యశస్వి రచన

Inspirational

5.0  

యశస్వి రచన

Inspirational

నా తెలుగు

నా తెలుగు

5 mins
516



"నాన్నా!! నాన్నా!! నా కోసం ఒక కథ చెప్పవా నాన్నా" అంటూ ముద్దు ముద్దు గా అడిగింది తన ఎదిగిన కూతురు..


తండ్రి:- ఏం కథ కావాలి, నువ్వు చెప్పు అమ్మా!!


కూతురు :- నాకు ఒక మంచి చందమామ కథ కావాలి నాన్నా!..


తండ్రి:- ఓరి పిచ్చి తల్లీ!! కథలు అన్ని మంచివే, వాటిలో వుండే భావం, చదివేటప్పుడు వున్న మన మనసు యొక్క స్థితి మీద ఆ కథ మంచిదో, చెడ్డదో అని నిర్ణయిస్తాము..


కూతురు :- ఏమో నాకు అవన్నీ తెలియవు కానీ..మీరు స్వచ్ఛమైన తెలుగు పదాలుతో కూడిన ఒక కథ చెప్పండి...


తండ్రి :- సరే ఐతే విను తల్లీ....కానీ ఈ కథ పూర్తి అయిన మరు క్షణం నువ్వు పడుకోవాలి.


కథ:- 


పూర్వము ఒక పురమున కష్టమున సేద్యము చేయునొక కృషీవలుడు వుండెను.కామందు పలుకుల తలంపున సేత అతి శీఘ్రమున స్వకార్యములుకు స్వస్తి చెప్పి పరుగున కామందు గృహమును చేరి అతని ముఖదర్శనం కోసం వేచి చూస్తూ నుండెను.....


ఇంతలో ఆ కృషీవలుడి మదిలో ఎన్నో తలంపులు విహంగం చేయుచున్నాయి.ధరణి చేరుటకి జాగు చేస్తున్న మేఘాల వలన, ధరణిని పెకల్చి మేఘముల వైపు, అంకురించు నారుల గతి నానాటికీ క్షీణించుతున్నదే అని ఒకవైపు సురభక్తి అమితముగ గల్గిన భుక్తి మితముగా కూడా లేక చిక్కి శల్యమువుతున్న పరివార దేహములకు విందు భోజనం కాదు కదా! తుదకు భుక్తి కూడా తీర్చలేక పోతున్నానే అనే క్షోభ మరో వైపు....


అంతటిలోకి కర్ణ కఠోర కంఠం తో కామందు స్వరం అలంపన సేత, విహంగ వీక్షణము నుండి వాస్తవంలోకి వచ్చినాడు కృషీవలుడు...


కృషీవలుడు :- అయ్యా!! మొలకెత్తిన అంకురాలు, భానుడి ప్రతాపానికి తిరిగి పుడమిన గతించు అకాలము వచ్చుచున్నది....మీరు దయతలచి ఒకమారు ఆ సూక్ష్మ ఆంకురాలని, మీ శోభితమైన నయనాలతో వీక్షిస్తే... నిస్సారమైన వాటి కాండ, వేరు వ్యవస్థలు శక్తి పుంజుకుని మరికొన్ని మాసాలలో పదునైన కొడవండ్ల సేత కోతకు సిద్ధమయి... మీ బోటి మహాశయులకు మా బోటి అల్ప ప్రాణులకు భుక్తిని ప్రసాదించును...కావున నా విన్నపము మన్నించి సేద్యమునకు ఆద్యములాంటి సలీలము కొరకై మీ సమ్మతి కావలెను.


కామందు :- తరముల నుండి వన్నె తగ్గుతున్నా మదిని మక్కువ సేత సేద్యము సేయు ఓ కర్షకుడా, నిన్ను నా వాకిలి యందు చూసి రొక్కము కొరకై కోర్కెలు కోరును కదా అని సందేహము మెదిలింది... గాని నీ వాక్కులు మా సందేహములను పటాపంచలు చేసినది... అట్లే మా మనసును చలింపచేసింది.


"హస్తమున చేరు పంట కాలమున ఒకమారు మాత్రమే కోతకు గురవును కానీ, పంచప్రణాధులు 'కృషి' మీద ఫణముగా పెట్టిన మీ మనసులు క్షణమునకు ఒకమారు కోతకు గురవును కదా,.....!"


కృషీవలుడు :- అయ్యా!!...మా సాధకబాధకాలు కాలచక్రమున వృత్తము వోలె మొదలు, అంతము ఒక్కటై వుండును... ఒక్కమారు మా కరచరణాదులు ఉపశమించినా ఆ కాలచక్రమున ఈ జాతి కి మిక్కిలి పెద్ద వచ్చును కదా...


"అందుచేత లిప్తపాటు ఈ కృషీవలుడు మనసున కృషి యందు వాంఛలు తప్ప మరియొక దానిపై వాంఛలు శూన్యము...ఒకటి తప్ప! బాల్యమున అడుసు నందు మోపిన పాదము, మలి శ్వాస వరకు సడలింపుకి లోనుకాకుండా వుండవలెను....."


కామందు :- స్వప్నమున సైతము , కృషీవలుడి వాంఛలు ధరణి వదిలిపోవు కదా? ఎంత 


"శేషతల్పమున, క్షీర సంద్రమున శయనించు ఆ విష్ణువు ఒక మారు మాతృమూర్తి ఒడి మాధుర్యం కోసం ఈ ధరణి చేరాడు...ఎందున అంటే మాతృప్రేమ అంత స్వచ్ఛమైనది....అట్లే మీ మన్నువాత్సల్యం కూడా అంతే స్వచ్ఛమైనది"


కృషీవలుడు:- మాతృవాత్సల్యమున మాధుర్యం గ్రహించిన శేషవాహనుడు, ఆ మాతృమూర్తుల భుక్తి తీర్చే మన్ను మీద మాత్రం ఏలనో ఈ సంశయము...ఆగత్యమున,


"కృషీవలుడు కష్టంబున సేద్యము సేయ కనుకుట్టినయట్లు

వరుణవాయుసురుల్ కర్తవ్యములు యేమరరచేదరో లేదో

మితిమీరెదరో మలిక్షణమున యందే కృషీవలుడు మృత్యువు

అట్టి అశ్రుగాథలు అమితము కదా నాగభూషణా ఈశ్వరా!


కామందు :- సురుల వోలె గతి తప్పి...మతి చెదిరి మేము కూడా మీలాంటి పుడమిని చీల్చు కర్షకులను కాఠిన్య చూపుతో చూడము...తక్షణమే మీరు కోరిన సువాంఛను మంజూరు చేయుచున్నాము....


కృషీవలుడు:- శతవర్షపు తపస్సుకై హరుడి సాక్షాత్కారము కల్గినయట్లు మీ వాక్కులు నాకు తృప్తినిచ్చాయి...శతవర్షపు తపస్సుకై ఈ శల్యమైన దేహంలో సత్తువ సరితూగదు అని దలచి ఆ హరుడే ఈ నరుడి రూపంలో సాక్షాత్కరించాడు...కదయ్యా.


కామందు :- శతవర్షపు తపస్సు అంకమున ఏమి పొందుదురు ఈ మునులు...సకల సంపదలు గాని, తరగని యవ్వనము గాని లేక మరేదో...కానీ కృషివలుడి శతవర్షపు ఆయుషు నందు సింహభాగమున జనుల భుక్తి కోసం పాటు పడెదరే...యట్టి మీ జీవనంబున ప్రతి క్షణము ఒక శతవర్షపు తపస్సు ఫలమునకై సరితూగును కదా....


కృషీవలుడు :- అట్లైన ఆ తపః ఫలముకై ఆ హరుడి సాక్షాత్కారము వద్దు గాని, సకాలమున మేఘముల కరుణ చాలును కదా అని వాంఛించును ఈ కృషివలుడు..


"మరికొన్ని సంభాషణల పిదప కృషీవలుడు, క్షేత్రము చేరి తన దప్పిక తలంపక తదుపరి కార్యమున నిమగ్నుడై అన్నదానమున తొలి అడుగులు వేయుచునున్నాడు...."


"కథ మధ్యలో, ఏంటి నాన్నా!! తెలుగు భాష ఇంత మాధుర్యం గా గమ్మత్తు గా వుంది....వినే కొలది ఇంకా వినాలి అనేలా వుంది అని అంటుంది కూతురు"


తండ్రి :- నాన్నా బంగారం!! తెలుగు భాష చరిత్ర, అంతా ఇంతా కాదు...దాని ఔన్నత్యం ముందు ఏదైనా మనకు చాలా తక్కువ గా కనిపిస్తుంది...


కూతురు :- అవునా నాన్నా!! ఐతే నాకు కొంచెం తెలుగు భాష చెప్పండి,.....


తండ్రి :- తప్పకుండా చెప్తాను విను.. 


"తెలుగు పదాలు తేనె వలే వుంటాయి. కనుక "తెనుగు" అనాలని కొందరు అంటారు"


" క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని అంటారు"


"తెలుగు భాష మూలపురుషులు యానాదులు అని నమ్ముతారు…"


"వెనీసు నగరానికి చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును 'ది ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌' గా వ్యవహరించారు"


"కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు"


తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలికాలు ఉన్నాయి..అదే యాస..


సాగరాంధ్ర భాష: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలలోని యాసను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.

రాయలసీమ భాష: చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ప్రాంతపు యాసను రాయలసీమ మాండలికం అంటారు.

తెలంగాణ భాష: తెలంగాణ ప్రాంతపు యాసను తెలంగాణ మాండలికం అంటారు.

కళింగాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యాసను కళింగాంధ్ర మాండలికం అంటారు.


"ప్రాంతం బట్టి యాస మారింది కానీ భావం మాత్రం తెలుగే...…"


"తెలుగు లిపి ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. తెలుగు లిపిలో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు ఉన్నాయి"


"11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు"


"14 వ శతాబ్దం కాలంలో సంస్కృత కావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన వంటి వారు పేరెన్నిక గన్న కవులు. ఇప్పుడే ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం"


"వీటి తర్వాత ప్రబంధ యుగము, దాక్షిణాత్య యుగము అలాగే ఇప్పుడు ఆధునిక యుగము ఇలా తెలుగు ఎన్నో తరాల నుండి వస్తుంది"


"19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి"



"ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు గురించి, విశ్వంలో ఉన్న చీకటిని కలం లో సిరా గా పోసి రాస్తే విశ్వం అంతా శ్వేత వర్ణం లో మారిపోతుంది...అయినా కానీ ఇంకా తెలుగు గురించి చెప్పవలసింది, రాయవలసింది మిగిలే వుంటుంది."


"సర్లే బంగారం!! ఈ రోజుకి ఈ కథ ఇంతటితో ముగించి మనం రేపు కొనసాగిద్దాం"


కూతురు:- కొనసాగిద్దాం కాదు నాన్నా!! నేను కొనసాగిస్తాను..


"ఆ మాట విన్న తండ్రి, ఇంత కన్నా ఏం కావాలి తల్లీ!! అంటూ కూతురుని గుండెకి హత్తుకుని పడుకున్నాడు"


*ఓపిక తో చదివిన పాఠకులకి ధన్యవాదాలు"


"నా అభిరుచి సైన్స్ కథలు మీద వుండటం వల్ల తెలుగు భాష లో రాయటం కుదరలేదు..కానీ ఎందరో మంచిగా తెలుగు పదాలతో కూడిన కథలు వ్యాసాలు రాస్తుంటే చాలా హాయిగా వుంది"


"తెలుగు భూమి మీద తెలుగు మాట్లాడితే జరిమానా వేసే రోజులు వున్నంత కాలం తెలుగు ఉనికి కష్టమే"


"డబ్బు సంపాదన కోసమే పరాయి భాష, ఒక్కసారి కార్యాలయం వదిలి వచ్చిన తర్వాత చక్కగా పిల్లలతో హాయిగా తెలుగు మాట్లాడి మంచి నడవడిక నేర్పవచ్చు...భయపెట్టి నేర్పిన భాష మెదడు లో వుంటుంది ప్రేమతో లాలించి నేర్పించిన భాష (అమ్మ భాష) మనసులో వుంటుంది"


"నేను చూశాను, వాస్తవం గా చిన్న చిన్న పిల్లల్ని ఇంటి దగ్గర కూడా ఆంగ్లంలో మాట్లాడమని భయపెడుతున్న తల్లి తండ్రుల ను....ఆ పిల్ల వాడికి వచ్చీ రాని ఆంగ్లంలో మాట్లాడితే వాడి బాధ కానీ ప్రేమ కానీ ఆ తల్లి తండ్రులకు ఏం అర్దం అవుతుందో ఏంటో... మమత తెలియకుండా పెరిగిన వాడు పెద్దయ్యాక ఆ తల్లి తండ్రులను ఇంకేం పోషిస్తాడు"


"మనసుకి తలచింది చెప్పాను... అక్షర దోషాలు వుంటే క్షమించండి కానీ, భావం అర్థం చేసుకోండి.. ఒకవేళ ఏదైనా మీ మనసుకి తప్పు అనిపిస్తే మన్నించండి"


                           


                      



Rate this content
Log in

Similar telugu story from Inspirational