పూల నవ్వులో ప్రేమ
పూల నవ్వులో ప్రేమ
రాజ్యాన్ని విస్తరించి మట్టిని కరడు గట్టించి
మొక్కకో అపార్టుమెంటు అంటూ, చూరుకు వేళ్లాడేసేవు
రెక్కవిచ్చుకున్న పక్షిని పంజరాన బంధించి
మమతల గూటికి దూరం చేసేవు
అద్దాలకొలనులో వయ్యారి చేపల చేర్చి
ముదముతీర మునకలేసే మొప్పలు విరిచేశావు
అమ్మపాలు గరిటెడైన దూడను తాపనీవు
వేకువఝామునే వొడలు విరిచి రక్తం పిండేస్తావు
మచ్చికపేరుతో పులినే పిల్లిని చేసి
రింగు మాస్టరునంటూ హంగులెన్నో చేస్తావు
దున్నపోతు,కోడెద్దుల కొమ్మునీ వదలవీవు
పండుగ సందు చేసి,కొమ్ములొంచే బడి పెడతావు
నిటారుగా పెరుగుతున్న నేలమ్మ, గిరుల చెట్లను
నిట్టనిలువుగా నరికి నట్టింట సోకు చేస్తావు
కళ్ళు కుట్టి,దురద పుట్టి-పక్కింటి చెట్టు ఒళ్ళు వంచి,
పరమేశ్వరుడు పూజకంటూ..గజదొంగవి నీవౌతావు
ఆనక కొంగ జపాన,పూలకన్నెను సంధికి పంపి
పుణ్యాల రాశులకు,గొప్పింటి మేడలకు అర్జీలు పెడతావు
ఇంతటి ఘనకార్యాన ,ఒక్క పొరైన ప్రేమ లేని
మనసది నీది, పూలలో దాగే ప్రేమ వెతుకును చూడు!?
ఆహా!ఏమా చిత్రము,మా ఇంటికి వస్తే తెచ్చేదేమి
మీ ఇంటికొస్తే ఇచ్చేదేమని,
రెండువైపులా నీకత్తికి ఉందోయ్ పదును
చూడకుందుడా!?పైవాడు కుంచంనింపి చేస్తాడు చదును
ఏమి ఇస్తే అదే తీసుకుంటావీ జగాన
ఎలా ఉండాలో తెలుసుకు బ్రతుకు,నయానా భయానా
లేకుంటే పూర్తిగా జరుగు భగవంతుని ఆభయానా.....
