అంజనమ్మ యొక్క నిస్వార్థ భక్తి
అంజనమ్మ యొక్క నిస్వార్థ భక్తి
అంజని, అందరు ప్రేమతో పిలిచే అంజనమ్మ, హనుమంతుడి మహాభక్తురాలు. ఆమె ఇల్లంతా హనుమంతుడి చిత్రాలతో నిండి ఉంటుంది. ప్రతిరోజూ ఆమె హనుమాన్ చలీసా, స్తోత్రాలతో దైవిక చింతనలో తలమునకలై ఉంటుంది. హనుమంతుడిని ఆమె దేవుడిగా కాదు, తన ఇల్లు మొత్తం కాపాడుతున్న ప్రియమైన వ్యక్తిగా భావిస్తుంది. ఆ పరిసర ప్రాంతంలో ఉన్న కోతులలో కూడా ఆమె హనుమంతుడినే చూస్తూ వాటికి భక్తితో ఆహారం పెడుతుంది.
ఈ విధంగా ఆమె భక్తి పట్ల హనుమంతుడు మిక్కిలి సంతోషించు తో, ఆమె భక్తిని పరీక్షించాలని నిర్ణయిస్తాడు.
ఒక రోజు, ఒక కోతి ఆమె వంటింట్లోకి చేరి, పాత్రలు అటూ ఇటూ పడేసి గందరగోళం సృష్టిస్తుంది. అన్నం, పప్పు అంతా చెల్లాచెదురుగా పడి ఇంటి మొత్తం అసహ్యంగా మారుతుంది. కానీ అంజనమ్మ కోపగించకుండా నవ్వుతూ, "ఇది ఆ హనుమంతుని లీలలే" అనుకుంటూ హనుమాన్ చలీసా జపిస్తూ, శుభ్రం చేయడం ప్రారంభిస్తుంది.
కొన్ని రోజులు గడిచే కొద్దీ, అంజనమ్మ కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారుతాయి . ఆలోచించకుండానే భర్తకు ఉద్యోగం పోయి కుటుంబం ఆదాయం లేకుండా పోతుంది. అయినప్పటికీ ఆమె భక్తి దృఢంగా ఉండి, ప్రతిరోజూ తన పూజలో మునిగిపోతుంది.
ఒక రోజు రాత్రి, తన కొడుకు హాస్టల్ నుండి ఇంటికి వస్తాడు. ఆయన కోసం పప్పు అన్నం వండి పెడుతుంది. అప్పుడే మరో కోతి లోపలికి వచ్చి మొత్తం భోజనం తీసుకొని వెళ్ళిపోతుంది, కేవలం కొద్దిగా అన్నం మాత్రమే వదిలిపెడుతుంది. అయినా తల్లి ఎలాంటి విచారం లేకుండా కొడుకుకు ఆ కొద్దిగా మిగిలిపోయిన అన్నం వండి పెడుతుంది, తాను మాత్రం కేవలం ఒక గ్లాసు నీరు తాగి, హనుమాన్ చలీసా జపిస్తూ నిద్రపోతుంది.
ఇది చూసి హనుమంతుడు ఆమె భక్తికి ఒక తుది పరీక్ష వేయాలని భావిస్తాడు.
ఒక ఉదయం, అంజనమ్మకు తన కొడుకు కాలేజీ నుండి ఒక కబురు వస్తుంది. అతను చాలా అస్వస్థతతో ఉన్నాడని, ఆహారం, పండ్లు కూడా తినలేదని చెబుతారు. ఆందోళనకు గురైన ఆమె రెండు కమల పండ్లు, ఒక సేపు ను పొరుగింటి వారి నుండి అరువుగా తెచ్చుకొని తన కొడుకును చూడటానికి బస్సులో ప్రయాణం ప్రారంభిస్తుంది. ప్రయాణంలో మరో కోతి హఠాత్తుగా బస్సులోకి దూకి ఆ పండ్లన్నీ ఆమె నుండి తీసుకొని వెళ్ళిపోతుంది. తన కొడుకుకు ఏమీ తీసుకురాలేదనే విచారం తట్టుకోలేకపోయినా, ఆమె హనుమాన్ చలీసా జపించడం ఆపదు.
తన కొడుకు దగ్గరకు చేరుకునే క్రమంలో, *నేను విఫల తల్లి, నా కొడుకుకి ఏమీ చేయలేకపోతున్నాను* అని బాధతో ఆలోచిస్తూ ముందుకు నడుస్తుంది.
కాలేజీకి చేరుకున్న తర్వాత, తాను ఉన్న స్థితిని గమనించిన విద్యాసంస్థ అధికారవర్గాల్లో ఒక అధికారి ఆమె వద్దకు వచ్చి కొన్ని పండ్లు అందిస్తూ, “తల్లి ప్రేమే అన్ని మందులతో కూడిన ఔషధం. ఈ పండ్లు మీ కొడుకుకి మీ చేతుల మీదుగా ఇవ్వండి, తల్లి ప్రేమతో తినిస్తేనే అతనికి మరింత బలం వస్తుంది” అని అంటాడు. ఇది వినగానే అంజనమ్మ అతనికి ఎంతో కృతజ్ఞత తెలుపుతూ, కొత్త ఉత్సాహంతో పండ్లు తీసుకుని తన కొడుకుకి అందిస్తుంది.
ఈ సంఘటనలు చూస్తూ హనుమంతుడు ఎంతో ఆనందంతో అంజనమ్మను ఆశీర్వదిస్తాడు. దివ్య కృపతో ఆమె కుటుంబం సుఖసంపదలతో పెరుగుతుంది.
పరిశీలన
ఒక దేవుడిని అంతగా ఆరాధించడం అవసరమా?
దైవం మానవుడి రూపం లో అంజనమ్మకు సహాయ పడిందా?
లేదా
తన బిడ్డకు ఫలాలు తీసుకెళ్లాలి, తను ఆహారం తీసుకొని మళ్ళీ ఆరోగ్యంగా నిలకడగా ఉండాలి అనే అంజనమ్మ సంకల్పం గొప్పదా?
అంజనమ్మ నమ్మకం కష్టాలను అధిగమించే శక్తిని కలిగించిందా?
లేదా
మానవతా విలువలు నిజమైన ప్రపంచంలో తమ స్థానం కోల్పోయాయా?
పాఠకుల మదిలో మెదిలే ఇలాంటి ప్రశ్నలకు, జవాబులు ఎన్నెన్నో ......
కథ సారాంశం:
ఎలాంటి కష్టకాలంలో అయినా , ఆధ్యాత్మిక నమ్మకం గాని, భక్తి నమ్మకం గాని, లేదా స్వీయ నమ్మకం గాని, అచంచలమైన విశ్వాసం, సానుకూల భావనతో కలిపి నమ్మినప్పుడు దైవకృపను ఆకర్షిస్తుంది.
నిజమైన విశ్వాసం పరీక్షించబడుతుంది, కాని పవిత్ర హృదయంతో ఆ విశ్వాసాన్ని ఉంచుకునే వారికి, ఆ విశ్వాసంలో ఉండే దివ్య కృపను అనుభవించగలరు.
*ముగింపు*
