STORYMIRROR

sesi saradi

Drama Inspirational

4  

sesi saradi

Drama Inspirational

వెండి వెన్నెల

వెండి వెన్నెల

20 mins
41

                      వెండి వెన్నెల


                                        శశి సారది


రోజూ లాగే రాత్రి పడుకునే ముందు కూతురు వెండి వెన్నెల గది లోకి వెళ్ళింది పూర్ణిమ. అప్పటికింకా చదువుకుంటుంది వెండి . తల్లిని చూడగానే 'అమ్మా రేపు తొందరగా లేపు . నీకు తెలుసు కదా కాలేజీలో డిబేట్స్ జరుగుతున్నాయి . నేను అన్నింటిలో పాల్గొంటున్నాను '.ఆ విషయం పూర్ణిమకు తెలుసు. పోటీలకు తయారవ్వడానికి తల్లి సహాయం తీసుకుంది వెండి. 'అలాగేలే ! చాలా టైం అయ్యింది . ఇంక పడుకో ' అని చెప్పి వెళ్తున్న తల్లితో , ' అమ్మా , నాన్నకు నేను త్వరగా వెళ్తానని చెప్పకు . తనే దింపుతానని అంటారు .నా ఫ్రెండ్ శాండీ వస్తుంది. తనతో కలిసి వెళ్తాను. నాన్నకు ఇబ్బంది ఎందుకు ? అదీ కాక ,అంటూ ఆగింది . ' ఏంటి?' అన్న పూర్ణిమ ప్రశ్నకు ' నాన్న చాలా స్లో గా డ్రైవ్ చేస్తారమ్మా ! నా ఫ్రెండ్స్ అందరు మన కారుకు ఎడ్ల బండి అని పేరు పెట్టారు తెలుసా ?వెండి మాటలకు పూర్ణిమ చాలా బాధపడింది. ఈ మాట తెలిస్తే భర్త మనసు ఎంత గాయపడుతుందో ఆమెకు తెలుసు .


వెండి ఎందుకిలా ప్రవర్తిస్తుంది ? నా పెంపకం లోనే ఏదైనా లోపం ఉండి ఉంటుంది . అని ఆలోచిస్తూ పడక గది లోకి వెళ్ళింది . అప్పటికే చంద్రం నిద్రపోతున్నాడు . మనసు నిర్మలంగా ఉన్న వారే ఇంత ప్రశాంతంగా నిద్రపోగలరు . అనుకుంది పూర్ణిమ . చంద్రం అనే అతను లేకపోతే పూర్ణిమ మనుగడే లేదు . అలాగే చంద్రం , పూర్ణిమ లేకపోతే వెండి వెన్నల ఉనికే లేదు కదా ! ఈ సంగతి వెండికి అర్ధం అయ్యేలా ఎలా చెప్పాలి? అనుకుంది పూర్ణిమ .


భర్తకి దుప్పటి సరిగ్గా కప్పి , తను కూడా పడుకుంది పూర్ణిమ కానీ ఎంతకూ నిద్ర పట్టలేదు . చంద్రాన్ని మొదటిసారి చూసిన రోజుల గుర్తుకు వచ్చాయి . అప్పట్లో పూర్ణిమకు ఇంచుమించు ఇప్పటి వెండి వయసే ఉంటుందేమో ! కానీ డీగ్రీ ఆఖరు సంవత్సరం వరకూ అతనితో మాట్లాడనే లేదు .ఈరోజు ఎందుకో పూర్ణిమకు ఆ రోజులు బాగా గుర్తుకు వస్తున్నాయి . అన్ని నిన్ననే జరిగినంత స్పష్టంగా కళ్ళ ముందు కదలాడాయి .

ముందుగా చంద్రంతో ' నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ' అని చెప్పిన సంఘటన గుర్తుకు వచ్చింది . అంత ధైర్యం ఎలా వచ్చింది ? ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది పూర్ణిమ కు. కానీ ఆ ధైర్యం వాళ్ళ జీవితాలను పూర్తిగా మార్చిందనే చెప్పవచ్చు .


డిగ్రీ ఆఖరు సంవత్సరం చదువు తున్నప్పటి పూర్ణిమను ఒక సారి చూసి వద్దాము. కాలేజీలో ఆఖరు సంవత్సరం చదువుతుండగా ఇక కాలేజీకి రావడానికి అవ్వదని బెంగ పడని విద్యార్థులు చాలా అరుదుగా ఉంటారు .

అక్కడితో వాళ్ళ స్వేచ్ఛాయుత జీవితానికి తెర పడుతుందనే చెప్పవచ్చు . పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయి . ఇక ప్రేపరేషన్ హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు . కాలేజీకి కొద్దిరోజులే నడుస్తుంది . అందరు విద్యార్థుల లాగే పూర్ణిమ కు కూడా ఆమె చదివే కాలేజీపై ఎనలేని మమకారం .కానీ ఇప్పుడు పూర్ణిమ బాధపడేది మాత్రం కాలేజీ ఎదురుగా ఉండే టెలిఫోన్ బూత్ చూసే అవకాశం ఇంక ఎప్పటికీ ఇంక ఉండదనే ! ఏ పని చేస్తున్నా ఆ విషయమే ఆలోచిస్తుంది ఆమె .


పూర్ణిమ మనసులో ఇంత అలజడి కి కారణం _ ఆ టెలిఫోన్ బూత్ నడిపే చంద్రం అని పిలవబడే చంద్రశేఖర్ అనే యువకుడు . ఒక మనిషికి ఇంకో మనిషితో అనుబంధం ఎందుకు పెనవేసుకుంటుందో ఎవరికీ అర్ధం కాని విప్పలేని ఒక చిక్కు ముడి .

అతనితో పరిచయం లేకపోయినా , కాలేజీలో చేరిన దగ్గరనుంచీ అతన్ని చూస్తుంది పూర్ణిమ ఆ షాపులో మొదట్లో లోకల్ కాల్ తర్వాత ఎస్ టి డి మాత్రం ఉండేవి . ఈ ఐదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి . ఇప్పుడక్కడ స్టేషనరీ , గిఫ్ట్ ఆర్టికల్స్ , తినుబండారాల పేకెట్లు , అన్ని దిన వార , మాస పత్రికలు దొరుకుతాయి . కానీ పూర్ణిమ ఎప్పుడూ అక్కడ ఏమీ కొనలేదు .దానికి పూర్ణిమ సహజ బిడియంతో పాటు ఆర్ధిక ఇబ్బందులు ఒక ముఖ్య కారణము .


పూర్ణిమ మధ్య తరగతి కంటే దిగువ స్థాయి నుంచి వచ్చిన అమ్మాయి .చిన్నప్పటి నుంచి అన్నింటికి సర్డుకు గుణం అలవడింది . మామూలుగా అయితే బట్టల దుకాణం లో పనిచేసే తండ్రి జీతంతో సంసార రధం సజావుగా సాగి ఉండేదేమో ! ఎందుకంటే పూర్ణిమతో బాటు ఆమె తమ్ముడొక్కడే అతని సంతానం .కానీ అతని చెల్లెళ్ళ పురుళ్ళు వాళ్లకి పెట్టే చీర సారెలతో , సగం జీతం షాపు లోనే కట్ అయ్యేది . అయినా అతనెప్పుడూ బాధ పడినట్లు కనిపించే వాడు కాదు . పైగా కొడుకు సతీష్ తో ' అక్కనెప్పుడూ జాగర్తగా చూసుకోవాలి . ఆడపిల్ల ఎప్పుడూ కన్నీరు పెట్టుకోకూడదు . అనేవాడు . అలాగే రోజూ పొద్దున్న లెగిసిన దగ్గరనుంచీ , రాత్రి పడుకునే వరకూ ఎవ్వరినీ పల్లెత్తు మాట అనకుండా , సంసారాన్ని సజావుగా నడపడానికి తల్లి పడే శ్రమ , పూర్ణిమ మనసు మీద పసితనం నుంచే ప్రగాఢమైన ముద్ర వేసింది .తనకు తోచిన చిన్న చిన్న సాయం చెయ్యడంతో బాటూ , ఏదైనా కావాలని పట్టు పట్టకుండా ఉండడం కూడా ఊహ తెలిసిన దగ్గరనుంచీ అలవాటు చేసుకుంది .అందరూ బాల్ పెన్నులు జెల్ పెన్నులు వాడే రోజుల్లో కూడా రీఫిల్స్ కొనలేక ఇంకు పెన్నుతోనే కాలక్షేపం చేస్తుంది . కాలేజీలో అందరూ ఆమెనొక బుధావతారం గా చూసినా , ' ఇంకు పెన్నుతో చేతి వ్రాత బాగా వస్తుంది ' అని సమాధానం చేప్తుంది . అలాంటి పూర్ణిమ

 ప్రేమలో పడింద.


ఎలా అతనికి ఈ సంగతి చెప్పడం ? ఒకవేళ చెప్తే అతను ఆ విషయం ఎలా తీసుకుంటాడు ? పరి పరి విధాల ఆలోచిస్తుంది ఆమె మనసు ఆరు నెలల క్రితం ఒకరోజుబాగా వర్షంలో గొడుగులేక , నీళ్లు కారుతున్న బస్టాపులో నిలబడ్డ పూర్ణిమను , ' ఇలా వచ్చి కూర్చోండి ' అని ఆహ్వానించాడు చంద్రం . అప్పుడే అతన్ని దగ్గరగా చూసింది . ఆ తర్వాత అతను తన వేపు చూడడం చాలా సార్లు గమనించింది పూర్ణిమ . కానీ మళ్ళీ ఎప్పుడూ దగ్గరగా వెళ్ళనూ లేదు , మాట్లాడనూ లేదు .


కాలేజికి వెళ్లడానికన్నట్టు తయారవుతున్న పూర్ణిమ తో , వాళ్ళమ్మ సావిత్రి , ఏంటమ్మా ఈరోజు ఆదివారం కదా ' అని అడిగింది . ' ఈ రోజు స్పెషల్ క్లాస్ ఉందమ్మా ' అన్న సమాధానం విని , అయ్యో నిన్న రాత్రి చెప్పాల్సింది . త్వరగా భోజనం పెట్టేద్దామని టిఫినేమి చెయ్యలేదే , బాధపడుతూ అంటున్న ఆవిడతో , ' ఎంతమ్మా , ఒక్క గంటే భోజనం టైమ్ కి వచ్చేస్తాను ' అంటూ బయలుదేరింది .


కాలేజి దగ్గర పడుతుంటే గుండెల్లో ఒకటే దడ ఇంత ధైర్యం ఎలా చేస్తుంది ? అతనేమనుకుంటాడు , తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ? పరి పరి ఆలోచనల మధ్య కాలేజీ రానే వచ్చింది .బస్సు దిగి నెమ్మదిగా అడుగులు వేస్తూ , ఇప్పటికైనా మించి పోయింది లేదు . వెనక్కి వెళ్లిపోవచ్చుఅనుకుంది . అయినా ఏదో అదృశ్య హస్తం నడిపిస్తున్నట్టు ముందుకే వెళ్ళింది . షాపులో కూర్చున్న చంద్రం , షాపు వేపు వస్తున్న పూర్ణిమను ఆశ్చర్యంగా చూసాడు . రోజూ పొద్దున్న నుంచి రాత్రి వరకూ కాలేజీ ఎదురుగా కూర్చునే అతనికి ఎవరెవరు ఏ క్లాసులో ఉన్నారో వాళ్ళ టైమింగ్స్ అన్నీ తెలుసు . ' ఇప్పుడీఅమ్మాయి ఎందుకొస్తుంది బహుశా కాలేజీ లో పనేమైనా ఉందేమో ! అనుకున్నాడు . కానీ ఆదివారం ఎవ్వరూ రారు . ఈ రోజు బేరాలు కూడా పల్చగానే ఉంటాయి .


పూర్ణిమ షాపు వరకూ వచ్చింది కానీ అక్కడే నిలబడి పోయింది . ఏం మాట్లాడాలో , ఏం చెయ్యాలో తెలియడం లేదు .తీరా ఇక్కడి వరకూ వచ్చాక , ఆమె చేస్తున్న పని ఆమెకే ఆశ్చర్యం అనిపించింది . ఆమెను చూసి అతనే బయటకు వచ్చాడు , ' ఏం కావాలండీ ' అంటూ . ఈ అమ్మాయి ఎప్పుడూ ఏమీ కొనలేదు. ఇప్పుడు కాలేజీకి శెలవని మర్చిపోయి వచ్చిందేమో , పాపం ! అనుకున్నాడు .చాలా మొహమాటంగా ' మీతో కొంచెం మాట్లాడాలి ' అని మాత్రం అన గలిగింది .ఆ మాటకి అతను ఆశ్చర్యపోయాడు . స్టూలు ముందుకు జరుపుతూ ' కూర్చోండి ' అన్నాడు .చున్నీ తో ముఖం ఒకసారి తుడుచుకొని ఎదురుగా కూర్చున్న అతనిని చూస్తూ , ' నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను . పరీక్షలు అయ్యాక ఇంక ఇటువైపు రాను ' , అంటూ మొదలుపెట్టింది .కుతూహలంగా వింటున్న అతను భయంగా , బేలగా తన వేపు చూస్తున్న ఆమెను చూసి , ' ఎందుకివన్నీ చెప్తుంది , బహుశా పర్సు పారేసు కుందేమో . తిరిగి వెళ్ళడానికి డబ్బు లేదేమో , అలా అడగలేక ఇవన్నీ చెప్తుంది . అనుకొని , ' అయితే ' అన్నాడు నవ్వుతూ .దాంతో మరింత ముడుచుకు పోయింది పూర్ణిమ . అయినా తనవైపు ఆసక్తిగా చూస్తున్న అతని కళ్ళల్లోకి చూస్తూ , ' నా పేరు పూర్ణిమ . నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ' . గబ గబా చెప్పి , అతనేమనుకున్నాడోనని , అతని వేపు చూసింది . అలా భయంగా చూస్తున్న పూర్ణిమను చూసి అతని గుండె పూర్తిగా కరిగి పోయింది .ఒక్క క్షణం తను విన్నది నిజమేనా అనిపించింది . కానీ , తన ఎదురుగా కూర్చున్న ఆ అమ్మాయిని చూసి నిజమేనని తీర్మానిన్చుకున్నాడు .ఒక అమ్మాయి ' నిన్ను ప్రేమిస్తున్నాను ' అని చెప్తే ఆనందించని అబ్బాయిలు చాలా అరుదుగానే ఉంటారు . కానీ , కానీ ఈ అమ్మాయి మనసు కష్టపడకుండా నిజమెలా చెప్పాలో చంద్రం కి అర్ధం కాలేదు . ' నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలా వచ్చి మనసులో మాట బయట పెడుతుంది ' అనిపించింది .


చటుక్కున లెగిసి బయటకు వెళ్ళాడు చంద్రం . బిత్తరపోయింది పూర్ణిమ . ' అతనికి ఇష్టం లేదేమో ! అందుకే ఆలా లెగిసి వెళ్లి పోయాడు . అయ్యో దేవుడా ! ఇలా జరిగిందేమిటి ? ఎవరికైనా తెలిసిందంటే సిగ్గు సిగ్గు . ఇంక ఈ అవమానంతో జీవితాంతం బతకాలిలా ఉంది ' అనుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళడానికి నెమ్మదిగా లెగిసింది . ఇంతలో చంద్రం ఫ్లాస్కు పట్టుకొని వస్తూ కనిపించాడు . ' కూర్చోండి ' అంటూ , పూర్ణిమకు ఒక కప్పులో టీ పోసి ఇచ్చి , తనొకటి తీసుకున్నాడు .


ముఖం దించుకొని బలవంతంగా టీ తాగుతున్న ఆమెను తదేకంగా చూసాడు . ' మీకు టీ ఇష్టం లేదనుకుంటాను ' , ఏదోఒకటి మాట్లాడాలి కదా అని అన్నాడు . ' అవునండీ , నాకు కాఫీ ఇష్టం ' అన్న సమాధానం విని ఆశ్చర్య పోయాడు . ఇదే ఇంకెవరైనా అయితే ' అబ్బే అదేంలేదండీ ' అనేవారు .ఈ అమ్మాయి ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది అని అతనికి అర్ధం అయ్యింది .


టీ తాగిన పూర్ణిమతో ' ఏం చూసి నన్ను ప్రేమించారు ? ' సూటిగా అడిగాడు . దాంతో కొద్దిగా తత్తర పడింది పూర్ణిమ . వణుకుతున్న పెదాలతో తలెత్తి అతన్ని చూసింది .ఒక్క నిముషం ఏం చెప్పాలో అర్ధం కాలేదు . అసలు నాకు తెలిస్తే కదా అతనికి చెప్పడానికి అనుకుంది . ఈ విషయం ఆమె కూడా చాలా సార్లు ఆలోచించింది . కానీ ఏమీ తట్టలేదు . చివరకు ఇది దైవ సంకల్పం అని సరిపెట్టుకుంది . నమ్మింది కూడా . అందుకే ఇంతగా ధైర్యం చేసి మనసులోని మాటను పూర్తి అపరిచిత వ్యక్తితో చెప్పగలిగింది .


ఏమో ! నాకు తెలియదు . మిమ్మల్ని చూసినప్పుడు , మీతో ముందే పరిచయం ఉన్నట్టు అనిపించింది . అందుకే మీతో యిలా మాట్లాడ గలుగు తున్నాను . అని చెప్పింది . చాలా సాధారణంగా , అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి , కావాలనుకున్నది సాధించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది అనిపించింది .


' సరే , మీకు నా గురించి ఏమీ తెలియదు కాబట్టి నేనే చెప్తాను . అది నా భాద్యత . నేను కటిక దరిద్రము అనుభవించిన వాడిని ' అతని మాట మధ్య లోనే ఆపుతూ , ' నేను కూడా ' అన్నది పూర్ణిమ .


కానీ మీకూ నాకూ ఒక తేడా ఉంది . ఈ షాపు వికలాంగుల సంక్షేమార్థం ప్రభుత్వం మంజూరు చేసినది . మీరెప్పుడూ గమనించ లేదా ? అంటూ అడిగాడు .ఎందుకు గమనించలేదు , తాటికాయంత అక్షరాలతో రాసి ఉంటే ! కానీ అతనెక్కడావికలాంగుడి లాగ కనిపించలేదు . బహుశా ఇంట్లో ఎవరి పేరు మీదైనా వస్తే అతను నడుపుతున్నాడేమో అని అనుకోనిది . ఆ మాటే పైకి చెప్పింది . దానికతను నవ్వుతూ , లేదు ఇది నాకే మంజూరయ్యింది . అని అన్నాడు .కానీ మీరు బాగానే ఉన్నారు కదా ! అయోమయంగా అడిగింది .


'పైకి బాగానే కనిపిస్తాను కానీ , నా కుడికాలు మోకాలు కిందనుంచి లేదు ' ఒక్కసారిగా తుళ్ళిపడింది పూర్ణిమ . నేనంటే ఇష్టం లేక అలా అబద్ధం చెప్తున్నాడేమో , అనుకుంది . కానీ , అతను చాలా సీరియస్ గా , పేంటు పైకి మడిచి కర్ర కాలు చూపించాడు . ఒక్కసారి మెదడు మొద్దుబారి నట్టు అనిపించింది పూర్ణిమకు . అయినా త్వరగానే తేరుకుంది . ' కాలు లేకపోతేనేం , మనిషి అతనే కదా ' అనుకుంది .


చంద్రం ఆమె వేపు చూస్తూ , అందుకే నా గురించి మీకేంతెలుసు అని అడిగాను . నేను కాలేజీలో చదువుకునేటప్పుడు , నా ఫ్రెండ్ మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు . సరదాగా ఒక రౌండ్ వేసి వద్దామంటే వెళ్ళాను . అప్పుడు జరిగిన ఆక్సిడెంట్ లో కాలు విరిగింది . అవిటితనంతో బతికేకంటే చనిపోవడమే మంచి దని పించేది .కానీ నా తల్లి , చెల్లి నేను లేకపోతే ఇంకా క్రుంగి పోతారనే ఆలోచన నన్ను బతికించింది . ఎన్నో అవమానాలకోర్చి డిగ్రీ పూర్తి చేశాను . కాలేజీకి , చంకలో కర్రలతో వెళ్తుంటే కొంతమంది ఎగతాళిగా , కొంతమంది జాలిగా చూడడం ఇంకా నాకు గుర్తుంది . ఆ రోజుల్లో పడ్డ బాధ ముఖంపై కనిపించింది .


ఒక స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో జైపూర్ కాలు పెట్టించుకున్నాను . అప్పటినుంచీ మళ్ళీ జీవితంపై ఆశ చిగురించింది . ప్రభుత్వం మంజూరు చేసిన ఈ టెలిఫోను బూత్ వల్లే నా కుటుంబం నడుస్తుంది . నా చెల్లి ఇప్పుడు ఇంటర్ చదువుతుంది . తన చదువే నా ప్రస్తుత ధ్యేయం ' .

IP

నా గురించి తెలుసుకున్నారు కదా ! ' ప్రేమించాను ' అని చెప్పారంటే మీరు తప్పక పెళ్లి గురించి ఆలోచించే ఉంటారు . ఒక అవిటివాడితో జీవితం ఎలా ఉంటుందో ఇంటికి వెళ్లి బాగా ఆలోచించండి .పగలంతా ఎలా గడిచినా , రాత్రికి ఈ కాలు తీసేస్తాను కదా ! అప్పుడు మీకు ఎలా ఉంటుంది ? ఇప్పుడు కాకపోయినా వయసు మళ్ళిన తర్వాతైనా , నాకు ఇంకొకరి సాయం అవసరం కావచ్చు . ఆ బరువు బాధ్యతలు తీసుకొని మొయ్యగలరా ? పూర్ణిమ వడిలి పోయిన ముఖం చూసి ' చెప్తున్నది ఆపి ' ఇవన్నీ ఆలోచించమంటున్నానని చదువు అశ్రద్ధ చెయ్యకండి . మన లాంటి వాళ్లకు చదువే ముఖ్యం . మీ చదువు పూర్తైన తర్వాత , అప్పటికీ మీ మనసు మారక పొతే .....అంటూ వదిలేసాడు .


పూర్ణిమ నెమ్మదిగా లెగిసింది . అక్కడకు వచ్చినప్పటికి , ఇప్పటికీ పదేళ్ల వయసు పెరిగినట్టు అనిపించింది . మనకి ఉన్న చిన్న

చిన్న సమస్యలనే పెద్దవిగా ఊహించుకుంటూ , మన మీద మనమే జాలచూపించు కుంటూ జీవితం గడుపు తుంటాము . కానీ , మనకన్నా దయనీయ పరిస్థితి లో ఉన్నవాళ్లను చూసినప్పుడు కానీ , మన అదృష్టం గురించి మనకు తెలియదు .


నిద్రలో ఉన్నదానిలా నడుస్తున్న పూర్ణిమను వెనక నుంచి జాలిగా చూసాడు చంద్రం. ' పాపం ! నా మాటల వల్ల ఆ అమ్మాయి చదువు దెబ్బ తింటుందా ? కానీ నేను చేసినదే మంచిది' . అనుకున్నాడు . నెమ్మదిగా వెళ్తున్న పూర్ణిమ , ఏదో నిర్ణయించు కున్నదానిలా , వంగిన భుజాలు సవరించుకొని , నుదిటిపై పడుతున్న వెంట్రుకలను వెనక్కి తోసి , కదులుతున్న బస్సును , పరిగెత్తుతూ ఎక్కింది . ఆ క్షణంలో చంద్రం మనసులో ఆమె పట్ల ఆప్పటివరకూ ఉన్న జాలి చిత్రంగా ప్రేమగా మారింది . ప్రపంచం లో ఇలా ఊహించని విధంగానే ప్రేమ పుడుతుందేమో !


ఇంటికి చేరిన పూర్ణిమ ను చూసి వాళ్ళమ్మ కంగారు పడింది . ' ఇదేంటమ్మా ఇలా ఉన్నావు , పొద్దున్న ఏమీ తినకుండా వెళ్లవు . చూడు ముఖం ఎలా వాడి పోయిందో ! వెళ్లి చల్లని నీళ్లతో ముఖం కడుక్కుని రా , భోజనం పెడతాను ' . అంటూ హడావిడి చేసింది . సావిత్రికి అన్ని సమస్యలకు పరిష్కారం ఆహారమే .' ఏ సమస్య అయినా ఖాళీ కడుపుతో పెద్దదిగా అనిపిస్తుంది . అదే కడుపు నిండాక ఆలోచిస్తే అదేమంత పెద్ద సమస్యగా అనిపించదు ' అనేది ఆవిడ వాదన ! అది నిజమే . భోజనం చేసి స్థిమిత పడ్డాక , పుస్తకాలు ముందు వేసుకుని కూర్చుంది , పూర్ణిమ . ' చంద్రం చెప్పింది నిజమే ! తామున్న పరిస్థితిలో చదువే ముఖ్యం . పరీక్షలు బాగా రాసి , జీవితం లో ఏదో ఒకటి సాధించాకే మళ్ళీ అతన్నికలుస్తాను . అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది .


చంద్రం మాత్రం ఎప్పుడూ పూర్ణిమ గురించే ఆలోచించేవాడు . పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎలా రాస్తున్నదోనని , తర్వాత రిజల్ట్స్ కోసం ఎదురుచూశాడు . ఫలితాలు వచ్చాక , పూర్ణిమ మంచి మార్కులతో పాస్ అయ్యిందని తెలిసి సంతోషించాడు .అప్పటినుంచి పూర్ణిమ ఏ రోజైనా రావచ్చని ఎదురుచూశాడు . రాకపోవడంతో మొదట్లో చాలా నిరాశ పడ్డాడు . తర్వాత , ' మంచి నిర్ణయమే తీసుకుంది ' అని సరిపెట్టుకున్నాడు . కానీ అతని గుండెలో పూర్ణిమ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది . అతని హృదయానికి అతి దగ్గరగా వచ్చిన వ్యక్తి ఆమె . దురదృష్టకరమైన అతని జీవితంలో ' నిన్ను ప్రేమిస్తున్నాను ' అని చెప్పిన అమ్మాయిపై ప్రేమ పొంగి పొర్లడంలో ఆశ్చర్యం లేదు కదా !ఇక పూర్ణిమ విషయానికి వస్తే , ఆమె పరిక్షలయ్యాక ఖాళీగా కూర్చోలేదు . తమ వీధిలో ఉన్న స్కూలు కు వెళ్లి ప్రిన్సిపాల్ తో తన పరిస్థితి వివరించిందఆవిడ చాలా సార్లు పూర్ణిమ స్కూలు ముందునుంచి బస్సు కోసం వెళ్లడం చూసేవారు . ' ఇప్పుడు సెలవులమ్మా , అయినా అవసరం అంటున్నావు గాబట్టి , ఆఫీస్ పనులు చూడు . కొంతమంది పిల్లలు ట్యూషన్ కు కూడా వస్తారు . సెలవులు అయ్యాక టీచర్ గా తీసుకుంటాను ' అన్నారు . దానికే ఎంతో సంబరపడింది పూర్ణిమ . పని ఎక్కువ జీతం తక్కువ . అయితేనేం ఎంతో కొంత సంపాదిస్తుంది . మొదటి జీతం అందుకున్నాక తల్లికి ఎంతో ఇష్టమైన కోవాబిళ్ళలు కొని ఆమె నోట్లో పెడుతున్నప్పుడు ఎంతో ఆనందం అనుభవించింది .తండ్రి మాత్రం , ' ఎందుకమ్మా , అంత తక్కువ జీతానికి పని చెయ్యడం . నీకంతగా టీచర్ అవ్వాలని ఉంటే బి . ఇ . డి చెయ్యి ' అన్నాడు .కానీ , తామున్న పరిస్థితిలో తానెంచుకున్న మార్గమే సబబనిపించింది . ఏ పని చేస్తున్నా , ఏ పరిస్థితిలో ఉన్నా , చంద్రాన్ని మాత్రం ఒక్క నిముషం కూడా మర్చిపోలేదు . చాలా సార్లు ఫోన్ చేద్దామని అనుకుంది కానీ ఏదో బిడియం అడ్డు వచ్చేది . ' ఏమనుకుంటున్నాడో , మర్చిపోయింది . ఇంక రాదు , అనుకుంటున్నాడేమో ' అని మధన పడేది .తర్వాత స్కూలు ప్రిన్సిపాల్ గారి ప్రోత్సాహం తో టీచర్ ట్రైనింగ్ అయ్యింది . అదే స్కూల్ లో , ముందుకన్నా ఎక్కువ జీతంతో తిరిగి చేరింది . జీతానికి తగ్గట్టే పని కూడా పెరిగింది .పెద్ద క్లాసుపిల్లలకు చెప్పాలి . సెలవు రోజు కూడా పరీక్షలని , ప్రైవేట్ క్లాసులని పని ఉండేది .ఒక రోజు అనుకోకుండా సెలవు దొరికింది .ఆ రోజు చంద్రాన్ని కలవాలని నిర్ణయించుకుంది .


కానీ ఉంటాడో ఉండడో అనుకుంటూ , తన దగ్గర ఉన్న టెలిఫోన్ బూత్ నంబర్ తీసి ఫోన్ చేసింది . అటు వేపు ఫోన్ ఎత్తగానే , ' చంద్రం గారు ఉన్నారాండీ ? అని అడిగింది . ' మాట్లాడుతున్నానండీ ' అన్న సమాధానం వినగానే గుండె ఎందుకో దడ దడ కొట్టుకుంది .

అయినా , నేను పూర్ణిమ నండి , గుర్తున్నానా? అని అడిగింది . అటువేపు ఫోన్ పట్టుకున్న చంద్రం చెయ్యి వణికింది .ఇన్నాళ్లూ ఊహల్లో ఉన్న పూర్ణిమ ఇప్పుడు స్వయంగా మాట్లాడడంతో ఒక్క క్షణం ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు . అతని పరిస్థితి తెలిసినట్టు నేను అటువేపు వస్తున్నానండీ , మీరు ఉంటారో ఉండరో నని ' అంటూ ఆపింది .' ఉంటానండీ ' అని ఎంతో త్వరగా , ఆలస్యమైతే ఆమె రాదేమో నన్నంత ఆత్రంగా చెప్పాడు . ' సరే అయితే వస్తున్నాను ' అంటూ ఫోన్ పెట్టింది .


ముందుగా చంద్రం షాప్ అంతా సర్దాడు . తర్వాత పక్కనున్న బేకరీకి వెళ్లి కేకులు , హోటలుకి వెళ్లి ఫ్లాస్కు లో కాఫీ తీసుకొని వచ్చాడు . ఆ అమ్మాయి ఆమెకు కాఫీ ఇష్టమని చెప్పడం మర్చిపోలేదు .తర్వాత ఎదురుచూపులు మొదలయ్యాయి . అంతలో ఇంకో అనుమానం వచ్చింది . ఒక వేళ తనకు పెళ్లి కుదిరిందని శుభలేఖ ఇవ్వడానికి గానీ రావడం లేదు కదా ! అనుకొన్నాడు . దానితో మరింత కంగారు పడ్డాడు . నిముషాలు గడుస్తున్నా కొద్దీ ఆరాటం పెరిగిపోయింది . ప్రేమలో ఇంత మాధుర్యం ఉందా ? అనిపించింది . కొన్నాళ్ల క్రితం వరకూ ఎవరో కూడా తెలియని అమ్మాయి , ఇప్పుడతని హృదయమంతా ఆవరించుకుంది .


ఆగిన ప్రతి బస్సు వైపు ఆత్రంగా చూస్తున్నాడు చంద్రం . చాలా సేపటికి బస్సు లోంచి దిగింది పూర్ణిమ . ఆశ్చర్యంతో చూస్తుండిపోయాడు . అతని ఊహలలో ఎప్పుడూ సల్వార్ లో ఉండే పూర్ణిమ , చీర కట్టులో నిండుగా కనిపించింది . నెమ్మదిగా నడిచి వస్తున్నా ఆ నడకలో ఒక ఆత్మ విశ్వాసం ఉంది .షాపుకు దగ్గరకు వచ్చాక చంద్రాన్ని చూసిన ఆమె కళ్ళల్లో మెరుపు వచ్చింది . అదే మెరుపు అతని కళ్ళల్లో కూడా ప్రతిఫలించింది .


' కూర్చోండి ' అని అతను అనకముందే కూర్చుని , ' ఎలా ఉన్నారు ' అంటూ సంభాషణ మొదలు పెట్టింది . కంగారు పడడం చంద్రం వంతయ్యింది . ' ఇంతలో ఎంత మార్పు వచ్చింది ' అనుకున్నాడు . కప్పులో కాఫీ వేసి ఆమెకు ఇస్తూ , ' నేను బాగానే ఉన్నాను . మీరెలా ఉన్నారు ? ఇన్నాళ్లూ ఏం చేసారు ? అని అడిగాడు .


' మీరు నాకు చెప్పిన విషయం గురించి నేను బాగా ఆలోచించాను . అయినా నా మనసు మారలేదు . నేనిప్పుడు టీచర్ గా కూడా ఉద్యోగం చేస్తున్నాను . మీ బాధ్యతలు పంచుకోగలను కూడా . మీ కాలు కారణంగా మీరు నాకు భారం అవుతారని నేను అనుకోను . ఒకవేళ పెళ్ళైన తర్వాత ఆక్సిడెంట్ అయితే , అప్పుడు ? అంటూ ఎదురు ప్రశ్నించింది .


' పర్వాలేదే , మీకసలు మాటల  రావనుకున్నాను . బాగానే మాట్లాడుతున్నారు ' అన్నాడు . ' అందరితో అయితే మాట్లాడను . కానీ , ఇది మన భవిష్యత్తు కు సంబంధించిన విషయం కదా ! అందుకనే , అని ఆగి , ' ఇప్పటికైనా మీ నిర్ణయం చెప్తారా ? అని అడిగింది .


' ప్రస్తుతానికి నా సంగతి పక్కన పెట్టండి . మీ ఇంట్లో వాళ్ళ మాటేమిటి ? ఒక అవిటివాడిని అల్లుడుగా ఒప్పుకుంటారా ? ఈ విషయం ఎప్పుడూ ఆలోచించని పూర్ణిమ , ' మీరేమంటారో అనే ఆలోచన తోనే గడిపాను . మిగిలిన విషయాల మీద అంతగా ధ్యాస పెట్టలేదు ' అయితే ఇప్పుడు పెట్టండి .ఒక కాలు లేనివాడు , ఆస్థి లేనివాడు , టెలిఫోన్ బూత్ నడుపుతున్న వాడికి తమ కూతురును ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఎవరూ అనుకోరు కదా !


' ముందు మీరు సరే అంటే , వాళ్ళని ఎలాగైనా ఒప్పిస్తాను . ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది . అప్పుడామె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ , ' నేను ఒప్పుకోనని ఎలా అనుకున్నావు , పూర్ణిమా ? అంతులేని అదృష్టం నా ముంగిట్లో వాలతా నంటే , కాదనుకునేంత వెర్రివాడిని కాను .కానీ మీ ఇంటికి వచ్చి , నిన్ను పెళ్లి చేసుకుంటానని అడగడానికి నాకు కొంత సమయం కావాలి 'అన్నాడు .

' సరే , కానీ ఎందుకో తెలుసుకోవచ్చా ? ' నీకు కాకపోతే ఎవరికి చెప్తాను ? నేను షాపులో కూర్చునే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను . ఈ మధ్య లెక్చరర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి కూడా వెళ్లి వచ్చాను . ఈరోజో , రేపో దాని ఫలితం తెలుస్తుంది . ఆ ఉద్యోగం వస్తే , ధైర్యంగా మీ ఇంటికి వస్తాను . టెలిఫోన్ బూత్ నడుపుతున్న వికలాంగుడి కంటే , లెక్చరర్ గా పనిచేస్తున్న వికలాంగుడికి ఓటు వేస్తారు కదా ! నవ్వుతూ అన్నాడు , చంద్రం .


' ఎందుకు ప్రతి మాటకీ , ముందు వికలాంగుడినని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు ? మీరింక ఆ సంగతి మర్చిపోవాలి . కొంచెం గట్టిగానే చెప్పింది .


' అలాగే మర్చిపోతాను . కానీ నువ్వు కూడా నేను చెప్పినదొకటి చెయ్యాలి ' ఏంటి అని చూస్తున్న పూర్ణిమతో , ' నువ్వు దూర విద్య ద్వారా ఎం . ఏ చదవవచ్చు కదా , అది పూర్తి చేసాక , నువ్వు కూడా లెక్చరర్ ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు .దూర విద్య ద్వారా సౌకర్యం ఏంటంటే , పుస్తకాలు మన ఇంటికే వస్తాయి . పైగా ఏమైనా అవసరం అయితే లైబ్రరీలు ఉండనే ఉన్నాయి . అన్నాడు .


కానీ ఫీజు , అంటూ ఆగింది . దానికతను అప్లికేషన్ ఫారం , ఫీజు కట్టిన డ్రాఫ్టు ఇస్తూ' ఈ ఫారం పూర్తి చేసి పంపించు . దీన్ని నా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను . వాడికి ఇంకొకటి తెప్పిస్తాను ' అన్నాడు . కానీ ఇంత డబ్బు ఎలా తీసుకోను ? సందేహం వెలిబుచ్చింది .

' నీకూ , నాకూ మధ్య ఇలాంటి విషయాలు ఇంక రాకూడదు ' అన్నాడు . ఇద్దరికీ చిత్రంగా అనిపించింది . కొన్ని గంటల క్రితం వరకూ ఎవరికి వారు . ఇప్పుడు ఒకరికి ఒకరు . ఇద్దరిదీ ఒకే ప్రపంచం . తేడాలే లేవని పిస్తుంది . ఎలా వస్తుంది ఈ మార్పు ? ప్రేమకి ఉన్న మహత్యం , మాధుర్యం అదేనేమో .


అప్లికేషన్ తీసుకుని , ' ఇంక వెళ్తాను . మీ రాకకోసం ఎదురు చూస్తుంటాను . అంటూ లెగిసింది . వెళ్తున్న ఆమెను చూస్తూ , ' ఇంత అదృష్టం నా స్వంతం ఎలా అయ్యింది . కాలు పోయినప్పుడు ఎంత బాధ పడ్డాను . దేవుణ్ణి ఎంత నిందించాను . పూర్ణిమ లాంటి అమ్మాయి నవ వసంతంలా వస్తాదంటే , రెండో కాలు పోగొట్టు కోవడానికి కూడా సిద్ధపడేవాడిని . భగవంతుడు ఒక చేత్తో తీసుకున్న దానికి , రెండో చేత్తో రెట్టింపు ఇస్తాడనేది ఎంత నిజం ' అనుకున్నాడు .


నెల లోపే , చంద్రానికి ఉద్యోగం వచ్చింది . తల్లిని , చెల్లిని తీసుకుని ఒక మంచిరోజు పూర్ణిమ ఇంటికి వెళ్ళాడు . అప్పటికే అతనిగురించి పూర్ణిమ ద్వారా వాళ్ళకి తెలిసింది . మొదట్లో సందేహించినా పూర్ణిమ గట్టిగా పట్టుపట్టడంతో , ఆమె తల్లితండ్రులు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారు .


పెళ్ళైన తర్వాత పూర్ణిమను చూస్తూ , నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి , నాలో ఎంత కలవరం లేపావో తెలుసా ? తర్వాత చాలా రోజులు నువ్వు రాకపోయేసరికి , నా పరిస్థితి గందరగోళంగా తయారయ్యింది . నీకు పెళ్లి అయిపోయి ఉంటుందని ఊహించుకొని ఎంతో బాధ పడేవాణ్ణి ' అంటూ మనసులో మాట చెప్పాడు . దానికి పూర్ణిమ ' చంద్రుడు లేని పున్నమి ఉంటుందా ? అంటూ అతని గుండె లో తలదాచుకుంది .


మధురమైన ఆలోచనల నుంచి బయటపడి చూస్తే అప్పుడే 5 గంటలవుతుంది .వెండి త్వరగా లేపమన్నదని గుర్తుకు వచ్చింది. తీరా వెళ్లి చూస్తే అప్పటికే లెగిసి తయారై పోతుంది . బాత్రూమ్ లోనించి నీళ్ల చప్పుడు వినిపించింది.


గబ గబా కిచెన్ కు వెళ్లి కాఫీ కలుపుకు వచ్చింది . కాఫీ తాగుతూ 'అమ్మా , ఈరోజు త్వరగా కాలేజికి వచ్చేస్తావు కదూ 'అని అడిగేటప్పటికే బయట హారన్ వినిపించింది .'అమ్మో శాండీ వచ్చేసింది 'అనుకుంటూ బై అమ్మా అంటూ బయటకు పరిగెత్తింది వెండి .


కూతురు వెళ్లేవరకూ చూసి లోపలకు వచ్చింది పూర్ణిమ. వెళ్ళేటప్పుడు తల్లిని త్వరగా రమ్మని చెప్పింది వెండి. పూర్ణిమాకెందుకో ఆ రోజు కాలేజీకి వెళ్లాలని అనిపించలేదు . వెళ్లకపోతే వెండి చిన్నబుచ్చుకుంటుంది అయినా నిరాసక్తంగా ఉండిపోయింది.


చంద్రం లెగిసే టైమ్ అవ్వడంతో తమ బెడ్ రూమ్ కు వెళ్లి భర్త కాల కృత్యాలు తీర్చుకోవడంలో సాయం చేసి వంట గది వేపు అడుగులు వేసింది . అక్కడ వంట మనిషి అన్నీ సిద్ధం చేసి ఉంచింది .టేబుల్ మీద అన్నీ సర్దమని చెప్పే టప్పటికి చంద్రం టిఫిన్ చెయ్యడానికి వచ్చేశాడు . పూర్ణిమ ఇంకా కాలేజికి తయారవ్వక పోవడం అతనికి చాలా ఆశ్చర్యం కలిగించింది.' పూర్ణిమా , ఒంట్లో బాగోలేదా ? అని అడిగాడు . బాగానే ఉందండి అంటే , మరి కాలేజీకి తయారవ్వలేదే అంటే , ఏమో ఈ రోజు వెళ్లాలని లేదు . ఎందుకో పాత రోజులు గుర్తుకువస్తున్నాయి . మీరు కూడా శెలవు తీసుకోవచ్చు కదా , అని అడిగింది . చాలా ఆశ్చర్యం గా అనిపించింది చంద్రానికి , ఎప్పుడూ శెలవు పెట్టదు పూర్ణిమ . అలాంటిది వెండికి ఎంతో ముఖ్యం ఐన రోజు ఎలా వెళ్లకుండా ఉంటుంది ? ఏదో కారణం ఉండే ఉంటుంది ఆనుకున్నాడు.అడిగితే పూర్ణిమ తప్పకుండా చెపుతుంది కాని అడగలేదు చంద్రం.వెండి డిబేట్స్ లోపాల్గొంటుంది కదా! నువ్వు లేకపోతే ఎలా? అన్నాడు .బాగానే ప్రిపేర్ అయ్యింది లెండి. అయినా నేనుండి ఏం చెయ్యాలి. కంగారు పడుతుంది కూడా."అన్నాది.


అతనికి భార్యతో సరదాగా గడపాలని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలని ఎంతగానో ఉంది .

కానీ ఈ రోజు తప్పనిసరిగా కాలేజీకి వెళ్ళాలి. అదే అన్నాడు . 'నాకు కూడా ఉండాలనే ఉంది . కానీ ఈ రోజు పీహెచ్డీ స్టూడెంట్స్ ను కలుస్తానన్నాను. థీసిస్ సమర్పించే టైము దగ్గర పడుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే వాళ్ళు బాధపడతారు' అంటూ తన నిస్సహాయత తెలియచేసాడు.


ఆ సంగతి పూర్ణిమ కు బాగా తెలుసు. అందుకే గట్టిగా అడగలేదు. టేబుల్ దగ్గర నుంచి లెగుస్తూ ' వెండి తయారయ్యిందా' అని అడిగాడు. ఆ తయారయ్యింది కాలేజికి కూడా వెళ్ళిపోయింది' అంటూ బదులిచ్చింది.' ఎలా ఎవరితో వెళ్ళింది? తన డిబేట్ కోసం చాలా వివరాలు సేకరించాను. కారు లో వెళ్ళేటప్పుడు డిస్కస్ చేద్దాం అనుకున్నాను' నిరాశగా

అన్నాడు.ఇంతకీ ఎవరితో వెళ్లింది. అని అడిగాడు . ' దాని ఫ్రెండ్ శాండీ వచ్చింది అంటే ' శాండీనా? అని , ఓ సంధ్యా? అని నవ్వుతూ సంధ్య ఎంత చక్కటి పేరు! ఆ పేరును ఇలా మార్చిందా?ఈ కాలం పిల్లలు ఇలా ఉన్నారేంటి,మన వెండి విషయంలో మనం చాలా అదృష్టవంతులం. అన్నాడు. నవ్వొచ్చింది పూర్ణిమకు. పిచ్చి చంద్రం ఎంత అమాయకుడు అనుకుంది బహుశా తండ్రులందరూ ఇలాగే ఉంటారేమో!

వెండి కూడా అదే పని చేసిందని తెలిస్తే చంద్రం ఎంత బాధపడతాడు! అనుకుంది.స్కూలు లో చదువుతున్నప్పుడు వెండికి తన పేరంటే ఎంతో గర్వంగా ఉండేది . ' ఎవ్వరికీ లేని పేరు నాకున్నదని టీచర్స్ అందరూ అంటున్నారు ' అని చెప్తుండేది.

కానీ కాలేజికి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ' నా పేరు చూసి అందరూ నవ్వుతున్నారు . సిల్వర్ సిల్వర్ అని ఎగతాళి చేస్తున్నారు'. అంటూ బాధపడేది. చిన్నపిల్ల అదే తెలుసుకుంటుందిలే అని పెద్దగా పట్టించుకోలేదు పూర్ణిమ.


కానీ తర్వాత తెలిసింది,వెండి కూడా తన పేరులోని ఇంగ్లీష్ అక్షరాలు మార్చి Vendi, Wendy లా అయ్యిందని .తర్వాత తానొక విదేశీ పేరుతో ఉన్నట్టు దాని వలన తనకు చాలా మంది విదేశీ పేస్ బుక్ ఫ్రెండ్స్ దొరికారని చాలా సంతోషించేది.


వెండికి ఎందుకు ఆ పేరు పెట్టామో చెప్పాలని చాలా సార్లు అనుకుంది కానీ చంద్రం వారించాడు. ' మన కూతురు అంత మాత్రం తెలుసుకోలేదూ? ' అనేవాడు .

వెండి పౌర్ణమి రోజు రాత్రి పుట్టింది.పాపను గదిలోకి తీసుకువచ్చి పాడుకోబెట్టినప్పుడు వెన్నెల కాంతి పాపపై పడి మెరిసిపోతూ బంగారు బొమ్మ లా కనిపించింది.

అది చూసిన చంద్రం పాపను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ' వెండి వెన్నెల' అన్నాడు. ' ఏంటి పేరా? ' నవ్వుతూ అన్న పూర్ణిమతో ' చంద్రుడు , పౌర్ణమి కలిసినప్పుడే కదా వెండి వెన్నెల పుట్టేది' అన్నాడు .


వెండికి ఈ సంగతి అర్ధం అయ్యే వయసు ఇంకా రాలేదేమో అనుకుంటూ నిట్టూర్చింది పూర్ణిమ


.కాలేజికి వెళ్లిన వెండి తల్లి కోసం ఎదురు చూసింది .తల్లి శెలవు పెట్టిందని తెలిసి కంగారు పడింది. రాత్రి మాటలకి అమ్మకి కోపం వచ్చిందని అనిపించి ఫోన్ చేసి అడిగింది .' ఏం లేదు వెండి కొద్దిగా నీరసంగా ఉంది. అల్ ది బెస్ట్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. పూర్ణిమ .


వెండికి ఎలాగో అనిపించింది. ఎప్పుడూ ఆ అమ్మాయే కంగారులో ఉండి ఫోన్ పెట్టేసేది. ఇప్పుడు అమ్మ ఫోన్ కట్ చేసిందంటే నా వల్ల ఎదో పెద్ద తప్పే జరిగింది అనుకుంది. అన్యమనస్కంగానే డిబేట్స్ లో పాల్గొంది.


సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళకుండా దగ్గర లోనే ఉన్న అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళింది. వెండిని చూసి సావిత్రి చాలా ఆనందించింది. కానీ ఆ అమ్మాయి ముఖం చూసి ఏదో జరిగిందని గ్రహించింది. అయినా పైకి ' రావే దగ్గరే ఉన్నా బొత్తిగా నల్ల పూసవై పోయావు'.రాగానే అమ్మమ్మను వాటేసుకుని ' అమ్మమ్మా!అమ్మకు నా మీద కోపం వచ్చింది' అంటూ బావురుమంది. ' మీ అమ్మకా నీ మీద కోపం వచ్చిందా? నేను నమ్మను. అసలు ఏం జరిగిందో చెప్పు' అంటూ అడిగింది .


దానితో రాత్రి జరిగిన సంగతి చెప్పింది. ఆలోచనలో పడింది సావిత్రి. నిజమే తనని ఎవరైనా ఏమైనా అంటే సహిస్తుంది కానీ చంద్రాన్ని ఎవరైనా కించపరిస్తే భరించలేదు పూర్ణిమ.అదే మాట మనవరాలికి చెప్పింది. 


'నీ కసలు వాళ్ళ అనుబంధం గురించి ఏం తెలుసు ? ఇదిగో ఈ పుస్తకం చదువు. అందులో మీ అమ్మ తమ జీవితం గురించి అంతా అంటే నువ్వు పుట్టేవరకు రాసుకుంది. అంటూ ఒక డైరీ అందించిందీ. అంతలోనే నీ కోసం మీ అమ్మ కంగారు పడుతుంది. అంటూఫోన్ చెయ్యడానికి లెగిసింది. అప్పుడే పూర్ణిమ నుంచి ఫోన్ వచ్చింది. 'వెండి ఇక్కడే ఉందే కొంచంసేపు ఉండనీ నేను పంపిస్తానులే' అని సర్ది చెప్పింది .అప్పటికే వెండి పుస్తకం చదవడంలో ములిగిపోయింది.పాలు వేడిచేసి తీసుకువచ్చి ఇస్తే అందుకుంటూ , 'అమ్మమ్మా నేనిప్పుడే అమ్మా నాన్నలను కలవాలి . అంటూ బయలుదేరబోయింది .


పాలు తాగి వెళ్లవే , అయినా నువ్వు ఇంటికి రాలేదని మీ అమ్మా నాన్న వస్తారులే ! పాలు తాగుతూ అమ్మమ్మా ! నాకీ సంగతులన్నీ ఎందుకు చెప్పలేదు ? అంటూ నిలదీసింది . అయ్యో నాన్నను ఎంత మాట అన్నాను !జరిగిన ప్రమాదానికి క్రుంగి పోకుండా మొక్కవోని దీక్షతో నాన్న ఎంత సాధించారు. దానికి అమ్మ ఎంతగా సహకరించింది. వాళ్ళ ప్రేమ ఎంత గొప్పది !నా పేరు కూడా ఎంత చక్కగా పెట్టారు! ఆ పేరు గురించి అమ్మని ఎంత బాధ పెట్టాను! నా ఉద్దేశం తెలిస్తే నాన్న ఎంత మనసు కష్టపెట్టుకుంటారు! ఈ తరం వాళ్ళము ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాము. మన అమ్మ నాన్నలు కూడా ఒక టైమ్ లో చిన్న పిల్లలేనని , వాళ్ళని కూడా ప్రేమ అనేభావం చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసి ఉంటుందని ఎందుకు ఆలోచన రాదు ? మనలను మన తల్లి తండ్రుల కన్నా ఎవరు బాగా అర్ధం చేసుకుంటారు ?


పచ్చాత్తాపంతో ఆ అమ్మాయి గుండెలలోంచి కన్నీరు పైకి ఉబికి వచ్చింది. కన్నీటి పొరల మధ్య అమ్మ నాన్న వస్తూ కనిపించారు. అంతే! ఒక్కసారిగా లెగిసి వాళ్ళను చుట్టేసుకుంది .' వెండీ ! ఏంటమ్మా అంటూ ఇద్దరూ కంగారు పడ్డారు .'అమ్మా నాన్నా , ఈ వెన్నెల సాక్షిగా చెప్తున్నాను. నేనెప్పటికీ మీ వెండి వెన్నెలనే' అంటూ వాళ్ళ ఒళ్ళో తలదాచుకుంది.


పూర్ణిమకు మనసంతా ఆనందంతో నిండి పోయింది. పొద్దున్న నుంచి పడిన మానసిక సంఘర్షణ నుంచి బయటపడిన ఆమె ముఖం నిజంగానే పున్నమి లాగ ఉంది .ఒకవైపు భర్త మరో వైపు కూతురు నడుస్తుండగా తేలిక పడ్డ మనసుతో ఇంటివైపు అడుగులు వేసింది .


Rate this content
Log in

Similar telugu story from Drama