Baswaraj Mangali

Tragedy Others

4  

Baswaraj Mangali

Tragedy Others

కర్ణ....వియోగం..

కర్ణ....వియోగం..

8 mins
536


   ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |

     దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ||

     

    సప్తాశ్వారథ మారుడం ప్రచండం కశ్యపాత్మజం|

   శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం||

ఆదిత్య శ్లోకాన్ని పఠిస్తూ అర్ఘ్యాన్ని గంగా నదిలో సమర్పిస్తున్నాడు ఆ ఆదిత్యపుత్రుడు,కర్ణుడు.

గోధూళి వేళన, గువ్వలన్నీ గూటికి చేరుతున్నాయి. నిర్మలమైన ఆకాశం నుంచి కిందికి దిగుతూ అస్తమిస్తున్నాడు ఆ సూర్య భగవానుడు.

పూజను మగించుకుంటూ, భక్తి పూర్వకంగా భాస్కరునికి ప్రణమిల్లి,కర్ణుడు గృహానికి బయలుదేరాడు.

అస్త్రాలను తీసుకునేందుకు అక్కడున్న చెట్టు వద్దకు వెళుతున్నాడు. ఒక స్త్రీ అక్కడ కూర్చొని ఉంది.పెద్దావిడ.ఖరీదైన వస్త్రాలతో ఉంది.కర్ణుడు రావడం చూసి వెనుదిరిగి పోతుంది.

అది గమనించిన కర్ణుడు,

" అమ్మా !ఎవరు మీరు?మీరు నా గురించి వచ్చారా?!, ఏదైనా సహాయం ఆశించి వచ్చారా?!నన్ను చూసి వేనుదిరిగారెందుకు?!

నా పేరు కర్ణుడు. మీకు ఎం కావాలన్నా అడగండి. సంశయించకండి". అంటూ వెళిపోతున్న ఆ స్త్రీని ఆపాడు.

"నువ్వు నాకు తెలుసు పుత్రా!నీవు దాన ప్రధాతవు, ఎవ్వరు ఏమడిగినా ఇస్తావు. నేను ఇక్కడకు దానం అడగడానికి రాలేదు కర్ణా,బిక్షం అడగడానికి వచ్చాను. దానం కాదన గలరు కానీ బిక్షం కాదన లేరు. నాకు నీ నుండి భిక్ష కావాలి.ఆ బిక్షను నువ్వు వెయ్యలేవు,నాకు కావలసింది నువ్వు ఇవ్వ లేవు. నాకు ఆ భాగ్యం లేదు రాధేయా !ఆశించి, భంగపడటం దేనికి?అందుకే వెళుతున్నాను."అని బాధతో అన్నది ఆమె.

"మీరు భిక్ష అన్నారు, కాదు అది ఆజ్ఞ. నన్ను అజ్ఞాపించండి. నా వశం లో ఉన్నది ఏదైనా సరే ఆనందంగా ఇస్తాను. చివరికి నా ప్రాణమయినా మీ పాదాల చెంత అర్పిస్తాను".అని వినమ్రంగా తలొంచాడు, దాత.

ఆ స్త్రీ కర్ణుడి కళ్ళలోకి చూసింది. అవి చాలా తేజోమయంగా కనిపించాయి. ఆ కళ్ళు ప్రశాంతంగా, నిజాయితీగా కనిపించాయి.ఆ సౌష్టవం లో అంగాంగం ఠీవినే, రాజసం తన ముందు తలొంచినట్టు కనబడింది. ఆమెకు.

"నీవు గొప్పవాడవు. దాన వీరుడవు. సుగుణ సంపన్నుడవు.నీ లాంటి దాన వీరుడను పెంచిన తల్లిదండ్రులు ధన్యులు. మీ అమ్మ రాధ అదృష్టవంతురాలు."గర్వం తో నిండిన గొంతులో అన్నది ఆమె.

"మా మాత గురించి మీకు తెలుసా?" ప్రశ్నించాడు కర్ణుడు.

"ఆ మాతృమూర్తి గురించి ఎవరికి తెలియదు!.గొప్ప వీరున్ని పెంచిన తల్లి కదా! ". జవాబిచ్చింది ఆ స్త్రీ.

"ఆ అదృష్టవంతులు, ధన్యులు వారు కాదు, నేను.

ఆ మాతృమూర్తి అందరికి తెలుసు కానీ నా తల్లి ఎవరో నాకే తెలియదు. ఆమె నా కన్న తల్లి కాదు.నేను గంగా నదిలో, పూల బుట్టలో, ఎర్రటి ఏండన ఏడుస్తూ అలలకు కొట్టుకు పోతుంటే,వారికి దొరికాను.వారు దయతో నన్ను పెంచారు.సాకారు.

నన్ను పెంచిన అమ్మే రాధమ్మ. ఆమె నన్ను కనక పొవచ్చు.కాని ఆమె నాకు కన్న తల్లి కన్నా ఎక్కువే. ఆ మాత మమత, మమకారం నాకు లభించాయి.ఆమె చేతులు నాకు జో కొట్టాయి.నిద్ర పుచ్చాయి.నేను భాగ్యశీలిని.అందులో ఏ సంశయం లేదు.

కానీ మీకు తెలుసో లేదో,నన్ను కన్న తల్లి,త్యాగశీలి!నన్ను త్యజించింది. పుట్టగానే ఈ గంగా నదిలోనే వదిలి నీళ్లు వదిలేసింది. అక్కడ సంచరించే జలచరాలకు ఆహరంగా నన్ను ఎర వేసి పోయింది, ఆ పావని "అంటూ తనలో ఉన్న కోపాన్ని, బాధను ఒక్కసారిగా గుర్తుచేసుకున్నాడు.

లిప్త పాటు అక్కడ నిశ్శబ్దం చేరిపోయింది.

"ఏ తల్లీ తన బిడ్డను అలా కావాలని వదిలేయదు,కర్ణా!

నిస్సహాయత తోనే వదిలేసివుంటుంది. ఎంతో నరకం అనుభవించి ఉంటుంది, అప్పుడే పుట్టిన పసి గుడ్డును

విడవడానికి."అని ఏడుపుకు సిద్ధంగా ఉన్న గొంతుతో అన్నది ఆ స్త్రీ.

"ఒక తల్లికి బిడ్డను వదిలేయాల్సిన స్థితి ఎందుకొస్తుంది ?చెప్పండి.చివరికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటుంది.. మీరు చెప్పండి మాత!,మీకు కలిగిన సంతానాన్ని అలా విడిచిపెట్టి పోతారా?

లోకం తో పోరాడైనా బిడ్డను కాపాడుకుంటుంది తల్లి.

మరి నేను ఒక్కడికే మినహాయింపు ఎందుకు?

ఆమె ఎపుడైనా ఎదురుపడితే నేను ఆమెను అడగాలనుకుంటాను, ఓ జనని ! నీకు నేను అక్కర లేదనుకున్నప్పుడు జన్మనెందుకు ఇచ్చావు? ఒక వ్యర్థాన్ని పారేసినట్టు నన్ను ఎందుకు పారేసావు? నేను చేసిన పాపం ఏంటని."ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు, రాధేయుడు.

"వస్తుంది. అలాంటి అవస్థ వస్తుంది కర్ణా! పరిస్థితులు ఎవరి ఆదేశాల్లో ఉండవు. ప్రాణం పోవడం కన్నా దుర్భర గతి చుట్ట ముడుతుంది. అప్పుడు ఆ స్థితి వస్తుంది.

ఏ తల్లికి రానటువంటి పరిస్థితి. ఎంత మానసిక క్షోభ అనుభవించిందో నాకు తెలుసు. చిన్న వయసులో నిన్ను కని,సమాజం నన్ను పెళ్లి కాని కన్యకు సంతానం ఎలా కలిగిందంటే, తండ్రి ఎవరని మాటలంటే,వారి దగ్గర ఏ సమాధానాలు లేనప్పుడు,.కన్న పాశాన్ని విధి అనే ఖడ్గం తో కోసుకుని,సమాజం వేసే ప్రశ్నలకు తలొగ్గి, తన మొదటి సంతానాన్ని గంగలో వేసేటప్పుడు ఆమె ఎంత మరణబాదను అనుభవించిందో నువ్వు ఊహించగలవా?

కనులరా నిన్ను ఇంకా చూడకుండానే, కడుపారా పాలు ఇవ్వకుండానే,బొడ్డు పేగు కూడా సరిగ్గా తెగని నిన్ను విడుస్తున్నప్పుడు, ఆ అమ్మ గుండెకు తగిలిన మాతృత్వపు కత్తుల వేట్లు, ప్రేమ పోట్లు ఎన్నో నీ అంచనాకైనా అందుతుందా కర్ణా?"అని నేరుగా అన్నది. ఏడుస్తూనే ఆమె.

"ఇవన్నీ మీకు ఎలా తెలుసు? ఎవరు మీరు? నా కన్న తల్లి ఎవరో మీకు తెలుసా? "తన తల్లి గురించి తెలుసుకోవాలన్న తపన తోను, అశ్చర్యం తోను అడిగాడు, కర్ణుడు.

"నేను......... నేను......."

"కుంతీ దేవి.పాండవుల తల్లిని.నిన్ను కన్న అమ్మను...."

అలా చెబుతూ కర్ణుడి కళ్ళలోకి సూటిగా చూడలేక చూపులను కిందకి మరల్చింది.అపరాధ భావానతో తనను నేరుగా చూడలేక పోయింది.

కర్ణుడు దిక్బ్రాంతికి లోనయ్యడు. ఇన్నాళ్లగా మనసులో అడుగున దాగిన వేదనలు నిప్పురావ్వల్లా గుండెల్లోంచి ఎగసిపడుతున్నాయి. అవి నేరుగా కళ్ళలోకి పాకి చూపులను వాడిగా మారుస్తున్నాయి. అవెన్నో ప్రశ్నల బాణాన్ని వేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇటు కుంతీ దేవి మనసులో చెలరేగిన తుఫాను ఒక్క సారిగా ఆగింది. ఇన్నాళ్లుగా మోస్తున్న బరువు ఒక్క సారిగా దిగి తేలిక అయినట్టుగా అయింది.తనను అను క్షణం కలచివేస్తున్న క్షోభకు కాస్త ఊరట చేరినట్టు అనిపించింది.


గడియ పాటు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.


ఒకరు ప్రశ్నల ఈటెలను,ఎగసిన బడబానలను వదలడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇంకొకరు రిక్త అమ్ముల పొదితో ఉన్నట్టు ఉన్నారు. తిరిగి సంధించడానికి ఏ ఒక్క ప్రశ్నల విల్లు, శర పరంపర కూడా లేదు ఆవిడ దగ్గర.ఆ ప్రశ్నలను ఎదుర్కోవడానికి తన దగ్గర సమాధానాల డాలు లేదు.తనకు గురి తగిలినా కూడా గాయం కాకుండా ఉండేందుకు కర్ణుడిలా దృడమైన, కవచ కుండనాల లాంటివి ఏవీ లేవు.

"మీకు ఈ సూత పుత్రుడు, కర్ణుడు ప్రణామం చేస్తున్నాడు.

ఓ రాజ మాత, దయుంచి మీకు కావలసింది అడిగి, తొందరగా ఈ వైపు నుంచి వెళ్ళండి.మీరు

పొరబాడుతున్నారు, మీరు వదిలేసినా ఆ సూర్యపుత్రుడు, కౌంతేయుడు ఏనాడో ఆ గంగమ్మ ఒడిలో చేరాడు. ఆ సూర్య భగవాననుడికి జలాన్ని సమర్పించి త్యజించిన ఆ భరతవంశీయుడు మరణించాడు. మీరు వచ్చింది, ఓ సాదారణ, కులతక్కువ ,జాతిహీన సూతసుతుడు ఈ రాధేయుడి దగ్గరకు. నన్ను మీ కొడుకని పిలవకండి". అని ఉన్న పాటుగా మాటల ఈటెలను, కోపాగ్ని జ్వాలలను విడిచాడు. ఆ కర్ణుడు.కోపోద్రేకుడై.

ఆ అక్కసుకు, కాఠిన్య వ్యాక్యలకు కుంతీ దేవి తాళలేక పోయింది. మొదటి సారి బిడ్డను కలుసుకున్న తల్లికి ఈ కరుకుదనం తల్లి పేగును కదిలించినట్టయింది.

టప, టప మని కన్నీళ్ల ధార కారుతోంది. ఆమెకు గొంతు పెగలడం లేదు..

కాస్త ఓపిక తెచ్చుకొని, చిన్న స్వరం తో ఇలా అంది

"ఏ కన్న తల్లికి నా వంటి దుస్థితి రాకూడదు కర్ణా.

ఒక్కసారి నా స్థితిలో ఉండి ఆలోచించు, ఆలోచిస్తే నువ్వు ఇలా మాట్లాడవు "ఏడుస్తూనే.

నాగురించి మీరెప్పుడైనా ఆలోచించారా?ఇటువైపు నుండి వేగంగా ప్రశ్న.

"చిన్న వయసులోనే నేను ఎన్ని అవమానాలకు గురయ్యానో మీకు తెలుసా?

నా స్నేహితులు నన్ను అమ్మ లేని వాడని వెక్కిరించినప్పుడు, నాకు అమ్మ ఉందీ అని ఖచ్చితంగా చెప్పలేనప్పుడు, మొదటి సారి నాకే తెలియకుండా జారిన కన్నీటి బొట్టులో ఉన్న స్పర్శ మీరు అనుభూతి చెందగలరా?

నాలో ప్రతిభ ఉన్నా, గురుకులం లో నన్ను చేర్చుకోలేదు. కారణం నేను తక్కువ కులంలో పుట్టడం అట.అప్పుడు నేను పడిన బాద మీరు ఎరుగుదురా?"

"ఆనాడు హేమాహేమీల కొలువు కుటంలో యువరాజుల పోటీ జరిగింది.వీరత్వానికి పోటీ.నేను పాల్గొనేందుకు వెళుతున్నప్పుడు, అక్కడి వారు నన్ను అడిగారు "నీవు ఏ జాతి వాడవు, శూద్రుడికి ఈ పోటీలో స్థానం లేదు "అని. నేను సమాధానం చెప్పలేక నిష్క్రమిస్తున్నప్పుడు, మీ పుత్రులు నన్ను "మాతో నీకు పోటీ ఏమిటి?

సూత పుత్రుడవు వెళ్లి అశ్వాలను కాయక అని అవమానిస్తుంటే, మీరు అక్కడే ఉన్నారు కదా రాజమాత!మరి అప్పుడు నన్ను గుర్తించలేదా?"

"ఒక వేళ గుర్తించి ఉంటే అక్కడివారందరికీ వినపడేలా అతడు ఎవరో కాదు, నా బిడ్డ. కన్న బిడ్డ అనేవారు.

ఆ తర్వాత పాండవులతో "పుత్రలారా!మీరు ఎవరిని హేళన చేస్తున్నారో తెలుసా, మీ పెద్ద అన్నను. వెళ్లి పాదాభివందనం చెయ్యండి అని శాసించే వారు. కానీ.....

మీరు అలా చెయ్యలేదు. అప్పుడే విదంగా కొన్ని కట్లు మీ చుట్టూ కప్పబడి ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయి.

మీరు నాకోసం రాలేదు, మీ కన్న కొడుకులకు నా వల్ల ఏ అపాయము కలగకూడని వచ్చారు.అంతేగా రాజమాత?"

"సరే నేను ఒప్పుకుంటాను మీరు నాకొరకు వచ్చారాని, కానీ ఒక్కటి చెప్పండి. ఒక్క ప్రశ్ననే.నేను మీ కన్న సంతానమని ఇక్కడున్న ఒక్క చెట్టుకైనా, పుట్టకైనా, చివరికి ఎండిన నా మనసులా ఉన్న ఈ ఆకుకైనా చెప్పగలరా?" అని "తన కాలికింద ఉన్న ఎండుటాకు వైపు చూసాడు.తన ఆవేశపు ప్రకంపనలు ఆ ప్రాంగణం అంతా వ్యాపించాయి.

"ఒప్పుకుంటున్నాను పుత్రా. నేను తప్పు చేసాను. నీకు తీరని అన్యాయం చేసాను. నీ బాల్యాన్ని , నీ హక్కులను దూరం చేసాను.ఏనాడైనా నా కుమారులకు ఒక బాగాన్ని పంచాల్సి వచ్చినప్పుడు,అయిదు బాగాలే చేసాను. ఆరు చెయ్యలేక పోయాను. నీ వంతు నీకు దక్క కుండా చేసాను. అప్పడి నుండి ప్రతి క్షణం ఆ అపరాధ భావననే బాధ ను మోస్తూనే, అనుభవిస్తూనే ఉన్నాను. నన్ను క్షమించు కర్ణా. దయుంచి క్షమించు......"

ఆమె పశ్చాతాపం తో నిలువునా నిండి ఉంది.

కాస్త తెరుకొని, ఊపిరి వేగంగా తీసుకుంటూ, కట్టలు తెంచుకున్న మాతృప్రేమను ఆణువణువూ అవహించగా,

"అయితే కర్ణా, తక్షణమే వెళ్లి పాండవులతో నువ్వు నా పుత్రుడవని, వెళ్లి నీకు పాదాభివందనం చెయ్యమని ఆదేశిస్తాను. మీకు పెద్ద అన్న ఉన్నారు, అది ఎవరంటే కుంతీపుత్రుడు, సూర్యనందనుడు కర్ణుడు అని నీ తమ్ముళ్లుకు చెపుతాను.వారు అమితానందం చెందేరు.

నీకు అందలం ఎక్కిస్తారు. నీరాజనం పడతారు. అర్జునుడు ఛాపం పడతాడు. చిన్న వారయిన సహదేవ, నకులులు మల్లె, సంపెంగ, చందనాలు నీ పై చల్లేరు.భీముడు రథసారథి అయి నిన్ను ముందుకు తీసుకెలుతాడు. యుదిష్ఠురుడు నీ ఆదేశాలను పాటిస్తాడు.

జనుల జయ జయ నాదాలతో,సమస్త రాజుల సమక్షంలో,వేద పండిత మంత్రోచ్చరణతో, మంగళ వాయిద్యాలతో నిన్ను ఛక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తారు.

నేను ఇప్పుడు కూడా స్వార్థం తో నే వచ్చావు అని అన్నావు. నా కొడుకులను కాపాడుకోవడానికే అన్నావు.

అయితే పుత్రా!నా కోరికను విను,

దీన్ని కోరిక అనకు బిక్ష లా భావించు, గంగా నదిలో వదిలిన నిన్ను, మళ్ళీ అక్కడే తిరిగి నా ఒడిలోకి చేర్చుకోవాలనుకుంటున్నాను. నా మనసుకు తగిలిన గాయాలకు మరలా మాతృత్వపు మందును పూయి.నన్ను అమ్మగా స్వీకరించు. మరో సారి నీకు అమ్మనయ్యే భాగ్యన్ని ప్రసాదించు.నీ తమ్ముళ్లకు అన్నగా భాద్యత వహించు.."

అని ఆశాపూరిత కళ్ళతో చూస్తోంది ఆ అమ్మ.

"పట్టాభిషేకం. ఏకఛత్రాదిపత్యం. పాండవుల జేష్ఠుడిగా హోదా.ఇవన్నీ నాకు ఇస్తాను అంటున్నారు మీరు.

కానీ నేను తిరస్కరిస్తున్నాను.

నా గతం,వర్తమానం,భవిష్యత్తు నన్ను సూతపుత్రుడు, రాధేయుడుగానే గుర్తించాయి.ఇక ముందు కూడా నన్ను అలాగే గుర్తిస్తాయి. ఇప్పుడెలాగయితే మీరు కాలానికి, పరిస్థితికీ తల వంచారో నేను ఇపుడు అలానే ఉన్నాను. సూయొదనుడికి సఖునిగ, ప్రాణహితుడిగా ఉన్నాను. మా మధ్య స్నేహబంధం నెలకొంది.భూమికి, జలానికి ఉండే ఆత్మీయ బంధం ఏర్పడింది. నేను నా రాజు, దుర్యోదనుడికి ఋణపడ్డాను. ఆ ఋణం ప్రాణం తోనే పోతుంది. నేను రాలేను! "

అని తొనకని కంఠం తో అన్నాడు.

ఇప్పుడు కోపమనే నిప్పులను వర్షించి తెల్లటి మేఘం లా ఉన్నాడు.

కుంతీ మాత కళ్ళలో ఆశ పూర్తిగా పోయింది. దీర్ఘంగా, దీనంగా నిస్తేజమైన కళ్ళతో కర్ణుడి వైపు చూస్తోంది.

తిరిగి కర్ణుడు,

"అయితే మీరు కోరిన దాన్ని నేను ఇవ్వలేను, అది నా వశం లో లేదు. నా దగ్గరకు దానం ఇమ్మని వచ్చిన వారిని రిక్త హస్తాలతో పంపను. నేను మీకు మాట ఇస్తున్నాను. నా నుండి పాండవులకు అంటే ఐదుగురికి ఎలాంటి ప్రమాదం జరగదు. ఒక్క అర్జునుడి కి తప్ప. మాలో ఎవరైనా ఒక్కరే మిగులుతారు. నేను మరణించిన పాండవులు ఐదు గురే ఉంటారు". అని మాట ఇచ్చాడు.

"నేనిక వారించను కర్ణా! నేను వెళతాను కానీ నిన్ను నా ఒడిలోకి చేర్చుకొనీ పుత్రా!

ఈ కఠిన్యపు హృదయాన్ని ఒక్క సారి తీసెయ్యి నాయన. నీ మదిలో అలుముకున్న వేదనను, రోధనను, ఆవేదనను ఒక్క మారు తొలగించు కర్ణా! అమ్మా అని మనసారా పిలవాలని లేదూ!నిన్ను కన్న అమ్మనురా!

నా రక్తమాంసాలతో రూపొందిన దేహానివి కదరా!

నా రక్తం నిన్ను హాత్తుకోవాలని ఆరాటపడుతోంది!

ఇంత కరకుదనం ఎందుకురా???"

ఆమె అమ్మతనం ప్రశ్నిస్తోంది, ఆవేదన ఆ గంగా నదిలా ప్రవహిస్తోంది. ఆమె కణకణం ప్రాధేయపడుతోంది. శరీర ప్రతి కదలిక కంపిస్తోంది.

తల్లి అవస్థను చూసి కర్ణుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనసు కదిలినట్టయింది. తన ఎదలో ఉన్న ఆవేదన, కోపం ఆ అమ్మ పిలుపుతో ప్రక్షాళనం అయ్యింది.

"విధి ఎంత బలియమైనది అమ్మ. నన్ను ఎంతగా పగపట్టింది. ఒక తల్లికి బిడ్డ కోసం అన్ని కోల్పోయేలా చేసింది, చివరకు కొడుకు ముందే సాగిలపడేలా చేసింది.

నేను కలవాలనుకున్నప్పుడు మీరు ఎవరో ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. ఇప్పుడు మీరు తెలిసినా మిమ్మల్ని చేరలేని పరిస్థితి. ఈనాడు నా అభాగ్యపు రేఖలన్ని కలసి మూకుమ్మడి గా నన్ను హతమార్చాయి. మాతా! హతమార్చాయి.. హతమార్చాయి.......

మీ కోసం నేను ఎంతగా తపించానో మీరు ఎరుగరు జననీ. భయమేసినప్పుడు మిమ్మల్ని తలుచుకోవాలనిపించేది. కానీ మీ ముఖం నాకు తెలియదు. ఏవేవో రూపాలు కళ్ళముందుకు వచ్చేవి అందులో మిమ్మల్ని చూసుకొనే వాడ్ని.కానీ అప్పుడు స్పష్టత లేదు.

ఇప్పుడు పిలుస్తున్నాను..... అమ్మా....... అమ్మా... అమ్మా......... మ్మా..."

అమాంతం కింద కూలబడి పోయాడు ఆ కౌంతేయుడు. మోకాళ్ళ పై కూర్చొని విలపిస్తున్నాడు. తెల్లటి మేఘం ముసిరి, వర్షమై కళ్ళలోంచి కురుస్తోంది. గుండెల్లో ఉన్న మంట, అవిరై బయటికి వచ్చేస్తోంది. ఇప్పడు అతడు నదిలో నిశ్చలంగా ఉన్న జలం లా ఉన్నాడు.

కుంతీ దేవి మనసు పుత్ర వాత్సల్యం నిండి ఉండి. ఆమె కర్ణుడి వద్దకు వెళ్ళింది. కర్ణుడి శిరస్సును తన ఒడిలోకి తీసుకుంది. కళ్ళనీళ్లను తుడిచి వేసింది.

హిమాలయ పర్వతం లోని మంచు కరిగి, జాహ్నవి గా పుట్టి, నీరయి ప్రవహించి, జలపాతంగా మారిన నదిలా ఉన్నారు ఆవిడ.నిర్మల సరస్సులా.

ఆ ఆత్మీయత, ప్రేమ, ఆ స్పర్శ కర్ణుడికి ప్రశాంతతను అందించాయి.

కుంతీమాత, కర్ణుడి తలను ప్రేమగా నిమిరింది.

మాతృత్వపు ఒడిలోకి , పుత్రవాత్సల్యం వచ్చి చేరింది.

ఎన్నో ఏళ్ల పాటు ఇరువురు పడుతున్న ఘర్షణ ఆగింది. ప్రశ్నల బాణాలు ఇక లేవు. సంజాయిషీలకు తావు లేదు. అపరాదాభావన, ఆక్రోశపు వెల్లువలు ఇక లేవు. నది చీలిక తిరిగి నదిలో కలసినట్టు గా ఉంది.


ఇవన్నీ చిత్రం గా చూస్తున్నట్టుగా ఉన్నాయి అక్కడున్న చెట్టు, చేమలు. కదలకుండా అలాగే ఉన్నాయి. అక్కడ మునుపేన్నాడు లేనంతగా ప్రశాంతం నెలకొంది.

తల్లి, బిడ్డను కలిపింది ఈ తండ్రేగా అనుకుంటూ,ఆకాశాన్ని, అవనిని కలిపానన్న గర్వంతో అస్తమిస్తున్నట్టుగా అగుపించాడు ఆ ఆదిత్యభగవానుడు, సూర్యుడు.

       *******నా మాట.**************

మీకో మనవి చేసుకోవాలి. ఇది కథ కాదు. ఒక సందర్భం.

మహాభారతంలోనిది. కుంటిభోజుని కుమార్తె కుంతీదేవి. దూర్వాస మహర్షి ఇంటికి అతిధిగా వచ్చినప్పుడు ఆమె ఆ మహర్షికి మంచి ఆతిద్యం ఇచ్చింది. దూర్వాసుడు మెచ్చి ఆమెకు సంతాన మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆమె చిన్నతనం లో,మహాభారతం లో ప్రతీ పాత్ర విశిష్టమైనది. ప్రతీ ఒక్కరి మనసులో ఎదో ఒక్క చోట అయినా ఘర్షణజరిగి ఉంటుంది. వారి వారి కొణాల్లో చేసిన ప్రతిదీ సరైనదే.

ఇన్ని పాత్రల్లో కర్ణుడిది ఉన్నతమైనది. కర్ణుడి లో లోతైనా, సునిషిత భావాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పుడే తల్లి కి దూరమై , సమాజం చేత అవమానించబడ్డాడు.ఒక అనాధ గా బతకడం ఎంత కష్టమో కూడా కర్ణుడి ద్వారా తెలుస్తుంది.ఇప్పుడు సమాజం లో తక్కువ కులం, జాతి వివక్షత కర్ణుడు అప్పుడే ఎదురుకున్నాడు.ఆ కాలం లో చిన్న జాతుల వారిని ఏ విదంగా అణచివేశారో కూడా మనం గమనించవచ్చు.

మొన్న టీవీ లో మహాభారతం చూస్తున్నాను. కుంతీ దేవి, కర్ణుడు కలుసుకున్న సందర్భం. ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు, వారు ఎంత మదనపడ్డారో అనిపించింది. అందుకే నేను ఈ సందర్భాన్ని ఎంచుకున్నాను.

చాలా ఎక్కువగా రాసాను. ఓపికతో చదివి ఆదరిస్తానని ఆశిస్తున్నాను...............

                                  

                                  ప్రేమ తో.♥️.

                                          రాజ్ సాహితీ.....



Rate this content
Log in

Similar telugu story from Tragedy