🌹 అనుమానం పెనుభూతం 🌹.
🌹 అనుమానం పెనుభూతం 🌹.
🌹 అనుమానం పెనుభూతం 🌹.
రచన :- అంజనీ గాయత్రి.
" ఎన్ని రోజులు నన్ను ఇలా అనుమానిస్తావు రమేష్? " అంటూ ప్రశ్నించింది గాయత్రి.
రమేష్ కి గాయత్రికి పెళ్లయి ఐదు సంవత్సరాలు అయింది. ముద్దులొలికే ఒక పాప కూడా వుంది వాళ్ళకి. పెళ్లయిన మొదలు గాయత్రి ఎవరితో మాట్లాడినా అనుమానమే రమేష్ కి.
ముఖ్యంగా మగాళ్లతో మాట్లాడితే ముందుగానే తిడతాడు. క్యాజువల్ గా ఎవరైనా పలకరించినా, సమాధానం చెప్పడానికి భయపడుతుంది గాయత్రి. ఎందుకంటే?? అనేకసార్లు ఇతర మగాళ్లు పలకరిస్తే సమాధానం చెప్పిందని, వాళ్ళు ఉండగా గుడ్లు ఉరుముతూ చూస్తూ, వాళ్లు లేని సందర్భంలో వాళ్లతో అలా మాట్లాడావ్ ఏంటి?? "నాకు ఇతర మగాళ్లతో మాట్లాడితే నచ్చదు, సందు దొరికింది కదా అనివాళ్ళతో భాతాఖాని వేసుకొనికూర్చుంటే , ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు , నువ్వు నోరు మూసుకుని ఉండు, అదే మంచిది మనకి," అంటూ రుసరుసలాడుతూ కోపం ప్రదర్శించాడు ఆమెపై.
అప్పటినుండి ఆమె ఏ మగాళ్ళతో మాట్లాడాలన్నా , ముఖ్యంగా రమేష్ ఎదురుగా అయితే మరీ భయపడుతుంది. ఆ రోజు ఏం గొడవ పెడతాడో ?? ఏం రాద్ధాంతం చేస్తాడో?? అనే భయంతో మాట్లాడకుండా మిన్నకుండిపోతుంది.
అనుమానం ఉన్న మగాళ్ళతో సంసారం చేయడం కష్టమే . అలాంటి కష్టాలు పగవాళ్ళకి కూడా రాకూడదని మనసులో తలచుకుంటూ కుమిలికుమిలి ఏడుస్తుంది గాయత్రి.
అదే విషయంగా ఉండబట్టలేక ఒక రోజు అడిగేసింది రమేష్ ని, " ఇలా అనుమానంతో వేధించే బదులు ఒకసారే నన్ను చంపేయొచ్చు కదా?? ఎన్ని రోజులు నన్ను అనుమానిస్తావు రమేష్? ఇలాంటి జీవితం నాకొద్దు, " అంటూ చెడామడా తిట్టి , బట్టలు, బ్యాగ్ లో మరియు సూట్ కేస్ లో సర్దుకుని ఆమె వెంట పాపను తీసుకుని పుట్టింటికి పోయింది.
ఇంక అక్కడ నుండి మొదలయ్యాయి రమేష్ కష్టాలు. ఆఫీస్ కి వెళ్లాలంటే అన్ని పనులు చేసుకునే వెళ్లాలి. ఆఫీస్ కి ఆలస్యం అయితే బాస్ చేతిలోతిట్లు తినడం , జరుగుతుండగానే ఒక రోజు రమేష్ వాళ్ళ అక్క వచ్చింది. నాలుగు రోజులు పుట్టింట్లో ఉందామని వచ్చిన ఆమె, గాయత్రి మరియు పాప లేకపోయేసరికి ఆరా తీసింది.
అక్క సుమతితో జరిగిన విషయం చెప్పాడు . రమేష్ చెప్పిన విషయం విన్న సుమతి, " నేను మీ అత్తగారింటికి వెళ్తాను , గాయత్రి తో మాట్లాడి తీసుకు వస్తాను, ఆమె వచ్చిన తర్వాత తిక్క వేషాలు వేసావంటే నాకు కుదరదు, " అంటూ తమ్ముడిని మందలించి నాలుగు తిట్లు తిట్టి, తమ్ముడు అత్తారింటికి బయలుదేరింది సుమతి.
గాయత్రి పుట్టింట్లో అడుగుపెట్టగానే , సుమతిని చూసి ఆమె తల్లిదండ్రులు మర్యాద చేసి, కూర్చునిఆమెతో మాట్లాడుతున్న సందర్భంగా కూతురు సంసారం గురించి చెప్పి బాధపడ్డారు.
"మా తమ్ముడు స్వతహాగా చెడ్డవాడు కాదు, చిన్నప్పటినుండి చాందసంగా ఆడవారితో ఎక్కువ మాట్లాడకుండా పెరిగాడు,ఆ అలవాట్లు ఒకసారే దూరం అవ్వడం కష్టం, ఆ రీత్యా గాయత్రిని అలా అనే వాడు గాని, ఆమెపై ఎటువంటి అనుమానం లేదు.అందుకే వాటి గురించి నేను మాట్లాడాను, తన పొరపాట్లు, తప్పులు ఒప్పుకున్నాడు. ఇంకెప్పుడు అలా చేయనని మాట ఇచ్చాడు . నన్ను నమ్మి మీ అమ్మాయిని మా ఇంటికి పంపండి," అంటూ గాయత్రి తల్లిదండ్రులను ప్రాధేయపడింది సుమతి.
ఆమె మాటలకు కరిగిపోయిన గాయత్రి తల్లిదండ్రులు మరియు గాయత్రి ముక్తకంఠంతో, " అతని గురించి మాకు ఎప్పుడు, మంచి అభిప్రాయమే ఉంది, అన్ని విషయాల్లో బాగా చూసేవాడు ఈ ఒక్క విషయంలో అలా ఉంటాడు , ఎందుకో?? అతనిలో మార్పు తీసుకురావాలనే ఇలా పుట్టింటికి వచ్చేసాను, మేమంతా అదే కోరుకున్నాము, " అని చెప్పారు ముగ్గురు.
అంతా మాట్లాడుకున్నాక ఆనందంగా గాయత్రిని సుమతి వెంట, రమేష్ ఇంటికి పంపించారు.
సుమతి వెంట గాయత్రి వస్తుందో, రాదో??' అన్న బెంగతో ఎదురు చూస్తూ కూర్చున్నాడు రమేష్. అల్లంత దూరంలో తనపాపతో పాటు ఇద్దరిని చూసి సంతోషంగా స్వాగతం చెప్తూ ఎదురెళ్ళాడు. నవ్వు ముఖంతో గాయత్రి ముఖంలోకి చూస్తూ ఆమె చేతులు అందుకుని, " ఇంకెప్పుడు నిన్ను అనుమానించే విధంగా మాట్లాడను,గాయత్రి! నన్ను నమ్ము!" అంటూ ప్రేమగా ఆమె చేతులు అందుకుని తడుముతూ చెప్పడంతోపాటు పాపని ఎత్తుకొని ముద్దులు కురిపిస్తూ,' మిమ్మల్నిఇద్దరినీ వదిలి నేను ఉండలేను ' అంటూ గాయత్రి తో చెప్పాడు.
' మీపై నాకు ఎలాంటి కోపం లేదు, మీరు మారాలనే కోపంతో మా ఇంటికి వెళ్లాను, నన్ను క్షమించండి" అంటూ అతని గుండెల పై వాలిపోయింది. ప్రేమగా ఆమె తల నిమురుతూ గాఢంగా ఆమెను హృదయానికి హత్తుకున్నాడు. ఇద్దరినీ చూసి మురిసిపోయింది సుమతి.
అనుమానం పెనుభూతం అన్నట్లుగా, అనుమానం వల్లే సంసారాలు విచ్చిన్నమవుతాయి. ఈ జీవిత సత్యం తెలుసుకున్న వాళ్ళు సజావుగా సంసారాలు సాగిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.
