Rama Seshu Nandagiri

Inspirational

4.9  

Rama Seshu Nandagiri

Inspirational

గ్రంథాలయం

గ్రంథాలయం

3 mins
34.7K



"అన్నా, సినిమా చూద్దామా." అడిగాడు రమేష్ అన్న సురేష్ ని.


" రోజూ ఇంట్లో టీ.వీ‌. లో నువ్వు చూసేవి సినిమాలే కదురా." నవ్వుతూ అన్నాడు సురేష్.


"నేను చూస్తాలే. నువ్వెప్పుడూ వర్క్ ఫ్రం హోం అని బిజీగా ఉంటున్నావు కదా, కాస్త రిలాక్స్ అవుతావేమో, నీకు నచ్చిన సినిమా పెడదామని." తనూ నవ్వుతూ అన్నాడు రమేష్.


"అలా సినిమాలు చూస్తూ కూర్చుంటావు, నీకు విసుగు అనిపించదు రా." ఆశ్చర్యంగా అడిగాడు సురేష్.


"పోనీ ఏం చేయాలి చెప్పు. ఇంట్లోఎవరూ లేరు. మనిద్దరమే ఉండేది. వంట పని చేస్తున్నాను. ఇంటి పని మనకేముంది? ఈ లాక్ డౌన్ పుణ్యమా అని కాలేజీ లేదు. నువ్వు నీ ఆఫీస్ పని లో బిజీ. నేనేం చేయాలి, సినిమాలు చూడక." అన్నాడు రమేష్ చిరాగ్గా.


రమేష్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. అన్న‌ ఆఫీస్ కి దగ్గరలో ఫ్లాట్ తీసుకుని ఉంటుంటే, తను కూడా అన్నతో పాటు ఉంటూ చదువుకుంటున్నాడు.


"అంత చిరాకు ఎందుకు? నాకు తెలుసు. మాట్లాడే వాళ్ళు లేక, మారు మనిషి కనపడక విసిగి పోతున్నావని. సినిమాలు అన్నీ చూసినవే కానీ, కొత్తగా ఏం రావట్లేదని కూడా నాకు తెలుసు. అంతగా తోచక పోతే నా రూం లో ఉన్న పుస్తకాలు తీసి చదువుకో." అన్నాడు సురేష్.


"అబ్బా, నాకు చదవడం అంటే బోర్ అన్నా. నీకు తెలుసు కదా, క్లాస్ బుక్స్ చదవడమే, తప్పనిసరిగా చదువుతాను." అన్నాడు రమేష్.


"ఏదైనా ఒకసారి చూస్తేనే కానీ తెలియదురా. సరే. నాకోసం, నీకు నచ్చిన పుస్తకం చదువు." అన్నాడు సురేష్.


"నాకు పుస్తకాలు అంటే ఇష్టం ఉండదు అంటే, ఇష్టమైనది చదవమంటావేంటి?" ఆశ్చర్యంగా అడిగాడు రమేష్.


"నువ్వు ఏ రకమైన సినిమాలు ఇష్టపడతావో, అలాంటి నవల చదవ మంటున్నాను." తెలియ చెప్పాడు సురేష్.


"ఓహ్, అదా. నాకు డిటెక్టివ్ సినిమాలు ఇష్టం." అన్నాడు రమేష్.


"అయితే ఉండు." అంటూ లోపలికి వెళ్ళి ఒక పుస్తకం తీసుకొచ్చి చేతిలో పెట్టాడు సురేష్.


"ఈ పుస్తకం నీకు నచ్చుతుంది. చదువు. ఈ రోజు నాకు శెలవు కాబట్టి, నేను వంట చేస్తాను. నువ్వు చదువుకో." అంటూ‌ వంటగది లోకి వెళ్ళాడు సురేష్.


వెళ్తూన్న అన్న వైపొకసారి చూసి, చేతిలో ఉన్న పుస్తకం తెరిచాడు రమేష్. అది మొదలు పెట్టిన దగ్గర నుంచి చాలా ఉత్కంఠగా అనిపించి ఏకబిగిన చదవడం మొదలు పెట్టాడు. అలా ఎంతసేపు చదివాడో కానీ సురేష్ వచ్చి పిలిచే సరికి తల ఎత్తాడు. 


"రెండు సార్లు వచ్చి చూశాను. చదవడంలో మునిగి పోయి ఉన్నావు. ఇప్పుడు వంట అయింది, భోజనం చేస్తావేమో నని పిలిచాను." అన్నాడు సురేష్ నవ్వుతూ.


"అన్నా, చదవడంలో ఇంత ఆనందం ఉంటుందని నాకు ఇప్పటి వరకూ తెలియదు. ఎంత బాగుందో చదువు తూంటే. అన్నా, నీ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ చదువుతాను. అన్నీ ఇలాంటివేనా." ఉత్సాహంగా అడిగాడు రమేష్.


"ఇవే కాదు. రకరకాల పుస్తకాలు ఉన్నాయి. నీకు నచ్చినవి చదువుకో. సరేనా. ప్రస్తుతం భోజనం చేద్దాం రా." అన్నాడు సురేష్.


"ఇన్నాళ్లూ నువ్వు చదువుతుంటే, నీకేం పని లేదు అనుకొనే వాడిని. ఒక్క పుస్తకం చదివే సరికి అర్థమైంది, చదవడంలో ఆనందం ఉంటుందని." అన్నాడు రమేష్.


ఇద్దరూ భోజనం చేస్తూ మాటలు సాగించారు.


"పుస్తక పఠనం చాలా మంచి అలవాటు. అయితే మంచి పుస్తకాలు ఎంచుకోవాలి. మన జ్ఞానాన్ని పెంచే పుస్తకాలు, మన వృత్తి కి సంబంధించినవి, ఆధ్యాత్మికం, ఆటలకు సంబంధించిన పుస్తకాలు, ఇలా రకరకాలుగా ఉంటాయి. అన్నీ మనం కొనుక్కో లేం కాబట్టి, మన అభిరుచికి తగినట్టుగా స్వంత గ్రంథాలయం ఇంట్లో ఏర్పరుచు కుంటాం." అన్నాడు సురేష్.


"అలా కొనుక్కో లేని వాళ్ళు గ్రంథాలయాల్లో చదువు కుంటారు, కదన్నా." అన్నాడు రమేష్.


"అక్కడ పుస్తకాలు మాత్రమే కాదు, ఉద్యోగ ప్రకటనలకు సంబంధించినవి, వార్తా పత్రికలు, అన్ని రకాలు ఉంటాయి. 

పేద విద్యార్థులకు చదువుకోడానికి వీలుగా చదువుకి సంబంధించిన పుస్తకాలు, పెద్దవాళ్ళు చదువుకొనే రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలు, అంతేకాక పిల్లలు చదివే బాల సాహిత్యం అన్నీ ఉంటాయి. అది సార్వత్రిక గ్రంథాలయం. నీకు స్కూల్, కాలేజీ గ్రంథాలయాల గురించి తెలుసుగా." అడిగాడు సురేష్.


"తెలుసు అన్నా. అక్కడ ఎక్కువగా తరగతికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. వార్తాపత్రికలు, బాలసాహిత్యం, కథల పుస్తకాలు కూడా ఉంటాయి." అన్నాడు రమేష్.


"ఇప్పుడు అర్థమైందా గ్రంథాలయాలకు ఉన్న విలువ." అడిగాడు‌ సురేష్ భోజనం పూర్తి చేసి.


"అన్నా. ఇన్నాళ్లూ గ్రంథాలయం అంటే పేద పిల్లలకు చదువు కోడానికి, కథల పుస్తకాలను చదువుకోడానికి మాత్రమే ఉపయోగ పడేది అనుకున్నా. ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థమైంది గ్రంథాలయం ఎంత ఉపయోగ కరమైనదో. పుస్తక పఠనం ఎంత విలువైనదో." అన్నాడు రమేష్.


"ఒక పుస్తకం చదివే సరికే నీకు జ్ఞానం బాగా పెరిగి పోయిందే." అన్నాడు సురేష్ నవ్వుతూ.


"అలా అని కాదు. ఇంత లోతుగా పుస్తక పఠనం గురించి, గ్రంథాలయం గురించి ఆలోచించలేదన్నా. నీతో మాట్లాడుతుంటే కెఅన్నీ అర్థమైనట్లుగా అనిపించింది." అన్నాడు రమేష్.


"అందుకే తెలియని విషయం తెలుసు కోవడానికి ప్రయత్నించాలి. చర్చిస్తేనే విషయం అవగతం అవుతుంది." అన్నాడు సురేష్ నవ్వుతూ.


"నిజమే అన్నా. ఇంకనుంచి ఏదైనా అడిగి తెలుసు కుంటాను." అన్నాడు రమేష్.


"మంచిది. క్లాస్ పుస్తకాలు, నా దగ్గర ఉన్న పుస్తకాలు చదువుతూ, మధ్యలో సినిమాలు చూస్తూ ఈ లాక్ డౌన్ టైం గడిపేయ్." అన్నాడు సురేష్, తమ్ముడి భుజం మీద ఆప్యాయంగా తడుతూ. అలాగే అన్నట్లు తలూపాడు రమేష్.














 



Rate this content
Log in

Similar telugu story from Inspirational