కళ్ళలో స్వప్నం
కళ్ళలో స్వప్నం
ఎన్నో ఏళ్ళు గడిచిపోతున్నాయి
మూసిన కళ్ళలో స్వప్నం నిలవడం లేదు
తీయని సమ్మేళనంలో రాత్రి కవిత గానం
నడిరేయి సందేశం శాశ్వతంగా గీతంగా నిలిచింది..
చీకటి పూసుకున్న ఆకాశం నవ్వింది
పున్నమి వెన్నెలను మాఘం మింగింది
కనుపాపలో బింబం మెరుస్తూంది
జామురాత్రి కోర్కె చుక్కలో జారుకుంది...
నీటి గ్రహం కన్నీటిలో కనిపిస్తుంటే
కలిసి మనసులు సముద్రంలా ఎగుస్తున్నాయి
రెక్కలు లేని అలలు ఆకాశం వైపు చూస్తుంటే
భూమిని బ్రద్దలు కొట్టినట్లు కనబడుతోంది...
ఎక్కడ పుట్టిందో చలి తుఫాను
వణికిస్తోంది తనువునంతా తల్లడిల్లేలా
కాలపు కంబడి చాలడం లేదు మనిషికి
రుతువుల బడిలో చేరి కూర్చొన్నాడు ఇప్పటికీ..
దూరంగా వెళ్ళమని చెప్పుతుంది కాలం
కనుబొమ్మల మధ్యలో సూర్యోదయంలా
ప్రసరించే సూర్యకిరణాలు ప్రాకుతుంటే
మధురమైన జ్ఞాపకాల్ని వెంట పంపుతుంది...
కలసిరాని సమయం వెకిలి నవ్వులు చేసే
విడదీసే బంధం ప్రేగు పోగుల అల్లికలు వేసే
ప్రతి నిమిషం విషం నిండిన చూపులే
మనసు దహించే మారణహోమం చేస్తుంది ..
కొలను లాంటి మనసులో సుడిగుండాలు
విసిరే రాళ్ళను పువ్వులుగా మార్చుకోలేకపోతే
గుండెలోన పొంగుతున్న కన్నీళ్ల సుడిగాలి
ఎన్నో మబ్బుల నీళ్ళను నిత్యం ధారపోస్తుందో.

