ఒక వేసవి సెలవుల్లో
ఒక వేసవి సెలవుల్లో
గడియారం చూసుకుంటుంటే 9:30 అయ్యింది. సాక్స్ వేసుకుంటూ అరిచాడు- “అనూ… టైం అవుతోంది త్వరగా బాక్స్ తీసుకురా”. అటునుండి అను- “ ఇదిగో వస్తున్నా అండి” బాక్స్ తీసుకొచ్చి రాము చేతికి అందించింది. సరే మరి నేను వెళుతున్నా. రాము దారికి అడ్డముగా వస్తూ, వెళ్తున్నా కాదు వెళ్ళొస్తా అని చెప్పండి అంది బుంగమూతి పెట్టుకుంది. సరే బంగారం వెళ్లి వస్తాను అను గదమ పట్టుకొని చెప్పాడు. “కిట్టు బాయ్ నాన్న” అని రాము గబగబ బయటికి నడిచాడు. ఇంతలో కిట్టు వచ్చి ‘బై డడీ’ అని చెప్పి వెళ్లిపోయాడు.
ఐదు నిమిషాల్లో బస్ స్టాప్ దగ్గరి కి చేరుకోగానే బస్ వచ్చింది. ఇవాళ సోమవారం అయ్యే సరికి బస్సు నిండా జనాలు ఉన్నారు. సీటు దొరకలేదు. రాము నిల్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది. రాము మళ్లి ఒకసారి గడియారం వైపు చూసుకున్నాడు 9:45 అయింది. ఆఫీసుకి లేటవుతుందని గాబరాగా ఉన్నాడు. అతనికి ఎదురుగా ఉన్న సీట్లో. ఒక ఆవిడా. “అరే చింటు గొడవ చేయకుండా గప్ చుప్‌గా కూర్చో.” అటువైపు తిరిగాడు రాము. ఆ పిల్లవాడు వాళ్ల అమ్మ కొంగుతో ఆడుతున్నాడు. కానీ దృష్టి అంతా ఆగింది ఆ పిల్లవాడి మీద కాదు వాళ్ళ అమ్మ పిలిచిన చింటు అన్న పేరుకి.
నేను రెండో తరగతి ముగించుకున్న తరువాత వచ్చిన వేసవి సెలవులను కుంట. అమ్మ నా బ్యాగ్ సర్దుతోంది. నాన్న తో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టడానికి. “అమ్మా… నేను వెళ్ళనమ్మ అక్కడ నాకు స్నేహితులు ఎవ్వరూ లేరామ్మ. నాకు బోర్ కొడుతుంది.” అమ్మ నా మాటలు వినకుండా నా బ్యాగ్ సదుర్కుపోతుంది. “రాము గొడవ చేయికు, అమ్మమ్మ తాతయ్య ఉంటారు కదా అమ్మమ్మ నీకు బోలెడన్ని కథలు చెబుతోంది, సైకిల్ మీద ఊరంతా తిప్పుతారు. నీకు బోర్ కొట్టదు. అయినా నేను కొన్ని రోజుల తర్వాత వస్తాను గా.” చేసేదేమీ లేక నాన్నతో వెళ్లి పోయాను.
నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మ నా దగ్గరి కి వచ్చి హత్తుకొని “రాము అంతా పెద్దవాడికి అయ్యావు రా” అంది. “ఇదిగో ఏమోయ్ ఏమి చేస్తున్నావ్ అక్కడ ఎవరు వచ్చారో చూద్దువు రా” అని అమ్మమ్మ కేకలేసింది. “అబ్బబ్బ ఎందుకు అరుస్తున్నావ్ అలాగా వస్తున్నా కదా” తాతయ్య కళ్ళజోడు సరి చేసుకుంటూ వచ్చాడు. “ఎవరది రాము నా అరే ఎంత పెద్దవాడివి అయిపోయావు రా బడవ అంటూ నన్ను దగ్గరి కి తీసుకున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఊరు మేము ఉంటున్న సిటీ నుండి చాలా దూరం. సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్లడం చాలా అరుదు. అమ్మమ్మ తాతయ్య వీలు చేసుకుని అప్పుడప్పుడు వస్తుంటారు . ఈసారి నాన్నకి ఏదో పని పడింది కాబట్టి వచ్చాను. నాన్న తాతయ్య ఏదో మాట్లాడుకున్నారు తర్వాత నాన్న వెళ్లిపోయారు.
అమ్మ చెప్పినట్టే నాకు బోర్ కొట్టలేదు తాతయ్య ఎక్కడికి వెళ్లినా నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్లేవారు బజార్ కానీ , బుర్రకథలకి , పొలం పనులకు వెళ్లేటప్పుడు కూడా నేను వెంట వెళ్లేవాడిని. రాత్రి కాగానే అమ్మమ్మ నేను నవారు మంచం మీద పడుకొని అమ్మమ్మ నాకు చుక్కలు చూపిస్తూ ఎన్నో కథలు చెప్పే ది. ఆ రోజు నేను ఉదయం లేచే సరికి తాతయ్య ఇంట్లో లేరు అమ్మమ్మని అడుగుతే ఏదో పనిమీద స్నేహితుడి వాళ్ళ ఇంటికి వెళ్ళాడని ఎల్లుండి వస్తాడని చెప్పింది. నాకు ఏమీ తోయక అలా వీధి అరుగు మీద కూర్చొన్నాను దిగాలుగా. పక్కనుండి అకస్మాత్తుగా ‘బౌ బౌ’ అని ఒక చిన్న కుక్క పిల్ల అరవడం వినిపించింది . చిన్న కుక్క పిల్ల తెల్లగా ఉంది కానీ దాని నుదురు మీద ఒక నల్లని మచ్చ కాని ముద్దుగా అనిపించింది. దాని అరుపులో కొంత నీరసం కనిపించింది. ఇంట్లోకి వెళ్లి అటక మీద అమ్మమ్మ నాకోసం దాచిపెట్టిన బిస్కట్ల ప్యాకెట్ తీసుకొని వచ్చి దానికి ఇచ్చాను అది తిని కాస్త హుషారుగా అరవడం మొదలు పెట్టింది. నాకు సంతోషం వేసింది. పాపం అది తప్పిపోయినట్టుంది ఆ వీధిలో దాన్ని తల్లి గాని దాని తోబుట్టువులు గాని ఎవరూ లేరు. ఆ సాయంత్రం అంతా దాంతో ఎంచక్కా ఆడుకున్నాను. రాత్రి అన్నం తినేటప్పుడు అమ్మమ్మతో- “అమ్మమ్మ నాకు ఒక కొత్త స్నేహితుడు దొరికాడు తెలుసా.” అమ్మమ్మ అన్నం తినిపిస్తూ అవునా పేరేమిటి అని అడిగింది. “దానికి పేరు లేదు అమ్మమ్మ అది ఒక చిన్న కుక్క పిల్ల.” అమ్మమ్మ నన్ను ఆ ప్రశ్న అడిగిన తర్వాత నాకు దానికి ఒక పేరు పెట్టాలి అనిపించింది. తెల్లవారు కాగానే వెళ్లి వీధి అరుగు మీద కూర్చొన్న అది మళ్ళీ వచ్చింది. “నిన్ను నేను ఏమని పిలవాలి ఆ … పప్పీ, డాలీ, క్యూటీ , నువ్వు చిన్నగా ఉన్నావు కదా చింటూ” . చింటూ అని పిలవగానే అది ‘బౌ బౌ’ అని అరిచింది. దానికి ఆ పేరు నచ్చిందే మో అనిపించింది. అప్పటి నుండి దాని చింటూ అని పిలవడం మొదలు పెట్టాను .
మర్నాడు తాతయ్య రాగానే నా కొత్త స్నేహితుడు చింటూ గురించి చాలాసేపు ముచ్చటించుకున్నాం. ఆ రోజు నుండి అది రోజు వచ్చేది మా ఇంటి దగ్గరి కి నేను వెళ్లి ఆడుకునే వాడిని అలాగే దానికోసం రోజు ఏదో ఒకటి తినడానికి తీసుకు వెళ్లే వాడిని. తాతయ్య తో నేను ఎక్కడికైనా వెళ్లిన అది సైకిల్ వెంటబడ ఉరుక్కుంటూ వచ్చేది. రోజులు నిమిషాల గడిచిపోయాయి నా వేసవి సెలవులు కూడా అయిపోయాయి. ఒక ఉదయనా అమ్మ నాన్న వచ్చారు కారులో నన్ను తీసుకు వెళ్ళడానికి. అమ్మమ్మ తాతయ్యని వదిలి వెళుతున్న అన్న బాధ కంటే చింటూ గాడిని వదిలి వెళుతున్న బాధ ఎక్కువగా ఉంది. ఆరోజు సాయంకాలమే ఇంటికి బయలుదేరాము. అమ్మమ్మ తాతయ్యకి బాయ్ బాయ్ చెప్పేసి చింటూ దగ్గరికి వెళ్లి “నేను మళ్ళీ వచ్చే వేసవి సెలవులకి వస్తాను సరేనా” అని చెప్పేసి కారు ఎక్కాను . కారు బయలుదేరింది చింటూ గాడు కారు వెనక చాలా దూరం వచ్చాడు నాకు చాలా బాదేసింది అమ్మ నాన్నని అడగాలనిపించింది చింటూ గాడిని మనతో ఇంటికి తీసుకెళ్దామని కానీ అమ్మకి నాన్నకి ఇంట్లో కుక్కల్ని పెంచుకోవడం నచ్చదు. సగం దూరం తర్వాత చింటూ గాడు కనిపియ్యలేదు పాపం వాడు తప్పిపోయాడు ఏమో. ఇంటికి వచ్చాక చాలా రోజులు పాటు చింటూ గుర్తుకు వచ్చేవాడు. తర్వాత కొన్నిసార్లు అమ్మమ్మకి ఫోన్ చేసినప్పుడు చింటూ గురించి అడుగుతుండేవాణ్ణి నేను వెళ్ళాక రాలేదు అని చెప్పింది. ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా చింటూ కోసం వెతికేవాడిని కానీ ఎప్పుడూ కనిపించలేదు. క్రమక్రమంగా మర్చిపోయాను.
మనిషి జీవితంలో కొన్ని బంధాలు తారసపడి వెళ్ళిపోతాయి కానీ వాళ్లతో గడిపిన సమయం జీవితాంతం గురతుంటుంది. నా ఆ వేసవి సెలవులను ఆహ్లాదంగా మలిచినందుకు మనసులో చింటూ కి కృతజ్ఞతలు చెప్పుకున్నా. నా స్టాప్ రాగానే కలల ప్రపంచం నుండి తెరుకొని బస్సు దిగిపోయాను. అరే ! కిట్టు కి ఒక మంచి కుక్క బొమ్మ తీసుకువెళ్లాలి అనుకున్నా .
