కానీ లేని కంటి చుక్క
కానీ లేని కంటి చుక్క
కానలేని కంటిచుక్క..ఘోషనేల పలుకను..!?
పాడలేని విరహానికి..స్వరములేల కూర్చను..!?
ఎంతచిత్రమీ కాలం..నీవులేక సాగును..
స్థంభించిన మానసమును..ఇప్పుడేల కదపను..!?
మాటాడని చీకటియే..ఆటలాడు చున్నది..
మధురమైన వేదనకో..రూపమేల ఇవ్వను..!?
జ్ఞాపకాల గొడవలేదు..మరపు దరికి చేరదు..
అక్షరాల చిత్రాలకు..కోటలేల కట్టను..!?
వేయదగిన తలుపులేవి..ఈతలపుల ఇంటికి..
నీప్రేమను గాకుండా..గజళ్ళేల వ్రాయను..!?
ముచ్చటించు అద్దమల్లె..ఎదుటినుండి కదలవు..
నీనవ్వుల పూలుగాక..తోటలేల కోరను..!?