Bairi Tejashwini

Drama Tragedy Classics

4  

Bairi Tejashwini

Drama Tragedy Classics

మా నాన్న గుర్తు

మా నాన్న గుర్తు

4 mins
298



ఇవాళ పొద్దున లేచినప్పటి నుండి మనసు అంతగా ఏం బాగాలేదు ఏదో కీడు శంకిస్తుంది. అయినా అవి ఏమీ పట్టించుకోకుండా తయారయ్యి చందన కట్టిన బాక్స్ తీసుకుని ఆఫీస్ కి బయలుదేరాను. 12:00 గంటలకు అనుకుంటా శ్రీనివాస్ అంకుల్ కాల్ చేశారు. ఎందుకు కాల్ చేస్తున్నారు అని సంకోచిస్తూనే లిఫ్ట్ చేశా-"ఒరేయ్ విజయ్ ఇవాళ పొద్దుగాల మీ నాన్నను పలకరిద్దామని ఇంటికి వెళ్ళాను అక్కడ మీ నాన్నగారు కుప్పకూలిపోయి ఉండేసరికి హాస్పిటల్ కి తీసుకొచ్చాం రా డాక్టర్లు ఇక్కడ హార్ట్ ఎటాక్ అంటున్నారు నువ్వు ఉన్న ఫలానా వచ్చేయి ఇక్కడికి."ఇప్పుడు ఎలా ఉంది నాన్నగారికి అని అడిగే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు. ఆఫీసులో చెప్పేసి ఇంటికి వచ్చాను.


వేల కాని వేలకి ఇంటికొచ్చి గేటు తీసుకొని లోపలికి నడుస్తుంటే చందన ముఖంలో భయం కనబడింది. నా దగ్గరికి వస్తూ ఏం జరిగిందండి అని అడిగింది. "శ్రీనివాస్ అంకుల్ కాల్ చేశారు నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందట చందన హాస్పిటల్లో అడ్మిట్ చేశారట వెంటనే వెళ్లాలి"- అని బదులిచ్చా. "అయ్యో అవునా ఇప్పుడు మామయ్య గారికి ఎలా ఉందట" - అని కంగారుగా అడిగింది. నాకు ఏం చెప్పలేదు మళ్లీ కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు నేను వెంటనే బయలుదేరాలి. నేను వస్తానండి ఇక్కడ టెన్షన్ పడుతూ ఉండలేను, ఇప్పుడు ఎలాగో మధ్యాహ్నం అయ్యింది కదా లంచ్ బ్రేక్ అయ్యుంటది రుద్రా ని వెళ్లి తీసుకురండి, అందరం కలిసి వెళ్దాం ప్లీజ్ అండి. చందన పడుతున్న కంగారుని చూసి చేసేదేమీ లేక సరే అన్నాను.


హాస్పిటల్ కి చేరుకునేసరికి అక్కడ మా చుట్టాలంతా గుమ్మ గూడి ఏడవడం మొదలుపెట్టారు. ఇక పరిస్థితి అర్థం అయింది. నేను చందన మోకాలు చూసుకున్నాం తన కళ్ళల్లో నుండి నీళ్లు రావడం మొదలైంది. రుద్ర ఆరు ఏళ్ల పసివాడు వాడికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బెదిరిపోయి నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. "లోపలికి వెళ్లి చూడు నాయనా" అంటున్నారు ఎవరో ఏడుస్తూ. నాన్న చాలా ప్రశాంతంగా పడుకున్నట్టు కనిపించింది, ముఖానికి ఆక్సిజన్ మాస్క్, ఇటుపక్క హాట్ రేట్ చెక్ చేసే మిషన్ మీద అడ్డగీత పోతుంది. 


నాన్నని ఇంటికి తీసుకొచ్చాము అంబులెన్స్ లో. నాన్నని బయటే పడుకోపెట్టారు చందన నాన్న దగ్గరికి చేరి పైటకొంగు నోట్లో కుక్కుకుంటూ ఏడవ సాగింది. నా బంధువులు ఒకరి తరువాత మరొకరు వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. కానీ నా కంట్లో నుండి ఒక్క చుక్క కూడా రాలేదు. దహన సంస్కారాలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక ఆఫీస్ కి ఫోన్ చేసి నెలరోజుల పాటు రానని చెప్పేసా. తరువాత రోజులన్నీ పుస్తకంలో పేజీల లా గాలికి టకటక తిరిగిపోయినట్టు గడిచిపోయాయి. ఇన్ని రోజులు నాన్నని చూసుకున్న శంకరయ్య నరసమ్మను పిలిచి డబ్బులు అందిస్తూ- "ఇక రేపు ఒక్కరోజు రండి ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిపోతున్నాం" అని చెప్పేసా వాళ్లు "అట్లాగే నయ్యా" అని చెప్పి వెళ్ళిపోయారు. 


ఇంట్లోకి వెళ్లి చందనాకి చెప్పేసా ఎల్లుండి పొద్దున వెళ్ళిపోదాం అని. "ఇల్లు పొలం ఏం చేద్దాం అండి"- అని అడిగింది. "చేసేదేముంది అమ్మేద్దాం ఇక్కడ మనకి ఇక పని లేదు కదా మొన్న బాబాయ్ తో మాట్లాడా తెలిసిన వాళ్ళకి చెప్పు పెడతా అన్నారు,సరియైన బేరం దొరికినప్పుడు మళ్లీ ఫోన్ చేస్తా అన్నారు". చందన తలెత్తి సంకోచంగా చూసి ఏదో చెప్పాలని చెప్పలేక సరే అని తల ఊపింది. 


రాత్రి భోజనం చేసి పడక ఎక్కాను. ఎందుకో అస్సలు నిద్ర రావడం లేదు, అటు తిరిగి ఇటు తిరిగి అలా గడియారం వంక చూసా రాత్రి 1:30 అవుతుంది. చందనాకీ రుద్రాకి నిద్ర భంగం కాకుండా నెమ్మదిగా లేచి బయట వరండాలోకి వచ్చాను. నాన్న కూర్చునే ఉయ్యాల ఉంది. అమ్మకి అది చాలా ఇష్టంగా పెట్టించింది అక్కడ దానిమీద మల్లెతీగ పాకి ఉంది. వెళ్లి దాని మీద కూర్చుని ఆకాశం వైపు చూస్తుంటే చందమామ కనిపించింది అది వెన్నెల కురుస్తుంది. మల్లెపూలు సువాసనని వెదజల్లుతున్నాయి. అమ్మకి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. పాపం రుద్రకి నానమ్మతో ఆడుకునే అవకాశం రాలేదు రుద్ర మూడేళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మకి జబ్బు చేసి మరణించింది. అమ్మ జ్ఞాపకాలని వదల్లేక నాన్న ఇక్కడే ఉన్నారు. నేను ఒక్కడినే కొడుకుని అందుకేనేమో అమ్మ నన్ను చాలా గారాబం చేసేది. కానీ నాన్న అలా కాదు నాకు మంచి నడవడిక, సంస్కారం, చదువు అబ్బాలని కాస్త కఠినంగానే ఉండేవారు. ఇలా ఆలోచిస్తూ ఎప్పుడూ కన్నట్టుకుందో తెలీదు రుద్ర వచ్చి నన్ను తట్టేసరికి అర్థమైంది తెల్లారిందని. చందన వచ్చి - "ఏంటండీ ఇక్కడ పడుకున్నారు" అని అడిగింది నేను జవాబు ఏమి ఇవ్వలేదు. మనం ఇవాళ ఒకసారి పొలం కి వెళ్దామా అని అడిగాను సరే అన్నది. రుద్ర నా మాటలు విని గెంత లేచాడు.


ఎప్పుడు పొలానికి వెళ్లిన నాన్న ఏదో పని చేస్తూ కనపడేవారు ఈసారి కనిపించకపోయేసరికి ఏదోలా అనిపించింది. రుద్ర వచ్చి నా చెయ్ లాక్కొని నీళ్ల పంపు దగ్గరికి తీసుకెళ్లి "నాన్న నాన్న పోయిన సెలవులకి వచ్చినప్పుడు నన్ను తాతయ్య ఇక్కడ ఒకసారి నీళ్లలో తోసేసారు, నేను మొత్తం తడిసిపోయాను, కానీ నేనేమైనా తక్కువనా నేను తాతయ్య మీదికి నీళ్ళు చల్లాను ఇద్దరం భలే ఆడుకున్నాము అనుకో, ఇదిగో ఈ చెట్టు కింద తాతయ్య అన్నం,పప్పు,చారు అని ఆట ఆడించుకుంటూ నాకు తినిపించారు " అని చెప్పుకుంటూ పోతుంటే చిన్నప్పుడు నేను నాన్న ఇక్కడ గడిపిన జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నాన్న చిన్నప్పుడే నానమ్మ తాతయ్య చనిపోయారట. వాళ్ళ పెద్దమ్మ గారి దగ్గర పెరిగారట. కావున తండ్రి గారి ఆస్తి ఏమి లెకుండే అట. ఆ పని ఈ పని చేస్తూ పైస పైస పోగేసి కొన్న పొలమట అందుకే నాకంటే ఈ పొలం మీద ప్రేమ ఎక్కువ అని అమ్మ నాతొ సరదాగా చెప్తుండేది. చందన నాకేసి చూస్తూ-" ఏవండీ మీరు మీ నాన్నగారికి ఆ ఇల్లు ఈ పొలం తప్ప వేరే ఆస్తులు లేవు అన్నారు కదా. మీ చదువులు ఇంకా అన్ని ఈ పొలం మీద వచ్చే రాబడితో గడిచిపోయాయి అంటే ఈ పొలం చాలా లాభం ఇచ్చింది కదా అంది." ఆ మాట వినగానే ఒకసారి అమ్మ నాన్నతో అన్న మాట గుర్తు వచ్చింది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న సెలవులకు ఇంటికి వచ్చాను. "విజయ్ కి చక్కటి ఉద్యోగం వచ్చాక పొలం అమ్మేసి మనము విజయ్ తో ఉందామండి." అప్పుడు నాన్న-" లేదు కమల పొలాన్ని అమ్మలేను తల్లి ప్రేమకి నోచుకోలేకపోయానేమో గాని ఆ పొలం నన్ను తల్లిలాగా ఇన్ని రోజులు నాకు ఏ లోటు లేకుండా చూసుకుంది" అని చెప్పారు.


ఇంటికి వచ్చాక నాన్నలిన నవారు మంచం మీద కూర్చుని ఇంటి కప్పు కేసి చూస్తుంటే ఇక ఈ ఇంటికి ఎప్పుడు రాము ఆ పొలానికి ఎప్పుడూ వెళ్ళ అని ఆలోచన నాకు అస్సలు నచ్చట్లేదు. మళ్లీ వచ్చి ఆ ఉయ్యాలో ఊగుతూ అమ్మా నాన్నని గుర్తు తెచ్చుకునే అవకాశం రాదా అన్న ఆలోచన చిరాకుని కోపాన్ని తెస్తూ కంట్లో నీరు రూపకంగా బయటికి వస్తుంది. చందన రేపు వెళ్లడానికి అన్ని సదురుతూ నా వంక చూసింది నా కళ్ళని ఎర్రగా నీరు నిండిపోయి ఉండడం చూసి కంగారుగా దగ్గరికి వచ్చింది "ఏమైందండీ అని అడిగింది." ఇన్ని రోజులు దాచుకున్న బాధంతా తెంచుకొని తన్నుకుంటూ వస్తున్నాయి కళ్ళల్లో నీళ్లు - "నాకు ఈ ఇల్లు ఆ పొలం అమ్మాలని లేదు చందన అని ఏడవసాగాను." చందన నన్ను దగ్గరికి తీసుకొని -"నాకు ఇష్టం లేదండి అని చెప్పింది. రేపు బాబాయ్ గారికి చెప్పండి పొలము ఇల్లు అమ్మటం లేదు అని." ఇది నాకు మిగిలిన నాన్న గుర్తుగా.







 









Rate this content
Log in

Similar telugu story from Drama