Anjani Gayathri

Inspirational Others

4.2  

Anjani Gayathri

Inspirational Others

🌹 మనిషి ఒకే ఒక్కరోజుదేవుడైతే

🌹 మనిషి ఒకే ఒక్కరోజుదేవుడైతే

3 mins
313



🌹 మనిషి ఒకే ఒక్క రోజు దేవుడైతే 🌹

 రచన :- అంజని గాయత్రి.



 " ఒసేయ్ సుమతి..! నీ పూజలు పునస్కారాలు కట్టిపెట్టి, నా ముఖాన కొంచెం కాఫీ తగలెయ్యవే," అంటూ పొద్దు పొద్దున్నే కోడల్ని నోటికి రాని తిట్లు తిడుతూ కాళ్ళు పారజాపుకుని పెరటి అరుగు మీద కూర్చుంది కాంతం.



" ఆ...అత్తయ్య.! ఒక అయిదు నిమిషాలులోపూజ అయిపోతుంది, తులసి మొక్కలో నీళ్ళు పోస్తే పూజ అయిపోయినట్లే, ఒక్క అయిదు నిమిషాలు ఓపిక పట్టండి, " అని అత్తగారికి సర్ది చెప్పబోయింది సుమతి .



 "నీ పూజలు పునస్కారాలు నిన్నేమైనా రక్షిస్తాయా? నాలాంటి పెద్ద దానికి సేవ చేసుకుంటే అదే మహద్భాగ్యం, బాగా నీరసం వచ్చేట్టుగా ఉంది తొందరగా నా ముఖాన కాఫీ పోయి, లేదంటే నా పై ప్రాణాలు పైనే పోతాయి," దెప్పసాగింది కాంతం.


 " ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో కానీ ఈ ఇంట్లో పడ్డాను, మనస్ఫూర్తిగా పూజ కూడా చేసుకోనివ్వదు ఈవిడ, " అని తిట్టుకుంటూనే కాఫీ కలిపితెచ్చి అత్తగారి చేతిలో పెట్టింది.


 కాసేపటికి భర్త వచ్చి టేబుల్ దగ్గర కూర్చుని, ఏదో పని మీద బయటకు వెళ్లాలి టిఫిన్ తొందరగా పెట్టమని ఆమెను ఒకటే సతాయించడం మొదలుపెట్టాడు.



 మీ అమ్మగారిని పెట్టమని అడగొచ్చు కదాండి, నేను చంటోడికి స్నానం చేయించాలి. పిల్లను స్కూల్ కి రెడీ చేయాలి, అని భర్తని విసుక్కుంటూ పని చేసుకోసాగింది.



" ఎంత ధైర్యమే నీకు?టిఫిన్ మా అమ్మనిపెట్టమని అడగమంటావా? నీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కిందే, అంటూ నోటికి రాని బండ బూతులు తిట్టడం ప్రారంభించాడు, అది చాలదన్నట్లు కోపం మితిమీరి పోవడంతో ఆమె జుట్టు పుచ్చుకుని కొట్టడానికి సిద్ధమయ్యాడు.


 ఆమె చేస్తున్న పనల్లా వదిలేసి, గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని, ఏడుస్తూ,

 " రామా.!నాకేంటి ఈ అగ్నిపరీక్షలు?ఎన్నాళ్ళు ఈ తిప్పలు? ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరు, చిన్న చిన్న విషయాలకే రాద్ధాంతం చేసే ఈ మనుషులతో ఎలా వేగాలి? నీవే కరుణించి, నాపై దయ చూపి ఈ కష్టాల నుండి నన్ను విముక్తిరాలిని చేయి స్వామి, " అని వెక్కివెక్కి ఏడుస్తూ తనకిష్టమైన రామున్ని ప్రార్థించింది.



 ఆమె బాధలో ఉండగా రామనామం స్మరించగానే, నేనున్నానంటూ హనుమమంతుడు మారువేషంలో ప్రత్యక్షమయ్యారు. రామనామం ఎక్కడ స్మరిస్తే అక్కడ ఆయన ప్రత్యక్షమవుతారు కదా, అలా రామభక్త హనుమాన్ మారువేషంలో ఆమెను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తూ,

" ప్రియభక్తురాలా, నేను నువ్వు కొలిచే దేవుడి భక్తుడినే, నేను ఆ దేవుని కొలవడంతో నాకు కొన్ని అద్భుత శక్తులు ఆ రామదేవుడే ప్రసాదించాడు.



 నిత్యం నువ్వు ఆ రామనామం తలుస్తూనే ఉండు, ప్రతి గురువారం నాడు రామదేవుని వ్రతం చేసుకుంటూ ఉండు, అలా కొన్ని రోజులు నీవు చేసినట్లయితే, నీకు తప్పకుండా ఆ దేవదేవుని సాక్షాత్కారం లభించి నీ కష్టాలన్నీ తీరుతాయి," అని ఆమెకి మంచిగా చెప్పారు హనుమ.



 "మీరు దేవుడని నేను ఎలా నమ్మాలి? మీరు మామూలు మనిషిగానే కనిపిస్తున్నారు, మీరు చెప్పినట్టుగా చేయాలంటే, మిమ్మల్ని నేను నమ్మాలి కదా? మీకు మహిమలు ఉంటే నాకు ఎలా తెలుస్తుంది?" అని ఎదురు ప్రశ్నించింది ఆమె.



 అయితే ఇలా చూడు అంటూనే ఆయన హృదయం చీల్చి హృదయంలో కొలువైన సీతారాములను చూపించారు.



 ఆయన అలా చూపించగానే ఆమె భక్తి పారవశ్యంలో మునిగిపోయి తాను నిత్యం కొలిచే దేవదేవుడు ఆ శ్రీరాముడు దర్శనం తో పాటు హనుమ దర్శనం కూడా లభించింది. తాను ఎంత అదృష్టవంతురాలినో అనుకుని మురిసిపోతూ, అత్త , భర్త పెట్టిన కష్టాలు మరిచిపోయి, ఆ క్షణం ఎంతో ఆనందపారవశ్యానికి లోనైంది.



 ఆమెను గమనించిన హనుమ,

 " ఇప్పటికైనా నన్ను నమ్మవా తల్లి, నేను నీకు మేలు చేయడానికే వచ్చాను, నీవు నిశ్చింతగా ఉండు, నేను నీ రూపంలో మారి, నీ భర్తను అత్తను మంచిగా మారుస్తాను, అంతవరకు నీవు నా రూపంలోకి మారి రామనామం స్మరిస్తూ ఉండు, ఒకరోజు మాత్రమే నువ్వు నా రూపంలో ఉంటావు, నేను నీ రూపంలో ఉంటాను, ఆ తర్వాత అంతా మంచే జరుగుతుందని పలికారు.



 ఆయన అలా చెప్పగానే ఆమె సాష్టాంగ నమస్కారం చేస్తూ,

" ఆంజనేయ మహావీరో హనుమాన్ మారుతాత్మజః సర్వగ్రహవినాశీచ నమస్తే వాయుపత్రం, " అంటూ శ్లోకం చదివి ఆయనను ప్రార్థించింది.



 వెంటనే అభయహస్తం ఇస్తూ ఆమెను దీవించి ఆమె రూపంలో మారి, ఆ ఇంట్లోనే కొలువయ్యారు.ఆమె హనుమ రూపంలోకి మారి గాలిలో ఎగురుతూ చుట్టుపక్కల ప్రదేశాల్లో జరిగే మనుషుల రాక్షస ప్రవర్తనలను గమనిస్తూ తనకున్న శక్తులతో వారిని హతమారుస్తూ వారికి బుద్ధి చెబుతూ, ఆ ఒక్క రోజు ఎంతో ఆనందంగా గడిపేసింది.



 ఆమె ఇంట్లో ఆమెగా మారిన హనుమ, ఆమె అత్త చీరలు ఉతకమని చెప్పిన వెంటనే చీరలు పీలికలయ్యేట్టుగా బండ కేసి బాదుతూ, ఆమె చీరలను సర్వనాశనం చేస్తూ ఆమె చెప్పిన ప్రతి పని రివర్స్లో ఆమె చేత చేయిస్తూ, ఆమెను ముప్పుతెప్పులు పెట్టారు. అలాగే ఆమె భర్త ఆమెను ( ఆమె రూపంలో ఉన్న హనుమను )కొట్టడానికి రాబోగా చేయి అడ్డు పెట్టగానే ఆయన శక్తికి తాళలేక అతడి చేయి కొంకర్లు పోయింది. ఆ చేతితో తిండి కూడా తినలేనట్లుగా వాచిపోయి, కుయ్యోమొర్రోమంటూ మూలన కూర్చున్నాడు. ఒక్కరోజులో అత్తకి భర్తకి నీరసం వచ్చేసింది.



 ఒకరోజు గడవగానే హనుమ, సుమతి కూడా ఎవరి రూపాలు వారు ధరించి యధా స్థానంలోకి వచ్చారు. ఇద్దరు రూపాలు మారగానే, ఇక మీదట నీ భర్త మరియు నీ అత్త నువ్వు చెప్పినట్టుగా వింటారు. నిన్ను విసిగించరు. నేను ఈరోజు నీ రూపంలో ఉండి ఇచ్చిన శిక్షతో వారిలో నువ్వంటే భయం పుట్టింది. ఇక మీదట నువ్వేదైనా చేస్తావేమో అని భయంతో నిన్ను ఏమీ అనరు. నువ్వు నిశ్చింతగాఉంటూనే నీ పనులు నువ్వు చేసుకుని నీ సంసారం చక్కబెట్టుకో, " అని వరం ప్రసాదిస్తూ అంతర్దానమయ్యారు స్వామి.



 సుమతి, కనుమరుగైన ఆ హనుమ రూపాన్ని తలుచుకుంటూ రామనామం స్మరిస్తూ , భర్త , మరియు అత్తగారి వేధింపులు తగ్గడంతో నిత్యం ఆ దేవదేవుళ్ళను పూజిస్తూ నిశ్చింతగా తన జీవితపయనం సాగించింది .


🌹 సమాప్తం 🌹.


Rate this content
Log in

Similar telugu story from Inspirational