మంచు కురిసే వేళలో
మంచు కురిసే వేళలో
పెళ్లి ..ఆ పదం లోనే ఒక మ్యాజిక్ ఉంది... మనసులను ముడివేసే బంధం ఉంది.. పెళ్లి మీద నమ్మకంతో ముందుకు సాగిన ఒక అతివ కథ... మంచు కురిసే వేళలో
**********
తెల్లవారుజామున మెలుకువ వచ్చేసింది నాకు... నా నడుమును అల్లుకుని మత్తుగా పడుకున్నారు శ్రీవారు..
ఆయన బలమైన చేతుల్ని కొంచెం కష్టం గానే విడిపించుకుని... నా బారు జడ ని ముడి వేసుకుని చీర సరిదిద్దుకుని.. ఆ గదికి ఆనుకుని ఉన్న బాల్కనీ లోకి వెళ్లాను..
రాత్రి వెన్నెల తో కలగలిపి మంచు పూలు కురిసినట్టు గా ... ఉంది వాతావరణం... అలా చూస్తూ ఉండిపోయాను... ఆ మంచు పూలు నీటి బిందువుల గా మారుతుంటే వాటితో ఆడుతున్నాను..
ఎంత చెప్పినా వినకుండా పిల్లగాలికి రెపరెపలాడుతుంది.. పైట చెంగు..
చేతులు రుద్దుకుంటూ ..ముడుచుకుంటూ ఆ వేళ ను ఆస్వాదిస్తున్నా...
అంతలోనే ఎప్పుడు వచ్చారో... మరి...శ్రీవారి వెచ్చని శ్వాస మత్తుగా చలి కాచుకున్నట్టుంది ...... చెంగు చాటు నడుమును ..గిలిగింతలు.. పెడుతున్న ఆయన చిలిపి అల్లరికి నా మది ఎప్పుడో ఆయన కు వశం అయింది..
తన హృదయానికి దగ్గరగా వెనక్కి వాలి ఆయనకు మరింత అనుగుణంగా.. మారేను..
ఏంటి ఏదో ఆలోచిస్తున్నావ్.. అంటూ నెమ్మదిగా అడిగారు.. శ్రీవారు
మౌనమే నా సమాధానం అయ్యింది.. పోనీ నేను చెప్పనా అంటూ మన పెళ్లి గురించే కదా అన్నారాయన...
హు.. అనుకుంటూ మా పెళ్ళి నీ.. గుర్తు చేసుకున్నాను...
**********
పెళ్లి... చెప్పడానికి రెండు అక్షరాలైనా ఆ పదం లోనే తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి..
ఆరోజు నన్ను పెళ్లి కూతురు నీ చేస్తున్నారు.. కొత్త కాటన్ చీర ఏమో.. మొత్తం చుట్టుకున్నట్టు అనిపించింది.. పీటల మీద కూర్చోబెట్టి, పసుపు పూసి , సున్నిపిండితో నలుగు పెట్టి కుంకుడు కాయతో తలంటరు..
సాంబ్రాణి వేసి జుట్టు ఆరేక.. పట్టు చీర కట్టేరు.. నన్ను నేను చూసుకున్నాను .. పెళ్లి బొట్టు తో , బుగ్గన చుక్కతో నాకు నేనే కొత్త గా ఉన్నాను ..కూర్చో పెట్టి అందరూ అక్షంతలు వేశారు...
ఇంటి గడప దాటి కళ్యాణ మండపం నికీ వెళ్తున్నప్పుడు.. ఏడుపొచ్చింది.. అదేదో సినిమాలో చెప్పినట్లు... ఆడపిల్లను పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలన్న సాంప్రదాయం పెట్టిన వాళ్లకి అమ్మాయి పుట్టి ఉండదు.. అనేది నిజమేనేమో మరి
పెళ్లి కూతురు గదిలో... నన్ను వదిలి అందరూ శ్రద్ధగా ముస్తాబవుతుంటే.. నాకు కోపం వచ్చింది మరి
గౌరీ పూజ పూర్తయింది... అందరూ నా దగ్గరికి వచ్చి.. పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు.. అంత హైట్ ఉన్నాడు అంటుంటే మనసు ఉప్పొంగిపోయింది..
ఇంతకీ మీకు చెప్పలేదు కదా... నేను ఇంతవరకు పెళ్ళికొడుకుని చూడలేదు.... ఎక్కువ సినిమాలు చూసే అలవాటు ఉన్న నాకు.. వరుడు సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆయన్ని పీటలు మీద చూద్దాం అనుకున్నా...
ఆయన.. ఆ పదం పెదవులు ఒకసారి ఉచ్చరిస్తే మనసు కొన్ని వేల సార్లు పలవరించింది...
ప్రధానం మొదలైంది... మా అత్తగారు వడ్డానం పెట్టారు... నా నడుము ఏమో.. పిడికెడంత.. అదేమో జారి పోతుంది...
ఇట్లా గా అయితే... ఎలాగ అమ్మాయి అంటూ బుగ్గలు పుణికి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు.. ఆవిడ స్పర్శ.. నేను చిన్నప్పుడే కోల్పోయిన మా అమ్మ ను గుర్తు చేసింది...
మొదటిసారి ఆయన పాదాలను చూస్తున్నాను.. కాలి వేళ్ళు ఎంత పొడుగ్గా ఉన్నాయో.. మా బాబాయ్, పిన్ని ఆయన కాళ్లు కడుగుతున్నారు..
ఆయన చేతుల్లో నా చేతుల వుంచి... కన్యా దానం చేశారు...
ముహూర్తం ఆసన్నమైంది .. గట్టి మేళం అన్నారు పంతులుగారు ...బాజాభజంత్రీలు మారు మ్రోగాయి...
జిలకర్ర బెల్లం పెడుతూ.. ఆయన్ని మొదటి సారిగా చూసాను.. రెండు నిమిషాలు అలాగే ఉండిపోయాను..
అబ్బో ఎంత అందంగా ఉన్నారో... శ్రీవారు.. చురుకైన కళ్ళు .. ముక్కు కొంచెం తప్పిడి ... ఇంకా కోరమీసం చాటున చిరు మందహాసం.. లైట్ గెడ్డం ఉంది... పెళ్లిలో గెడ్డం... నాకు నచ్చలేదు...
ఆశీర్వాదాలతో కూడిన అక్షింతలు మాపై వర్షించాయి... ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాతో ప్రతిదీ బంధిస్తున్నారు...
నన్ను తాకి తాకకుండా.. వేదమంత్రాల సాక్షిగా మాంగళ్యధారణ జరిగింది ....ప్రణామాలు చేసుకున్నాం
పిల్ల.. పెద్ద హడావిడి మధ్య తలంబ్రాలు పోసుకున్నాం.. కొంగుముడి పడింది... సప్తపది పూర్తయింది.....పూల దండలు మార్చుకున్నము..
శ్రీవారు నాకన్నా సున్నితం ఏమో... చాలా నెమ్మదిగా నెమలి ఫించం తో తడిమినట్టుగా ఆయన పాదంతో నా పాదాన్ని తాకరు..
నా చిటికెన వేలు పట్టుకుని..... ఒక తండ్రి ...ఒక బిడ్డకు అడుగుల నేర్పిస్తున్నట్లాగా.. నడిపించి అరుంధతిని చూపించారు...
మనస్ఫూర్తిగా నమస్కరించుకుని... ఆనందభాష్పాలు మధ్య అత్తవారింటికి పయనమయ్యాను...
**********
ఒక గంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నాం..
పెళ్లి బట్టల్లో పసుపు, కుంకుమ ,అక్షింతలు తో కలిగి ఉన్న మాకు దిష్టి తీసి దారి ఇచ్చారు... కొంగులో వడికట్టు బియ్యంతో.. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ.. గుమ్మం దగ్గర ఆగాము..
ఆయన మేనత్తలు, ఆడపడుచులు... పేర్లు చెప్పండి అని ఆట పట్టించి... హారతి పల్లెం లో.. కట్నం దండి గానే వసూలు చేసుకున్నారు..
అప్పటికే అలసిపోయిన నేను , నాతోపాటు వచ్చిన మా అత్తకి ఇచ్చిన గదిలోకి వెళ్లి నిద్ర లోకి జారుకున్నాను..
ఇలా పడుకున్నానో లేదో... వెంటనే లేపి వ్రతానికి రెడీ చేసింది మా మేనత్త...
పెళ్లికి ముందు ఏమి తిననవ్వలేదు.. ఇప్పుడేమో వ్రతం ... ఏందయ్యా స్వామి నువ్వు ....ఒక్క నిమిషం అనుకుని ..మరుక్షణం తప్పు తప్పు అనుకుని చెంపలు వాయించుకున్న..
వ్రతం పూర్తయ్యాక... తొలిసారిగా శ్రీవారు తినిపించారు ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని...
సాయంత్రం అయింది... నన్ను, ఆయనను ఎదురెదురుగా కూర్చోబెట్టి మా చేత ఆటలు ఆడించారు....
పౌడర్ రాయించారు... కుంకుమ పెట్టించారు.. సెంటు పోయించారు... ఆటలు ఆడించారు...
ఆ రోజు.. ఆడబడుచుల తో ..ఆ ఇంటి బంధువుల పరిచయాల తో అలా గడిచిపోయింది..
*********
తర్వాత రోజు
పాత కాలం నాటి పందిరి మంచం... సర్వాంగ సుందరంగా ముస్తాబయింది... మరుమల్లెలు మరువం తో జత కూడాయి.. సుగంధలపరిమళం గదంతా వ్యాపించింది...
గది లోకి వచ్చేటప్పుడు మా అత్త చెప్పిన మాటలను మననం చేసుకుంటూ.. బిడియ పడుతూ గది లోకి వచ్చాను...
సినిమాల్లో చూసిన విషయములు, ఫ్రెండ్స్ చెప్పే కబుర్లు నిన్న నాకు..
ఎన్నెన్నో తలపుల ...ఆ.. అలజడిలో నా మది మురిసిపోయింది... ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని... ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకో వాలని... పెదవి... పెదవి ప్రయాణం మొదలుపెట్టాలని ... హద్దుల్లేని ముద్దుల ...తడి లో
అంతకుమించి ఆలోచిస్తున్నా.. నా మనసు ఆత్రానికి అడ్డుకట్టవేసి గది వంక ఓరగా చూసాను...
ఎక్కడ కానరావట్లేదు.. వారి జాడ.. గది అంతా నిశ్శబ్దంగా ఉంది..
శ్రీవారు ఎక్కడున్నారు.. పంపరాదు ప్రేమ సందేశం.. అనుకుంటూ ఎదురు చూస్తున్నాను.. ..
********
కాలం గడిచింది... గోడకున్న గడియారం లో ముల్లులు కదులుతున్నాయి.. రేయి.. నిశ్శబ్దంగా కరుగుతుంది.. అక్కడ వెలిగించిన అగరబత్తులు వలే.. అంతులేని అలజడి కలుగుతున్న అలుపన్నది రాకుండా ఎదురు చూస్తున్నాను..
ఎప్పుడు నిద్ర లోకి జారుకున్నానో.. ఎప్పుడు తెల్లారిందో తెలియలేదు.. బయట హడావడి గందరగోళంగా అనిపించడంతో తలుపు తీసి చూసాను...
*********
గదినుంచి.. బిడియ పడుతూ.. చిరు గర్వంతో రావాల్సిన వరుడు... గుమ్మం దగ్గర ఉన్నాడు.. అతని పక్కనే ఒక అమ్మాయి ... ఆమె గర్భవతి...
డోర్ దగ్గర నిలబడ్డా ఇద్దర్నీ చూస్తూ.. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు...అలా మౌనంగానే ఉండిపోయాను...
రేయ్ ఎవర్రా ఆ అమ్మాయి... ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్... గంభీరంగా ప్రశ్నించారు మామగారు...
తన పేరు చైత్ర... కొన్ని కారణాల వల్ల నేను తీసుకు రావాల్సి వచ్చింది అన్నారు... ఆయన
చైత్ర అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు కదా మను... తనే నా ఆమె అని ప్రశ్నించారు ..అత్తయ్య గారు
అవును అంటూ నా వంక చూసారు... ఇద్దరి చూపులు ఒకసారి ముడిపడి మళ్లీ విడిపోయాయి...
గుమ్మం దగ్గర నీరసంగా జారపడి ఉన్న చైత్ర గారి.. నీ చూసి ఏమనుకున్నారో ఏమో లోపలకు తీసుకెళ్ళండి అన్నారు.... ఆవిడ
ఇంత జరుగుతున్నా మౌనం గానే ఉన్నాను... చిన్నప్పటి నుంచి అంతే... మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు... పెద్దలకు ఎదురు సమాధానం చెప్పకూడదు అంటూ పెంచారు... అన్ని విషయాల్లో సర్దుకుపోవడం తప్ప ప్రశ్నించడం చేతకాలేదు..నాకు.. .
ఈ విషయంలో కూడా నా..అంటూ . నా మనసు నన్ను తిరిగి ప్రశ్నించడం మొదలు పెట్టింది..
ఆలోచనలలో ఉన్న నా దగ్గరికి వచ్చారు ఆయన...
చూడండి ..మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు.. కానీ తన పేరు చైత్ర మేమిద్దరం ప్రేమించుకున్నాం అన్నది వాస్తవమే.. ..
కానీ తను ఇప్పుడు వేరొకరి భార్య... పెళ్లి అయిన అమ్మాయిని ప్రేమించే అంత మూర్ఖుని కాదు... అలాగే నేను పెళ్లి చేసుకున్న నా భార్య ని వదులుకునే వ్యక్తిని కూడా కాదు...
ఒక గంటలో మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం... మీ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పెను ప్రయాణం గురించి... ఇక మీ ఇష్టం అన్నారు...
అవే తొలిపలుకులు మా ఇద్దరి మధ్య...
*********
చైత్ర గారితో కలిసి మా ప్రయాణం మొదలైంది...
మా ముగ్గురి మధ్య నిశ్శబ్దం కూడా.. మాతో పాటే ప్రయాణించింది...
సిటీలోని ఒక అపార్ట్మెంట్ ముందు ఆగింది .. కార్
జాగ్రత్తగా రా చైత్ర అంటూ.. ఆమెను తీసుకుని వెళ్లారు.. మను గారు...
అదొక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్... నీట్ గా పొందిగ్గా ఎక్కడి వక్కడ అమర్చబడి ఉన్నాయి...
అప్పటికే ప్రయాణం తో కలిగిన అలసట దానికి తోడు విపరీతమైన ఆలోచనలుతో ఉన్న నా దగ్గరికి వచ్చి....
మీరు కూడా చైత్ర తో పాటు ఉండండి.. అంటే తనకు ఈ సమయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో చెప్పలేము కదా ... అందుకే మీ బ్యాగ్ ఆ గది లో పెట్టాను
మనకు ఫుడ్ ఆర్డర్ చేశాను.. అది వచ్చేలోపు ఫ్రెష్ అయి రండి అన్నారు...
మను గారి బలవంతం మీద కొద్దిగా తిని గదిలోకి వెళ్ళి పోయారు చైత్ర గారు...
నాతో ఏమైనా చెప్తారేమో అని ఎదురుచూస్తూంటే.... బాగా అలసిపోయాను .. ఏమైనా అవసరం వస్తే పిలువు అంటూ వారు కూడా వెళ్ళిపోయారు....
నేను గదిలోకి వెళ్ళేసరికి.. తన బేబీ బంప్ మీద చెయ్యి వేసుకుని పడుకున్నారు.. చైత్ర గారు..
పచ్చని పసిమి ఛాయ, అలసిపోయినట్టుగా ఉన్న మొఖం, ఎగురుతున్న ముంగురులు.. ఇంకా ఏదో తెలియని బాధ తో ఉన్న ఆవిడ్ని కొద్ది సమయం అలాగే చూసి.. నిద్ర లోకి జారుకున్నాను...
********
తెల్లారింది....
అటూ ఇటూ తిరిగే వాహనాలు.. వాటి మధ్యలోంచి రోడ్డు దాటాలని అనుకునే మనుషులు... చిన్న చిన్న వ్యాపారులతో మహా సందడిగా ఉంది.. సిటీ వాతావరణం...
బాల్కనీ లో ఉన్న నా దగ్గరికి.. కాఫీ కలిపి తీసుకొచ్చారు...ఆయన..
మొహమాటం గా తీసుకుని.. లోపలికి వచ్చేసరికి.. అక్కడ పాల ప్యాకెట్లు , కాయగూరలు ఇంకా వంట కి కావలసిన సామాను ఉంది...
నాకు అర్జెంట్ వర్క్ ఉంది.. ఆఫీస్ కి వెళ్తున్నాను అంటూ.. చెప్పి చైత్ర గారితో మాట్లాడి వెళ్ళిపోయారు...
తిరిగి రాత్రి కి వచ్చారు...
అలాగే రెండు మూడు రోజులు గడిచిపోయాయి... చైత్ర గారు ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉండి.. తమ లోకంలో తాను ఉండేవారు.. ఏదైనా పెడితే తినడం లేదా వద్దు అనేవారు..
అలాగని నాకు మా ఆయనకు మధ్య కూడా పెద్ద మాటలు ఉండేవి కాదు.. అలా సాగిపోయేది..
ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఎలా ఉంది కొత్త కాపురం అని అడిగితే చిరునవ్వే నా సమాధానం అయ్యాది..
*********
ఇక్కడకి వచ్చి దాదాపు పది రోజులు గడిచిపోయింది...
మనుషుల మధ్య బంధం బలపడటానికి మాటలే అవసరం ఉండదు... ఒక్కొక్కసారి మౌనమే దగ్గరితనాన్ని కలిగిస్తుంది...
మను గారి గతం తాలూకు జ్ఞాపకాలు సజీవంగా వారి కళ్ళముందున్న ....ఆయన మా బంధానికి ఇచ్చిన గౌరవం కారణంగా నేను కూడా మౌనంగానే ఉన్నాను...
నేను అడగలేదు.. వారు చెప్పలేదు.. మౌనంగానే గడిచిపోయింది కాలం... అడిగే ధైర్యం లేక కాదు తను చెప్తే వినాలని...
********
ఎప్పుడు ముభావంగా శూన్యంలోకి చూస్తూ ఉండే చైత్ర గారి లో నెమ్మదిగా మార్పు వచ్చింది..
అపార్ట్మెంట్ పార్క్ లో అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుండేవారు... వాళ్లు నవ్వు లని చూస్తే ఆవిడ మొఖం లో కూడా చిరు నవ్వు వచ్చేది...
ఒకరోజు రాత్రి ....
చైత్ర గారు ...నన్ను క్షమించావా..... అంటూ నా చేతులు పట్టుకుని
పెళ్లి జరిగి.. కొత్త జీవితానికి నాంది పలుకుతూ ..... సంతోషంగా ఉండాల్సిన మీరిద్దరూ ...నా కారణంగా విడి విడిగా ఉంటున్నారు... అంటూ
వాళ్ళిద్దరి ( మను, చైత్ర ) ప్రేమ గురించి చెప్పసాగారు..
*********
చైత్ర చెబుతోంది....
మను చాలా మంచి వ్యక్తి... నేను , మను ఒకే కాలేజ్... ఓకే క్లాస్ ... మా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలియదు.... ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం.. ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం...
మను ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకున్నారు ...కానీ మా ఇంట్లో మాత్రం మా పెళ్ళికి అంగీకరించలేదు.. ....
కారణం పెద్దవాళ్ళు నాకు అప్పటికే పెళ్లి నిశ్చయించారు....
" మాటిచ్చాం.. ఇది ఇంటి గౌరవం నీకీ సంబంధించింది ... మేము చూపించిన వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకోవాలి "అన్నారు ....
ఇంట్లో వాళ్ళ మాట కు ఎదురు చెప్పలేకపోయాను... ఫలితం రఘు గారి తో నా పెళ్లి... రఘు గారు కూడా మంచి వ్యక్తి కానీ
******
అంటూ ఏదో చెప్పబోతూ ఆగిపోయి.. నా వంక చూసి మను చాలా మంచి వ్యక్తి అతన్ని వదులుకోకు... నేను త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్లి పోతాను అన్నారు... చైత్ర గారు..
" వదులుకునే దాన్ని అయితే వారితో ఇక్కడి వరకు వస్తానా.." అని మనసులో అనుకునీ
చైత్ర గారి మాటలను మననం చేసుకుంటూ.. ఆవిడ కీ పరిస్థితుల వలన కలిగిన ఇబ్బంది ని అర్థం... చేసుకున్నాను
శ్రీవారి సహాయంతో ఎలాగైనా ఆవిడకి ... నచ్చజెప్పాలి..
********
ఒక చల్లని సాయంత్రం బాల్కనీ లో నుంచుని కరిగిపోయే నీలి మబ్బులు ను చూస్తూ పిల్లగాలితో పారచికలాడుతున్న నాకు...
ఒక్కసారిగా నా వెనకాల వెచ్చని శ్వాస తగిలేసరికి.... అది ఎవరిదో అర్థమయ్యేసరికి ...ఉలిక్కిపాటు తో పాటు బిడియం కూడా తోడు వచ్చింది..
నును సిగ్గుతో.. కనబడుతున్న నన్ను చూసి ...త్వరగా రెడీ అవ్వు ..మనం బీచ్ కి వెళ్దాం .. చైత్ర కి కూడా చెప్పు అన్నారు... మను గారు
వెళ్దామని చూస్తున్న నాకు... దారికి అడ్డుగా ఉంటూ... అటు ఇటు నడిపిస్తూ అల్లరి చేస్తున్నారు.. .. ఆయన
శ్రీవారి అల్లరి మనసుకు నచ్చుతున్నా.. పైకి మాత్రం బెట్టు చూపిస్తున్నాను... నన్ను చూసి మరింత చిలిపితనాన్ని సంతరించుకుంటున్నాయి ఆయన చూపులు..
*********
ఎన్నో విషయాలను తన గర్భంలో దాచుకుంది.. ఆ .. సాగరం....అలాగే.. ఆకాశాన్ని తాకేలా పడి పడి లేస్తున్నయి ..దాని అలలు..
చైత్ర గారి మాటల్లో తెలిసింది... ఆయనకి బీచ్ అంటే ఇష్టమని..
ముగ్గురం బీచ్ కి వచ్చాము... మమ్మల్ని వదిలి ఒక దగ్గర కూర్చున్నారు చైత్ర గారు...
ఆ తీరం వెంబడి నెమ్మదిగా మా అడుగులు వేయడం మొదలుపెట్టాం..
మేము ముగ్గురుం తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ మా కోసం ఎదురుచూస్తున్నారు.. చైత్ర గారి హస్బెండ్ రఘు గారు...
నన్ను క్షమిస్తావా చైత్ర.. నిన్ను అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాను ..అంటూ ఆవిడ యెదుట నిలబడి .. చెప్పారు..
" మరి ఇప్పుడు ఎందుకు తిరిగివచ్చారు.. "అని అతన్ని ప్రశ్నించారు మను గారు...
చైత్ర గారు మాత్రం... ఏడుస్తూ అతన్ని చూస్తూ ఉండిపోయారు..
రఘు గారు.. ఒకసారి మా ఇద్దరి వైపు చూసి.. ఒక నిమిషం నిట్టూర్చి..
తప్పు చేశాను... అంటూ ఒకరోజు పని మీద బయటకి వెళ్లిన నాకు ..
మను,చైత్ర చదువుకునే సమయంలోనే ప్రేమించుకున్నారు అని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు అని తెలిసింది...
" పెద్దల బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్న చైత్ర కి... నేనంటే ఇష్టం లేదేమో... తనింకా మనోహర్ (మను) నే ప్రేమిస్తుంది ఏమో అనుకుంటూ... తనకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాను" .... ఆ విషయమే చైత్ర కి చెప్పి తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పి
... ఒక నిమిషం మా అందరి వైపు చూసి.. చైత్ర దగ్గరికి వెళ్లి ఆమె రెండు చేతులు పట్టుకుంటూ...
నిన్ను వదిలేసి వచ్చినప్పట్నుంచి ...నాకు నువ్వే గుర్తొచ్చావు.. మన పెళ్లి అయిన దగ్గర్నుంచి నువ్వు నా పై చూపించిన ప్రేమ అబద్ధం కాదనీ.. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావనీ నేను తెలుసుకునేసరికి ఆలస్యమైంది... అంటూ
ఆమె బేబీ బంప్.. మీద చేయి వేసి ..నా పిచ్చి ఆలోచనలు వలన మన ప్రేమకు సాక్ష్యం ఆయన మన బిడ్డను కూడా వదులుకోవాలని చూసిన మూర్ఖుని ...
నన్ను క్షమించు అంటూ కన్నీళ్లతో చైత్ర గారి నీ అడిగారు.. రఘు గారు
ఆమె ..ఒక సెకను కూడా ఆలస్యం చేయకుండా అతన్ని హత్తుకుంటూ... " ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా వదిలివెళ్లారు కదా..!! నాకెంత భయమేసిందో.." ఆరోజు సమయానికి మను రాకపోతే మన బిడ్డ మనకు దక్కే వాడు కాదు...
అంటూ ఆ సమయాన్ని గుర్తు చేసుకున్నారు..
ఆరోజు విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్న నాకు ఏం చేయాలో తెలియక మను కి ఫోన్ చేశాను....
ఎంతో సంతోషంగా జీవితాన్ని ప్రారంభించాల్సిన మను....
" కేవలం నాకోసం అతని భార్యని గదిలో ఒంటరిగా వదిలి వచ్చి హాస్పటల్ కి తీసుకెళ్లి ఆ రాత్రంతా నాతో పాటే ఉండి.... తిరిగి
నన్ను ఒంటరిగా అలా వదిలే లేక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడినుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు..." అని
మావారి గురించి అసలేం జరిగిందో మొత్తం చెప్పారు చైత్ర గారు...
********
అన్ని సమస్యలు తీరిపోయాయి కదా..
నేను , చైత్ర బయలుదేరుతాము.. ఇంకా మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి అంటూ నవ్వుతో చెప్పారు రఘు గారు...
నేను అందరూ వంక చూసాను... అందరి కళ్ళల్లో ఏంతో సంతోషం.... మా వారి కళ్ళల్లో అయితే ఇంకా ఎక్కువ ... ఎందుకో మరి
అబ్బో అనుకుంటూ... అలా ఎలా పంపించేస్తాను చైత్ర గారిని ...ఆవిడ ఇన్ని రోజులు .. ఎంత బాధ పడిందో నాకు తెలుసు.. మా ముగ్గురి మధ్య ఎంతో మౌనం ఇప్పుడు వరకు..
అందుకు కారణం రఘు గారు.. ఇప్పుడు వచ్చి సారీ అంటే " ఇట్స్ ఓకే "అనేస్తారా.. అనుకుంటూ
"చైత్ర గారు ఎక్కడికి రారు.. ఇక్కడే మాతో పాటే ఉంటారు.. ఆవిడ కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండి ఆమెను చూసుకోండి.. మీరు బాగా చూసుకుంటే అప్పుడు ఆమెను పంపిస్తాను" అని రఘు గారిని ఉద్దేశించి అన్నాను..
అందరూ అవాక్కయి... నా వైపు చూసారు.. నేను మాత్రం తగ్గేదే లే
చైత్ర గారు కూడా నాకే సపోర్ట్ ఇచ్చారు... ఆ రాత్రి రఘు గారిని బయటకు తోసేసి చైత్ర గారి పక్కన నేను సెటిలయ్యాను..
అబ్బాయిలు ఇద్దరు మొఖం మాడ్చుకుని మా వైపు చూస్తున్నారు... మేము మాత్రం హాయిగా నిద్ర పోయాము..
ఇలాగే రెండు రోజులు కొనసాగింది... తర్వాత రోజు రాత్రి మాత్రం... నేను చైత్ర గారి దగ్గరికి వెళ్లేసరికి... రఘు గారు.. ఆమె ఒడిలో పడుకుని బేబీ బంప్ నీ ముద్దుడుతూ కనిపించారు...
దెబ్బకి నేను డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చేసాను.. లోపల్నుంచి నవ్వులు వినిపించాయి...
నా కోసం మావారు వెయిటింగ్...మా.. గదిలో... ఇది వీరిద్దరు ప్లాన్ అని అర్థమైంది..
అక్కడ
పతిదేవునికి అన్ని కబుర్లు వచ్చు అని .. చమత్కారం కూడా తెలుసని ... తెలిసింది ... మా మధ్య ఉన్న మౌనం నెమ్మదిగా మాటలతో దూరమైంది ...
వారి అల్లరి శృతి మించి ప్రణయపు గది తలుపులు తెరచి ...కలిసిపోతున్న ఇరు శ్వాసలు ఒకరికొకరు సొంతమని తెలుపుతుంటే హాయిగా వారి గుండె పై సేదతీరాను...
తర్వాత రోజు... రఘు గారు చైత్ర గారిని తీసుకొని వెళ్ళిపోతు... మాకు హనీమూన్ టికెట్స్ ఇచ్చారు..
********
ప్రస్తుతం.....
నేనింకా దాని గురించి ఆలోచిస్తుంటే.... నిశ్శబ్దంగా నన్ను మరింత అల్లుకుపోయారు... ఆయన..
తన చిలిపి అల్లరి శృతి మించుతుంటే.. ఇరు తనువులలో రేగిన తపనల అల్లరి కి ఇప్పటివరకు ఉన్న సరిహద్దులు దాటుకుంటూ మా బంధాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం... ఈ మంచు కురిసే వేళలో..
.
.
.
.
.
.
.
.
.......... .......సమాప్తం................

