kottapalli udayababu

Inspirational

4  

kottapalli udayababu

Inspirational

జననీ జన్మభూమిశ్చ!

జననీ జన్మభూమిశ్చ!

9 mins
808


    జననీ జన్మభూమిశ్చ...!!!

  ‘’ఏరా శీనుగా. నేను బేరానికి ఎల్తన్నాను. నువ్వు అన్నం ఒక్కటి వండేసి స్కూలుకెల్లిపో. ఎదవ నాయాళ్ళతో కలిసి ఎక్కడైనా ఆడినట్టు కనిపిత్తే తోలు వలిసేసి పనిలో ఎట్టేస్తాను. అర్దమైందా.’’ దండాన ఉన్న ఎర్రతుండుగుడ్డ తలకు చుట్టుకుని గుమ్మంపక్కనున్న రిక్షా దగ్గరకు వెళ్ళాడు సోములు.

‘’అట్టాగే నాన్నా.’’ తండ్రి గంజి తాగిన సీవండి బేసిను శుభ్రంగా కడిగి పాతగుడ్డతో తుడిచి చెక్క అలమారులో బోర్లించాడు శీను.

మళ్ళీ ఏమనుకున్నాడో తిరిగి గుడిసెలోకి వచ్చాడు సోములు.

‘’శీను బాబు ఇలారా.’’ అనిపిలిచాడు మోకాళ్ళ మీద కూర్చుని.

‘’ఏంటి నాన్నా?’’ అంటూ దగ్గరగా వచ్చాడు శీను.

వాడి ఏడేళ్ళ లేత ముఖం చిదిమితే పాలుగారేంత మృదువుగా ఉండి, నిర్మలమైన తెల్లని నందివర్ధనం పూవుల్లాంటి మెరిసే కళ్ళతో, పాలమీగడ చెక్కిళ్లతో, మరీ ముఖ్యంగా రేపు విడిచే సంపంగె మొగ్గలాంటి ముక్కుతో మిలమిలా మెరిసిపోతోంది. దగ్గరగా వచ్చిన కొడుకు ముఖాన్ని రెండుచేతుల్లోకి అపురూపమైన వస్తువులా తీసుకుని వాడి కళ్ళల్లోకి చూసాడు సోములు. అవే మల్లెమొగ్గల కళ్ళు,అదే కోటేరువేసిన ముక్కు, అవే బంగిన పల్లి మావిడి పళ్ళ బుగ్గలు...అంతా.. అంతా సెంద్రి పోలికలే. వాడి కళ్ళమీద, బుగ్గలమీద, నుదురు మీద పెల్లుబుకున్న ప్రేమతో ముద్దులు పెట్టుకుని ‘’జాగర్త గా బడికి ఎల్లు నాన్నా.అన్నం ఏలకు వచ్చెయ్యి.కలిసి తిందాం. నేను కర్రీపాయింటు నుంచి కూర, రసం తెత్తాను.’’అనేసి కొడుకుని మరో మారు హెచ్చరించి వెళ్ళిపోయాడు సోములు.

రిక్షా నెమ్మదిగా తోక్కుతున్నాడన్న మాటే గానీ సోములు ఊహల్లో సేంద్రి పోలికలున్న శీను గురించే ఆలోచన.

తానూ కొడుకును ఏనాడు తిట్టడు, కొట్టడు.వూరికే అరుస్తాడంతే. ఆ అరుపులు అంటేనే సీనుకి చాలా భయం.

 ‘’ నువ్వు అరిత్తే నాకు బయమేస్తుంది నాన్నా. అమ్మదగ్గరకేల్లిపోవాలనిపిస్తుంది.’’ ఒకసారి ధైర్యం చేసి తండ్రిదగ్గరగా వచ్చి అన్నాడు శీను.

అంతే! అమాంతం సీనుని గుండెలకద్దుకుని ‘’ ఇంకెప్పుడు అరవను నాన్న. మరి నువ్వు మాట ఇనకపోతే ఆపరేసన్ సేయించుకోకుండా అమ్మ వచ్చేత్తది.ఆపరేసన్ సేయిన్చుకోలేదు కాబట్టి అమ్మ సచ్చిపోద్ది.అమ్మ సచ్చిపోవడం నీకిట్టమా? సెప్పు?’’ అన్నాడు తను

‘’లేదు నాన్నా. నీ మాట వింటాను. అమ్మ ఆపరేసన్ సేయించుకుని వచ్చేసరికి నేను పెద్ద డాక్టర్ ని అవుతాను. అమ్మకి మళ్ళీ జొరం రాకుండా జాగ్రత్తగా సూసుకుంటాను. నిన్నుకూడా.’’ అన్నాడు తండ్రి కౌగిలిలో గువ్వలా ఒదిగిపోతూ..

రెండోసారి గర్భం ధరించి ఏడోనెలలో పట్నం లో డాక్టర్ కి చూపించి తీసుకొస్తున్న సమయంలో వూరు శివార్లలో లోడుతో ఉన్న ఇసకలారీ రిక్షాను గుద్దేసింది. ఆ వేగం లో లారీ మర్రిచెట్టుకు గుద్దుకుని పక్కకు ఒరిగిపోయింది. తోట్టేలోని ఇసుకంతా రిక్షాలోంచి ఎగిరిపడ్డ సేంద్రిమీద పెద్దగుట్టలా జారిపోయింది. లారీ డ్రైవర్ తన సీటు లోనే ప్రాణాలు వదిలేసాడు. తనకు సృహ తప్పిన కొద్దిసేపటికి మెలకువ వచ్చి చూసుకుని ఇసుక అంతా దిగలాగితే ఇసుకకింద కొన ఊపిరితో సేంద్రి. వెక్కి వెక్కి ఏడుస్తూ లేపి ఆస్పత్రికి తీసుకెళ్దామని ప్రయత్నిస్తే సేంద్రి సెయ్యట్టుకుని ఆపేసి వాలిపోతున్న కళ్ళతో అంది.

’’ మావా.నువ్వెంత పెయత్నం సేసినా నేను బతకను. నాకు తెలిసిపోతావుంది. సీనయ్య...సీనయ్యజాగ్రత్తమావా. నేను లేకుండా ఒక్క చ్చనం ఉండలేడు ఎర్రి సన్నాసి. ‘’అమ్మా..అమ్మా.’’ అని అలుపులేకుండా కొంగట్టుకుని తిరుగుతానే ఉంటాడు. ఆడు..ఆడు జాగర్త మావా..ఆడు పెద్దయి బాగా సడువుకుంటే నిన్ను బాగా సూత్తాడు. ఆడిని ఇంగ్లిపీసు కాన్వెంట్లో ఏసీ ఆడు ‘’మమ్మీ ‘’ అని పిలిత్తే మురిసి ముక్కలైపోదావనుకున్నాను. ముక్కలవకుండానే మమ్మీనైపోతన్నాను.ఆడు జాగర్త మావా..ఆ....డు.....జా.........గర్..............తా.” అంటూ తన సేతుల్లోనే పాణం వదిలేసినాది.

ఆ పెమాడంలో లారీ యజమాని సేంద్రి సావుకు కారణమైనందుకు గొడవ పోలీసులదాకా ఎల్లకుండా కొంత డబ్బు ముట్ట జెప్పాడు సోములుకి. ఆ డబ్బు ను పోట్టాఫేసులో శీను పేరా దాచిండు. ఆ డబ్బుతో సీనుని పెద్ద సదువు సదివించాల అనుకున్నాడు సోములు.

మూడురోజుల తరువాత సేంద్రి అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని ఇంటికి చేరిన తనను పక్కింటినుంచి వచ్చిన శీను అడిగాడు.

‘’ అమ్మేది నాన్నా?’’

‘’ అమ్మకు ఆపరేషన్ సేయాలంట నాన్నా. పట్నం లో ఆసుపత్రిలో ఉండిపోయింది .నువ్వుఏడవకుండా నాన్న మాట ఇని బాగా సదువుకుంటే అమ్మ ఆపరేషన్ సేయించుకుని వత్తాదంట. లేకుంటే రాదట. రేపట్నుంచి నువ్వు బుద్దిగా బల్లోకి ఎల్లి అయ్యోరు సేప్పినవన్ని బాగా ఇని సడువుకోవాలంట. ఆగోలీలు ఆడే నాయాల్లతో సేరి బడి మానేత్తే అమ్మ ఇంకెప్పుడూ రాదంట. మరి అమ్మ మనింటికి రావాలా వద్దా.’’ తండ్రి మాటలు విని

భోరున ఏడుస్తూ ‘’నాన్నా. నాకు అమ్మ కావాలి.’’అంటూ భుజం మీద వాలిపోయాడు.

ఈ ఊళ్ళోనే ఉంటె ఈ కుర్ర ఎదవలంతా కలిసి సీనుని ఏడిపించడం కోసం ‘’మీ అమ్మ సచ్చిపోయిందిరా. మీ నాన్న నీకు అబద్ధం సేప్పాడు.’’ అని పిల్లాడికి ఎక్కేస్తే తాను అమ్మనూ తెచ్చివ్వలేడు. పైగా తాను అబద్దం సేప్పినట్టు ఆ సిన్నమనసుకు తెలిసిపోతే తన మాట ఇనడు. సేంద్రికిచ్చిన మాట తానూ నిలబెట్టుకోలేడు.

అందుకే పట్నం ఎల్లిపోవాలి. అనుకుని పట్నం లో అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న కాలనీ లో ఓ డబ్బున్న ఆసామి కాళ్ళు పట్టుకుని అతనున్న సందు చివర డ్రైనేజీ అవతలి గట్టుమీద పుంత నానుకుని చిన్న పాక వేసుకుని అందులోకి మకాం మార్చేశాడు తను.

 ఆ కాలనీలోకి రావాలంటే ఆటోలు, బస్సులు తిరిగే రోడ్డుమీదనుంచి కిలోమీటర్ దూరం లోపలికి రావాలి. అపుడు అందరికి రిక్షా అవసరం అవుద్ది అనే ఆలోచనతో ఆ ఆసామి దగ్గర డబ్బు అప్పు తీస్కుని కొత్త రిక్షా కొనుక్కున్నాడు తానూ. అప్పటికే ఆ కాలనీలో ఒక కాన్వెంట్ వెలిసి నడుస్తోంది.

 సేంద్రి కోరిక ప్రకారం సీనుని ఆ కాన్వెంట్ లో చదివిద్దాం అనుకున్నాడు. కానీ కాన్వెంట్ వాళ్ళు బీదవాడని కూడా చూడకుండా వేలకు వేలు డబ్బు కట్టమన్నారు. అదే సమయంలో కాలనీలో పేద కుటుంబాల పిల్లల అవసరం గుర్తించి ఒక ప్రాధమిక పాఠశాలను ప్రభుత్వం ప్రారంభించింది.

అందులో సీనును చేర్చి అక్కడ పెద్దమేడం గారికి తన పరిస్తితిని చెప్పుకున్నాడు తానూ. సేవాభావంతో అక్కడ పనిచేస్తున్న ఆమె శీను ను ఉత్తమ విద్యార్ధిగా తయారుచేస్తానని, తన కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానని మాట ఇచ్చి ఆ ప్రకారమే సాకుతోంది కూడా. అయితే ఆ స్కూల్లో కుర్రాళ్ళు శీను బాగా చదువుతున్నాడనే ఉక్రోషం తో ‘తూటు కాడలతో ఆడే క్రికెట్’ అలవాటు చేసారు. అది గమనించిన మేడం సీనును బాగా మందలించి ఆ విషయం సోములు చెవిన వేసింది. అందుకే ప్రతీ రోజు తానూ వాళ్లతో ఆడవద్దని హెచ్చరించి మరీ వెళ్తాడు.

తల్లిపోలికలు వచ్చినోళ్ళు గొప్పోరు అవుతారని సోములు విశ్వాసం. అందుకే సీనుని అపురూపంగా చూసుకుంటున్నాడు సోములు.

 

 

శీను ఇపుడు రెండో తరగతి చదువుతున్నాడు. తండ్రి హెచ్చరించి వెళ్లిపోయాకా టీచరుగారు ఇచ్చిన ఇంటి పని చేసేసాడో లేదో చూసుకున్నాడు.పుస్తకాలన్నీ స్కూల్ బాగ్ లో సద్దుకుని ఇంటి తడికకు తాళం పెట్టి తాళం చెవి మొలతాడుకు వేలాడగట్టి స్కూల్ వైపు నడవసాగాడు.

వాడు వెళ్ళే రోడ్డులో కుడి పక్కన ప్రాంగణం లోనే ఆ కాన్వెంట్. రిక్షాలలో దిగిన పిల్లలు తమ కారేజీలు ఉన్న బుట్టలు ఆయమ్మలకు ఇచ్చి తమ క్లాసువైపు వెళ్తున్నారు. 

శీను హటాత్తుగా ఒక రిక్షా ముందు ఆగిపోయాడు.

ఆరిక్షా లోనే కూర్చోపెట్టి యూనిఫాం లో ఉన్న తనవయసు పిల్లాడికి చేతిలోని టిఫిన్ బాక్స్ లోని ఇడ్లి తినిపిస్తోంది ఒకామె. ఆ పిల్లాడి తల్లి కాబోలు. వాడు ‘’నేను తినను..నాకు సాయంత్రం ఐస్క్రీం కొంటా నంతేనే తింటా వూ...వూ..’’అంటూ మారాం చేస్తున్నాడు.

రిక్షావాడు విసుక్కుంటున్నాడు.’’అమ్మా.రోజూ ఇలాగే అయితే బజారులో నా బేరాలు ఏం కావాలి? నా పెళ్ళాం బిడ్డలు ఏం తినాలి?అలారం పెట్టి కొద్ది ముందుగా లేపుకుని పిల్లల్ని తయారు చేసుకోవచ్చుగా.’’ అన్నాడు.

‘’అనవసరంగా వాక్కు. మా వీధిలో వాళ్ళంతా నెలకి పన్నెండు వందలు ఇస్తోంటే నేను పదిహేను వందలు ఇస్తున్నాను. ఎందుకనుకున్నావ్? నువ్ అడిగినదానికి బేరమాడకుండా ఒప్పుకున్నందుకు నన్ను పదిమందిలోనూ అంత మాట అంటావా?ఇంటికి రా. మావారితో చెప్పి నీ గుడిసేకి ఇంకో వెయ్యి రూపాయలు పన్ను వేయించకపోతే చూడు.’’ అందామె చేతిలో ఇడ్లీ ముక్క ఉండగానే.

ఇదే అదను కదా అని ఆ పిల్లాడు రిక్షా దూకి గేట్లోంచి తన తరగతి గదివైపు పారిపోయాడు. ‘’హారి వెధవా.నన్నే మోసం చేస్తావా.’’ అనుకుని ఆమె ఇడ్లి బాక్స్ స్కూటీ డిక్కీలో పెట్టుకుని ‘’ ఇంటికి రా నీ ఆపని చెబుతా.’’ అని రిక్షా అతన్ని బెదిరించి స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది.

‘’ హాయిగా పిల్లల్ని సరైన టయానికి లేపుకుని ఇంట్లోనే అన్నీ తినిపించి బంగారం లాంటి ప్రబుత్వ పాఠశాలలో పిల్లల్ని చదివించుకోక ఈ డబ్బున్న వాళ్లకు ఇదేమి ఖర్మవో? రోడ్రు మీద అందరూ సూత్తుండగా అలా పిల్లలకి టిపినీలు పెడితే అదేమన్న ఒంట పడతదా పాడా? సరేగానీ ఆ అమ్మగారు నిన్నట్లా బెదిరిత్తున్నారు. ఎవర్రా ఆమె?’’ అడిగాడు ఇంకో రిక్షావాడు.

‘’ బిల్లు కలెక్టర్ గారి భార్యరా... ఇపుడెల్లి ఆయన కాల్లట్టుకోవాలి. లేదంటే ఇంటి పన్ను ఇంకో రెండేలు పెంచినా పెంచేత్తాడు. ఈ యమ్మ ఎల్లి ఏం సెప్పుద్దో ఏంటో? హారి దేవుడా. పొద్దున్నే అనవసరం గా ఆ యమ్మ నోట్లో నోరేట్టాను.సీ.. నా బతుకు సేడ.” తనని తానూ తిట్టుకుని ఆ రిక్షా వాడు ఆవిడ స్కూటీ పరిగెత్తించిన వైపు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.

ఆ దృశ్యం చేదిరిపోవడం తో శీను స్కూల్ కి వెళ్ళిపోయాడు.

మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తిరిగి వస్తుంటే సరిగ్గా స్కూల్ గేటు దగ్గర ఆగిపోయాడు శీను.

ఉదయం కొడుక్కి ఇడ్లీ తినిపించిన ఆవిడే గేటు దగ్గర నిలబడి గేటుకు లోపలివైపున ఉన్న కొడుకుకి అన్నం తినిపిస్తోంది. అలాగ తినిపిస్తున్న కొంతమంది తల్లులని చూడగానే వాడికి తల్లి గుర్తొచ్చింది. ఒక్క క్షణం వాడి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. అవి జారిపోవడం కూడా వాడికి తెలియలేదు. తన ఇంట్లో అమ్మ సీవండి బొచ్చే లో తనకోసం పెరుగు అన్నం కలిపి ఉల్లిపాయ నంజుతూ అన్నం పెట్టిన సందర్భం వాడికి గుర్తొచ్చింది. ఈ డబ్బున్నోళ్ళ ఇళ్ళల్లో అన్నం తినడానికి పెద్ద పెద్ద బల్లలుంటాయంట. వాటిమీద పిల్లలు కూసుని మారాం సేత్తుంటే అమ్మలు బతిమాలి వాళ్లకి ఇస్టమైన అన్నం కూరి కూరి తినిపిత్తారంట. ఒకటి రెండు ఇళ్ళల్లో పాచి పనులకేల్లినప్పుడు తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి వాడికి.

సరిగ్గా అప్పుడే వాడి కన్నీళ్ళను ఒక చెయ్యి తుడిచింది. శీనుగాడు తలెత్తి చూసాడు. ఎదురుగా తండ్రి.కొడుక్కి సేంద్రి జ్ఞాపకం వచ్చిందని సోములుకి అర్ధం అయింది. అడిగితె వాడిని ఓదార్చడం కష్టమని ఊరుకున్నాడు.

‘’ నాన్నా. వచ్చేసావా.నీకోసమే ఇంటికోత్తున్నా.పద ఎల్దాం.’’ అన్నాడు శీను.

ఎందుకో ఆ దృశ్యం వాడి మనసు పొరల్లో బాగా ముద్రించుకుపోయింది. స్కూలు వదిలాకా ఆటలకు వెళ్ళడం మాని ఇంటికి వచ్చాకా వాడి ఊహల్లో మెరిసిన బొమ్మల్ని వేయడం అలవాటుగా చేసుకున్నాడు. ముందు ముందు కాకి పిల్లి...లాంటి జంతువుల బొమ్మలు వేసినా క్రమేపీ పిల్లలకోసం ఆహారం తేవడానికి ఆకాశం లోకి వెళ్ళిన తల్లిపక్షి, తల్లి తమకు ఎపుడు ఆహారం తెచ్చి పెడుతుందా అని ఎర్రని నోళ్ళతో గూటిలో ఎదురు చూసే పక్షి పిల్లలు...ఆవు- దూడ కధలో లేగ దూడకు పాలిచ్చి తాను పులికి ఆహారం అవ్వడానికి వెళ్తున్న తల్లి ఆవు ...ఇలాంటి దృశ్యాలు వాడి చేతుల్లో అలవోకగా అపురూపమైన బొమ్మలుగా మలగడం చూసిన టీచర్ సోములు అనుమతితో మండల స్థాయి, జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలకు పంపించింది.

వాటిల్లో ‘’ ఇదేమి ఖర్మం?’’ అన్న టైటిల్ తో వేసిన చిత్రానికి జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలలో మొదటి బహుమతి వచ్చింది.

అది ఒక ధనవంతురాలైన తల్లి కాన్వెంట్ గేటు లోంచి తన బిడ్డకు అన్నం తినిపిస్తున్న దృశ్యం.

            ఆరోజు రాష్ట్రం లోని ప్రముఖ దిన పత్రికలలో సంచలన వార్త. సోషల్ మీడియా లో అత్యున్నత స్థానం లో ఉన్న ఫేస్- బుక్ నందు ఎన్నో ఫేక్ ఐ డీ లతో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని వారిని ప్రేమ పేరుతొ మోసం చేసి వారినుండి కొన్ని లక్షల రూపాయలను దోచుకుని అమెరికా పారిపోబోతున్న ఒక హైదరాబాద్ యువకుణ్ణి బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ ఆపరేషన్ సాధించడానికి ప్రభుత్వం చేత నియమింపబడి, ఈ కార్యక్రమంలో అత్యంత చురుకుగా పాల్గొని తన చాకచక్యం తో నేరస్థుడిని పట్టుకున్న పోలీసు అధికారి శ్రీనివాసరావు గారికి రాష్ట్ర ప్రభుత్వం గణ తంత్ర దినోత్సవం నాడు ఉత్తమ సేవాపురస్కారం అందజేస్తుందని ఒక అధికార ప్రకటనలో తెలియజేసింది.

కొడుకు ఫోటో ప్రచురించిన అన్ని దినపత్రికలని కొని అక్షరం అక్షరం కూడబలుక్కుని చదువుతున్న తండ్రి ని చూసి ‘’ఏమిటి నాన్న...చదవడం పూర్తిగా వచ్చేసిందా? అన్ని పేపర్లు కొనేసి చదువుతున్నావ్?’’ అంది అడిగాడు అప్పుడే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు అనే సీనుగాడు తన త్రండి సోముల్ని.

చేతిలోని దినపత్రికలన్నీ కొడుకు తలమీదుగా సీలింగుకు తగిలేలా విసిరేసి అవన్నీ అక్షతులుగా కిందకు జారిపోతుంటే కొడుకును గాఢంగా కౌగలించుకున్నాడు.

‘’ నాన్నా..మీ అమ్మ చనిపోయిందన్న నిజాన్ని దాచి పెట్టి నిన్ను కాన్వెంట్ లో చదివించే స్థోమత లేక కేవలం ప్రభుత్వ వీధి బడిలో చదివించిన నన్ను క్షమించు నాన్నా.నిన్ను అలాంటి చోట చదివించి ఉంటె నీ జీవితం ఇంకా బాగుందేమో.తప్పు చేసానేమో నాన్నా?’’ అన్న సోములు కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.

తండ్రి కన్నీళ్లు తుడిచి సోములు కాళ్ళకు నమస్కరించాడు శీను.

‘’ ఇది మీరు నన్ను ప్రభుత్వ పాఠశాలలో చదివించినందుకు సాధించిన విజయం నాన్నా.ఇదే కాదు. నేను వేసిన కొన్ని బొమ్మలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించిందంటే అదంతా నువ్వు పెట్టిన బిక్ష నాన్నా.నన్ను ఆశీర్వదించు నాన్న.’’

*****

‘’బాబూ. ఒక్కసారి మా అబ్బాయిని చూడవచ్చా?’’ తన సీట్లో కూర్చుని కొత్త కేసు ఫైల్ ను పరిశీలిస్తున్న శ్రీనివాసరావు తలెత్తాడు. ఎదురుగా ఒక తల్లి చేతిలో టిఫిన్ బాక్స్ తో...ఆమె ...ఆమె ఆనాడు కాన్వెంట్ గేటు ముందు నిలబడి గేటుకు లోపల ఉన్న కొడుక్కు అన్నం తినిపించిన తల్లి. ఆమెలో ఆ పూర్వపు భేషిజం ఎక్కడా లేదు.

అ నేరస్తుడు ఎవరో కాదు. ఆమె బ్రతిమలాడి అన్నం పెట్టిన కొడుకు.

శ్రీనివాసరావు అనుమతి తో కొడుక్కి కడుపారా అన్నం తినిపించిన ఆమె వెళ్ళిపోతూ శీను చేతిలో ఒక ఉత్తరం పెట్టి వెళ్ళిపోయింది.

శీను ఆశ్చర్యపోతూ ఆ వుత్తరం చదివాడు. అందులో ఇలా ఉంది.

‘’బాబూ,

నీకు శుభాసీస్సులు. నిన్ను కన్న తల్లి ఎంతో అదృష్టవంతురాలు. మా డబ్బున్న ఇళ్ళల్లో పిల్లలను మీ పేదోళ్ళు కన్నట్టే కంటాము. కానీ పెంపకాలలో తేడా. మీకు అన్నీ జీవిత అవసరాలు. మాకు అన్నీ అతిశయం తో కూడిన అవసరాలు. లేని భేషిజాలకు పోయి అక్రమ మార్గాలలో డబ్బు సంపాదించి ఆ డబ్బుతో పిల్లలను ప్రేమతో పెంచుతున్నాము అనే భ్రమలో వాళ్ళు అడిగిందల్లా ఇచ్చి వాళ్ళని ఇలా తయారు చెయ్యడం లో మా తల్లుల పాత్ర చాలా తక్కువ బాబు.

మా పిల్లలు బాగా చదువు కోవాలని, విదేశాల్లో ఉద్యోగాలు చెయ్యాలని, అక్కడ స్థిరపడి పది తరాలకు సరిపడా సంపాదించాలని మాత్రమె తల్లులుగా ఎక్కువశాతం మంది కోరుకుంటాం.అందుకోసం మా మగవాళ్ళు చేసే పనుల్నీ నీకు వివరించలేను.

కానీ ఒక్క మాట మాత్రం నిజం బాబు. నేను నా బిడ్డకు పెట్టిన అన్నం మాత్రం గుండెలనిండా పిల్లల పట్ల పెంచుకున్న కన్న ప్రేమతోనే బాబు. నువ్వు చిన్నప్పుడు జిల్లా స్థాయిలో పొందిన బహుమతి చిత్రాన్నీ నేను ఆనాడు దినపత్రికలో చూసాను బాబు.

ఆ చిత్రం లో తల్లిని నేనే అని తెలుసు గాని...ఆ కాన్వెంట్ గేటు నా బిడ్డకు చెరసాల అవుతుందని, ఆ గేటు లోపల ఉన్న నాకొడుకు నేరస్తుడవుతాడని గాని నేను ఊహించలేదు బాబు. అదోక్కటీ నువ్వు అర్ధం చేసుకుంటే చాలు బాబు.నీ కన్న తల్లి ప్రేమలాంటిదే ఈ కన్న తల్లి ప్రేమ కూడా అని నువ్ అర్ధం చేసుకుంటే అదే చాలు బాబు.ఉంటాను.

                                                                                       శుభాసీస్సులతో

                                                                                         ఒక అమ్మ.”

ఆ ఉత్తరం ఒకటికి పదిసార్లు చదివిన శ్రీను అంతరంగంలో సేంద్రి రూపంతో బాటు శ్రీరాముడు అన్న వాక్యం అప్రయత్నంగా అతని నోటినుంచి బయటకు వచ్చింది. దానిని ఉచ్చరిస్తూ అతను తాదాత్మయంతో కళ్ళుమూసుకున్నాడు.

‘’జననీ జన్మ భూమిశ్చ ...స్వర్గాదపీ గరీయసీ ‘’

                                                       

                                                    సమాప్తం 


Rate this content
Log in

Similar telugu story from Inspirational