M.V. SWAMY

Inspirational

5  

M.V. SWAMY

Inspirational

కరోనా నేర్పిన బ్రతుకు పాఠాలు

కరోనా నేర్పిన బ్రతుకు పాఠాలు

2 mins
88       కరోనా నేర్పిన బ్రతుకు పాఠాలు (కథ)


"రవి మనపని మనం చేసుకోవడంలో తప్పులేదు,పైగా ఈ కరోనా సెలవుల్లో కాసేపు చదువుకొని కొంత సమయం ఆడుతూ పాడుతూ గడిపి మిగతా సమయంలో మీ నాన్నకు వ్యవసాయ పనుల్లో సాయపడటంలో నీకొచ్చిన ఇబ్బంది ఏందిరా బిడ్డా..."అని అడిగాడు తాతయ్య మనవడు రవిని.


"అది కాదు తాతయ్య నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను,పైగా ప్రైవేట్ కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం చదువునాది.నేను సెవెంత్ క్లాస్లో మా స్కూల్లో టెన్త్ ర్యాంకర్ని...నన్ను పట్టుకొని నాన్న గేదెలు కాయమంటాడు,నా ఫ్రెండ్స్ చూస్తే నాకు ఎంత అవమానమో!నాన్నకూ నీకూ అర్ధం కావడంలేదు"అని బుంగమూతి పెట్టాడు రవి.


"ఒరేయ్ రవి నేనూ పియూసీ పాస్ అయ్యాను,మీ నాన్న బియ్యే పాస్ అయ్యాడు,అయినా మేము పొలం పనులు చెయ్యడం లేదా!గేదలు మేపడం లేదా!ఊర్లో ఇంటింటికీ పాలు పోసి బ్రతకడం లేదా!... మనం పాడిపంటల రైతులం మన వృత్తి మనం చేసుకోడంలో సిగ్గెందుకు...అయినా నీకు సెలవులు ఉన్నాయి కాబట్టి నాన్న నీకు పశువులు బాధ్యత అప్పగిస్తున్నాడు... నీకు బడి ఉంటే అలాంటివి చెప్పడు,నీకోరిక మేరకే కదా మీ ఫ్రెండ్సతో నిన్ను విడదీయడం ఇష్టం లేకే కదా!డబ్బులు పోతున్నా...పేరు పెద్ద ఊరు దిబ్బ ప్రైవేట్ కాన్వెంట్లో వేలకు వేలు ఫీజులు కట్టి నిన్ను చదివిస్తున్నాడు, అలాంటప్పుడు నువ్వు నాన్నకు సాయపడితే తప్పేముంది"అని అన్నాడు తాతయ్య.


"నువ్వు ఎన్నైనా చెప్పు తాతయ్య నాకు పొలం పని,పశువులు పని,అప్పుడప్పుడైనా పాలు అమ్మే పని చేయడమంటే నాకు నామోసీగా ఉంటుంది,విచిత్రం ఏమిటంటే అమ్మ కూడా నాన్నకే వంత పడుతుంది,ఇంత చదువూ చదివి ఇదేమి పని అనిపిస్తుంది నాకు "అని తాతయ్య మరో మాటాడకుండా అడ్డుకట్ట వేసాడు రవి.


"సరే రవి ఆ టాపిక్ ఆపేయ్,మీ నాన్నమ్మ రోడ్డుమీదకు వెళ్లి అరటిపళ్ళు కొని తెమ్మంది పద వెళ్దాం"అని అన్నాడు తాతయ్య.


"సరే తాతయ్యా"అంటూ రవి తాతయ్య వెంట నడిచాడు.రోడ్డు మీద అరటిపళ్ళు బండి తోసుకుంటూ అరటిపళ్ళు అమ్ముతున్న మనిషిని చూసి రవి ఆశ్చర్యపోయాడు,అతని ముఖం చూస్తే ఆ మనిషి సిగ్గుపడిపోతాడాని రవి ఆ అరటిపళ్ళు బండిని వేగంగా దాటిపోడానికి ప్రయత్నం చేస్తుండగా...


"రవీ అరటిపళ్ళు కావాలా! రా ఇటురా... ఇతను మీ తాతయ్యే కదూ..."అని అడిగాడు అరటిపళ్ళు అమ్మే అతను..రవినీ,తాతయ్యనీ చూసి నవ్వుతూ.


"అవును సార్...సార్ అరటిపళ్ళు బండతను లేడా మీరెందుకు ఈ బండి దగ్గరవున్నారు మీకు పళ్ళు అమ్మే అతను బందువా లేక మిత్రుడా....మీరెందుకు ఈ బండిని తోస్తున్నారు"అని ఆశ్చర్యంగా అడిగాడు రవి


"రవి ఈ బండి నాదే ఈ అరటిపళ్ళు నేను పెద్ద బజారులో కొని ఇక్కడ అమ్ముకుంటున్నాను"అని అన్నాడు అతను.


"ఇంతకీ మీకూ ...రవికి పరిచయం ఏంది..."అని అడిగాడు తాతయ్య అరటిపళ్ళు అమ్మేవాడిని.


"నేను రవికి పాఠాలు చెప్పే మాస్టార్ని,కరోనా కారణంగా మా కాన్వెంటు చాలా నెలల నుండి మూతపడింది.పిల్లలు రారు,ఫీజులు రావు అందుకే మాకు జీతాలు రావు,మీకు తెలుసుకదా జీతం మూరడు,ఖర్చులు బారెడు జీవితాలు మావి కుటుంబాన్ని పోషించడానికి,తక్కువ జీతాలు వల్ల నిత్యం చేసే అప్పులు తీర్చడానికి,వడ్డీలు కట్టడానికి ఈ ఈ పని చేస్తున్నాను,ఇది నాకు ఆలవాటైన పనే మా నాన్న ఈ అరటిపళ్ళు బండి నడిపే నన్ను ఎమ్మెస్సీ ఎమ్మెడ్ చదివించాడు,నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టునయ్యాను.ఈ బండే మా కుటుంబ బండిని నడిపి నాలో పట్టుదలని పెంచింది,ఇప్పుడు నాకూ పనికొచ్చింది ఈ బండి...ఏం తప్పంటారా"అని అడిగాడు అరిటిపళ్ళు అమ్ముతుండే రవి కాన్వెంటు మాస్టర్.


"లేదు సార్ అందుకే కరోనా ముందుకన్నా కరోనా తరువాత మన బ్రతుకుల్లో తేడాలు వస్తాయి అని పెద్దలు చెప్పారు...అయినా బ్రతకడానికి దొంగతనం,

అదువుతనం చెయ్యడం తప్పుగానీ చక్కగా కష్టపడి పని చేయడం నామోసీ కాదు,కరోనా కారణ కరువుని నిందిస్తూ ఇంట్లో పస్తులు ఉంచకుండా మీరు మంచిపనే చేస్తున్నారు."అని మాస్టారుకే కితాబిచ్చాడు తాతయ్య.

రవికి తాతయ్యకి మాస్టారికి మధ్య జరిగిన మాటల సారాంశం పూర్తిగా అవగాహనకొచ్చింది.


బజారు నుండి ఇంటికొచ్చిన తరువాత రవి అన్నపానీయాలు త్వరగా ముగించుకొని"తాతయ్యా నేను పొలానికి వెళ్తున్నాను,కాసేపు నాన్నకు సాయం చేసి, మధ్యాహ్నం గేదెలు మేపుకు తీసుకొని వెళ్తాను, సాయంకాలం నాన్నతో పాటు నేనూ వెళ్లి మన దగ్గర పాలు పోసుకునే వాడకం దార్లతో పరిచయం పెంచుకుంటాను, నాన్నకు ఎప్పుడైనా వెళ్లడం కుదరకపోతే నేను వెళ్ళాలి కదా"అని నవ్వుతూ పొలం వైపు నడిచాడు రవి.


తాతయ్య చాలా సంతోషించాడు,రవికి కాన్వెంటు మాస్టారు బడిలోనే కాదు జీవితంలోనూ మంచి పాఠాలు నేర్పాడు"అనుకొని నిండు నిట్టూర్పు విడిచాడు.
.


 


Rate this content
Log in

Similar telugu story from Inspirational