గుండెలో
గుండెలో
చూపలేని గాయమొకటి..నేస్తమైనది గుండెలో..!
నీ నవ్వుల పూలకత్తి..గుచ్చుకున్నది గుండెలో..!
వలపువీణ సంగతులకు..తనువు పులకలెత్తేనే..
నీ చూపుల వెన్నెలేమొ..పరచుకున్నది గుండెలో..!
నిను తాకిన లేతగాలి..ఇటుగ వచ్చి వెళ్ళెనేమొ..
ఎంత మధుర భావనమో..అల్లుకున్నది గుండెలో..!
తలపుమాటు గంధమేమొ..పలుకుతేనె వర్షమాయె..
పాడరాని రాగమొకటి..మ్రోగుతున్నది గుండెలో..!
దివ్య పారిజాతరాశి..అనుగ్రహమే ఈ జన్మకు..
చెలిమినిధీ పరిమళాలు..నింపుతున్నది గుండెలో..!
నీతోడే గాక అసలు..స్వర్గమేది మనసా..
దిక్కులేని ఆశ ఒకటి..నలుగుతున్నది గుండెలో..!