వినూత్న దీపావళి
వినూత్న దీపావళి
కథలోకి వెళ్లే ముందు నా మనసులొ వున్న మాటలు మీతో పంచుకోవాలని అనిపించింది.పండుగ ఇంక పబ్బాలు మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం జరుపుకుని బంధువులు స్నేహితులు మరియు కుటుంబంతో గడిపితే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు కదా.కాని కొంత మందికి ఈ అవకాశం ఉండకపోవచ్చు, కారణాలు అనేకం ఉంటాయి. వారిని తలుచుకుంటే మనసు వికలం అవుతుంది.ఈ కథ అలాంటి ఒక సంఘటన గురించే కథ చదివి మీ అభిప్రాయం పంపించండి మరి. దీప ఓక అందమైన యువతి .బాగా చదువుకున్న అమ్మాయి.ఆమె ఎప్పుడూ తన పధ్ధతిలో తనదయిన రీతిలో జీవించడం ఇష్ట పడుతుంది.ఆమె ఒక మంచి కంపెనీలో చాలా మంచి జీతం సంపాదించుకుని తనకి ఇష్టమైన రీతిలో కర్చు చేసుకుంటూ ఆనందంగా ఉంటోంది.అవును మరి 23 ఏళ్ళకే ఓక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది కదా.పైగా.ఇంటికి డబ్బు పంపించనవసరం లేదు కూడా.కారణం ఆమె పరివారం పేరు మోసిన ధనవంతులు.ఇంక ఆమె ఉద్యోగం తన ఇంట్రెస్ట్ కొద్ది చేస్తోంది.సరే, ఇదీ విషయం.దీప తన ఉద్యోగం చాలా సిన్సియర్గా చేసుకుని ఆ వచ్చిన జీతంతో తనకు నచ్చిన విదంగా ఖర్చు చేసి సుఖంగా ఉంది. మరి కొద్ది రోజుల్లో దీపావళి పండుగ రానే వచ్చింది. దీప తన స్నేహితురాలు బిందుతొ కలిసి సమయం దొరికినప్పుడల్లా బట్టలు, వాటికి తగ్గ యాక్ససరీలు తెగ కొంది. అ శొపింగ్ అంతా అయ్యాక సడెన్గా దీపకి ఓక పని గుర్తుకొచ్చింది.అది ఏమిటంటే మట్టి ప్రమిదలు కొనడం.మరి దీపావళి పండుగ అప్పుడు ఎన్ని ప్రమిదలు వెలిగించి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఇంటి ముంగిట వుంటే అంత ఆనందంగా వుంటుంది కదా.సిరుల తల్లి మహాలక్ష్మి దేవిని ఆరాధించి ఇంటిలోకి ఆహ్వానం పలుకుతూ వుండటానికి ఇంత కన్నా సంతృప్తి నిచ్చే పద్దతి మరొకటి లేదు. దీప ఆమె స్నేహితురాలు బిందు శొపింగ్ మోల్కి ఆనుకుని వున్న మార్కెట్లోకి వెళ్ళారు. ముందుకి నడవగానే ప్రమిదలు అమ్ముతూ ఒక అవ్వ కనిపించింది.ఆమె బుట్ట నిండా మట్టి ప్రమిదలు పెట్టుకుని ఎవరయినా కొనుగోలు చేస్తారా అని ఆశగా చూస్తూ వుంది.దిపకి ఇదొక మంచి అవకాశం అని అనిపించింది.అవును మరి తక్కువ ధరకు బోలెడు ప్రమిదలు కొనుక్కుని దీపాలు వెలిగించి సంబరం చేసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఆ ముసలి అవ్వ దగ్గరకి వెళ్లింది.బిందు కూడాను.దీపని చూసి అవ్వ సంతోషంగా అడిగింది "అమ్మా ఎన్ని ప్రమిదలు ఇవ్వను?" ఆమె మొహంలో ఆశ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది."ముందు రేటు చెప్పు అవ్వ" అంది దీప."ఐదు రూపాయలకి రెండు ప్రమిదలు అమ్ముతున్నాను అమ్మగారు" అంది అవ్వ."అంత ఖరీదే? చాలా ఎక్కువ రేటు చెపుతున్నారు అంది దీప".బిందు "పర్వాలేదు తీసుకుందాం' అన్నా దీప వినలేదు సరి కదా "నువ్వు ఊరుకో ఇంకా తక్కువ ధరకు ఇస్తుంది లే చూసావు కదా అవ్వ దగ్గర ఎవరూ కొనటం లేదు.మనం అడిగిన రేటుకే ఇస్తుంది" అని అంది. బిందుకి మనసులో అలా చేస్తే బాగుండదు అని వున్నా దీప తన మాట వినదు అని తెలుసు కాబట్టి ఊరుకుంది. మొత్తానికి దీప అవ్వ దగ్గర బోలెడంత బేరం ఆడి తక్కువ ధరకు బోలెడు ప్రమిదలు కొనుక్కుని ఆనందంగా ఇంటికి బయలుదేరింది. ఇద్దరికీ ఆకలి దంచుతూ వుంది.కొంచం దూరంలో ఒక మంచి రెస్టారెంట్ వుందని వాళ్లకు తెలుసు.కాకపొతే ఆ రెస్టారెంట్లో భోజనం చాలా కాస్ట్ల అని కూడా తెలుసు.వడి వడిగా నడిచి రెస్టారెంట్లో కి వెళ్లారు.జనం బాగానే ఉన్నారు.కొంత సేపు వెయిట్ చేసాక ఓక టేబుల్ ఖాళీ అయింది.వైటర్ వచ్చి చెప్పాడు.కావలసిన అన్ని ఐటమ్లు ఆర్డర్ ఇచ్చి దీప ఇంక బిందు శొపింగ్ గురించి, పండుగ గురించి ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ వైట్ చేస్తున్నారు. "అమ్మ నేను ఈ సారి దీపావళికి అస్సలు టపాకాయలు కొనుగోలు చెయ్యను.నేను నా ఫ్రెండ్స్ అందరూ ఇలా డిసైడ్ చేసుకున్నాం" ఈ మాటలు దీప ఇంక బిందు కూర్చుని వున్న వెనుక సీట్ నుంచి వీళ్ళకి వినిపిస్తున్నాయి.గొంతుకుని బట్టి మాట్లాడే వ్యక్తి ఒక యుక్త వయస్సు బాలుడు ఇంక అతని తల్లి అని వీళ్ళకి అర్థం అయ్యింది.ఆ మాటలు విని ఆ పిల్ల వాడి తల్లి "అదేమిటి మొన్నటిదాకా ఎంతో ఉత్సాహంగా ఎన్నో రకాల ప్లాన్స్ వేసి ఇలా డిసైడ్ చేసుకున్నావు?నీకు దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం ఇంక సరదా కదా?"ఆ ప్రశ్నకి ఆ కుర్రాడు చెప్పిన సమాధానం విని దీప ఇంక బిందు ఆశ్చర్యపోయి ఆలోచనల్లోకి వెళ్లిపో వలసి వచ్చింది.ఆ కుర్రాడి ఉద్దేశం అంత బావుంది మరి.ఈ లొపల వైటర్ ఇచ్చిన ఆర్డర్ బట్టి ఫుడ్ ఐటమ్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు.ఆ కుర్రాడు అన్న మాటల ప్రకారం పండుగ ఘనంగా జరుపుకోవడం పెద్ద గొప్ప ఏమీ కాదు,ఆ పండుగ సందర్భంగా మనకి తగినంత లొ వేరే వాళ్ళకి ఆనందం పంచాలి. అదీ అసలు పండుగ అని అన్నాడు.ఆ కుర్రాడు ఇంకా మాట్లాడుతూ అన్నాడు,"అమ్మ, నేను మార్కెట్లోకి వెళ్లి నాకు దీపావళి పండుగ సందర్భంగా తాతగారు ఇంక నాన్నగారు ఇచ్చిన డబ్బులతో బేరం ఆడకుండా ముగ్గు రాళ్ళని, ప్రమిదలను, పువ్వులు, పళ్ళు ఇలా అన్ని కొన్నాను.ఇదీ మరీ అంత గొప్ప పనేమీ కాదు కానీ, అవి అమ్మి, జీవితం గడిపే వారికి మనం కొంత చేయూతనిచ్చి వాళ్ళ కళ్ళలో కొంత కాంతి చూసాం చూడు, ఆది అసలు దీపావళి పండుగ "అని అన్నాడు.ఆ మాటలు విని దీప ఇంక బిందు ఉలిక్కి పడ్డారు.మార్కెట్లొ అవ్వ దగ్గర బోలెడంత బేరం ఆడి ప్రమిదలు కొనడం ఎంత తప్పో అర్థం అయ్యింది.తమ కంటే వయసులో చాలా చిన్నవాడు అయినా ఎంతో గొప్ప ఉద్దేశం ఉన్న కుర్రాడు మంచి సందేశం ఇచ్చి వాళ్ళ కళ్ళు తెరిపించాడని ఆనుకుని , వెనుక సీట్ లో వున్న కుర్రాడికి థ్యాంక్స్ చెప్పి వడి వడిగా వెళ్ళారు. అవును మీరు అనుకున్నట్టు గానే ఇద్దరూ మార్కెట్ లోకి వెళ్లి అస్సలు బేరం ఆడకుండా ప్రమిదలు, పువ్వులు, పళ్ళు వగైరా కొని సంతోషంగా ఇంటికి వెళ్లారు.మీలొ కొందరు అనుకోవచ్చు మరీ చోద్యం కాకపోతే ఇది కూడా ఒక గొప్ప పనేనా అని, చేసి చూడండి మీకే తెలుస్తుంది.ఇంతకి ఆ కుర్రాడికి వీళ్ళు థాంక్స్ ఎందుకు చెప్పారో తెలియదు పాపం. పోనీ లెండి కనీసం ఇద్దరి ఆలోచనా విధానం లో మంచి మార్పు జరిగినది కదా?
