Rama Seshu Nandagiri

Inspirational

4.9  

Rama Seshu Nandagiri

Inspirational

అపరిచితుడు

అపరిచితుడు

3 mins
412


"రాధీ, ఈ రోజు బైల్దేరతావు కదూ." ఆతృతగా అడిగాడు వంశీ.


"అరే, ఎందుకు తొందర! చెప్పానుగా సాయంత్రం ట్రైన్ కి వస్తున్నానని." అంది రాధిక నవ్వుతూ.


"నీకేం. అలాగే కబుర్లు చెప్తావ్. మీ ఆడాళ్ళకి, పుట్టింటికి వెళ్తే, ఇంక మొగుడు, ఇల్లు ఏం గుర్తుండవు కదూ."అన్నాడు కినుకగా.


"అబ్బో, ఇప్పుడు నీ ముఖం చూడాలి, ఎంతో ముద్దొస్తుందో."

అంది కవ్విస్తూ


"నిన్నూ..." కసిగా అని ఫక్కున నవ్వాడు.


"అదేంటి? నా మీద కోపం లేదా!" ఆశ్చర్యంగా అడిగింది.


"నీ మీదా..నాకా..నిన్నేదో ఝడిపిద్దామని.."మళ్ళీ నవ్వాడు.


"చాల్లే. నువ్వు ఝడిపిస్తే, ఝడిసి పోయి జ్వరం తెచ్చుకుంటా ననుకున్నావా. అంత లేదు." అంది కొంచం గర్వంగా


"అంతలేదని తెలుసు. కొంతైనా ఉందేమోనని... " అంటూ నవ్వాడు.


"సరే, సరే, నువ్వు ఫోన్ పెడితే నేను సర్దుకోవాలి. బై." అంది రాధిక.


"ఓకే. గెట్ రెడీ. బై." అంటూ ఫోన్ పెట్టేసాడు.


రాధిక హైదరాబాద్ లో తన భర్త ఉద్యోగరీత్యా ఉంటోంది. ఆమె అత్తవారిల్లు విజయవాడ. బంధువులింట ఫంక్షన్ ఉంటే వచ్చితర్వాత తల్లి గారింట్లో 4 రోజులు ఉండడానికి వైజాగ్ వెళ్ళింది.

ఆరోజు సాయంత్రం ట్రైన్ కి తిరుగు ప్రయాణం.


తండ్రి స్టేషన్ కి వచ్చి ట్రైన్ ఎక్కించారు. 


"జాగ్రత్త అమ్మా, డబ్బులు ఉన్నాయా, కావాలా? " అడిగారు.


"దేనికండీ డబ్బులు? అమ్మ రాత్రి కి టిఫిన్ కట్టి ఇచ్చింది. అక్కడ వంశీ వస్తారు. నాకేం అవసరం లేదు. ఎక్కువ డబ్బులు ఉంటేనే

ఇబ్బంది." అంటూ నవ్వింది రాధిక.


"సరేనమ్మా, జాగ్రత్త. వెళ్ళాక ఫోన్ చేయి. ఉంటాను." అంటూ ట్రైన్ కదిలే దాకా ఉండి వెళ్ళి పోయారు. 


తర్వాత చుట్టూ చూస్తే తన ఎదురుగా ఒక గెడ్డం ఉన్న వ్యక్తి ఉన్నాడు. బట్టలు మాసి ఉన్నాయి. చూస్తే అంత‌ మంచి భావన కలగడం లేదు. కళ్ళు మూసుకొని కూర్చుని ఉన్నాడు. 'అతనెలా ఉంటే నాకెందుకు' అన్నట్లు తల తిప్పుకొని బైటికి చూడసాగింది

రాధిక. 


ఇంతలో ఫోన్ రింగ్ కావడంతో ఫోన్ ఆన్సర్ చేసింది. వంశీ ఫోన్.


"ట్రైన్ ఎక్కాను వంశీ. స్టార్ట్ అయింది." అని చెప్పింది రాధిక.


అవతలి నుండి వంశీ ఏదో చెప్తున్నాడు. సిగ్నల్ సరిగా లేక వినబడటం లేదు. కిటికీ లో నుండి చెయ్యి బైటికి పెట్టి‌ స్పీకర్ లో

పెట్టింది రాధిక. 


"ఏంటి వంశీ." కొంచెం గట్టిగా అడిగింది. బండి చాలా స్పీడ్ గా వెళ్తోంది. అప్పుడే ఒక స్తంభం రాధిక చేతికి తగలడం, చేతిలోని

సెల్ఫోన్ జారిపోవడం ఒకేసారి జరిగాయి. రాధిక ఒక్కసారి షాక్ అయింది.


'ఇప్పుడెలా. తను ఎవరితోనూ కాంటాక్ట్ చేయలేదు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు టికెట్ చెకింగ్ కి వస్తే ఏం చేయాలి? ఫోన్ లో ఉంది కదా అని తను కాపీ తీసుకోలేదు. మరెవరికీ తన టికెట్ షేర్ చేయలేదు.' ఇదే ఆలోచనలతో సతమతమవుతూ చుట్టూ చూసింది. అటు సీట్ల లో ఎవరూ లేరు. ఎదురుగా ఉన్న వ్యక్తి పట్టించుకొనే లాగా లేడు. దిక్కు తోచని స్థితిలో అలా ఉండి పోయింది రాధిక.


ఇంతలో టికెట్ చెకింగ్ కి రానే వచ్చాడు. ఏం చెప్పాలో తోచక

చూస్తూ ఉండి పోయింది.


"టికెట్ ప్లీజ్, మిమ్మల్నే." రెండు సార్లు అడిగాడు.


"సార్, ఆవిడ మొబైల్ లో టికెట్ ఉండాలి. కానీ అనుకోకుండా చేతిలోంచి సెల్ బైట పడిపోయింది. హైదరాబాద్ దాకా ఫైన్ తో సహా ఎంతవుతుందో చెప్పండి. నేను కడతాను." అని అతను తన టికెట్ చూపించాడు.


"మీరు ఆమెకి ఏమౌతారు." రిసీట్ రాస్తూ అడిగాడు టి.టి.


"తోటి ప్రయాణీకుడిని." సౌమ్యంగా జవాబిచ్చాడు అతను.


టి.టి.ఇచ్చిన రిసీట్ తీసుకుని " చాలా థాంక్స్ అండి. నేనెవరో తెలియక పోయినా పెద్ద హెల్ప్ చేశారు. మా వారు స్టేషన్ కి వస్తారు. మీకు మనీ ఇచ్చేస్తాను." అంటూ చేతులు జోడించింది.


"ఫర్వాలేదండీ. ఇది మనిషి కి మనిషి చేసే సహాయం. మనసు లో పెట్టుకో కుండా మర్చిపోండి." అంటూ పడుకో డానికి ఉపక్రమించాడు.


రాధిక కూడా తెచ్చుకున్న టిఫిన్ తినేసి పడుకుంది. తెల్లవారాక తెలివి వచ్చి చూస్తే అతని సీట్ ఖాళీగా ఉంది. సామాను కూడా లేదు. కంగారుగా చుట్టూ చూసింది. మరొక అరగంట లో స్టేషన్ వస్తుంది. 


అతని బెర్త్ మీద తలగడ క్రింద ఒక కాగితం కనిపించింది. ఏంటని చూస్తే "నేను మీకు చేసిన సహాయం అవసరం అయిన వారికి మీరూ చేయండి. అప్పుడే మీరు నా ఋణం తీర్చినట్టు. నాకొకరు ఈ విధంగా సహాయం చేశారు. ఈరోజు నేను మీకు సహాయం చేసి నా ఋణం తీర్చు తీర్చుకున్నాను. 

                           --అపరిచితుడు. 

అని రాసి ఉంది. రాధిక అతనికి మనసులోనే కృతజ్ఞతలు తెలపుకుంది.


ఇంతలో స్టేషన్ వచ్చింది. ప్లాట్ ఫాం మీద వంశీ కంగారుగా చూస్తున్నాడు. అతను తన వైపు చూడగానే చేయి ఊపింది.

ఒక్క ఉదుటున లోపలికి వచ్చి "ఏమైంది, నీ ఫోన్ ఎంత ట్రై చేసినా కలవలేదు. ఎంత కంగారు పడ్డాను తెలుసా" అంటూ

బేగ్ అందుకొన్నాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా అనుసరించి

కార్లో కూర్చున్నాక జరిగినదంతా చెప్పింది.


"అదృష్టం. మంచి వాడు. సమయానికి సహాయం చేసాడు." అన్నాడు వంశీ.


"కానీ, అతనిని చూసిన వెంటనే నేను చాలా తప్పుగా అను కున్నాను. వేషభాషలు చూసి మను‌షుల్ని అంచనా వేయకూడదు అని తెలుసు కొన్నాను." అంది అపరాధ భావంతో.


"అయితే ఈ సారి నీ ప్రయాణం నీకు ఒక మంచి విషయం నేర్పిందన మాట." అన్నాడు వంశీ నవ్వుతూ.


"ఒకటి కాదు. ఇంకా తెల్సుకున్నాను. ఫోన్ మీద మాత్రమే ఆధారపడకుండా కానీ తీసి పెట్టుకోవాలి అని, డబ్బులు కూడా

చేతిలో పెట్టు కోవాలని. ఇంకా ఈ జీవితం లో ఎన్ని నేర్చుకోవాలో." అంది రాధిక.


"జీవితంలో ప్రతి మలుపు కొత్త పాఠం నేర్పుతుంది రాధీ. అలా నేర్చుకో గలిగితేనే ముందుకు సాగగలం." అన్నాడు వంశీ.


"నిజమే. నేర్చుకోవాలని అనుకుంటే మన జీవితం నుండి ఎన్నో నేర్చుకోవచ్చు." అంటూ తృప్తి గా అతని భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది రాధిక. వంశీ ఆమె తలపై ప్రేమగా

చుంబించాడు.  


                     ******

 



Rate this content
Log in

Similar telugu story from Inspirational