sesi saradi

Drama Inspirational

4  

sesi saradi

Drama Inspirational

మాతృ దేవో భవః

మాతృ దేవో భవః

9 mins
374



దూరంగా కృంగిపోతున్న సూర్యుణ్ణి చూస్తూ కూర్చుంది పరిమళ .రోజూ చూసే దృశ్యమే అయినా ఏరోజు కా రోజు కొత్తగా కనిపిస్తుంది . అద్భుతంగా అనిపిస్తుంది . ఇన్నేళ్ల జీవితంలో ఏనాడూ రెండు సూర్యాస్తమాలు ఒకలా కనిపించలేదు . ఎప్పుడు చూసినా ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది .అందుకే ఆ దృశ్యం ఆ రోజే మొదటిసారి చూసినంత ఆసక్తిగా చూస్తుంది .


ఆ రోజు "మాతృ దినోత్సవం" అంటే "మదర్స్ డే" . ఎప్పుడూ నిశ్శబ్దం గా ఉండే ఆ వృధాశ్రమం లోకి ఆ రోజు సందడి తీసికొని వచ్చింది .రోజంతా అందులో ఉండేవారు పిల్లలతో, మనుమలతో చాల హడావిడిగా గడిచింది .ఆ "ఆశ్రమ వాటిక" లో ఉంటున్న కొంతమంది ఎవరూ లేనివారు ఉన్నారు . వాళ్ళు బాధ పడకుండా ఉండేందుకు నిర్వాహకులు స్కూల్స్, కాలేజీల నుంచి స్వచ్చందం గా ముందుకు వచ్చిన పిల్లలను వారికీ మనుమలు కింద తీసికొనివచ్చారు.సాయంత్రం అయ్యేటప్పటికి కోలాహలమంతా సర్దుమణిగింది .అందరూ ఎవరి గదులకు వారు వెళ్లిపోయారు . అప్పుడే ఆ ఆవరణలో ఆ ప్రశాంతత మధ్య పరిమళ ఒంటరిగా కూర్చుని ఉంది . ఆ వయసులో ఆ పరిస్థితుల మధ్య ఉన్న చాలా మంది లాగ మనో వేదనతో కృంగిపోకుండా తృప్తిగా ఉంది. మనసు లోని సంతృప్తి ఆమె ముఖంపై ప్రతిఫలిస్తుంది.



ఆ" ఆశ్రమ వాటిక" లో ఉంటున్న చాల మంది, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ధనికులే . వారిలో చాల మంది పిల్లలు విదేశాల్లో లేదా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లినవారే.వారు ఈ ఆశ్రమానికి రావడానికి ఒంటరితనం ముఖ్య కారణమైతే, ఒంటరిగా నివసించే వృధులపై దాడులు పెరగడం కూడా ఒక కారణం.


వీరు ఇలా ఆశ్రమం లో ఉండడం వాళ్ళ వారి పిల్లలు కూడా వీరి గురించి చింత లేకుండా ఉంటారు.



పరిమళ చుట్టూ ఉన్న ప్రశాంతత ను భంగం చేస్తూ సరస్వతి వచ్చింది ."మీ అబ్బాయి వెళ్లి పోయి నట్టున్నాడు". అంటూ సంభాషణ ప్రారంభించింది .అవునన్నట్టుగా తల పంకించింది పరిమళ ."ఈ రోజుల్లో పిల్లలకు తల్లి తండ్రుల పై బొత్తిగా ప్రేమాభిమానాలు తక్కువయ్యాయి ఏదో మొక్కుబడికి వచ్చి ఎప్పుడెప్పుడు బయట పడదామా అని చూస్తుంటారు" . తన పిల్లల పై ఆమెకున్న అసహనాన్ని వ్యక్తం చేసింది.


"అలా ఎందుకనుకోవాలి? మన రోజులకు, ఇప్పటి రోజులకు చాలా తేడా ఉంది . మనకున్న ఖాళీ సమయం వీళ్లకు లేదు. వాళ్ళ ఉరుకుల పరుగుల జీవితాల్లోంచి కనీసం ఈ ఒక్క రోజైనా మనకోసం కేటాయిస్తున్నందుకు నిజంగా మనం సంతోషించాలి', నవ్వుతూ అన్నాది, పరిమళ 


"మీ దంతా వితండ వాదం" అంటూ వెళ్ళిపోయింది, సరస్వతి.



పరిమళ ఆలా అనడం కొడుకుని సమర్ధించడానికి కాదు . అది ఆమె అభిప్రాయం . ఎప్పుడూ అలాగే అనుకుంటుంది . ఆలా అని కొడుకు దూరంగా ఉంటున్నందుకు ఆమె సంతోషంగా ఉన్నదని కాదు . నిజానికి ఒక్కగానొక్క కొడుకు అమెరికా లో స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆమె పడిన బాధ ఇంతా అంతా కాదు.


సురేష్ ఫై చదువులకని అమెరికా వెళ్లి అక్కడే ఉండిపోయాడు .


అతనక్కడ ఇల్లు కొనుక్కున్నప్పుడు అతని అభిప్రాయం ఆమెకు చూచాయగా అర్ధం అయ్యింది . ఆవిడ భయాన్ని కొట్టి పారేస్తూ , "నువ్వేం కంగారు పడకమ్మా! నేను ఇండియా తప్పక తిరిగి వస్తాను . ఇక్కడ అద్దె ఇంట్లో ఉండడం కన్నా స్వంత ఇల్లు ఉంటేనే పొదుపు అవుతుంది" అన్నాడు సురేష్.



ఆ ఇంటి గృహ ప్రవేశం తల్లి తండ్రుల తో చేయించాలనుకున్నాడు సురేష్ . అలా మొదటిసారి అమెరికా ప్రయాణమయ్యారు పరిమళ ఆమె భర్త .గృహప్రవేశం రోజు వచ్చిన ఆహ్వానితుల లోనుంచి ఒక అమ్మాయిని తీసికొనివచ్చి నా కొల్లీగ్ సమంత అంటూ పరిచయం చేసాడు .ఆ రోజు రాత్రి అందరూ వెళ్ళిపోయాక తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని ఒళ్ళో తల పెట్టుకొని" అమ్మా సమంత ఎలా ఉంది? అని అడిగాడు . 


ఆత్రంగా తన వేపు చూస్తున్న కొడుకు కళ్ల లోని భావాన్ని చదివింది పరిమళ.


మరునాడే సమంత తల్లి తండ్రుల తో మాట్లాడు పెళ్లి కుదిర్చారు .వారి కోరిక ప్రకారం పెళ్లి ఇండియా లోనే జరిపించారు . పెళ్లి లో సమంత తెలుగులో మాట్లాడడం విని అందరూ ఆశ్చర్య పోయారు . ప్రశ్నర్ధకంగా చూస్తున్న అందరికీ, "వీకెండ్స్ లో తెలుగు అసోసియేషన్ కు వెళ్లి నేర్చుకుంది "అంటూ గర్వంగా చెప్పాడు సురేష్ .


పెళ్ళైన తర్వాత సమంత పేరు కూడా మార్చుకుంది . ఆలా అమెరికా అమ్మాయి 'సమంత', ఇండియా కోడలు 'సుమిత్ర' గా మారింది. కోడల్ని చూసుకొని పరిమళ, ఆమె భర్త కూడా ఎంతో ఆనందించారు.


తాము వెతికి తీసికొని వచ్చినా సురేష్ కు ఇంత మంచి, అనుకూలవతి అయిన భార్యను తేలేమని అనుకునేవారు . సురేష్ కు పెళ్ళైన మరుసటి సంవత్సరమే అతని తండ్రి రామ రావు గారు మరణించారు . అయన సంతోషం గా తృప్తిగా తనువు చాలించారు. కానీ పరిమళ ఒంటరిగా మిగిలిపోయింది .


"ఇంత ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటావు మాతో అమెరికా వచ్చేయి" అని సురేష్, సుమిత్ర ఎంతగా నో ప్రాధేయ పడ్డారు .కానీ ఇల్లు వదిలి వెళ్లాలని అనిపించలేదు .


అలాగే సంవత్సరాలు గడిచాయి . సురేష్ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు .ప్రతి సంవత్సరం కుటుంబంతో ఇండియా వస్తూనే ఉన్నాడు . రోజూ రెండు సార్లు ఫోన్ చేసి బాగోగులు కనుక్కుంటూ ఉంటాడు. అయినా ఏదో వెలితి .అలా పది సంవత్సరాలు గడిచాక ఇంక ఒంటరిగా ఉండడం అసాధ్యం అనిపించింది . ఫోన్ చేసి సురేష్ ను ఒకసారి రమ్మని అడిగింది . కంగారు పడుతూ వెంటనే వచ్చాడు .


"ఇంక ఒంటరిగా ఉండలేనురా! ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ చూడు . అందులో చేరతాను" అని చెప్పింది. దానికి సురేష్ చాలా బాధ పడ్డాడు . మళ్ళీ అమెరికా వచ్చేయ్య మని బలవంతం చేసాడు .కానీ ముందు లాగే పరిమళ తిరస్కరించింది.


"ఈ వయసులో అక్కడకు వచ్చి ఆ వాతావరణం లో ఇమడడం కష్టం రా"అన్నది .దానికి సురేష్" ఇంత పెద్ద ఇల్లు ఉంది .ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరడం ఎందుకమ్మా? నీకు అన్ని సౌకర్యాలూ ఇక్కడే ఏర్పాటు చేస్తానమ్మా" అన్నాడు.


" ఇప్పుడు సౌకర్యాలు లేవని కాదురా. రోజులు బాగోలేవు .ఎవ్వరినీ నమ్మలేము .మొన్నటికి మొన్న పక్క వీధి లోని రిటైర్డ్ జడ్జి గారిని, అయన భార్యను హత్య చేసి ఇల్లంతా దోచేశారు . బాగా తెలిసిన వాళ్ళ పనేనంట. ఇక ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదురా . ఇక్కడ నేనెలా ఉన్నానోనని నువ్వు కూడా కుదురుగా ఉండలేవు. ఓల్డ్ ఏజ్ హోమ్ లో మా లాంటి వారికీ రక్షణ ఉంటుంది . భయం లేకుండా నిశ్ఛయింతగా శేష జీవితం గడుపుతాం" అన్నారు .


 అప్పుడు కూడా పరిమళ కొడుకుని తిరిగి వచ్చేయమని అడగలేదు . తల్లి అంతగా వివరించాక, సురేష్ ఆమెను ప్రస్తుతానికి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచడానికే నిర్ణయించు కున్నాడు . 



ఊర్లో ఉన్న వృధాశ్రమాలన్నీ చూసి వచ్చాడు . అతనికి "ఆశ్రమ వాటిక" బాగా నచ్చింది. ఒక వారం రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాడు.


అప్పుడు ఇల్లు ఏం చెయ్యాలనే సంభాషణ వచ్చింది . "నీ ఇష్టంరా నీకు ఎలా బాగుంటుందని అనిపిస్తే ఆలా చెయ్యి .అద్దెకు ఇవ్వచ్చు, ఇల్లు అమ్ముదామన్నా నాకేమీ అభ్యంతరం లేదు".


అని పరిమళ అంటే కళ్ల నీళ్లు తెచ్చుకున్నాడు సురేష్ ." ఆలా అనకమ్మా !ఈ ఇంటి కోసం నువ్వూ, నాన్న గారూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు . ఈ ఇంట్లో నా చిన్నతనపు తీపు గుర్తులు ముడిపడి ఉన్నాయి . ఈ ఇంట్లో ఇంకెవరు ఉన్నా నేను సహించలేనమ్మా . నా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఈ ఇంట్లోనే పెరగాలని నా కోరిక . అది ఇప్పట్లో అసాధ్యం అనిపిస్తున్నా అదే నా అభిమతం" అన్నాడు .



ఈ సంఘటన జరిగి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది . పరిమళ కు" ఆశ్రమ వాటిక"లో కాలక్షేపం బాగానే జరిగిపోతుంది . ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు అయినా. అప్పుడప్పుడు కొడుకు, కోడలు, మనుమలు దగ్గర ఉంటె బాగుండునని అనిపిస్తుంది .


ఈ రోజు కొడుకు రావడం ఆమెకు ఎంతో ఆనందం కలిగించింది . మనసు ఆమె చిన్నతనం వేపు వెళ్ళింది.


మాతృ దినోత్సవం యొక్క ఔచిత్యం గురించి తెలిసిన రోజు గుర్తుకు వచ్చింది . అప్పటి సంగతులన్నీ నిన్న మొన్న జరిగినట్టు స్పష్టంగా ఉన్నాయి . ఆ రోజులు ఆమె హృదయం ఫై అంత పటిష్టమైన ముద్ర వేసాయి


.ఆ సంవత్సరం పరిమళకు స్కూల్ లో ఆఖరు సంవత్సరం . ఆ సంవత్సరమే "మదర్స్ డే" గురించి తొలి సారి తెలిసింది. అప్పుడే పరిమళకు పిల్లలపై తల్లికి ఉండే వెల కట్టలేని మమకారం గురించి తెలిసింది . ఆ రోజు నుంచి పరిమళ మనసంతా ప్రేమ తో నిండి పోయింది .ఇప్పుడు దాదాపు ఏభై సంవత్సరాల తర్వాత, ఎంత పనైనా నోరు మెదప కుండా, గొంతు పెంచకుండా చేస్తూ, అందరికీ అనురాగం పంచి ఇచ్చిన తల్లి గుర్తుకు వచ్చింది . ఎప్పుడో జరిగి, ఎప్పటికీ తిరిగి రాని ఆ రోజులు ఇప్పుడే జరిగినట్టు కళ్ళ ముందు కదలాడాయి.



పరిమళ స్కూల్ ఫైనల్ చదువుతుండగా మొదటిసారి "మథర్స్ డే" గురించి తెలిసింది . స్కూల్ లో అందరూ అదే మాట మాట్లాడు కుంటున్నారు .కానీ పరిమళ లో మాత్రం ఎలాంటి ఉత్సాహం లేదు. పరిమళకు తల్లితో చనువు తక్కువ . ఏదైనా పని చెప్పడానికి లేదా తమ్ముడినో, చెల్లెలినో ఎత్తు కోవడానికి మాత్రమే తల్లి తన ను పిలుసుందని , తల్లికి తనపై ఏ విధమమున ప్రేమ లేదని ఆమె అనుకునేది .



పరిమళ వాళ్ళకి రెండెకరాల మాగానీ భూమి ఉంది . పొలంలో తండ్రి కష్టపడితే , ఇంట్లో ఎటువంటి సహాయం లేకుండా పనంతా తల్లే చేసుకునేది .వాళ్లెప్పుడూ పస్తులు ఉండక పోయినా పెద్దగా సౌకర్యాలు లేకుండా చాలా సామాన్య జీవితం గడిపేవారు.పరిమళ తన సామాన్యమైన బట్టలను మిగిలిన పిల్లల బట్టలతో పోల్చుకుని బాధపడేది .ఇక "మదర్స్ డే" గురించి ఆమె ఏం పట్టించు కుంటుంది? ఆమె స్నేహితులందరూ ఏదో ఒక బహుమతి కొంటున్నారు . డబ్బు లేనివారు వాళ్ళ చేతులతో ఏదో ఒకటి చేస్తున్నారు."మదర్స్ డే" రోజు బహుమతులు చూసుకొని తల్లుల మొహాలలో కనిపించే ఆశ్చర్యం గురించి అప్పుడే మాట్లాడు కుంటున్నారు .కానీ పరిమళ మాత్రం" ఇదేంటి మనకి ఎప్పుడూ తెలియనిది. ఇప్పుడెందుకు చేసుకోవాలి" అనేది.


"మదర్స్ డే" మర్నాడనగా స్కూల్ త్వరగా వదిలి పెట్టడం వాళ్ళ ఇంటికి మధ్యాహ్నమే తిరిగి వచ్చింది పరిమళ . ఎప్పటి లాగే వీధి తలుపు వేసి ఉంది . పక్కన ఉన్న సందులోంచి ఇంటి  వెనకకు వెళ్ళింది . ఆమె పేరు వినిపించి అక్కడ ఆగిపోయింది.


"నేనేం చెయ్యను కాంతా! నీకు మా పరిస్థితి తెలుసు కదా! పని కి మనిషిని పెట్టుకోలేము. కానీ పరిమళకు ఈ సంవత్సరం స్కూల్ లో ఆఖరు సంవత్సరమంట. పెద్ద పరీక్ష రాయాలంట దానికి పని చెప్పాలంటే బాధగా ఉంటుంది.కానీ ఒంటరిగా చేసుకోలేక, దాని సాయం తీసుకోవలసి వస్తుంది .ఆలా దానికి పని చెప్తున్నప్పుడు ఎంతో బాధ పడుతున్నాను . అందుకే దానితో సరిగ్గా మాట్లాడ లేక పోతున్నాను కూడా" తల్లి గొంతులోని నిస్సహాయత పరిమళ గుండెల్ని పిండి వేసింది .


అంతలో "నేవ్వేమి చెయ్య గలవులే కమలా! అయినా పరిమళ చిన్న పిల్ల కాదు కదా, పరిస్థితిని అర్ధం చేసుకుంటుందిలే. నువ్వేమీ బాధ పడకు" అని "ఇంక వెళ్తాను ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది" అంటూ ఆమె అత్త వెళ్ళడానికి నిలుచుంది.ఆమెను బయటి వరకూ సాగనంపడానికి ఆమె తల్లి వెళ్లడం గమనించి కూడా పరిమళ ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోయింది.



ఆమె హృదయం ఆనందం తో నాట్యం చేస్తుంది . మనసంతా తల్లి పట్ల ప్రేమతో నిండిపోయింది .ఆ నిముషం లో ఆమె జీవితం మారిపోయింది .ఇన్నాళ్లూ తల్లి మనసు అర్ధం చేసుకోనందుకు ఎంతో బాధ పడింది .ఆమెకు అప్పుడే మర్నాడు" మదర్స్ డే" అని గుర్తుకు వచ్చి ఇంకా బాధ పడింది.అయ్యో అమ్మ మనసు ఒక్క రోజు ముందు తెలిసినా ఎంత బాగుండేది ఇప్పుడు ఏమి చెయ్యాలి అనుకుంటూ మధన పడింది .నేను ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మ ఏమీ తేడా చూపించదు కానీ ఏదైనా చెయ్యాలి అమ్మకి నా ప్రేమ తెలపాలి అనుకుంది.ఇంతలో లోపలకు వచ్చిన కమల కూతురుని చూసి" పరిమళా ఎప్పుడు వచ్చావమ్మా ?అని సమాధానం కోసం చూడకుండా" రా "అంటూ పళ్లెంలో సున్నుండలూ, చేగోడీలూ తెచ్చి, "తిను. కాంతమ్మత్త తెచ్చింది" అని ఇచ్చింది .


ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా తల్లి నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె గుండెల్లో ముఖం దాచుకుంది పరిమళ . దాంతో కమల కంగారు పడుతూ , ఏమయ్యిందమ్మా? స్కూల్ లో మాస్టారు కోప్పడ్డారా? అని అడిగింది . "లేదమ్మా "అంటూ "అమ్మా రేపు మదర్స్ డే" అని చెప్పింది. అంటే అన్న తల్లి ప్రశ్నకు ఏమి చెప్పాలో తెలీక "రేపు ఆదివారమమ్మా" అని మాత్రం అనగలిగింది.



"అయితే రేపు ఆలస్యంగా లేప మంటావా?"అన్న తల్లి ప్రశ్నకు, అవునంటూ తల ఊపింది .


అప్పుడే అమెకొక ఆలోచన వచ్చింది . రాత్రి పడుకునే టప్పటికి ఏం చెయ్యాలో నిర్యాయించుకుంది .రోజూ కమల నాలుగు గంటలకే లేచి వీధి గుమ్మం , పెరడు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గులు పెట్టి తర్వాత పశువుల శాల తుడిచి ఆవు పాలు పిండుతుంది . మర్నాడు ఆ పనంతా చేసి తల్లి ని ఆశ్చర్య పరచాలని తీర్మానించు కుంది పరిమళ.


ఇదే నేను అమ్మకిచ్చే మదర్స్ డే బహుమతి అనుకుంటూ నిద్ర పోయింది. రాత్రంతా మధ్య మధ్యలో లేచి టైం చూసుకుంటూ చివరికి మూడు గంటలకు పక్క మీద నుంచి లెగిసి బయటకు వచ్చింది .ఆ రోజు నక్షత్రాలు ఎంతో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్నట్టు కనిపించాయి . బహుశా చుట్టూ దీపాలు లేకపోవడం వల్లేమో అనుకుంది .



పెరడు, వీధి గుమ్మం శుభ్రంగా తుడిచింది . పేడతో ఒత్తుగా కళ్ళాపి జల్లి ముగ్గులు పెట్టింది .తర్వాత పశువుల శాల తుడిచి పాలు పిండడానికి తయారయ్యింది . ఎందుకో ఆవు ఆశ్చర్యంగా చూసినట్టు అనిపించింది.తల్లి పక్కన లేకుండా ఎప్పుడూ ఒంటరిగా పాలు పిండలేదు తన్నదు కదా అనుకుంటూ నెమ్మదిగా పాలు పిండింది.పల గిన్ని పట్టుకు వెళ్లి పొయ్యి పక్కన పెట్టి మూత పెట్టింది . అప్పటికి నాలుగు అవుతుంది.నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా ఇంట్లోకి వచ్చి మంచం మీద పడుకుని దుప్పటి ముసుగు పెట్టుకుంది.


తల్లి బయటకు వెళ్లడం, తిరిగి వెంటనే లోపలకు రావడం వినిపించింది . తల్లి అందెల చప్పుడు దగ్గరగా రావడంతో గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలు పెట్టింది పరిమళకు .


"పరిమళా" అంటూ ముఖంపై దుప్పటి తీసింది కమల . బయటి నుంచి పడుతున్న చిరు వెలుగులో కొత్త కాంతితో మెరుస్తున్న తల్లి ముఖాన్ని తదేకంగా చూసింది పరిమళ .ఆ కాంతి ఒక తల్లికి పిల్లలపై ఉండే అపారమైన మమకారం . పని ఒత్తిడిలో మరుగున పడే ఆ ప్రేమ అప్పుడప్పుడు ఇలా మనసులోంచి బయటకు తొంగి చూస్తుందేమో . "ఎందుకు చేశావమ్మా అంత పని ,చూడు అరచేతులెలా కంది పోయాయో" అన్న ఆమె గొంతులో ఎప్పుడూ వినిపించని ఆత్మీయత వినిపించింది పరిమళకు.


"అమ్మ ఎంత అల్ప సంతోషి ఇప్పుడు నేనేం చేశానని ఇంత ఆనందిస్తుంది" అనుకుంది మనసులో. తల్లిని చూస్తూ "అమ్మా నువ్వంటే నాకెంతో ఇష్టం అందుకే అందుకే…." అంటున్న పరిమళను గుండెకు హత్తుకుందామె . ఇద్దరి హృదయాలలోనూ ప్రేమ పొంగి పొరలింది .ఆమె చేసిన చిన్న పని వాళ్ళ జీవితాల్లో ఎంత మార్పు తెచ్చిందో గమనించిoది పరిమళ.


ఆ రోజు ఆమె ప్రేమ మానవ సంబంధాలలో ఎంత మార్పు తెస్తుందో తెలుసుకుంది . అంతే ఆ రోజు నుంచి చుట్టూ ఉన్నవారికి ప్రేమని మాత్రమే పంచింది . ఆ రోజు పనంతా ఐన తర్వాత తల్లికి "మదర్స్ డే" గురించి వివరించింది .



గతం లోంచి బయటకు వచ్చిన పరిమళకు తల్లి ఇంకా పక్కనే ఉన్నట్టుగా అనిపించింది .అప్పుడే ఆమెకు వెనక అడుగుల చప్పుడు వినిపించింది ."రాత్రి భోజనానికి అప్పుడే టైం అయ్యిందా" అనుకుంటూ వెనక్కి తిరిగిన ఆమెకు నడిచి వస్తున్న సురేష్ కనిపించాడు.ఆమె కు ఆశ్చర్యం తో బాటు సంతోషం కూడా వేసింది."ఎయిర్ పోర్ట్ లో ఎదో ప్రాబ్లెమ్ వచ్చిందమ్మా! నా ఫ్లైట్ ఇంకో నాలుగు గంటల వరకూ బయలు దేరదoట .ఆ టైం నీతో గడుపుదామని తిరిగి వచ్చాను" అన్నాడు.


పరిమళ మనసు గర్వంతో పొంగి పోయింది . ఈ టైం సురేష్ ఎక్కడైనా గడపవచ్చు . స్నేహితులను కలుసుకోవచ్చు . కానీ తల్లితో గడపాలని వచ్చాడు. ఏ తల్లి కైనా ఇంతకంటే గర్వ కారణం ఇంకేం ఉంటుంది."అమ్మా నీతో ఒక సంగతి చెప్పాలి. ఇప్పుడు చెప్దామని అనుకోలేదు. కానీ ఎలాగూ వచ్చాను కదా !".అంటూ తల్లి పక్కన కూర్చున్నాడు.


ఆమె చెయ్యి పట్టుకొని" అమ్మమ్మ ఎప్పుడూ నువ్వు ఇచ్చిన 'మదర్స్ డే' బహుమతి గురించి చెప్తుండేది.ఈ రోజు నీకు నేను డబ్బుతో కొనేది ఏదైనా ఇవ్వగలను. కానీ అమ్మమ్మకు నువ్వు ఇచ్చిన ఆనందాన్ని మాత్రం ఇవ్వలేను. నీకు ఏం కావాలో నాకు తెలుసమ్మా! కానీ ఈ సంవత్సరం అది నీకు ఇవ్వలేక పోయాను .కానీ నీకు ఒట్టు పెట్టి చెప్తున్నాను . వచ్చే 'మదర్స్ డే' మన ఇంట్లోనే జరుగుతుందమ్మా".అన్నాడు.సంభ్రమంగా చూస్తున్న తల్లితో" అవునమ్మా మేము ఇండియా తిరిగి వచేస్తున్నాము. సుమిత్ర ,నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాము . అక్కడ అన్నీ సెటిల్ చేసుకుని రావాలి కదా! అందుకే ఒక సంవత్సరం పడుతుందని అంటున్నాను" .


పరిమళ కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఆకాశంలో మబ్బుల మధ్య నుంచి తొంగి చూస్తున్న నక్షాత్రాల మధ్య నుంచి నవ్వుతూ తల్లి చూస్తున్నట్టు అనిపించింది . ఎప్పుడో బాల్యంలో తల్లి ఫై ఉన్న ప్రేమను చూపించడానికి చేసిన చిన్న పని పరిమళ జీవితాన్ని మార్చింది . ఆమె అందరిపై చూపించిన ప్రేమ ఆమె జీవితంలో కూడా వెలుగును ఆనందాన్ని తెచ్చి పెట్టింది .ఈ రోజు పరిమళకు నిజమైన "మదర్స్ డే" . 







Rate this content
Log in

Similar telugu story from Drama