పూలజట్టు
పూలజట్టు
ఏ ఊరు బుల్లీ మీది!?టేబుల్ మీద మోర్ మార్కెట్లో, 199 రూపాయలకు ఒకే ఒకటి వచ్చిన రబ్బరు బుట్టలో పొందిగ్గా కూర్చున్న,బెంగళూరు గులాబీ అడిగింది..
ఉ..ఉ!!కడియం నర్సింమయ్య నర్సరీ నుంచి వచ్చేమ్!వాటి సోకు చూడండమ్మా!బుట్టలో పెట్టేరు..మనల్ని ఇలా నేలమీద కుప్పకింద పోసేరు రేకులు నొక్కుకున్నాయి. మల్లెలు...
మీపని చాలా నయం పిన్నీ!మమ్మల్ని పిల్లలతో సహా దూసి తీసుకొస్తారు..ఇగో!మాల కడుతుండగా గ్రేడింగులో వాళ్ళని పెంటమీద పోస్తారు..మేము అసలే సుకుమారులమాయె!ఎండకు దప్పిక అయినట్టు,
ఎండిపోతాం,గోను సంచీలో గాలి వస్తున్నా...ఎక్కడా!?ఒకరిమీద ఒకరం పండుగలో ట్రైన్ లా కిక్కిరిసినట్టు ఉంటుంది..పైనుంచి అందీ అందకుండా కొన్ని నీళ్లు విదిలిస్తాడా ....అమ్మయ్యో!నడుం పడిపోయినట్టు అవుతుందే బాబూ...కనకంబరం కలత చెప్పుకుంది..
ఏమోనమ్మా!ఇయ్యేమీ సంబరాలో!?ఒక్కరూ కడవరకూ మన ఊసు ఎత్తరు..ఒకందుకు అదీ మంచిదే!ఆ బంతి చామంతులను తెస్తూనే ఒళ్ళు హూనం చేసి,వలిచేస్తారు.
ఆనక కాళ్ళకింద వేసి తొక్కుకుంటారు..ఒక్కొక్కళ్ళు గొప్ప కోసం నెత్తిన ఉండిపోయిన రేకుల్ని ఎంత హీనంగా విదిలిస్తారనుకున్నావ్!?పాపం వాటికి ఆ రాత ఏమిటో...
నువ్వు భలే మల్లిఅక్కా!అయ్యేయో పక్కరాష్ట్రం పచ్చ పందిట్లో పూసిన పువ్వులంట!?పంటకొచ్చినన్నాళ్ళూ నీడపట్టున పెంచుతారు..ఇగో!ఇలా పెళ్లి,పండుగ అని పెద్ద..పెద్ద..లైట్లు మొకాన కొట్టేలా పెడతారు అక్కా!పెళ్లి సందడికి సగం ఆపువ్వులే కారణం అనుకుంటాం కానీ, సెగకి దగ్గరగా, చెమట కారుతూనే ఉంటాయి పాపం,..
అదేంటే!?పారిజాతమా...స్వర్ణకమలమా...అలా మెరిసిపోతోంది...అంతా రేకులు విచ్చుకు చూస్తున్నాయి.
హ...హ...!బంగారు సంపెంగ పువ్వు కనకా...వాసన రాదు..మనలా ఎక్కడబడితే అక్కడ కూర్చోలేదు..అయినా ,ష్!ఇంక మాటాడకండి..పెళ్లికూతుర్ని అలంకారానికి తోలుకువస్తున్నారు గులాబీ గదిమింది పెద్దరికంగా..
అమ్మాయి కొత్తిమీరకట్ట లాంటి జడచూసి...సరిపోయింది!అని నీరసపడింది బెంగళూరు గులాబీ.
ఈ పిల్ల జడకి నేనే ఓ మూర అయితే,బరువయ్యి,
తలపోటు వచ్చేలా ఉంది..మిమ్మలను ఎట్టా తురుముతారే మల్లెమ్మలూ...నవ్వాపుకోలేకపోతుంది కనకమ్.
టెంకిసలు అయ్యో!క్షమించాలి,పచ్చపందిరిలో పూసిన పూలు అమ్మయ్యో!బతికిపోయాం...ఈ పిల్ల జడకి మా కాడ మట్టుకు పెడితే సరిపోతుంది కదా!జోక్కున్నాయి
పూలజడ సందడి మొదలయింది..కొన్ని మల్లెలు,
కనకంబరాలు,గులాబీలు కొన్ని వారి బంధువుల నుంచి వేరుచేయబడ్డాయి..ఓపదినిమిషాలు హిమాలయాల్లో శిక్ష అనుభవించి వచ్చాయి..
రేకు ఎత్తి పలకరించలేకపోతున్న వాటిని చూసి,మిగతా పూలు బాధగా నిట్టూర్చాయి..
లక్ష్మీదేవి...సరస్వతి..వద్దు!వద్దు!కలియుగ దైవం,కోట్లు గడిస్తున్నాడు...మా సాయి కూడా అంతే కోట్లు సంపాదిస్తున్నాడు..వాళ్ళ చర్చకు పూలు దిమ్మ తిరిగిపోయింది..ఆ తరువాత చిత్రాన్ని చూసి ఆత్మహత్య సదృశ్యమైంది అన్ని పూల పరిస్థితి...
సవరం పెట్టి జడని పొడుగు చేశారు సరే!కానీ జడమీద పూలతో గోడనే కట్టేసి,మధ్యలో వేంకటేశ్వరుని పూలతో గుచ్చేరు..గుమ్మానికి పండక్కి వెళ్లాడే ,గుప్పిన పందిరి దండలా,అత్తకోడళ్ల మధ్య అడ్డుగోడలా,గాలిపటాన్ని ఆ అబ్బాయి ఎవరో జాకిట్టులా వేసుకున్నట్టు....
ఎంటోలా,చూస్తే అదోలా,ఎం చెప్పాలో తెలీని విధంగా ఉంది..పైగా వాళ్ళ పూర్వీకులు సంప్రదాయంగా ఇట్ఠానే గుప్పేవారట..ఏమోనమ్మా!ఇన్ని వందల తరాలు చూసేము,ఎవరి కొప్పుని ఇలా ఆలంకరించలేదు...
మిగిలినపూలు నవ్వుకుంటున్నాయి.
నదినెత్తిన ,సంద్రం దగ్గర లైట్ హౌస్ లా నిలబడింది బంగారు సంపెంగ..దాని పిన్ను గులాబీని,కొన్ని మల్లెల్ని మొదటినుంచి గుచ్చుతూనే ఉంది..
అబ్బా!అమ్మా...అని మల్లెలు వగస్తున్నాయి..గులాబీ గుండె జారేలా ఉంది..పువ్వుల్ని ఈల చీలికలకి కట్టి ఉంచడంతో ఊపిరి పీల్చలేక వెంకన్నని వేడుకున్నాయి..
కనకంబరాలది అసలే!వయ్యారి నడుమేమో!?అసలే దారం మధ్య బిగుసుకుని చేస్తుంటే,పైగా ఈ కఱ్ఱపుల్లలకి టేప్ కూడా వేసి మరీ అతికించేసరికి...రేపొద్దున్న డంప్ యార్డ్ని చూస్తామా!అని వాపోయాయి
మనకేనా స్నేహితులు!?నోరులేనివాళ్ళు మరింత కట్టుబడి ఉంటారు స్నేహానికి లేదా గౌరవానికి...అందుకే అమ్మాయి నడుముని అదే పనిగా గుచ్చింది ఓ మల్లెపూవు ముచ్చిక..దాంతో విసురుగా తిరిగింది ఆమె.
బంగారు సంపెంగ కిందపడిపోయింది...అయ్యో!ఎక్కడ....ఎక్కడ హడావుడి మొదలైంది..అమ్మాయి కూడా చిరాగ్గా ఇన్ని పూలు గడ్డిమేటు వేసినట్టు వేస్తే,ఇలానే ఉంటుంది మొత్తం పీకి కింద పడేసింది..
ఎండలు కావడంతో పెట్టించిన కూలర్ల దగ్గరలో హాయిగా ఊపిరి తీసుకున్నాయి పూలు..అమ్మాయి మాత్రం కొత్తిమీర జడని అలంకరించబోయే బంగారు సంపెంగ వెతుకులాటలో ఉంది..
వాటిలో వాటికి ఎంత స్నేహం,ఎంత ప్రేమ....మేమూ ఉన్నాము..వందలు ఖర్చు చేసి తెస్తారు..ఒకర్ని రాక్ లో,ఒకర్ని ఫ్రిజ్ లో,ఒకర్ని గిన్నెలు స్టాండ్ లో...ఎక్కడెక్కడో విసిరేస్తారు...ఎప్పటికీ మాట్లాడుకొనివ్వరు బాధపడుతూనే,మురిసిపోయింది 199 రూపాయల రబ్బరు బుట్ట..
