sesi saradi

Drama Inspirational

4.5  

sesi saradi

Drama Inspirational

అనుబంధం

అనుబంధం

11 mins
17


అనుబంధం


ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది . లలితమ్మ గారు ఆ న్యూస్ పేపర్ తీసి పట్టుకున్నారు . పట్టుకున్నారు అంతే చదవడం లేదు .మనసు పరి పరి విధాలు పోతుంది .పాత రోజులు ఈ రోజు మరీ మరీ గుర్తుకు వస్తున్నాయి . ఒంటరిగా ఉండడం వలన జరిగిపోయిన రోజుల్ని గుర్తు తెచ్చుకోవడం తప్ప వేరే ఏమీ పని లేదు .మనసు ముఫై ఐదు సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది .


కొడుకు రవి పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గుండె పోటు వచ్చి ఆమె భర్త మరణించాడు . ఆ రోజులు తలచుకుంటే ఇప్పటికే గుండె జలదరిస్తుంది . ఎంతో భయంగా ఉండేది .దగ్గర వాళ్ళెవ్వరూ లేక చిన్న పిల్లాడితో భవిష్యత్తు అంధకారంగా తోచేది.భర్తకు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకు లో వేసి ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి ఫామిలీ పెన్షన్ తో కాలం నెట్టుకు వచ్చేది .ఏ నెలకానెల డబ్బు సరిపెట్టగలనా అని భయపడుతూ ఉండేది .కొన్నాళ్ళు పక్కనే ఉన్న నర్సరీ స్కూల్ లో టీచర్ గా చేసింది పెట్టుకుని పెంచింది .వాడు కూడా ఇంటి పరిస్థితి అర్ధం చేసుకొని ఎప్పుడూ ఏ కోరికలూ కోరలేదు.చాలా బుద్ధిగా చదువుకునేవాడు . ఇంట్లో 

 సాయంగా పొద్దున్నే న్యూస్ పేపర్ లు వేసేవాడు . సాయంత్రం చిన్న పిల్లలకు ట్యూషన్ లు చెప్పేవాడు . చివరకు మంచి కాలేజీలో మెరిట్ మీద ఇంజనీర్ అయ్యాడు.వాడికి ఉద్యోగం వచ్చినప్పుడు ఎంతగా ఆనందించిందో మాటలలో చెప్పలేదు . ఎన్నో సంవత్సరాల తమ ఉమ్మడి కష్టానికి ఫలితం దక్కిందని అనిపించింది.


ఇంకో రెండు మూడు సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి .తెలిసిన వాళ్లందరికీ చెప్పి రవికి సంబంధాలు వెతకడం మొదలు పెట్టింది. వాడికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరుతుంది అనుకునేది . ఒక రోజు సాయంత్రం రవి తో బాటూ ఒకమ్మాయి వచ్చింది . లలితమ్మ గారికి విషయం అర్ధం ఐనా 'రవీ ఈ అమ్మాయి…' అని ఆగిపోయారు .దానికి రవి అమ్మా ఈ అమ్మాయి సుజాత నాకు బస్సు స్టాండ్ లో పరిచయం అయ్యింది చాల చాలా మంచి అమ్మాయమ్మా అన్నాడు.

దానితో ఆవిడకు కొడుకు మనసు అర్ధం అయ్యింది .వంటింట్లోకి వెళ్తూ అమ్మాయీ కాఫీ కలుపుదాం రామ్మా అన్నారు .ఆ అమ్మాయి భయపడుతూ వెనక్కి తిరిగి రవిని చూస్తూ లోపలకు నడిచింది.సంభాషణ మొదలు పెట్టారు లలితమ్మ గారు ఏమ్మా ఎక్కడుంటారు మీరు అని అడిగారు . పక్క వీధిలో ఉంటామండీ నెమ్మదిగా చెప్పింది.

సుజాత.ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్న ప్రశ్నకు అమ్మ నాన్నగారు అన్నయ్య నేను ఉంటామండీ అని బదులిచ్చింది సుజాత .


మీ అమ్మ నాన్నగారు మా ఇంటికి వస్తారా లేక నేను మీ ఇంటికి రావాలా అని అడిగారు.' దేనికండీ? బిత్తరపోతూ అడిగింది సుజాత .

"పెళ్లి మాటలు మాట్లాడ దానికి" అన్న సమాధానం వినగానే సిగ్గుతో బయటకు పరుగు పెట్టింది సుజాత .


మూడు నెలలు తిరగ కుండానే సుజాత ఆ ఇంటికి కోడలై వచ్చింది.లలితమ్మ గారికి సరోజ బాగా నచ్చింది . ఎంతో అణకువగా ప్రేమగా ఉంటూ అత్తగారిని గౌరవంగా చూసుకునేది . బహుశా రవి ద్వారా వాళ్ళు అనుభవించిన కష్టాల గురించి తెలుసుకుని ఉంటుంది . లలితమ్మ గారిని ఏ పనీ ముట్టుకోవద్దనీ అన్నీ తానే చేస్తా నని అనేది.


దానికి మాత్రం ఆవిడ ఎంతమాత్రం ఇష్టపడలేదు . నువ్వు ఆఫీస్ కు వెళ్తావు నేను ఇంట్లోనే ఉంటాను . పనిమనిషి ఉన్నది కదా నేను చేసేది వంట ఒక్కటే అయినా నా ఇంట్లో ఓపిక ఉన్నన్నాళ్లూ చేస్తాను తర్వాత ఎలాగూ నీకు తప్పదు అనేవారు.


ఐదు సంవత్సరాలు తిరిగే టప్పటికి ఇల్లు ఇద్దరు మనుమలు శ్రీకాంత్ శిరీష లతో కళ కళ లాడింది . భర్త పోయేటప్పటికే లలిత కాస్తా లలితమ్మ అయ్యింది .కొడుకు పెళ్లయ్యాక ఆమె అమ్మగారు కోడలు చిన్నమ్మగారు ఇప్పుడు కోడలు అమ్మగారు ఆమె పెద్దమ్మ గారు.కాలంతో ఇలాంటి మార్పులు తప్పవు దానికావిడ ఎప్పుడూ బాధ పడలేదు.పైగా సంతోషించేది కూడా . అయినా ఆవిడకు ఇలాంటివన్నీ పట్టించుకునే టైం కూడా ఉండేది కాదు . పొద్దున్నే నాలుగు టిఫిన్ బాక్స్ లు కట్టి,అందరూ బయటకు వెళ్ళాక మిగిలిన పనులు చేసుకుని భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని లేగిసే టప్పటికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయ్యేది . వాళ్ళకి పాలు కలిపి ఇచ్చి తినడానికి ఏమైనా పెట్టి హోమ్ వర్క్ చెయ్యించేది.

అప్పుడు ఆమెకు రవి చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చేవి .పిల్లల హోమ్ వర్క్ అయిపోయాక రాత్రి వంటకు అన్నీ సిద్ధం చేసేవారు . రాత్రి వంట సుజాతే చేస్తుంది కానీ ఆఫీస్ నుంచి వచ్చి అన్నీ ఒక్కర్తే చేసుకోవడం కష్టం అని కొంత సాయంగా ఉంటుందని అన్నీ అమర్చి పెట్టేవారు.


ఇలా జీవితం సజావుగా సాగుతుంది . కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళు ముందునుంచీ ఉన్న ఇల్లు చిన్నది అయినట్టు అనిపించేది.అందుకే పిల్లల స్కూల్ కి దగ్గరగా రెండు పడగ్గదుల అపార్ట్మెంట్ లోకి మారారు .అక్కడకు మారిన తర్వాత లలితమ్మ గారికి కొత్త జీవితం ప్రారంభం అయ్యింది.ఇల్లు ముఖ్యంగా వంట గది వీలుగా ఉండడం వల్ల ఆవిడకు పని తొందరగా అయిపోయేది . ఆ అపార్ట్మెంట్ లో ఆమె వయసు వాళ్ళు చాలా మంది పరిచయం అయ్యారు . అందరి కీ ఇంచుమించు ఒకటే వయసు ఒకే ఆరోగ్య సమస్యలు . రోజూ మధ్యాహ్నం ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకొని మంచి చెడ్డా మాట్లాడు కునే వారు.

తమ గడిచిన జీవితం గురించి పిల్లల గురించి మాట్లాడుకునే వారు.ఇలా లలితమ్మ గారి జీవితం సాఫీగా సాగిపోతుంది . ఆ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి . రవి ఉద్యోగం మాని వ్యాపారం మొదలు పెట్టాడు .మొదట్లో కొంత ఒడుదుడుకులు వచ్చినా రాత్రనక పగలనక కష్టపడడం వల్ల. కొంత కాలానికి వ్యాపారంలో నిలదొక్కుకున్నాడు .ఇంక సుజాతకు కూడా ఆమె పని చేస్తున్న ఆఫీస్ లో బ్రాంచ్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది . పిల్లలిద్దరూ కాలేజి వెళ్లే వయసు వాళ్ళయ్యారు .వాళ్ళకిప్పుడు లలితమ్మ గారు చదువులో సాయం చెయ్యలేక పోతున్నారు . కాలేజి నుంచి రాగానే ట్యూషన్ లకు వెళ్లి పోతున్నారు .పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఈ ఇల్లు కూడా ఇరుకు అవుతున్నట్టుగా అనిపిస్తుంది . ఇన్నాళ్లూ పిల్లలు లలితమ్మ గారు ఒకే గదిలో ఉంటున్నారు . కానీ ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ వేరే గదులు కావాలంటున్నారు .పిల్లలు దూరమవుతున్నారని లలితమ్మ గారు బాధపడేవారు . దానికి శిరీష అదేంలేదు నానమ్మా నేను అన్నయ్య ఎలా ఒక గది షేర్ చేసుకుంటాం నా ఫ్రెండ్స్ చదువు కోవడానికి వస్తుంటారు కదా అన్నాది.


ఇలా మాటలు జరుగుతుండగా ఒక రోజు రవి ఇంటికి త్వరగా వచ్చి తల్లిని తొందరగా తనతో రమ్మన్నాడు దానితో ఆవిడ భయపడ్డారు.'సుజాత ఏదిరా, నువ్వు నన్ను ఎక్కడకి తీసికొని వెళ్తున్నావు?' అని అడిగారు . 'సుజాత ఆఫీస్ లోనే ఉందమ్మా .నువ్వు త్వరగా తయారై రా. నీకొకటి చూపించాలి 'అన్నాడు . ఆ మాటలతో స్థిమిత పడి ఆవిడ తయారై కారులో కూర్చున్నారు .ఊరికి కొంచెం దూరంగా తీసికొనివెళ్ళి కారు ఆపాడు రవి.

అక్కడ కొత్తగా లే అవుట్ వేసినట్టున్నారు . కొన్ని చోట్ల పని జరుగుతుంటే అక్కడక్కడ విసిరేసి నట్టుగా కొన్ని కొత్తగా కట్టిన ఇళ్ళు ఉన్నాయి.

ఇక్కడకి ఎందుకు వచ్చాము అన్నట్టుగా చూస్తున్న ఆమెతో రవి ఇలా అన్నాడు . 'ఇక్కడ ప్లాటు తీసుకున్నానమ్మా ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు చిన్నగా అనిపిస్తుంది కదా . పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు . నువ్వు కూడా పూజకు వేరే గది ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అంటుంటావు కదా మనం స్వంతంగా కట్టుకుంటే మనకు వీలుగా ఉండేటట్టు డిజైన్ వెయ్యించి కట్టుకోవచ్చు' .అంటూ వివరించాడు.


లలితమ్మ గారి మనసు గర్వంతో నిండిపోయింది . కష్టపడి చదువుకొని కొడుకు ఎంతో ప్రయోజకుడయ్యాడని మురిసిపోయారు . ఇల్లు కడుతున్నప్పుడు ఎప్పుడూ తల్లి సలహా తీసుకునే వాడు రవి . అప్పుడప్పుడు సైట్ దగ్గరకు తీసికొని వెళ్ళేవాడు .చూస్తుండగానే ఇల్లు తయారై పోయింది . గృహప్రవేశం జరిగి పోయి సంవత్సరం గడిచిపోయింది.ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో ఆవిడ ఒంటరిగా మిగిలారు . వేరే వేరే గదులు కావాలని గొడవ చేసిన మనుమలిద్దరూ పెద్ద చదువులకు వేరే ఊర్లో హాస్టల్ లో ఉంటున్నారు. 'ఇక్కడ కాలేజీలు లేవేంట్రా? పిల్లలను దూరంగా పంపించావు

 అని రవితో అంటే 'అక్కడ ఉంటేనే చదువు మీద దృష్టి పెడతారమ్మా ఇంట్లో ఉంటే ఎప్పుడూ స్నేహితులు, షికార్లు సినిమాలు అంటారు హాస్టల్ లో అయితే అన్నీ టైం ప్రకారం జరుగుతాయి.' అన్న రవి మాటలు కొట్టి పారెయ్య లేక పోయింది.


ఆవిడ ఇలా ఆలోచన లతో ఉండగానే పనిమనిషి రత్న 'భోజనం వడ్డించానమ్మా' !అంటూ వచ్చింది. 'ఇంకా ఆకలిగా లేదే', అంటే 'తినెయ్యండమ్మా, మీరు తిన్నాక నేను కూడా తిని డ్రైవర్ భార్యతో కలిసి మేటినీ సినిమా కి వెళ్ళాలమ్మా', అని బతిమాలింది . 'దీని పనే బాగుంది ఊరికి దూరమైనా స్నేహితులకు సినిమాలకు కొదవ లేదు'. అనుకున్నారా విడ. 

అన్య మనస్కంగానే భోజనం చేసి గదిలోకి వచ్చారు చేద్దామన్నా ఏ పనీ లేదు. వంట మనిషి, పని మనిషి,తోట మాలి, డ్రైవర్ అందరూ ఉన్నారు . ముందు నుంచీ పని చేసే అలవాటు ఉండడం వాళ్ళ ఆవిడకు తనకు తానే మూల పడిపోయిన పాత సరుకుని అనే భావన బయలుదేరింది.

ఆ మాటే ఒకసారి రవితో అంటే ఇన్నాళ్లూ చాల చాలా కష్టపడ్డా వమ్మా ఇప్పుడైనా సుఖపడు అన్నాడు.


కానీ ఆవిడ ఒంటరితనాన్ని భరించలేక పోతుంది .ఇంతకు ముందులా పుస్తకాలు కూడా చదవలేక పోతుంది . కొంచెం చదవగానే కళ్ళు మండుతున్నాయి .ఒక విషయం ఈ మధ్య పదే పదే అనిపించసాగింది .

అదే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటే బాగుంటుందేమోమని .చాలా సార్లు టీవీ లో వాటి ప్రకటనలు చూసింది. కొన్ని బాగా నడపకపోయినా కొన్ని ఆశ్రమాలు చాలా బాగుంటున్నాయి . అక్కడ పెద్దవారికి చాలా సౌకర్యంగా ఉంటుందని ఆవిడ భావించారు . అంటే ఇంట్లో లేవని కాదుగానీ అక్కడ తన వయసు వారు ఉంటారు గాబట్టి బాగా కాల క్షేపం అవుతుందని, ఆ రోజు రవి ఇంటికి రాగానే ఈ విషయమై ప్రస్తావించాలని అనుకున్నారు.

ఆఫీస్ నుంచి రాగానే తల్లి అన్యమనస్కంగా ఉండడం గమనించాడు రవి . ఏమ్మా అలా ఉన్నావు ఒంట్లో బాగోలేదా అని అడిగాడు . ఏంలేదురా బాగానే ఉన్నాను అన్నరావిడ . ఒంట్లో బాగోలేకపోతే వెంటనే చెప్పమ్మా దాయకు అన్నాడు.తల్లి తనకోసం పడ్డ కష్టం ఒక్క క్షణం కూడా మర్చిపోడు రవి. కొడుకు తన గురించే ఆలోచిస్తుంటాడని ఆవిడకు తెలుసు. తాను ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరతానంటే ఎంత బాధ పడతాడో కూడా తెలుసు .

అయినా భోజనాలు అయిన తర్వాత ఆవిడ కొడుకు గదిలోకి వెళ్లారు . ఎప్పుడూ అతనే తల్లి గదిలోకి వెళ్లి కూర్చుంటాడు ఇప్పుడు ఆవిడే వచ్చే టప్పటికి ఏదో చెప్పడానికే అనుకున్నాడు.

తల్లి చెయ్యి పట్టుకొని మంచం మీద కుర్చోపెడుతూ ఏంటమ్మా ఇందాకటి నుంచీ చూస్తున్నాను అదోలా ఉన్నావు భోజనం కూడా సరిగ్గా చెయ్యలేదు ఏమయిందమ్మా అంటూ అడిగాడు.


నాకు ఏమీ తోచడం లేదురా అన్నరావిడ . టీవీ లో నీకు ఇష్టమైన ఛానెల్స్ అన్నీ ఉన్నాయి కదా . ఇంకా ఇష్టమైన సినిమాలన్నీ ఇంట్లో ఉన్నాయి చూడడం లేదమ్మా . ఎలా వాడాలో తెలియడం లేదా మళ్ళీ చూపించమంటావా అని ఆత్రంగా అడిగాడు రవి.

అతన్ని చేతితో వారిస్తూ నాకు తెలుసురా కానీ ఒక్కదాన్నే కూర్చుని ఏం చూడమంటావ్ . నువ్వు మరోలా అనుకోకపోతే ఒక మాట చెప్తాను అన్నారు చెప్పమ్మా దానికింతగా అడగాలా అన్నాడు రవి

'ఏం లేదురా ఈ రోజుల్లో చాలా మంది వృధాశ్రమంలో చేరుతున్నారు కదా నేను కూడా 'అని ఆగిపోయారు. రవి ముఖంలో ఆశ్చర్యం,బాధ ఒకేసారి కనిపించాయి .

'అమ్మా'! నివ్వెరపోతూ, అన్నాడు . కొడుకు మనసు చాలా గాయపడింది గ్రహించారు ఆవిడ . నువ్వు బాధపడకురా నీకు ఇష్టం అయితేనే అక్కడైతే నా వయసు వాళ్ళు ఉంటారని అంతే నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు అని బయటకు వచ్చేసారు.

కొడుకు విషణ్ణ వదనం ఆవిడ చూడలేక పోయారు . అతనింక రాత్రంతా నిద్ర పోడని ఆవిడకు తెలుసు . అనవసరంగా ఈ విషయం ఎట్టానేమో ఎత్తానేమో నని ఆవిడ చాలా మధన పడ్డారు . కానీ నా కేదైనా సమస్య వస్తే నా ఒక్కగానొక్క కొడుకుతో కాక ఎవ్వరితో చెప్పుకుంటాను అని సమాధాన పడ్డారు .

ఇక రవి పరిస్థితి అయోమయంగా ఉంది .పని చెయ్యాలని అనిపించ లేదు . కంప్యూటర్ కట్టివేసి బాల్కనీ లోకి వచ్చి నిల్చున్నాడు. అతను చిన్నప్పటి నుంచీ ఒకే ఆశయంతో పెరిగాడు . అది బాగా డబ్బు సంపాదించి తల్లి కి అన్ని సౌకర్యాలు కల్పించాలని . అలాగే చేసాడు కూడా కానీ అన్ని సౌకర్యాల మధ్య ఆవిడా ఒంటరి తనంతో బాధ పడుతున్నారు . ఈ పెద్ద ఇల్లు కట్టి పొరపాటు చేసానా అనుకున్నాడు.అవును నిజమే నేను అమ్మకు అన్నీ ఇచ్చాను వాటికి తోడుగా ఒంటరితనం కూడా ఇచ్చాను. పెద్ద వాళ్లకు కూడా స్నేహితుల అవసరం ఉంటుందని ఎందుకు గ్రహించలేక పోయాను.నేనెప్పుడూ అమ్మ మాటకు ఎదురు చెప్పలేదు కానీ ఈ మాట కు సరే అనగలడా అమ్మ లేని ఇంట్లో ఉండగలడాఅలాగని ఆవిడ బాధ పడుతుంటే చూస్తూ ఉరుకోగలడా పరి పరి విధాల ఆలోచన లతో అన్య మానసికంగా మంచం మీద కూర్చున్నాడు.వంట ఇంట్లోంచి బెదురూమ్ లోకి వచ్చిన సుజాతకు ఆశ్చర్యంగా అనిపించింది .అర్ధ రాత్రి వరకూ కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసుకునే రవి అప్పుడే దాన్ని కట్టెయ్యడం చిత్రంగా అనిపించింది ఏంటండీ ఈ రోజు విశేషం నా కోసం ఎదురు చూస్తున్నారా సరదాగా అంటూ దగ్గరకు వచ్చిన సుజాత భర్త ముఖం చూసి కాళ్లకు ఏదో అడ్డు పడ్డట్టు ఆగిపోయింది.


ఏమైందండీ పిల్లల దగ్గర నుంచి మెయిల్ ఏమైనా వచ్చిందా అయినా నేనిప్పుడే వాళ్లతో మాట్లాడి వస్తున్నాను పాలిపోయిన ముఖంతో అన్నాది.


రాత్రి తన పెర్సనల్ మెయిల్ చూసుకొని జవాబులు పంపిస్తుంటాడు రవి అందుకే సుజాత తల్లి మనసు పిల్లల వేపు వెళ్ళింది.


కాదు సుజా ఇలా వచ్చి కూర్చో అన్నాడు.భర్తని ఎప్పుడూ ఇలా చూడని సుజాత లో సన్నగా వణుకు మొదలయ్యింది.

భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అమ్మ ఓల్డ్-ఏజ్ హోమ్ లో చేరతానంటుంది . ఆ మాట అంటుంటూనే రవి కళ్ళల్లో నీరు ఊరాయి .


అదేంటి ఒక్క నిముషం ఏమీ అర్ధం కాలేదు సుజాత కు అమ్మ నన్ను వదిలి వెళతాను అన్నాడంటే ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో ఆలోచించు .అయినా అమ్మ లేకుండా నేను ఉండలేను అన్నాడు.


ఆ సంగతి సుజాత కు వేరే చెప్ప నవసరం లేదు . అత్తగారికి భర్త కు మధ్య ఉన్న అనుబంధం ఆమెకు బాగా తెలుసు.అందుకే ఇన్నేళ్ల వైవాహిత జీవితంలో ఎప్పుడూ సరదాకి కూడా మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం నేనా మీ అమ్మగారా అని పొరపాటున కూడా అడగలేదు.ఎందుకంటే సమాధానం అమ్మ అని వస్తుందని ఆమెకు తెలుసు . అలాగని ఆమె మీద ప్రేమ లేదని కాదు . ఆ తల్లి కొడుకులిద్దరూ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు . ఇక సుజాత విషయానికి వస్తే ఆమె వారి సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంత జీవితం గడుపుతున్నప్పుడు వారి జీవితాలలోకి ప్రవేశించింది.ఇప్పుడు భర్త ఎంత బాధలో ఉన్నదో ఆమె అర్ధం చేసుకోగలదు .


అందుకే అతనికి ధైర్యం చెప్పడానికి ఇప్పుడు పడుకోండి పొద్దున్న ఏం చెయ్యాలో ఆలోచిద్దాం .అయినా శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయని సామెత ఉంది కదా దీనికి కూడా ఏదైనా పరిష్కారం దొరుకు తుందేమో" అని మళ్ళీ తనే "పోనీ నన్ను ఉద్యోగం మానెయ్యమంటారా"? అని అడిగింది . ఆ ఆలోచన రవికి కూడా వచ్చింది . కానీ సుజాత మాత్రం ఎంతసేపు తల్లితో గడపగలదు . ఇద్దరూ ఎప్పుడైనా మాటకు మాట అనుకొని మనస్పర్థలు కూడా రావచ్చు. అదే మాట పైకి అన్నాడు 

. సుజాతకు కూడా నిజమే కదా అనిపించింది.భర్తకు ధైర్యం చెప్పినా పడుకున్న సుజాతకు నిద్ర కరువయ్యింది . ఆమెకు తల్లి గుర్తుకు వచ్చింది అమ్మ కూడా ఇలాగే బాధ పడుతుందా అనిపించింది మొదటి సారి ఆ దిశగా ఆలోచించడం మొదలు పెట్టింది .


ఈ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఆవిడ రెండు నెలలకు పైగానే ఇక్కడ ఉండిపోయారు . ఇంక వెళ్తాను అనికూడా అనలేదు . కూతుర్ని మనవలని వదలలేకేమో అని అప్పుడు అనిపించింది.బహుశా ఆవిడ కూడా ఒంటరి తనంతో బాధ పడుతున్నారేమో.ఇక్కడ అత్తగారితో కలిసి ఉండడం ఆవిడకు బాగుండేదేమో . ఇద్దరూ కలిసి తోటలో తిరిగే వారు . టీవీ చూస్తూ కామెంట్ చేసేవారు . పేపర్ చదివి రాజకీయాల గురించి చర్చించుకునే వారు. ఇవన్నీ గుర్తుకు వచ్చాయి సుజాతకు . 'అయ్యో ఈ సంగతి ముందుగా ఎందుకు నాకు తట్టలేదు ?"అని ఆమె మనసు తల్లడిల్లింది.

'మనం ఏమనుకుంటాం వాళ్ళగురించి వాళ్లకు అన్ని విషయాలు ఎందుకు? ఏదో ఒక దగ్గర కూర్చుని చూసినంత సేపూ టీవీ చూసి తర్వాత కృష్ణా రామా అనుకోవచ్చు కదా అనుకుంటాం. కానీ మనకూ ఆ వయసు వస్తుంది కదా? మనం అలా ఉండగలమా? ఈ చిన్న విషయం ఎందుకు .మరిచిపోతాం వాళ్లకు కూడా స్నేహితులు ఉండాలని వాళ్ళు వాళ్ళ భావాలు ఎవరితో నైనా పంచుకోవాలని అనుకుంటారని ఎందుకు భావించాము?" . ఇలా అనుకోగానే సుజాత కళ్ళల్లో నీళ్లు ఊరాయి.

ఈ దిశగా ఆలోచించడం మొదలు పెట్టక సుజాత మనసులో ఒక ఆలోచన రూపు దిద్దుకుంది.టైం చూస్తే అప్పుడే నాలుగున్నర అయిపోయింది . భర్త కూడా నిద్రపోయి ఉండడని తెలుసు . లైట్ వెయ్యగానే రవి లెగిసి కూర్చున్నాడు.

"ఇహ మీకు నిద్ర పట్టదు . ముఖం కడుక్కోండి కాఫీ కలుపుతాను". అంటూ పక్కగది లోకి వెళ్ళింది.రవి చాలా సార్లు అర్ధరాత్రి వరకూ పని చేసుకుంటాడు . రాత్రి టీ పెట్టడానికి కిందకి కిచెన్ లోకి వెళ్లలేక పక్కనే కాఫీ టీ పెట్టుకోవడానికి చేసు కున్నారు. 

రవి బాత్రూం లోంచి వచ్చేటప్పటికి రెండు కప్పులతో కాఫీ కలిపి తెచ్చింది సుజాత.రవి కాఫీ తాగుతుండగా," నాకొక ఐడియా వచ్చింది "అన్నాది సుజాత.

"ఏంటి చెప్పు?" అన్నాడు . ఇంతవరకూ నేను ఆలోచించలేదు . అమ్మ కూడా ఇలా ఒంటరితనంతో బాధ పడుతూ ఉండవచ్చు . అమ్మను ఒక రెండు నెలలు ఇక్కడకు వచ్చి ఉండమందాం అత్తయ్య గారు కూడా అక్కడకు వెళ్లి ఉండవచ్చు వాళ్లకు కొంచెం మార్పు ఉంటుంది ఏమంటారు "?అని అడిగింది.


రవి మనసులో రాత్రి నుంచి ఉన్న బాధ అంతా చేత్తో తీసివేసి నట్టు మాయం అయ్యింది."బ్రిలియంట్ ఐడియా కానీ అమ్మ కూడా వెళ్లాలా?' అన్నాడు . "ఎప్పుడూ మా అమ్మనే రమ్మంటే బాగోదు కదా?" నవ్వుతూ అంది సుజాత .నిజమే అనుకున్నాడు రవి ..సుజాత మళ్ళీ మొదలు పెట్టింది . "నేను ఈ విషయం రాత్రంతా ఆలోచించాను ఇది మన ఒక్క కుటుంబ సమస్యే కాదు .దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంది . మనకి తెలిసిన వాళ్ళనే తీసికోండి ఈ ఊళ్ళోనే ఐదారుగురు అత్తయ్య లాంటి వాళ్ళు ఉన్నారు.మా పెద్దమ్మనే తీసికోండి పిల్లలు అమెరికా లో సెటిల్ అయ్యారు ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు . ఆవిడను కూడా రమ్మంటే రావచ్చు .తర్వాత నెమ్మదిగా అందరి లిస్టు తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్లతో మాట్లాడి వీళ్ళు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి ఉండి ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా చూడగలిగితే బాగుంటుంది కదా.!"అన్నాది . 

దానికి రవి, "కానీ దానికి చాలా టైం పడుతుంది . ఇక్కడ ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి.

ఎప్పుడూ ఒక ఇంట్లో ఇద్దరి కన్నా ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి . వాళ్ళకి కూడా పెద్ద వాళ్ళకి చెయ్యాలంటే కష్టం కదా ?"అన్నాడు .

" ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాము ముందు అన్నయ్యకి ఫోన్ చేస్తాను" అంటూ ఫోన్ దగ్గరకు వెళ్ళింది.


పొద్దున్నే చెల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చేటప్పటికి సుకుమార్ కంగారు పడ్డాడు . 'ఏమ్మా సుజాత అందరూ బాగున్నారు కదా'! అని అడిగాడు . 'అందరూ బాగున్నారన్నయ్యా', అంటూ విషయం వివరించింది.


'అలాగే నమ్మా అమ్మను పంపిస్తాను కానీ మీరు ఇల్లు కట్టుకొని వెళ్లిన తర్వాత బొత్తిగా ఇటువైపు రావడం మానేశారు ఆదివారం అందరూ పొద్దున్నే వచ్చెయ్యండి . లంచ్ తర్వాత అమ్మను తీసికొని వెల్దురు గాని' అన్నాడు . 'అలాగే అన్నయ్య' తేలికైన మనసుతో అన్నాది సుజాత.


దూది పింజలా తేలికయ్యింది రవి మనసు . ఆ సమయంలో పూజ పూర్తి చేసుకుని తోటలో కూర్చుంటుంది . 

'అమ్మ కి కాఫీ కలుపు'. అని

మళ్ళీ తానే "వద్దులే నేనే కలుపుతాను" అని రెండు కప్పుల కాఫీ కలిపి ఫ్లేస్క్ లో పోసి తీసికొని వెళ్తుంటే చిన్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి.

తల్లికి కాఫీ అంటే చాలా ఇష్టం కానీ తండ్రి చనిపోయిన తర్వాత కాఫీ కి పాలు ఎక్కువ పడతాయని టీ తాగేది . ఒక్క ఆదివారం మాత్రం కాఫీ కలిపేది .


అదీ రెండు చిన్న గ్లాసులతో . ఇప్పుడు ఇంట్లో చిక్కటి పాలు, ఖరీదైన ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉన్నాయి .అయినా ఆ రోజుల్లో తల్లి కలిపిన నీళ్ల కాఫీ రుచి దీనికి రాదనిపిస్తుంది.

అదే మాట తల్లితో అంటే,' లేదురా కాఫీ ఇప్పుడే రుచిగా ఉంది. అప్పట్లో మనకది అందుబాటులో లేని రుచి. అందుకే వారానికి ఒక్కసారి తాగినప్పుడు ఎక్కువ ఆస్వాదించే వాళ్ళం. ఇప్పుడు రోజూ తాగుతున్నాము కదా, అందుకే అంత రుచిగా అనిపించడం లేదు . అయినా జరిగిపోయిన రోజులు ఎంతో మధురంగా ఉంటాయి .కొంత కాలం గడిచిన తర్వాత ఈ రోజులు కూడా ఎంతో బాగుండేవని అనుకుంటాము .ఏదైనా మనకి దూరం అవుతుందేమో అనిపించినప్పుడే దాని విలువ తెలుస్తుంది" అన్నారు.

"నిజమేనమ్మా నువ్వు చెప్పినవన్నీ నిజం. నువ్వెప్పుడూ నాతోనే ఉంటావని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తానంటే నువ్వు నాకెంత ముఖ్యమో తెలిసింది. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా.' చిన్న పిల్లాడిలా అన్నాడు రవి.

కొడుకు రాత్రంతా నిద్ర పోలేదని రవి రాగానే ఆవిడకు తెలిసింది . కొడుకుని చాలా బాధ పెట్టానని ఆవిడ తల్లి మనసు తల్లడిల్లింది.

"రాత్రంతా నిద్ర పోలేదు కదరా .ఇంట్లో పిల్లలు కూడా లేరు కదా, అందుకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది .ఇంకెప్పుడూ అలా అననురా.

అన్నారు. 'లేదమ్మా నువ్వు నీ బాధ పైకి చెప్పడం వల్లే నా పొరపాటు నాకు తెలిసివచ్చింది.' అంటూ సుజాతకు వచ్చిన ఆలోచన గురించి చెప్పాడు.

'ఎవరైనా ఇంట్లో ఉంటే బయటకు వెళ్తానని అనవు కదమ్మా ?'అన్నాడు.

దానికి ఆవిడ సజల నయనాలతో కొడుకు చెయ్యి పట్టుకొని 'నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నానురా అలాగే సుజాత నా కోడలైనందుకు కూడా ఎంతో ఆనందిస్తున్నాను.

'మీ ఇద్దరూ నా మాటకు విలువనిచ్చి దాని గురించి ఆలోచించారు . ఏదో ముసల్ది ఎక్కడో పడి ఉంటాది. అనుకోకుండా దానికొక పరిష్కారం ఆలోచించారు ఈ వయసులో ఉన్న వాళ్లకు ఇంతకన్నా ఏం కావాలిరా' అన్నారు.


మేడ మీద నుంచి తల్లి కొడుకులను చూస్తున్న సుజాత కళ్ళు కూడా చెమర్చాయి . అంతలోనే వాటిలో తన కొడుకుని తలచుకొని ఒక మెరుపు వచ్చింది . తనకూ ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మను చూసినంత అపురూపంగా తన కొడుకు తనను చూస్తాడని ఆమె గాఢమైన నమ్మకం .



Rate this content
Log in

Similar telugu story from Drama