Soudamini S

Drama

4.8  

Soudamini S

Drama

ఆకాశ హర్మ్యం లో ఆశ

ఆకాశ హర్మ్యం లో ఆశ

5 mins
727


ఉరుము శబ్దానికి ఒక్క సారి గా మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూశాను. ఒక్క సారి ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. చుట్టూ చీకటి గా ఉంది. చీకటి ని చీల్చుకుంటూ మధ్య మధ్యలో మెరుపులు కనిపిస్తున్నాయి. వేగం గా కొట్టుకుంటున్ననా గుండె చప్పుడుకు ఇంకా భయం ఎక్కువ అవుతోంది. ఒళ్ళంతా చెమటలు పట్టి ఉంది. అలసట తో నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియదు. అంతలో లైట్ వెలిగింది. కళ్ళు చిట్లించుకొని చూసిన నాకు అప్పుడు ఎక్కడ ఉన్నానో గుర్తుకొచ్చింది... హోటల్ మెట్ల మీద ఉన్నాను. టైమ్ చూశాను. రాత్రి పది గంటలు. రేపు పొద్దున్న కాన్ఫరెన్స్ ప్రెసెంటేషన్ ఎనిమిది గంటలకు. ఇది నా కెరీర్ కి చాలా important. అసలు నేను ఇక్కడి నుండి బయట పడ గలనా? నా పక్కన చిన్న కిటికీ లో నుండి చూశాను. బయట కుండపోతలు గా వర్షం పడుతోంది. మధ్య మధ్య మెరుపుల కాంతి లో ఆకాశ హర్మ్యాలు మెరుస్తున్నాయి. 

హోటల్ కి వచ్చీ రాంగానే మెట్ల మీద ఇలా ఇరుక్కు పోయాను ఏమిటో.. అది చాలదన్నట్లు వెంటనే కరెంట్ పోవటం ఏమిటో.. ఏమి చేయలేని నిస్సహాయత లో నిద్ర పోవటానికి ప్రయత్నించాను. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కాదా, ఇక్కడే ఎమర్జెన్సీ అయ్యేలా ఉంది. సరే, ఇప్పుడు జరగాల్సింది చూడాలి - ఇప్పుడు నేను ఇక్కడి నుండి బయట పడే దారి ఏది? లేచి మరలా తలుపు తీసే ప్రయత్నం చేశాను. ఉహూ తెరుచుకోలేదు. ఒక పక్క కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఎప్పుడో ఫ్లయిట్ లో తిన్నఆకులు, కూరలు, పళ్ళు – అవైతే తినగలిగాను కానీ మల్లె పూల వాసన వచ్చే రైస్ ఏంటది జాస్మిన్ రైస్, అదే తినలేక పోయాను. ఆకలి అనగానే అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ ఉంటే అసలు ఆకలి అవనిస్తుందా? ఇందుకే కాబోలు అమ్మ నన్ను పంపను గాక పంపను అంది – “ఆడపిల్ల, మొదటి సారి వేరే దేశం ఒంటరి గానా?”, ససేమీర అంది. అప్పుడు నాన్న అమ్మకి ఏమి చెప్పారు, “దాన్ని దాని కళ్ళతో ప్రపంచాన్ని చూడనీ, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే ప్రపంచం ఎలా అర్థమవుతుంది” అని. అప్పుడు పొంగి పోయాను కదూ, ఇప్పుడు చూడు ఈ ప్రపంచం లోకి వచ్చి పడ్డాను. అమ్మ కి నా ముఖం ఎలా చూపించను? అసలు చూపించ గలనా లేదా..

నాలుగు గంటల క్రితం:


అది షాంఘై విమానాశ్రయం. అది నా మొదటి విదేశీ ప్రయాణం. విమానం దిగగానే మొదటి సారి వేరే లోకం లోకి అడుగు పెట్టినట్లు వింత అనుభూతి. బహుశా కౌరవులు మయ సభ లో అడుగు పెట్టినప్పుడు కూడా ఇలానే అనుకొని ఉంటారు. లగేజి తీసుకొని బయటకు వచ్చి ఎగ్జిట్ దగ్గరకు వెళ్ళి క్యాబ్ కోసం వెతుకుతున్నాను. అది పసిగట్టాడేమో అన్నట్లు సన్నగా, తెల్ల గా ఉన్న చైనీస్ అతను నా దగ్గరకు వచ్చి పలకరించి స్టీరింగ్ తిప్పినట్లు సైగ చేసి “క్యాబ్” అన్నాడు. అవునన్నట్లు తల ఊపి అతన్ని అనుసరించాను. ముందే చైనీస్ లో రాసుకొన్న హోటల్ అడ్రసు చూపించాను Grand Hyatt Shanghai 上海君凯悦. 550 యువాన్ అని రిసీట్ చూపించాడు. 5500 రూపాయాలా అని ఆశ్ఛర్యపోయాను. వేరే దారి లేక డ్రైవరు ని అనుసరించాను.


బయట సన్న గా వాన తుప్పర పడుతోంది. హ్యాండ్ బాగ్ నెత్తి మీద పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ ఎక్కాను. కారు కదిలిన తరువాత తడిసిన కారు అద్దాల మధ్య నుండి ఆ మహా నగరాన్ని చూశాను. వెళ్తున్న కొద్ది వాన పెరుగుతూ ఉంది. అసలే ట్రాఫిక్, ఇంకా వాన తోడు అయ్యేసరికి కార్ నెమ్మదిగా వెళ్తోంది. ఒక గంటన్నర సేపు అలా వెళ్ళిన తరువాత ఒక చిన్న నది, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాలు కనిపించాయి. అప్పుడే వెలుగుతున్న దీపాల మధ్య ఆ నగరం ముస్తాబైన పెళ్లి కూతురులా అందం గా ఉంది. షాంఘై చైనా కి ఆర్థిక రాజధాని. అందుకని దారిలో స్టాక్ ఎక్స్ఛేంజి కూడా కనిపించింది. ఒకొక్క ఆకాశ హర్మ్యం మీద శిఖరం ఒకొక్క రకమైన ఆకారం లో వుంది. ఆకాశ హర్మ్యాలు అన్నీ కిరీటాలు పెట్టుకొని విశ్వ సుందరి బిరుదు కోసం జాబిల్లి ని అందుకొనటానికి పోటీ పడుతున్న సుందరీమణు లు లాగా ఉన్నాయి. నేను ఫ్యాషన్ డిజైనర్ ని కదా, ప్రపంచం అంతా ఆ కోణం లోనే కనిపిస్తుందిలే అనుకొన్నాను. అక్కడే హోటల్ గ్రాండ్ hyatt ముందు క్యాబ్ ఆగింది. డ్రైవరు లగేజి కింద పెట్టి చైనీస్ లో ఏదో అన్నాడు, అది అర్థం కాలేదు కానీ మధ్యలో "టిప్" అన్న మాట వినిపించింది. అర్థం కానట్లే నటించాను.


వర్తమానం :

కొద్ది సేపటి ముందు కిరీటాలు పెట్టుకుని విశ్వ సుందరి కోసం పోటీ పడుతున్నట్లు ఉన్న ఆ ఆకాశ హర్మ్యాలు ఇప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకున్న బ్రహ్మ రాక్షసులు లాగా కనిపిస్తున్నాయి...

ఇంతలో నాకు ఏదో తెలియని మొండి ధైర్యం వచ్చింది. వడి వడి గా ఆలోచించడం మొదలు పెట్టాను. నేను ఉన్నజిన్ మిన్ టవర్ ఎత్తు 88 అంతస్తులు. అందులో హోటల్ 56-85 అంతస్తుల మధ్యలో ఉంది. నేను ఉన్నది 70 అంతస్థులో. అంటే ఇంకా 14 అంతస్తులు దిగితే రిసెప్షన్ ఫ్లోర్ వస్తుంది. అక్కడ ఏదైనా ఉపాయం దొరకచ్చు. నాలో ఆశ నిదుర లేచింది. గబ గబా మెట్లు దిగటం మొదలు పెట్టాను. అంతలో కనిపించింది ఒక ఆశా కిరణం.


అక్కడ కనిపించింది ఒక లాండ్లైన్ ఫోన్. రిసెప్షన్ నెంబర్ 9 అయి ఉండచ్చు అని 9 డైల్ చేశాను. అవతల నుండి సమాధానం లేదు. 8,7,.. చివరకు 2 డైల్ చేయగానే అవతల నుండి గొంతు వినిపించింది. “I am stuck in the stairs near 56th floor” అని చెప్పాను. అవతల నుండి సమాధానం లేదు. ఫోన్ లో శబ్దం ఆగిపోయింది. వచ్చినప్పటి నుండి ఇదే బాధ. వీళ్ళకి ఇంగ్షీషు అస్సలు అర్థం కాదు. సైగలు చేసి చేసి ప్రాణం పోతోంది. ఇప్పుడు ఫోన్ లో సైగలు ఎలా చేసేది? రొట్టె విరిగి రాతి యుగం లో పడ్డట్లు ఉంది నా పరిస్థితి. ఇంక మళ్ళీ డైల్ చేయడం ప్రారంభించాను. ఎవరూ ఎత్తట్లేదు. సరే రిసెప్షన్ దొరకకపోతే హోటల్ లో ఈ అంతస్థులో ఉన్న వారు అందరికీ కాల్ చేద్దాం, ఎవరైనా ఒకరకి నా ఇంగ్షీషు అర్థం కాక పోతుందా అనుకుంటున్నాను... 


అంతలో ఎవరో తలుపు తీసిన శబ్దం. సెక్యూరిటీ తలుపు తియ్యగానే, నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్క ఉడుటన పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళాను. నా ఇంగ్షీషు అర్థం కాకపోయినా నా ఎమోషన్ అర్థం అయినట్లు ఉంది, ఏదో ఒకటి మొత్తానికి బయట పడ్డాను.  బయటకు రాగానే పక్కనున్న బోర్డు చూశాను “స్టాఫ్ ఎంట్రీ” అని రాసి ఉంది. మరి పైన ఫ్లోర్ లో ఈ బోర్డు లేదే అని కోపం వచ్చింది.   అదే వేరే చోట అయితే తిట్టేసే దాన్ని. ఇక్కడ మామూలు మాటలే వీళ్ళకి అర్థం కావట్లేదు, ఇంక తిట్లు ఏమి అర్ధం అవుతాయి ?  రిసెప్షన్ వద్దకు వెళ్ళి రూమ్ కీ ఫర్ 7006, “I lost the key” అన్నాను. రిసెప్షన్ అమ్మాయి కీ ఇచ్చింది. రూమ్ లోనికి వెళ్ళి మంచం మీద వాలిపోయాను. ఇన్ని గంటల నుండి పడిన నరక యాతన కి తెర పడింది. ఒక పది నిమిషాల అలా పడుకొన్న తరువాత కీ మీద ఉన్న వైఫై పాస్వర్డ్ తో ఫోన్ లో వైఫై కనెక్ట్ చేసి నాన్న కు కాల్ చేశాను.


నాన్న గొంతు వినగానే ఒక్క సారి దుఖం ఉప్పొంగి వచ్చింది. “ఏమయ్యిందే కన్నా” అని బుజ్జగిస్తూ అన్నారు నాన్న. “నాన్నా, నీకు తెలుసా,  నేను హోటల్ బిల్డింగ్ మెట్ల మధ్య రెండు గంటల నుండి ఇరుక్కు పోయాను ”. అని జరిగినదంతా వివరించాను దుఃఖాన్ని అపుకుంటూ. 

“అమ్మ తో మాట్లాడాలంటే భయం గా వుంది ” అన్నాను బింకం గా.

అమ్మ బయట నుంచి వచ్చాక నేను చెప్తానులే, అయినా అమ్మ ఏమంటుంది, ఏమి అనదు” అని భరోసా ఇచ్చారు నాన్న.

 “అది సరే , అలా ఎలా ఇరుక్కుపోయావు?” అని అడిగారు నాన్న.

“రూమ్ లో లగేజి పెట్ట గానే మంచి నీళ్ళ కోసం బయటకు వచ్చాను, కీ రూమ్ లో ఉండి పోయి లాక్ పడింది. లిఫ్ట్ ఏమో కీ లేక పోతే పని చేయదు, ఇంక చేసేది లేక రిసెప్షన్ కి వెళ్దామని మెట్లు దగ్గరకి వెళ్లానో లేదో, ఆ తలుపు మూసుకు పోయింది.” అని వివరించాను.

పోనీలే ఇప్పటి కైనా బయట పడ్డావుగా" అన్నారు నాన్న ఊపిరి పీల్చుకుంటూ. 

“ఈ ప్లేస్ నాకు నచ్చలేదు -ఏది సరిగ్గా లేదు, ఒక్కడికి కూడా ఇంగ్లీషు సరిగ్గా అర్థం కాదు”  

“ఇంక నేను ఎప్పుడూ ఒంటరి గా ప్రయాణం చేయను గాక చేయను” అన్నాను మారాం చేస్తూ.


దానికి నాన్న చెప్పిన సమాధానం నాకు ఇంకా చెవుల్లో రింగు మంటూనే ఉంది.

“జీవితం లో మనకు వచ్చిన కష్ట నష్టాల నించే కదా పాఠాలు నేర్చుకునేది. ప్రమాదం వస్తుందని ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటే అనుభవాలు ఎలా వస్తాయి? ఈ అనుభవం తో నువ్వు రేపు ఇంకా పెద్ద సమస్యలనే అధిగమించగలవు, అయితే ఈ సారి చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడు. సరే, ఇదేదీ రేపు నీ ప్రెసెంటేషన్ మీద ప్రభావం పడకుండా చూసుకో”.


మారునాడు Artificial Intelligence on Fashion and Textile International Conference లో గ్రాసిమ్ కంపెనీ తరఫున మన భారతీయ linen దుస్తుల డిజైన్ మీద నేను ఇచ్చిన ప్రెజెన్టేషన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రోజు కలిగిన ఆనందం, మన భారత దేశ గొప్పదనాన్ని అంతర్జాతీయ వేదిక మీద నిలబెట్టాననన్న గర్వం, ముందు రోజు భయాన్నిపూర్తి గా పారద్రోలాయి .

 తిరుగు ప్రయాణం లో ఫ్లయిట్ లో నా పక్కన ఒక భారతీయురాలు కూర్చుంది. “hi, my name is miss asha” అని పరిచయం చేసుకొన్నాను. దానికి ఆమె “good to meet you, నా పేరు రాజి, నేను నిన్న కాన్ఫరెన్స్ లో మీ ప్రెజెన్టేషన్ చూశాను, I like it” అంది.


Rate this content
Log in

Similar telugu story from Drama