వర్షం నా నేస్తం
వర్షం నా నేస్తం
నేను ప్రేమిస్తున్న అమ్మాయికి నా మనసులో మాట చెప్పబోతున్నాను. తనూ నేను ఒకే కాలేజీలో చదువుకున్నాము. ఇప్పుడు మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. ఆరు సంవత్సరాల నుండి పరిచయం ఉంది మా ఇద్దరికి. తను అంటే నాకు ఎప్పటి నుండో ఇష్టం కానీ తన మనసులో ఏముందో నాకు తెలియదు. చెప్తే తను నా నుండి పూర్తిగా దూరం అవుతుందేమో అని భయంతో చెప్పలేదు. కానీ ఈరోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా. తను నా దగ్గరికి వస్తుంటే ఎప్పటిలానే గుండె వేగం పెరిగింది. వళ్ళంతా చమటలు పడుతున్నాయి. మాట తడబడుతూ ఉంది. తను ఎదురుగా వచ్చి నిలబడింది. "ఎదో విషయం చెప్తాను రమ్మన్నావు. ఏంటీ?" అని అడిగింది. "అది..." నేను చెప్పబోతూంటే వర్షం మొదలు అయింది.
తడవకుండా చెట్టు కిందకి వెళ్ళబోతున్న తన చేయి పట్టుకొని ఆపాను. పుట్టినప్పటి నుండి నాకు నా నేస్తం వర్షంతో ఉన్న అనుబంధం ఒక్కసారిగా కళ్ల ముందు కనిపించింది.
నా జీవితంలో జరిగిన ప్రతీ సంతోష క్షణంలో వర్షం ఉంది. నేను పుట్టినప్పుడు కూడా వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాయి అట. అలా ప్రతీ అనుభవం నన్ను వర్షాన్ని బాగా దగ్గర చేసాయి.
నేను బడిలో చేరిన మొదటి రోజు ఏడుస్తూ వెళ్లాను. బడి దగ్గరికి వెళ్లగానే వర్షం మొదలు అయింది. అప్పటిదాకా ఏడుస్తున్న నేను ఒక్కసారిగా ఏడుపు ఆపేశాను. ఎందుకో తెలియదు, ఇప్పటికి కూడా.
మొదటిసారి నేను తనని మా కాలేజీలోనే చూసాను వర్శంలో. చెప్పాను కదా ప్రతీ విషయంలో వర్షం వెంటే ఉంటుంది. అప్పటివరకు ఎవరిని చూసినా కలగని అనుభూతి మొదటిసారి తనని చూసినప్పుడు కలిగింది. తనతో పరిచయం అయ్యిన కొద్ది రోజులకి తెలిసింది ఆ అనుభూతిని ప్రేమ అంటారు అని. ఎన్నోసార్లు తనతో చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. ఈరోజు ధైర్యం చేస్తున్నాను.
తన చేయి పట్టుకోగానే తను నావైపు అలాగే చూస్తు ఉంది. మా మనసులోని భావాలకి మాటలు అవసరం లేదు అని అప్పుడే అర్థం అయింది. వర్షంలో తడుస్తూ అలాగే ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాము.
ఇంతకీ మా పేర్లు చెప్పలేదు కదూ. నా పేరు ఆకాశ్ తన పేరు అవని. అంటే నింగి నేల. నింగి నేల కలవవూ అంటారు కానీ వాటిని కలిపేది వర్షం. మా ఇద్దరినీ కలిపింది ప్రేమ అనే వర్షం.

