gowthami ch

Inspirational

4.7  

gowthami ch

Inspirational

నా కళాశాల చదువు

నా కళాశాల చదువు

3 mins
831


 గంగ , యమునా , సరస్వతి అని ముచ్చటగా తమ ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టుకున్నారు. గంగ మరియు సరస్వతి చదువులోనూ అలానే అందంలోనూ, మరియు తెలివితేటల్లోనూ ముందుండే వారు. యమున మాత్రం అన్నింట్లో వాళ్ళకంటే చాలా తక్కువే , తనకి తక్కువ మార్కులు వచ్చిన ప్రతిసారి వాళ్ళ నాన్న కొప్పుడుతూ , తిడుతూ ఉండేవారు కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఎప్పుడూ ఏమి అనేవారు కాదు. సాయంత్రం వేళలు యమునని ప్రత్యేకంగా ఇంట్లో ఒక గదిలో కూర్చొబెట్టుకొని తను ఎందులో తక్కువ మార్కులు తెచ్చుకుందో కనుక్కుని అందులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బొమ్మల రూపంలో తనకి వివరంగా చెప్పేవారు.


అలా అమ్మ చెప్పినవి ఎప్పటికీ గుర్తుండిపోయేవి యమునకి. అలా తన 10 వ తరగతి వరకు తన తల్లి సహాయంతో చదివి 70 శాతం మార్కులతో 10 వ తరగతి పాస్ అయింది. తరువాత యమునా ఇంటర్ కి వచ్చింది. తన తల్లికి ఉన్న జ్ఞానంతో 10 వరకే చెప్పగలిగింది, అందువల్ల దగ్గర కూర్చొని చదివించడం తప్ప ఏమీ చేయలేక పోయేది ఎన్నో స్పెషల్ క్లాస్ లు చెప్పించడం మొదలుపెట్టింది. కానీ స్పెషల్ క్లాస్ లు కూడా తనని పాస్ చేయించలేకపోయాయి. ఇంటర్ రెండు సంవత్సరాలు అయ్యే సరికి ఇంకా 2 సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి.


వాళ్ళ నాన్న కోపంతో "నువ్వు ఇంక చదివింది చాలు ఇంట్లో కూర్చో" అనడంతో ఏంతో బాధ పడి తనలో తాను ఏడ్చిన నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపింది. చివరకు సప్లమెంటరీ లో ఎలాగోలా పాస్ అయ్యింది. తరువాత డిగ్రీ చదవాలని ఉందని తల్లిని అడగడంతో కూతురి కోరికని కాదనలేక భర్త ని ఒప్పించాలని నిర్ణయించుకొని భర్త దగ్గరకి వెళ్లి అడిగింది.


" నువ్వు చెప్పడం వల్లనే ఇంత వరకైనా చదివించాను తనని ,లేకుంటే ఎప్పుడో మానిపించేవాడిని ఇప్పుడు ఇంక ఎవరు చెప్పినా వినను , దానికి చదువు రాదు అని తెలిసి చదువుపై డబ్బులు పెట్టడం వృధా , పక్కన తనతో పాటే పుట్టిన వాళ్ళు ఇద్దరూ బాగా చదువుతున్నారు కాబట్టే వాళ్ళని చదివిస్తున్నాను. ఇంక తనపై డబ్బు కర్చుపెట్టడం నాకు ఇష్టం లేదు తర్వాత నీ ఇష్టం." అని వెళ్లిపోయారు.


యమున బాధ చూడలేని వాళ్ళ అమ్మ , వాళ్ళ నాన్న ని ఎంతగా ప్రాధేయ పడిందో యమున కి ఇంకా గుర్తుంది. చివరకు "సరే" అన్నారు యమున వాళ్ళ నాన్న గారు. ఆ తర్వాత వాళ్ళ ఊరు పక్కనే ఉన్న వేరే ఊరిలో ప్రభుత్వ బాలికల కళాశాలలో డిగ్రీలో చేర్చారు. అప్పుడు కూడా వాళ్ళ అమ్మే యమునతో వెళ్ళి ,అక్కడ చేర్చి మంచి చెడులు అన్ని చెప్పి వచ్చింది.


తను తీసుకుంది కంప్యూటర్స్ గ్రూప్ ,ఇంగ్లీష్ మీడియము కావడంతో చాలా వరకు ఇంగ్లీష్ లొనే బోధన అంతా ఉండడంతో, తెలుగులోనే కష్టపడి పాస్ అయ్యే తను ఇంగ్లీష్ మీడియం లో చాలా కష్టపడింది. క్లాస్ లో అందరికంటే వెనక ఉండేది. చాలా బాధ పడి చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు, ఓదార్చడానికి అమ్మ కూడా పక్కన లేదని ఎంతో కృంగిపోయింది.


అప్పుడప్పుడు అమ్మ కి ఫోన్ చేసి ఏడ్చేది. అప్పుడు వాళ్ళ అమ్మ ఇచ్చే ధైర్యంతో కొంతకాలం బాగుండేది. కానీ ప్రతి సంవత్సరం సబ్జెక్ట్స్ మిగిలిపోయేవి. ఆ విషయం తండ్రికి చెప్పకుండా తల్లితో మాత్రమే చెప్పేది. "ఇప్పుడు కూడా పాస్ కాకుంటే మా నాన్న నన్ను ఇంక చదవనివ్వడు ,ఇంట్లో కూర్చోబెడతాడు, అంతకన్నా ముందు అమ్మని తిడతాడు. నా మూలంగానే అమ్మకి ఇన్ని కష్టాలు , అయినా నేనేం చేయలేకున్నాను ఎంత చదివినా పరీక్ష సమయానికి ఏమీ గుర్తు ఉండట్లేదు" అని ఎంతో ఏడ్చింది.


చివరకు డిగ్రీ 3 సంవత్సరాలు అయిపోయాయి చివరకి ఎంతో కష్టపడి మూడవ సంవత్సరం సబ్జెక్ట్స్ అన్ని పాస్ అయింది కానీ 2 సబ్జెక్ట్స్ ఇంకా మిగిలిపోయాయి ఒకటవ సంవత్సరంలోది ఒకటి , రెండవసంవత్సరం లోది ఒకటి. అందరూ ఒక్కొక్కరుగా చదువు ముగించుకొని హాస్టల్ నుండి వెళ్లిపోతున్నారు కానీ తను మాత్రం అక్కడే ఉండి పోయింది. మరలా సప్లమెంటరీ లో పాస్ అయ్యి 60 శాతం మార్కులతో ఇంటికి చేరింది .


తరువాత ఎంబీఏ చేయాలని కోరిక తో ఈసారి తనే భయం భయంగా వెళ్లి వాళ్ళ నాన్నని అడిగింది.


ఆయన మారు మాట్లాడకుండా "సరే" అనడం తో తన ఆనందానికి అవధులు లేవు. తల్లి కి విషయం చెప్పగా తల్లి ఆనందంతో యమునని ముద్దుపెట్టుకొని "నాకు జీవితంలో ఎంతో చదవాలని కోరిక ఉండేది. కానీ అప్పటి మా కుటుంబ పరిస్థితుల కారణంగా నేను పెద్ద చదువులు చదివితే అంతకన్నా పెద్ద చదువులు చదివిన వాళ్ళని భర్తగా తేవాలి , అందుకని ఇంక చదివింది చాలు అని అంతటితో నా ఆశని చంపేశారు. అందుకే నేను చదవలేక పోయిన చదువు మా పిల్లలకి అందించాలి అనుకున్నాను గనుకే ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని చదివిస్తున్నాను. నేను చదవలేక పోతున్నాను అని ఎప్పుడూ నిరాశ పడకు అది మనలోని ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది. దేవుడు అందరికి ఒకే రకమైన తెలివి తేటలు ఇచ్చారు, అది మనం ఉపయోగించడంలోనే తేడాలు తప్ప, తెలివి లేక కాదు. నీలో చదువుకోవాలి అన్న కోరిక ఉంది కాబట్టే ఎంత కష్టమనిపించినా చదవాలి అనుకుంటున్నావు.


"ఇప్పుడు నువ్వు చదివే ఈ రెండు సంవత్సరాలు నీ భవిష్యత్తు ని నిర్ణయించేవి గా భావించి పూర్తి శ్రద్దతో , ఏకాగ్రతతో చదువు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ప్రతి సమస్యకి కచ్చితంగా పరిష్కారం కూడా ఉంటుంది. నేను చదవలేను అని అనుకోవడం మానేసి, ఎందుకు చడవలేను ? అనుకోని ఒక్కసారి నీ మనసు పెట్టి ఆలోచించు ఎక్కడ లోపం జరుగుతుందో నువ్వే గమనించుకో, ఆ లోపాన్ని సరిదిద్దుకొని సరైన మార్గాన్ని ఎంచుకో ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు." అని యమున లో ధైర్యం నింపి పంపింది.


తరువాత యమున ఐసెట్ లో మంచి ర్యాంకు సాధించి మంచి కళాశాలలో ఎంబీఏ లో చేరింది. రెండు సంవత్సరాలలో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి 80 శాతం మార్కులతో క్లాస్ లోని మొదటి 5 మందిలో ఒకటిగా నిలిచింది. తన విజయానికి థానే ఆశ్చర్యపోయింది. అప్పుడు తన తల్లి చెప్పిన "మనసుంటే మార్గం ఉంటుంది" అన్న మాటలు గుర్తుచేసుకుని ఆనందపడింది.


Rate this content
Log in

Similar telugu story from Inspirational