోఎవరికీ మంచి అభిప్రాయం లేదు. కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఒక్కసారిగా సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది గౌతమ్ కి. ఇదే విషయాన్ని ఇంటికెళ్ళి తన చెల్లి , తమ్ముడు కూడా చెప్పాడు. తరువాత సంధ్య తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది. గౌతమ్ దగ్గరుండి ఎగ్జామ్స్ కి తీసుకెళ్ళాడు. మెల్లగా అందరి మనస్సులను గెలుచుకుంది. కానీ ఒక్క సాగర్ ని మాత్రమే ఇంకా మార్చలేక పోయింది.

ఆరోజు ఇంట్లో హడావిడిగా తిరుగుతూ సంధ్య ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది. గౌతమ్ కి కేక్ తీసుకు రమ్మని చెప్పింది. అందరూ ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది..అన్నట్టుగానే మావయ్య తో సహా అందరూ ఐదు గంటలకే ఇంట్లో ఉన్నారు. ఒక్క సాగర్ తప్ప.. సంధ్య ఎందుకు రమ్మందో ఎవరికీ తెలియక ఆశక్తి గా ఎదురుచూస్తున్నారు. హల్లో టేబుల్ నీటి గా డెకరేట్ చేసి దాని పై వాళ్ళ, రూమ్ లో ఉన్న రమ్య ఫోటో తీసుకొచ్చి పెట్టింది. ఇంతలో కేక్ కూడా వచ్చింది, అన్ని ఆరెంజ్ చేసి,

"మావయ్య గారు ఈ రోజు మీ కోడలు పుట్టిన రోజు, తను మనతో లేకపోయినా మనందరి మనస్సులో, సజీవం గానే ఉంది. అందుకే రమ్య భర్త డే సెలెబ్రేటే చేయాలనుకున్నాను.., రండి మీరే కేక్ కట్ చేయాలి " అంది. అందరూ సంధ్య వైపు ఆశ్చర్యం గా చూశారు.

అందరికి, సంధ్య చాలా ఉన్నతం గా కనిపించింది. కానీ సంధ్య మావగారు, నేను కాదమ్మా..

“సాగర్ కి ఫోన్ చేస్తాను, వాడు కేక్ కట్ చేస్తాడు” అని సాగర్ కి ఫోన్ చేయబోయాడు. కానీ అప్పటికే సాగర్ హడావిడి గా లోపలకి వస్తున్నాడు,వెనుకే హేమంత్ కూడా ఉన్నాడు. సాగర్ ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతున్నాడు.

" అంకుర అనాధ శరేణాలయమేనా.. "

" అవునండి " అనే సమాధానం వినబడింది.

" ఈ రోజు నా భార్య పుట్టిన రోజు, నేను మరొక గంటలో మీ శరణాలయానికోస్తా.. పిల్లలకి అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి, నేన డొనేట్ చేయాలనుకుంటున్నా" అంటూ ఫోన్ లో మాట్లాడు తున్నాడు

కానీ అవతల పక్కనుండి

" సాగర్ గారు..ధన్యవాదములు అండి ఆల్రెడీ రమ్య గారి పేరు మీద ఈ రోజు ఉదయమే పిల్లలకి స్వీట్స్, బట్టలు, వాళ్లకి అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుండి సంధ్య గారు అందజేశారు. పిల్లలతో ఒక గంట ఇక్కడే గడిపి వాళ్ళని ఆటలు కూడా ఆడించారు... సంధ్య గారికి మరొక్క సారి థాంక్స్ చెప్పిండి. " ఫోన్ లో వినబడిన సమాధానంతో సాగర్ కి ఒక్క సారిగా షాక్ తగలినట్టనిపించింది. అక్కడే నిలబడి పోయాడు. అప్పటికే సాగర్ కోసం ఎదురుచూస్తున్న అందరూ, అన్నయ్యా రా తొందరగా అంటూ పిలుస్తున్నారు.తరువాత సాగర్ కేక్ కట్ చేసాడు. గౌతమ్ కి చిన్న తమ్ముడుకి, చెల్లమ్మ కి అందరి కి కేక్ తినిపించాడు. సంధ్య మాత్రం ఒకపక్కగా నిలబడి, సాగర్ మొఖం లో ఆనందం వెతుకుతుంది. 

“ రమ్య ఫోటో చేతిలోకి తీసుకొని ఆప్యాయం గా తడుముతూ, రమ్యా.. నువ్వెంత అదృష్టరాలూవో కదా..! ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో, నువ్వు బాహ్యం గా లేకపోయినా, సాగర్ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు.అనుకుంటూ తను కూడా అక్కడున్న కేక్ తీసుకుంది. సాగర్ సంధ్య వైపే చూస్తున్నాడు.. ఆ స్ధానం లో ఎవరున్నా గాని రమ్య పై కోపమే ఉండేది.. నిజం చెప్పాలంటే రమ్య జ్ఞాపకాలు ... సంధ్య జీవితానికి అడ్డంకి.. కానీ సంధ్య మాత్రం రమ్యని అభిమానిస్తుంది..  సాగర్ కి చాలా ఆనందం గా అనిపించింది..

ఆ రోజు అందరూ కలసి కూర్చుని భోజనాలు చేశారు. సాగర్ తమ్ముళ్లు మాట మాటకి "వదినా.. వదినా అని పిలుస్తుంటే తనకి చాలా ఆనందం గా అనిపించింది. హేమంత్ కూడా వాళ్లతో కలసి సరదాగాఅందరిని నవ్విస్తున్నాడు. సాగర్ మొఖం లో కూడా చిరునవ్వు కనబడింది.భోజనాలు అయ్యాక , హేమంత్.. ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. సాగర్ కూడా గేట్ వరుకు హేమంత్ తో కలసి వెళ్ళాడు.. హేమంత్ వెళ్లేముందు ...

"సాగర్ , భగవంతుడు రమ్యని దూరం చేసినా... సంధ్య రూపం లో మరో అదృష్టం నీ చేతిలో పెట్టాడు.. అదృస్టాన్ని చే జార్చు కోకు, ఇంత కంటె ఎక్కువ ఏమి చెప్పలేను."అంటూ తాను చెప్పాలనుకున్నది సాగర్ కి చెప్పి వెళ్ళిపోయాడు. సాగర్ రూమ్ లోకి అడుగుపెట్టేటప్పటికి, సంధ్య అక్కడే ఏవో సర్దుతుంది. సాగర్ మెల్లగా సంధ్య దగ్గరగా వచ్చి

" సంధ్యా నన్ను క్షమించు , నీ మనస్సు బాధ పెట్టాను " అన్నాడు. సాగర్ పిలుపులో ప్రేమ, అతని చూపులో ఆరాధనా కనిపించాయి సంధ్య కి, సమాధానం గా చిరునవ్వు నవ్వింది. సాగర్ రెండు చేతులు ఆమెను దగ్గరకు లాక్కున్నాయి. సంధ్య తుళ్ళిపడి అతని హృదయం పై వాలిపోయింది. సంధ్య మనస్సు లోనే “అన్నపూర్ణ మ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంది.అవిడ చెప్పిన మాటలు అక్షరాలా నిజమైయ్యాయి”.. సాగర్ ఏదో చెప్తున్నాడు, అవేమి చెవికి చేరటం లేదు, ఒక్కమాట తప్ప.. "సంధ్య రేపే మీ ఉరికెళ్దాం.. మీ నాన్న గారు నీ గురించి చాలా బాధ పడుంటారు, నేనే ఆయన తో అన్ని మాట్లాడాలి " అన్నాడు. ఇప్పుడు సాగర్ రెండో భార్య సంధ్య... పూర్తిగా అతని మనస్సులో మొదటి భార్య స్ధానాన్ని ఆక్రమించుకుంది.

         * సమాప్తం *

ఈ కధ పై మీ అమూల్య మైన అభిప్రాయం, సమీక్ష రూపంలో తెలియ జేయగలరని మనవి.

లక్ష్మి కుమార్

హైదరాబాద్ 


Rate this content
Log in

Similar telugu story from Romance