Baswaraj Mangali

Drama Inspirational Others

4.5  

Baswaraj Mangali

Drama Inspirational Others

ప్రేమంటే ఏంటీ?

ప్రేమంటే ఏంటీ?

7 mins
453


"అసలు ప్రేమంటే ఏంటీ?" అన్న ప్రశ్న ఎన్నాళ్లుగానో వెంటాడుతూనే ఉంది ఋషిని .అతడు చెట్టు కింద కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు.ఈ ప్రశ్ననేవేసుకుంటూ,మంత్రంలా పదే పదే తలుచుకుంటూ. ఋషికి మూప్పై ఎనిమిది సంవత్సరాలు దాటాయి. జీవితం లో ఎన్నో ఆటు పోట్లు తిని,మానవ సంబంధాలు,డబ్బు తో తప్ప ఈ లోకంలో దేనితో ముడి పడి లేవని,బందాలన్ని బాధ్యతలు, బరువులే తప్ప ఇంకేం లేదని అనుకుని, జీవితంపై విసిగివేసారి, వైరాగ్యంతో సన్యాసి అయిపోయాడు. సన్యాసి అంటే కాషాయ వస్త్రం, కమండలం, జపమాల, పాదుకలు ఇవన్ని అతను ధరించలేదు. గడ్డం మాత్రం పెరిగింది. దాన్ని అతడు పట్టుంచుకోలేదు గనక.

ఎన్నో ఏళ్లుగా చెట్ల కింద,పుట్ల కింద పర్వతాల దగ్గర, కూర్చుని తపస్సు చేసాడు. ఏ దేవుడో వస్తాడని కాదు, వరాలు అడిగాలని కాదు,కేవలం ఈ ప్రశ్న కోసమే. "ప్రేమంటే ఏంటి?"

ఒక్క ప్రశ్న కోసమే! సంవత్సరాలు గడిచాయి.అయినా ఏం లాభం లేదు ఈ ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. ఇన్నాళ్ల తన తపస్సు మొత్తం వ్యర్థమైందని, తపస్సును విరమించాలి అనుకున్నాడు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఏక్కడికి వెళ్లాలి. తన వారి దగ్గరికి వెళ్లడం ఇష్టం లేదు. ఏం తోచలేదు. ఏదయితే అది అయిందని,దారిపొడుగునా వెళ్ళసాగాడు. వెళుతుంటే ఒక చిన్న గ్రామం కనిపించింది.అక్కడ ఆగాడు. అప్పుడు కనిపించింది ఒక దృశ్యం. ఒక గుడిసె ముందర, ముసలి స్త్రీ చనిపోయిపడి ఉంది. శవం పై ఈగలు వాలుతున్నాయి. నోరు తెరిచి ఉంది. గుడిసె లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి.అటు వైపు చూసాడు. ఎవరో తగువులాడుకుంటున్నారు. " అది బతికున్నన్నాళ్ళు నీకే సేవలు చేసింది,నీ పైనే ప్రేమ ఎక్కువ.శవదహనానికి నువ్వే డబ్బులు ఇయ్యిరా "అని ఒకరి కోపంగా అంటున్నారు.

"ఆ..... ఉన్నప్పుడు తన సంపాదనంతా నీకు ఇచ్చిందిగా

ఇయ్యిరా డబ్బులు"అంటూ రివ్వున పైకి లేచాడు. ఇంకొకరు. ఇద్దరు తిట్టుకుంటున్నారు.బహుశా ఆ ముసలి తల్లి పుత్ర రత్నాలేమో! జన్మనిచ్చిన రుణానికి రుణాలు కడుతున్నారు. కొడుకులు కాదు వీళ్ళు రాబందులు కదా!. మానవ సంబంధాలన్నీ ఇంత దిగజారిపోయాయి. ఇంకా హీన స్థితికి పతనమవుతున్నది !.నేను సన్యాసి అయింది అందుకే, అనుకుంటుండగా తన చూపు రోడ్డుకు ఓ వైపున ఉన్న కుక్క వైపు మళ్ళింది. అది చనిపోయియింది.పెద్ద వాహనం ఢీకొని ఉండి ఉంటుంది. చాలా వికారంగా కనిపిస్తుంది దాని శరీరం. రక్తసిక్తమై,మాంసముద్దలు బయటకు వచ్చాయి. చుట్టూ దాని పిల్లలు చేరి బాధగా అరుస్తున్నాయి. కొన్ని పిల్లలు పాల కోసం అటూ ఇటూ గెంతుతున్నాయి.చిన్నపిల్లాడు నడుచుకుంటూ వచ్చాడు.కళ్ళ నిండా నింపుకొని "ఎందుకు వెళ్లిపోయావు నన్ను వదిలి?"అంటూ ఏడుస్తున్నాడు.ఆప్యాయతగా దాని నెత్తిన చేయపెట్టి నిమిరాడు.తన చేతిలో ఉన్న బ్రేడ్డు ముక్క, బిస్కెట్లు కుక్కపిల్లలకు పెట్టాడు. కాసేపయ్యాక ఆ పిల్లలను తన వెంట తీసుకెళ్లి వెనక్కి తిరిగి "మళ్ళీ తిరిగి రా నేస్తమా " అంటూ వెళ్లిపోయాడు.కాసేపటి కిందనే కన్న తల్లి శవం పై పొట్లాడుకున్నారు కొందరు. కానీ, ఓ కుక్క కోసం కన్నీరు కార్చి వెళ్ళడు ఈ పిల్లాడు. ఒక జంతువు కోసం బాధ పడటం ఏమిటి? అసలు ఇది దయనా? కాదు మరేమిటి?అసలు ఆ ముసలి తల్లి కన్నా ఈ కుక్క శవం మేలేమో!కనీసం పసి హృదయంతో నివాళి అందుకుంది.మళ్ళీ ప్రశ్నలే? తనని తికమక పెట్టసాగాయి. ఎంతకీ అర్ధం కాక వదిలేసాడు. అలా ముందుకు సాగాడు. పగలు ప్రయాణం చేస్తూ రాత్రి ఎక్కడో చెట్ల కింద గడుపుతూ, ఆకలేస్తే పండ్లుతింటూ, ఎం దొరక్క పోతే నీళ్లు తాగి నడిచి పోతున్నాడు ఎక్కడికో తెలియని గమ్యానికి.

******************

అది ఒక సంత చాలా రద్దీగా ఉంది. అమ్మేవాళ్ళు అమ్ము కుంటున్నారు. కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు. ఆ సంతలోంచి నడుచుకుంటూ వెళుతున్నాడు ఋషి. చుట్టు పక్కల అన్ని గమనిస్తూ. వింతగా వాటి వైపు చూస్తూ పోతున్నాడు. చాలా కొత్తగా కనిపిస్తున్నాయి అతనికి. అది మధ్యాహ్న సమయం . ఎండ విపరీతంగా కాస్తోంది. ఓ బిచ్చగాడు అడుక్కుంటున్నాడు.ఒక కాలు లేదు. కింద కూర్చుని వికారంగా ఏడుస్తూ,ఒక చేత్తో నెత్తిని కొట్టుకుంటున్నాడు. వచ్చిన వారి కాళ్ళ పై పడి బిక్షం ఇవ్వమంటున్నాడు. ఒళ్ళంతా చమటతో తడిసి పోయింది. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. తన ఎదురుగ ఓ ముసలమ్మ గాజులను అమ్ముకుంటుంది.ఇంటికి వెళ్లే వేళ అయిందేమో గాజులన్నీ గంపన పెట్టుకొని,ఆ బిచ్చగాడి వైపు వచ్చింది. తను అమ్మగా వచ్చిన డబ్బులలో ఓ పెద్ద నోటు తీసి ఇచ్చింది. ఒక అన్నం పొట్లాన్ని కూడా ఇచ్చింది. ఆ బిచ్చగాడు,ఆ ముసలమ్మ కాళ్ళు మొక్కుతూ "నువ్వు సల్లగుండమ్మా "అని,కృతజ్ఞతబావంతో చూసాడు. ఆవిడ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. చాలా హృద్యంగా అనిపించింది ఆ దృశ్యం ఋషికి. ఇంత మంది ఇక్కడ ఉన్నారు. వారు తలా కొంత ఇచ్చిన ఈ బిచ్చగాడి ఆకలి తీరుతుంది. కానీ, కనిసం చూడకుండా వెళ్లారు. బిచ్చగాడే కావచ్చు కానీ సాటి మనిషి కదా! ఈ ముసలమ్మ కోటిశ్వరురాల? కాదు. గాజులు అమ్మితే గాని బతుకుదెరువు లేదు ఈవిడకి. ఏ గొప్ప గుణంతో ఇచ్చింది దానం?. కాదు సాటి మనిషికి చెయ్యాల్సిన సాయం.ఆమె పేద కావచ్చు.నా కంటికి మాత్రం ఆవిడ కోటిశ్వరురాలే!

అనుకుని ముందుకు వెళుతున్నాడు.ఆకలి వేస్తోంది. కానీ డబ్బులు లేవు. ఎవరిని దానం అడగడానికి అతని ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. నీళ్లు తాగి ఒక హోటల్ ముందున్న చెట్టు కింద కూర్చున్నాడు.గ్లాస్ పగిలి పోయిన చప్పుడు అయింది. తలపైకేత్తి హోటల్ వైపు చూసాడు. ఒక కుర్రవాడు బిత్తర చూపులు చూసుకుంటూ"చెయ్యి జారింది అయ్యా!ఆ గ్లాసులకు బదులు నాకు ఈ రోజు భోజనం పెట్టకండి "అంటున్నాడు భయంభయంగా. యజమాని ఆ పిల్లాడి వైపు కోపంగా చూస్తూ " ఒక్క సారని వదిలేస్తే అన్ని పగలగొడతావురా నువ్వు. నీకు ఇలా కాదు" అంటూ కర్రతో కొడుతున్నాడు.పిల్లాడికి వాతలు వచ్చాయి.ఋషి అక్కడికి వెళ్లి యజమాని కాలరు పట్టుకుని "నువ్వు మనిషివా? పిల్లాన్ని ఇంత దారుణంగా కొడతావా?"అని అడిగాడు. అక్కడే ఉన్న పని వారు వచ్చి ఋషిని హోటల్ బయటకి తోసేశారు.ఆ పిల్లాడు ఏడుస్తూ, తిరిగి పనికి వెళ్లి

పోయాడు. ఎంత కర్కాషులు ఈ జనం. రాక్షసుల కన్న కఠినలు వీరు. డబ్బు కోసం ఉచ్చానీచాలు మరవాలా? దయా, జాలి గుండెని కనీసం తాకనన్న తాకవా వీళ్ళకి.

డబ్బు మదం ఎక్కువయ్యి కఠిన పాషాణమయింది,వారి మనసు! అంటూ, సమస్తమనుశ్య జాతినే నిందిస్తూ, భావేద్వేగానికి గురి అయ్యాడు.నడిచాడు అక్కడి నుంచి ఆకలి కూడా చచ్చిపోయింది.

**********************

రోజులు గడుస్తున్నాయి ఒక చోట స్థిరంగా ఉండటానికి మనస్సు ఒప్పుకోడం లేదు ఋషికి. ఎదో తెలియని వెలతి తడుతోంది. మనసంత అశాంతే నిండి ఉంది.తిరిగి సన్యాసిద్దామా! అంత ఓపిక, శక్తి ఇక లేవు. ఉత్సాహం తగ్గిపోయింది.మరేం చేయ్యాలి?అని మనసు వేదిస్తోంది, అతడికి . బాట వెంట వెళుతున్నాడు.అలా ఓ ఇంటిని దాటుకుంటూ వెళుతున్నప్పుడు, తన చూపు వేప చెట్టు వైపు పడింది. ఆ చెట్టుని నరికేస్తున్నారు.

పచ్చని చెట్టు. విశాలంగా మోలిచాయి దాని కొమ్మలు.

ఆ ఇంటికి కళ ఈ చెట్టే అన్నట్టుగా ఉంది.కానీ ఎందుకు కొట్టేస్తున్నారు అర్ధం కాలేదు. ఆ ఇంటి పక్కన నిల్చున్న వ్వక్తిని అడిగాడు."ఆ చెట్టు వాస్తుకు లేదట" అన్నాడు.

విషయం తెలుసుకుని అక్కడి నుండి రెండుమూడు అడుగులు వేసాడు. అప్పుడు వచ్చింది ఓ చిన్న పాప. ఆ చెట్టు దగ్గరకి వెళ్లి "దీన్ని కొట్ట వద్దు, చంపేయవద్దు "అంటూ గట్టిగా చేతులు చూట్టేసుకుంది. ఆ చెట్టుని ."ఏమిటే నీ అల్లరి, చెట్టు వాస్తుకు లేదు, ఇది ఇలానే ఉంటే మనింట్లో దరిద్రం పోదట, వాస్తు పండితుడు చెప్పాడు. నువ్వు ఇలా రా "అని కోపంగా రెక్క పట్టి లాగేసింది. ఒక ఆవిడ. ఆ పాప తల్లిమో! పాప ఆ చెట్టు వద్దకు వెళ్లి, మెత్తనైనా తన చేతేలతో, గొడ్డలి పోటు తగిలిన చోటున మెల్లిగా రాసింది. అది రాల్చిన ఎండు ఆకులను తన హృదయానికి హత్తుకుని,ఏడుస్తూ ఇంటి లోపలికి వెళ్ళింది.తాను చూస్తున్నది చాలా చిన్న విషయమే. కానీ తన ఆలోచనలు ఇలా సాగాయి.ఈ చెట్టు కొట్టేస్తున్నారు, ఎందువల్ల? వాస్తు కోసం. అసలు ఈ చెట్టు కొట్టేస్తే "దరిద్రం "పోతుందని ఆ వాస్తుశాస్త్రజ్ఞుడు రుజువు చేయగలడా? ఈ చెట్టు కొట్టేయగానే నిధి, నిక్షపాలు తరలి వస్తాయా? అదృష్టంలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంటుందా? తన చేతగాని తనాలకి, అభిరవృద్ధి ఎలా కావాలో తెలియక

ఇలా ఈ దారులన్నీ ఆశ్రయిస్తున్నారు ఈ జనం.నిజం కాదా? చాలా మంది నమ్మి మోసపోవడం లేదా? కానీ ఈ చిన్నారి హృదయం ముందు ఈ వాస్తు నిలబడ గలదా? తను చెట్టు పై పెంచుకున్న బంధం ముమ్మాటికీ వాస్తు కన్నా పెద్దే! ఈ అసమర్థుల,మూర్ఖుల ముందు తను ఓడినా గెలిచినట్టే కదా!నాకో పాఠం నేర్పింది పాప. కొన్ని బంధాలు ఎంత స్వచ్ఛమైనవో అని .

***************

కొన్ని నెలలు గడిచాయి.అయినా ఋషి ప్రయాణం ఆగడం లేదు. అలా నడిచి పోతున్నాడు. తిండి సరిగ్గా లేక స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి కొద్ది దూరంలోనే ఉంది. కొందరు వచ్చి ఆసుపత్రికికి తీసుకుని పోయారు.తన కి కొంచెం మత్తుగా ఉంది. కళ్ళు మెల్లిగా తెరుస్తున్నాడు. ఎదురుగా డాక్టర్. " తినక పోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు, ఇప్పుడు మీకు పరవాలేదు. ఇంతకీ మీరు ఎవరు?....... పేరు?

అడిగింది డాక్టర్." నా పేరు ఋషి. నేనో బాటసారిని.నాకు చిరునామా అంటూ లేదు.నా ట్రీట్మెంట్ ఖర్చు? నా దగ్గర డబ్బులు లేవండి."అన్నాడు ఋషి."ఇది ప్రభుత్వ ఆసుపత్రి, డబ్బుల ఇవ్వాల్సిన అవసరం లేదు" అంది ఆమె.

పక్క బెడ్ పై ఓ యువతి పడుకుని ఉంది. .ముఖం మొత్తం కాలిపోయివుంది. కళ్ళు తప్ప. పక్కనే కూర్చుని ఓ స్త్రీ కన్నీరు పెడుతుంది. వాళ్ల అమ్మా అయుంటుంది . "ఏమైంది డాక్టర్?" అడిగాడు ఋషి, డాక్టర్ని.ప్రేమను అంగీకరించలేదని ఓ పోకిరి ముఖం పై ఆసిడ్ పోసాడు" అంది. అతడికి మనస్సు చీవుక్కుమంది.ఆ అమ్మాయికి నిండా 20ఏళ్ళు ఉండవు . తనకు నచ్చలేదని చెప్పే స్వేచ్చ కూడా లేదా ఈ సమాజంలో. ఒప్పుకోక పోతే ఆసిడ్ పోస్తాడా? ఈ పైశాచిక ఆలోచచన రూపుదిద్దుకోవడానుకి

ఆ యువకుడిని ప్రేరేపించిందేమిటి?

హద్దులు, కట్టుబాట్లు ఆడవాళ్ళకేనా,ఈపురుషప్రపంచంలో?

ఇప్పుడీ అమ్మాయి భవిష్యత్తు ఏమిటి? తనను ఎవరు పెళ్లిచేసుకుంటారు. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అంటారు మరి, ఈ పైశాచికత్వం, పాశవికం ఎక్కడి నుండి వచ్చాయి?

ప్రేమిస్తే ఆరాదించాలి కానీ ఈ నీచస్వబావం ఎందుకు?

దీన్ని ప్రేమ అంటే, ప్రేమ చావును కోరుతుందా? తనలోని రాక్షసున్ని నిద్ర లేపుతుందా? కాదు. ముమ్మాటికీ కాదు. ఇది ప్రేమ కాదు. మరి ప్రేమంటే ఏంటి? మళ్ళీ మొదటికి వచ్చాడు. తనను జీవితాంతం వెంటాడుతున్న ప్రశ్న. తన జీవితం సగం గడిపిన ప్రశ్న. ఇప్పుడు తనని కవ్విస్తున్న ప్రశ్న.దీర్ఘాంగా గాలి తీసుకుని నిట్టూర్పు విడిచాడు. అసలు ఎక్కడ మొదలుఅయ్యింది ఇదంతా!

అతడికి పుటలులా కళ్ళ ముందు మెదులుతున్నాయి కొన్ని అనుభవాలు.

ముసలి తల్లి శవం గుర్తుకు వచ్చింది. కన్న తల్లిని దహనం కూడా చెయ్యలేనిది ప్రేమా? కాదు. గ్లాసులు పగిలి పోయాయని వాతలు వచ్చేలా కోట్టే ఆ యజమాని డబ్బు పై ప్రేమా? కాదు. కనీసం మనిషి మీద చూపాల్సిన దయ కూడా లేదుకదా! మరి ఇప్పుడు ప్రేమించిన మనిషి ఒప్పుకోలేదని ఓ ఉన్మాది ఆసిడ్ దాడా ప్రేమంటే? కాదు.

తనకు ఏ మాత్రం సంబంధం లేకున్నా, వచ్చి ఆ కుక్క కోసం ఏడ్చాడు, ఆ కుక్క పిల్లలకు ఆహారం అందించాడు. కళ్ళ నిండా నీళ్లతో "తిరిగి రా నేస్తమా!"అని ఆప్యాయత తో అన్నాడు. ఆ పిల్లాడి కళ్ళలో కనిపించింది, ఏమిటీ?

ఆ ముసలమ్మ గాజులు అమ్మి వచ్చిన డబ్బులలో కొంత తీసి ఇచ్చింది. అన్నం పెట్టింది. ఆ బిచ్చగాడు కృతజ్ఞతపూర్వకంగా చూసాడు. ఆ చూపులో ఉంది ప్రేమా?

మరి ఆ చిన్న పాప చెట్టు కొడుతుంటే అడ్డుపడి, తనేమీ చెయ్యలేదని తెలిసాక. క్షమించు అన్నట్టుగా చెట్టుని తాకి, రాలిన ఆకులను ఎదకు హత్తుకుంది. ఆ స్పర్శలో ఉంది ప్రేమా?

అవును. అది ప్రేమ. ప్రేమనే. జంతువుల పట్ల ప్రేమ. ప్రకృతి పట్ల ప్రేమ. మనిషికి మనిషి పట్ల ప్రేమ. లోకం లో స్వార్థం ఉంది, కర్కషత్వం ఉంది. ఉన్మాదం ఉంది. కానీ ప్రేమ వీటికి అతీతమైంది. అరిషడ్వర్గాలను జయిస్తుంది . అన్ని గుణాలులో శ్రేష్ఠమైంది ప్రేమ. అద్వితీయమైన అనుబూతి.

బుద్ధుడు తపించింది ఈ ప్రేమ కోసమే కావచ్చు .అల్లాహ్, జీసాస్ పంచింది శాంతి అయితే,ఇదే ప్రేమ.గీత సారమంతా"ప్రేమ" అన్న మాటే కదా! ఇన్నాళ్ల తపస్సు ఫలించింది. వనాలలో ఉన్నప్పుడు కాదు. జనారణ్యంలో ఉన్నప్పుడు ప్రేమ సాక్షాత్కారం అయ్యింది. తనని వెంటాడి, కవ్వించిన ప్రేమ కన్యక ఇప్పుడు తన పరిశ్వంగంలో ఉంది. ప్రశ్న చిక్కు వీడింది. ప్రేమ.... ప్రేమ... ప్రేమా....

ఎల్లలు లేనిది ప్రేమ. ఆణువణువూనా, అంతటా ప్రేమ. "విశ్వం పై ప్రేమ. "విశ్వజనీయ ప్రేమ ".

ఋషి కి సమాధానం దొరికింది. ఇప్పుడు అతడు నిజంగా ఋషే అన్నట్టు భావిస్తున్నాడు. పెదవిపై చిరునవ్వు విరిసింది. అశాంతి తొలగి, సంతృప్తి లభించింది. బెడ్ మీద నుంచి బయటికి వెళ్ళబోతుంటే " ఎక్కడికి వెళుతున్నారు "అడగింది డాక్టర్. నా వాళ్లు ఎదురుచూస్తున్నారు. నా ఇంటికి వెళ్ళాలి."అన్నాడు ఋషి. అతని కళ్ళల్లో ఎదో శక్తి. నమ్మకం తో కూడిన తేజం కనబడింది ఆమెకి."నా ప్రేమని పంచాలి. నా జీవితం వైరాగ్యంతో, మెట్ట వేద్దాంత్తంతో ఉండిపోకూడదు "అని మనసు లోపల అనుకున్నాడు.బయటికి వెళ్ళాడు. ఇప్పుడు తన దారి స్థిరంగా ఉంది. గమ్యం నిర్థిష్టంగా ఉంది. పయనమవుతున్నాడు ఆ బాటసారి. తన చివరి మజిలీ వైపు.........

         

**************నా మాట ************

చాలా ధన్యవాధాలు అండి. ఓపికగా చదివినందుకు. 

నేను రాసిన మొదటి కథ.చాలా ఇష్టంగా రాసాను

చాఫ్టర్స్ విడగొట్టడం, పాత్రపోషణ ఇవన్నీ సరిగ్గా నాకు తెలియవు. నేను చదివిన కథల స్ఫూర్తితో రాసాను. తప్పులుంటే క్షమించండి.🙏



Rate this content
Log in

Similar telugu story from Drama