నీలిమేఘాలు....
నీలిమేఘాలు....
నీలిమేఘాలు అంటే చాతకపక్షికి ప్రాణాలు నిలిపే దేవతాసమూహం ,మనం మాత్రం తక్కువా!?నీలమేఘుడ్ని చూస్తే అయితే వరాలజల్లు అడుగుతాము లేదా నిలువుదోపిడీ కూడా ఇచ్చేస్తాం..ప్రపంచంలో ప్రతీ సృష్టి ఆయనది అయినపుడు,ఓమాటు ఎవరా పెద్దమనిషి!?అని ,ఆవెలుగు భరించలేక ,అరచేయి కళ్లకు అడ్డుపెట్టి అయినా సరే!చూద్దాం అనుకోవడం కూడా సాధారణమే!?
నేనో మాట రాని మౌనిని.మనసు తెలుపలేని దానిని.
ఆకారానికో జీవిని.ఓ పీనాసి ఇంట్లో చీమనై కుక్క బ్రతుకు బతుకుతున్నాను.మా పుట్ట వీడికి కలిసి వచ్చిందట.
పుట్ట తియ్యనివ్వడు,అన్నం మెతుకన్నా విదిలించడు.
ఇంక నాకిష్టమైన ఓ రెండు పంచదార పలుకులు అంటే....!?అబ్బో!భారతావని ప్రజకి అంబానీ పెళ్లింటి భోజనమే!
పాపం!బంగారుతల్లి భార్యకు టీ నీళ్ళల్లోకి ,శ్రీరామనవమి పానకాన్ని సీసాలో పట్టి,ఫ్రిజులో నిల్వ చేసి మూత కొలత ఇస్తుంటాడు.ఎవరైనా తెచ్చిన తీపి తప్ప,ఈ ఇంట్లో తీపి వాసన ఎరుగను నేను.
ఎపుడైనా తిరుపతి,అన్నవరం అంటూ ప్రసాదాలు వచ్చినా,ఎక్కడ బారులు తీరుతామో అని పుట్ట చుట్టూ గోడ కట్టించేడు కుటిల కుంభవృష్టుడు..ఇంకా దాని చుట్టూ చీమల మందు చల్లిస్తాడు రోజూ..గోడ గడప దాటింది లేదమ్మా!నాలుగు రోజులైంది..కానీ ఈ రోజు కో ప్రత్యేకత ఉంది.నాకు స్వతంత్ర దినం.
చాన్నాళ్ల నా విన్నపాన్ని ఉఛ్వాస,నిశ్వాసలు చిత్తుడికి అప్పచెప్పితే,ఆయన చిట్టాకి ఎక్కిస్తూ పుణ్యం ఎక్కువుందోయ్!హరి దర్శనానికి వెళ్ళు అన్నాడు.
ఈ గోడనే దాటలేను,దర్శనం ఎలా అని అనుమానించినా,నారు నీరు సామెత మాకు వర్తిస్తుంది కదా!పూజకని వచ్చిన పిసినారి ఉత్తరీయపు నూలు పొగుని, మా గోడమీదకి పడేలా వేసేడు.అమ్మయ్యో!అయ్య ఆజ్ఞ అనుకుని చక చకా ఎక్కేసేను.మా మంద అలవాటయి,అక్కడక్కడ తిరుగుతున్నాయి.నన్ను పట్టించుకోలేదు.వెళ్ళొస్తాను అని చెబుదాం అంటే.
ఎక్కడిదో!గోధుమ ప్రసాదం నోరు ఊరిస్తోంది.అయినా మనసు దేవుడు దర్శనానికి జై కొట్టింది.ఇంద్రభవనంలా ఉంది ఇల్లు.అయ్యగారు ఇడ్లీ ఒక్కటే తిన్నాడు.జ్యూస్ చుక్క రుచి మనసును మెలేసింది మళ్ళీ.ఈ కంగారుతోనే కదూ!పిచ్చి కోరిక కోరుకున్నాను అనుకుంది మళ్ళీ..
కారులో ప్రయాణం భలే బావుంది.నడుస్తుంటే కాళ్ళు నొప్పులు.కూర్చుంటే జారిపోయినట్టు ఉంది.అయినా కొంచెసేపటికి చిరాకు వేసింది.కునుకు మా దినచర్యలో లేదు.రోజుటి నడక నడుద్దాం అని ఉత్తరీయంలో చక్కర్లు కొట్టింది.గురుడుకి గుచ్చుకుందేమో!ఒక్కదెబ్బ వేసేడు.చావుతప్పింది.దైవనిర్ణయం మరి.
హఠాత్తుగా భూమి బద్దలయినట్టు ఎదో ధ్వనులు..గురక అంటారట.డ్రైవర్ తిట్టుకుంటూ రామా..శ్రీరామా...అని మొదలెట్టేడు.ఆ నోట్లో ఎన్ని రకలున్నాయో పాటతో పాటూ సంగీతం వస్తోంది..
అయ్యగారికో ఘన స్వాగతం జరిగింది.వీఐపీ దర్శనం అంటున్నారు ఎవరో!కుదుపుగా ఉంది,వడిగా నడుస్తున్నట్టు ఉన్నాడు అయ్య.ఆ తోపులాటలో మళ్ళీ గుచ్చింది.ఈలోపు స్వామి దగ్గరికి వచ్చేసినా,కండువా ని ఓ దులుపు దులిపేడు..ఓసారి టీవీ లో చూసేను.అందరూ అరుస్తూ పైకంటా పోయి,కిందకి వస్తున్నారు.నేనూ అలానే పైకి పోయి,మెత్తగా ఓ గట్టి రాయిపై పడ్డాను.
అపరాధం!స్వామి పాదాలు అవి..పిసినారీ!నీ కధ ఎంత ఖర్చుపెట్టినా అంతవరకే!నేను చూడు స్వామి పాదాలని తాకేను.
అన్నా!నా ముక్కుకు కొండ అడ్డం వచ్చింది.స్వామి వేలు.తప్పని చెప్పడానికి కిందకు దిగి వచ్చింది.పీనాసి అయినా వాడిలో,నీలో అంతటా నేనే..నన్ను తిట్టచ్చా!?నవ్వేడు స్వామి.
చిన్నతనంగా అనిపించింది.జారిపోతున్నాను.ఏమైంది అయ్యో!అనుకుంటుంటే...బంగారు తాపడం ఆట.
నేను అందుబాటులో అందంగానే ఉండేవాడిని సుమా!మీరంతా నన్నిలా..అమ్మలేని వాడిని చేసి ఆడుకుంటున్నారు.మీ అమ్మ ఇలా చేస్తే ఊరుకుంటుందా చెప్పు,స్వామి నవ్వాడు పగలు వెన్నెలంత మనోహరంగా ఉంది.
పైకి ఎక్కబోతుంటే...ప్రసాదం రుచి,ఆపేస్తోంది..దర్శనం ఐందిగా!కానివ్వు అన్నాడు స్వామి.
ఎవరైనా చూస్తే..భయన్గా అంది.
నా సన్నిధిలో భయమా!సరే...తల పంకించేడు.చాలా బరువుగా పడింది.పడ్డంతోనే నీలంగా,ఆకాశం కింద ఉన్నట్టు ఉంది.నెమ్మదిగా స్వామి కాలు దాకా పాకి చూద్దునా!దీని సిగదరగా !!!శంఖం పువ్వు..సాక్షాత్తూ హరిహరుల దర్శనం ఒకే చోట ,అక్కడినుంచి పైకి చూసింది కానీ ఏంటో అడ్డు ఉంది.
స్వామి మళ్ళీ తల వంచేడు.నేను వారు వేరు కాదు సుమీ!మీరే మమ్మల్ని వేరు చేస్తారు.
నవ్వింది చీమ..కళ్ళకి ఏమో అడ్డుగా ఉంది.కనుల నుండి మసకలాంటి మేఘం,నీటి చుక్కలు వదులుతోంది..
పొద్దున్నే మంగళ స్నానాలు అయ్యాయి తల్లి.మరింక చెమ్మ చేయకు.నీలాఎన్ని జీవులో ఇక్కడ!ఈ స్థలిని కేదారపు వరద అవసరమా!?చెప్పు...ఇది పుణ్యస్టలమ్ సుమా...
