శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

విన్నపం

విన్నపం

4 mins
337


           " విన్నపం " 

            ‎-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


     కావ్య తన తల్లికి ఒంట్లో బాగోకపోవడంతో పుట్టింటికి వచ్చినప్పటినుంచీ...తల్లి పరిస్థితి తల్చుకుని ఏవేవో ఆలోచనలు మనసులో ప్రయాణిస్తూనే ఉన్నాయి. కన్న బిడ్డలు ఉండగా అమ్మను ఆవిధంగా దూరంగా ఉంచాలను కోవడం ఎంతవరకూ న్యాయమో అర్థం కావడం లేదు. కొన్ని ఆలోచనలు మనసుని నొప్పిస్తుంటే...మరికొన్ని సంతోషంతో మనసుని తడిపేస్తున్నాయి. తోడబుట్టిన వాడి పరిస్థితిని అర్థం చేసుకుని తాను సహకరిస్తే ఇది పెద్ద సమస్యే కాదు. కన్న కూతురుగా తనతల్లి ఋణం తీర్చుకోవాలన్న ఆలోచనే తనకు న్యాయమనిపించింది. ఆ తపనతో...ఆ విషయాన్ని భర్తకు ఎలా చెప్తే బాగుంటుందో ఆలోచించి మాట్లాడాలి అనుకుంది. కొన్ని మాటల్లో చెప్పేకంటే...రాతల్లో చెప్తే మనసుని హత్తుకుంటాయన్నది తనకు బాగా తెలుసు. తాను చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్పడానికి కాగితం,కలం అందుకుంది....!

           ‎

     ప్రియమైన మీకు,

    ఇలా మిమ్మల్ని సంభోదిస్తూ మీకు ఉత్తరం రాసి చాలా రోజులైపోయింది కదూ...! అవును మరి అందరి చేతుల్లోకి మొబైల్ ఫోన్లు వచ్చేసాయి కదా. ఏ విషయం మాట్లాడుకోవాలనుకున్నా... నిమిషాల్లో మాట్లాడేసుకుని నిర్ణయాలు తీసేసుకుంటున్నాం. ఆలోచిస్తే అది తొందరపాటే. కొన్ని కొన్ని విషయాలు రాతలతో వివరించిన లేఖలను కళ్ళతో చదివాక బాగా అర్థం చేసుకుని... సమయం తీసుకుని చెప్పే సమాధానాలే సరైనవని నా అభిప్రాయం. అందుకే ఇది ఫోన్లో అడిగే విషయం కాదనిపించింది.ఫోన్ చేసి అడిగినా నామాట పూర్తి కాకముందే ..మీరు తిరస్కరిస్తే నేను చెప్పాలనుకున్న విషయం చెప్పలేక పోవచ్చు.అందుకే... మీ ఎదురుగా అడగలేక ఈలేఖ ద్వారా నావేదనని అక్షరాల్లో నింపుకుని మీముందుంచాలనే నాప్రయత్నం.దయచేసి అర్థం చేసుకుంటారు కదూ...!


     ‎ మా అమ్మకు ఒంట్లో బాగోలేదని చూడ్డానికి మా పుట్టింటికి వచ్చినప్పటినుంచీ ...నాలో ఏవేవో ఆలోచనలు. నా మనసంతా ఎంతో గుబులు గా ఉంది. ఎవరితోనూ చెప్పుకోలేని నిస్సహాయత. మీతో చెప్పినా అర్థం చేసుకుంటారా అనే సందిగ్థత.


    ‎ మన కుటుంబంలో మీరు,నేను,మీ అమ్మగారు, మనిద్దరి పిల్లలు. ఈ ముప్పై సంవత్సారాలు ఎంతో హాయిగా గడిపేసాము. పిల్లలకు కూడా పెళ్లిళ్లు అయి ఉద్యోగరీత్యా దూరంగా వెళ్లిపోయారు.ఈమధ్య మీ అమ్మగారు కాలం చేసినప్పటినుంచీ మనిల్లెంత బోసిపోయిందో కదా...!      నాకొస్తున్న ఫీలింగ్ తో మీరు కూడా తరచూ అంటూనే వుంటున్నారు.ఇంట్లో పెద్దవాళ్లంటూ కనుమరుగైతే ఆఇల్లు ఇల్లే కాదని. నిజమే.. ఆవిడున్నంత కాలం చూడటానికి వచ్చే బంధుమిత్రులతో ఇల్లెంతో కళకళ లాడుతూ ఉండేది. ఆ వేడుక పెద్దవాళ్ళు ఇంట్లోఉన్నంత వరకే.  ఇప్పుడు మనింట్లో ఏ సందడీ లేకేమో నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి...!


    ‎ మీ అమ్మ గారు ఈ మూడేళ్లు మంచంపట్టి ఎంత బాధపడ్డారో మీకూ నాకూ మాత్రమే బాగా తెలుసు. ఆవిడకి ఎలాంటి ఇబ్బందీ రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటూనే వచ్చాం.ఎంతైనా ఆరోగ్యం చెడితే మన చేతుల్లో ఏం లేదు. ఎవరి బాధా మనం తీసుకునేది కాదుగా. వారి బాధ వారు అనుభవిస్తూ పోవాల్సిందే. మనకు తోచిన ఆసరా వారికిస్తూ ప్రేమగా మాట్లాడుతూ సమయానికి మందులు, ఆహారం ఇవ్వడమే ఆసమయంలో మనం చేయగల సేవ. ఇలాంటి సేవ చేసే అదృష్టం నాకు రాసున్నందుకేనేమో...నేను ఎంప్లాయిగా కాకుండా గృహిణిగా ఉంటూ...ఇంటి బాధ్యతలు సంతోషంగా చేయగలిగాను. మీ అమ్మగారి చివరిచూపు వరకూ ఆవిడకు తోడుగా వుండే భాగ్యం నాకే దక్కింది. అప్పట్లో అప్పుడప్పుడు కొంచెం విసుగనిపించినా... ఇప్పుడు ఆలోచిస్తే ...ఆ కొంచెం మాత్రం ఎందుకు విసుకున్నానా అని నామీద నాకే చిరాకేస్తుంది. మనిషి వున్నప్పుడు కంటే... మనిషిపోయాకా ఆవిడ విలువ ఎక్కువైంది. నిజం చెప్పాలంటే మాఅమ్మ దగ్గర పెరిగిన రోజుల కంటే...పెళ్లై వచ్చాకా మీ అమ్మ గారి దగ్గరే ఎక్కువ రోజులు గడిపాను. అందుకేనేమో మీ అమ్మగార్ని అసలు మరచిలేకపోతున్నాను. 

    ‎

   ఇప్పుడు నాకు మా అమ్మ గురించి కూడా ఆలోచనలు మనసుని ముసిరేస్తున్నాయి. దాదాపు మా అమ్మకి కూడా మీ అమ్మ గారి వయసే. అమ్మ ఒంట్లో కూడా ఏపనీ చేసుకోలేని నిస్సత్తువ వచ్చేసింది. తమ్ముడు, మరదలు ఇద్దరూ కూడా ఉద్యోగాలకు పోయేవాళ్ళు. ఉదయం పోయి రాత్రయ్యే వరకు రారు. ఉన్న ఇద్దరి పిల్లల్ని హాస్టల్ లో వేసి చదివిస్తున్న సంగతి మీకూ తెలుసు. ఒంట్లో బాగుండని మాఅమ్మని ఇంటిపట్టున ఉండి కనిపెట్టుకునే మనుష్యులు ఎవరూ లేక... ఒకవేళ జీతానికి ఎవరినైనా పెట్టుకోవాలనే ఆలోచన వున్నా ...ఎవరో తెలియని వ్యక్తులకి ఇల్లు అప్పగించే ధైర్యం లేక ఎటూ తేల్చుకోలేని సమస్యతో... చేసేదిలేక మా అమ్మను హోల్డ్ ఏజ్ హోంలో జాయిన్ చేయాలనుకుంటున్నామని తమ్ముడు నాతో చెప్పినప్పటినుంచీ నా మనసు మనసులో లేదు. 

    

    ‎తమ్ముడు పరిస్థితులను బట్టి వారు అమ్మను హోమ్లో జాయిన్ చేస్తే ... బంధువులంతా తప్పుగా భావించి తల్లిని పట్టించుకోకుండా హోమ్ లో పడేశారంటూ చెవులు కొరుక్కుంటారే గానీ ... వీరి పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోరు. అమ్మ కూడా ఒకవిధంగా బాధ పడుతుంది.


    ‎అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను.ఇంట్లో నేనిప్పుడు ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి.. నన్ను కన్న అమ్మకు నేనే అమ్మనై స్వయంగా నాచేతులతో ఈ చివరిరోజుల్లో అయినా సేవ చేసుకోవాలనిపిస్తుంది. తల్లి కొడుకు దగ్గరే ఉండాలని అనాదిగా ఆచరిస్తూ వస్తున్నాం. తల్లి పిల్లలెవరికైనా అమ్మే...!ఇలాంటి పరిస్థితి వస్తే ఆతల్లి కన్న పిల్లలెవరైనా సరే ఆమె బాధ్యత తీసుకోవడంలో తప్పులేదుగా. కొడుగ్గా తమ్ముడు అమ్మని ఈ వయసులో చూసుకోవాల్సిన విధంగా చూసుకోలేక పోతున్నాడు గనుక కూతురుగా నేనే అమ్మను చూసుకోవాలనుకుంటున్నాను. నన్ను కనకపోయినా మీ అమ్మగార్ని కూతురుగానే చూసుకున్నాను. అలాంటప్పుడు నన్ను కని పెంచిన అమ్మను నేను చూసుకోలేకపోతే నా ఈ జన్మకు అర్థం లేదనిపిస్తుంది.


   పెళ్లయ్యాక అత్తింటికి వచ్చేసాక ..మా పుట్టింట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనసులోనే పెట్టుకున్నాను గానీ ... వాటికి పరిష్కారం చూడండని నేను మిమ్మల్ని ఏనాడూ కోరకపోవడానికి కారణం అత్తింట్లో నేనూ,మావాళ్ళు చులకనవ్వకూడదనే. వయసైపోతున్న మా అమ్మకు ఇప్పుడైనా నాకేదో చేయాలని మనసు కొట్టుకుంటుంది. మా అమ్మను మనింటికి తీసుకొస్తే...ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారన్న తృప్తి మనకీ వస్తుంది. 

    

    ‎ కొడుకుని వదిలి కూతురు ఇంటికి రావడం అమ్మకి మొహమాటం గా ఉండొచ్చు. వాళ్ళు బాగా చూసుకోడం లేదనే నేను ఈనిర్ణయం తీసుకున్నానని తమ్ముడు కూడా నన్ను అపార్థం చేసుకోవచ్చు. ఇలా ఆలోచిస్తూ పోతే ... మధ్యలో అవస్థ పడేది అమ్మే కదా.


    ‎మా అమ్మగారిని మీ అమ్మగారి స్థానంలో తీసుకెళ్తున్నా అని మీరే అమ్మకీ, తమ్ముడుకూ నచ్చచెప్పాలి. ఇంతకీ మా అమ్మని తీసుకురావడం మీకు ఇష్టమో కాదో... మిమ్మల్ని అడగకుండానే నేనీ నిర్ణయం తీసేసుకున్నాను. అందుకే మీ ఎదురుగా అడగలేక...ఎంతో కూడబలుక్కుని నాకోరికను ఈఅక్షరాల్లో అల్లుతున్నాను. కాదనరు కదూ...!


   మా అమ్మ ఉన్న పరిస్థితిని బాగా ఆలోచించండి. ఈవయసులోనే వారి ఆఖరి క్షణం వరకూ కన్నవాళ్ళు దగ్గరుంటే తృప్తిగా కళ్ళు మూస్తారు. మన పెద్దవాళ్లకు సేవ చేసే భాగ్యం మనకు దొరికినప్పుడు మనం మన అదృష్టంగా భావించాలి. నాకు తట్టిన ఈ ఆలోచన మీకూ సరైనదనే భావిస్తారని...నా మనసును నొప్పించే విధంగా మీరు కాదనరనే నమ్మకంతో ఆలోచించి అడుగుతున్నాను. 


   వీలుచూసుకుని మీరు మా ఊరు వస్తే... అమ్మను ఒక వారం రోజుల్లో మనింటికి తీసుకెళ్లిపోవచ్చు. మీ రాకకోసం నేను ఎదురుచూస్తూ వుంటాను.  


                         ఇట్లు

                         మీ కావ్య


  సరైన ఆలోచనతో భర్తకు ఉత్తరం రాసాకా గానీ.. తన ఆలోచనలు వదలలేదు. తృప్తిగా గాలి పీల్చుకుని... భర్తకు ఈ మెయిల్ చేసింది. 


   మెయిల్ లో భార్య అక్షరబద్దం చేసిన భార్య మనసును అర్థం చేసుకున్నాడు కావ్య భర్త. నిజమే కదా...ఇన్నాళ్లూ నాకీ ఆలోచన ఎందుకు రాలేదో...? అప్పటివరకూ తనకు రాని ఆ ఆలోచనకు సిగ్గుగా అనిపించినా...భార్య మనసుతో తానూ మనస్ఫూర్తిగా ఏకీభవించాడు.


   వెంటనే ఫోనందుకుని...భార్యకు ఫోన్ చేసాడు. 

   "హలో కావ్యా...నేను బయలుదేరి వచ్చేస్తున్నా. మీ అమ్మగారి బట్టలు సర్ది ఉంచు" అంటూ చెప్తున్న భర్త మాటలు ఎంతో తీయగా వినిపిస్తున్నాయి కావ్యకు...!*


       ******    *******  ********

   


   

                        



Rate this content
Log in

Similar telugu story from Inspirational