M.V. SWAMY

Inspirational

4  

M.V. SWAMY

Inspirational

ఏమో ఏనుగు ఎగరా వచ్చు

ఏమో ఏనుగు ఎగరా వచ్చు

2 mins
654    

           


    సీతామాలక్ష్మి అమ్మా నాన్న తమ్ముడుతో కలిసి శ్రీశైలంలో వున్న అమ్మమ్మగారింటికి వెళ్ళింది. వీళ్ళు వెళ్లిన వెంటనే మామయ్య "నల్లమల అడవుల్లో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి, శని ఆదివారాల్లో చూసి వద్దాం"అని రెండు రోజులు టూర్ కి ప్లాన్ చేసాడు, వినడమే గానీ అడవికి ఒకసారి కూడా వెళ్లని సీతామహాలక్ష్మీ నల్లమల అడవి టూర్ వార్త వినగానే ఎగిరి గెంతులేసింది.


           అనుకున్న ప్రకారమే సీతామహాలక్ష్మీ కుటుంబం, అమ్మమ్మవాళ్ళ కుటుంబం, ఇంకా కొంతమంది కలిసి నల్లమల అడవుల్లో టూర్ కి వెళ్లారు.అక్కడ అడవి అందాలను చూసి సీతామహాలక్ష్మీ ఎంతో మురిసిపోయింది. తమ్ముడు, మరికొంతమంది కజిన్స్,ఫ్రెండ్స్ తో కలిసి సీతామహాలక్ష్మీ కనిపించిన జంతువుల పేర్లు, పక్షులు పేర్లు రాయడం అనే పోటీని ప్రతిపాదించింది,లెక్కలేనన్ని జంతువులు, పక్షులు కనిపిస్తున్నాయి కాబట్టి, ఎవరు ఎక్కువ పేర్లు రాయగలరో వాళ్ళకి బహుమతి ఇస్తానని మామయ్య ప్రకటించాడు.


            సీతామహాలక్ష్మీ జంతువులు, పక్షులు పేర్లే కాదు బొమ్మలు కూడా వెయ్యడం మొదలు పెట్టింది. వాళ్ళు బస చేసిన ప్రాంతానికి దూరంగా సీతామహాలక్ష్మీ ఒక ఏనుగు పిల్లని చూసింది. ఆ ఏనుగు పిల్ల బొమ్మని వేస్తూ కాస్తా వెరాటీగా ఉంటుంది అని ఏనుగు బొమ్మకి రెక్కలు వేసింది.ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు.'ఏమో ఏనుగు ఎగరనూవచ్చు' అనే కథను రాయడం కూడా మొదలు పెట్టి, తన ఊహలకు పదును పెట్టి రంగులు అద్దింది సీతామహాలక్ష్మీ.


****     ***** ***** **** ***** ****


              ఆ రోజు రాత్రి నిజంగా రెక్కల ఏనుగు సీతామహాలక్ష్మీ ముందుకి వచ్చింది,

సీతామహాలక్ష్మీ ముందు మొకరిల్లి తన వీపు పైకి ఎక్కి కూర్చోమని సైగలు చేసింది. సీతామహాలక్ష్మీ ఏనుగుపైకి ఎక్కింది.రెక్కల ఏనుగు రివ్వుమని ఆకాశంలోకి ఎగిరింది, ముందుగా చంద్రమండలానికి చేరింది,చంద్రుడు సీతామహాలక్ష్మీ బుజ్జి బుజ్జి బుగ్గలు గిల్లి,"తల్లీ నీకు ఏమి వరం కావాలి"అని అడిగాడు."నాకు ఏమీ వద్దు కానీ చల్లని వెన్నెల,చిక్కని వెలుగులు లోకానికి ఇవ్వు చాలు"అని అంది సీతామహాలక్ష్మీ."అలాగే"అని అన్నాడు చంద్రుడు కాస్తా సందేహంగా. ఆ తరువాత రెక్కల ఏనుగు సీతామహాలక్ష్మీని నక్షత్ర మండలానికి తీసుకెళ్లింది,నక్షత్రాలు సీతామహాలక్ష్మీతో ఎన్నో ముచ్చట్లు చెప్పాయి,"మీరు ఎప్పుడూ తల తల మెరుస్తూ ఉండండి"అని చెప్పింది.నక్షత్రాలు పెదవులు విరిచి "చూద్దాం" అని అన్నాయి .ఆ తరువాత అక్కడ నుండి ఏనుగు నవగ్రహాల మండలానికి మధ్యలోకి వచ్చి ఆగింది. గ్రహాలకు దండం పెట్టి "మా భూమిని జాగ్రత్తగా చూసుకోండి"అని కోరింది సీతామహాలక్ష్మీ."తదాస్తూ..."అంటూ ఏనుగుకి ఏవేవో సైగలు చేశాయి గ్రహాలు. తెల్లవారగానే చివరగా సూర్యమండలం చేరింది రెక్కల ఏనుగు సీతామహాలక్ష్మీని తీసుకొని, సూర్యుడు సీతామహాలక్ష్మీని చూడగానే మండి పడ్డాడు."మీ మనుషుల పెంచుతున్న కాలుష్యం వల్ల విశ్వమంతా మలినమైపోతుంది. నన్నూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు మీరు"అని గద్దించాడు. రెక్కల ఏనుగు సూర్యుడు చెవిలో ఏదో చెప్పడంతో కాస్తా శాంత పడి, సీతామహాలక్ష్మీకి అతిధి మర్యాదలు చేసాడు. "ఇక ఆకాశానికి ఆవల ఉన్న స్వర్గం, నరకం, వైకుంఠం లాంటి లోకాలకు వెళదాం" అని అంది సీతామహాలక్ష్మీ. "అలాంటి లోకాలు ఏమీ లేవు, అసలు ఆకాశమే ఒక మిధ్య అది కేవలం సూన్యం మాత్రమే, స్వర్గం, నరకం, వైకుంఠం మీ చేతుల్లోనే ఉంటాయి, మీరు మంచిగా ఉంటే స్వర్గం, లేకుంటే నరకం" అని అంది ఏనుగు."అయితే ఆలస్యం చెయ్యకుండా అమ్మ దగ్గరకి తీసుకొని వెళ్లిపో అమ్మ తోడు ఉంటే అన్నీ మంచి పనులే అలవడతాయి ఆదే స్వర్గం, నువ్వు నన్నూ అమ్మని కలపడం ఆలస్యం చేస్తే అదే నరకం"అని అంది సీతామహాలక్ష్మీ నవ్వుతూ. రెక్కలు ఏనుగు ఆగమేఘాలమీద వచ్చి సీతామహాలక్ష్మీని అమ్మ ముందు ఉంచింది.

   ******    *******  *******  ******

        కథను మామయ్యకి చూపింది సీతామహాలక్ష్మీ. మామయ్య చదివి అందరికీ వినిపించి, అందరి ప్రశంసలు మధ్య సీతామహాలక్ష్మీకి బహుమతి ఇచ్చి,ఆమె కథలో చెప్పిన నైతిక బాధ్యత పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడున్న అందరి చేతా ప్రతిజ్ఞ చేయించాడు.     

         


            


               


            


Rate this content
Log in

Similar telugu story from Inspirational