Kalyani B S N K

Drama Others

4.5  

Kalyani B S N K

Drama Others

ఊటబావిమా అమ్మమ్మలు

ఊటబావిమా అమ్మమ్మలు

2 mins
34.6K


ఏడుకొండలు గాడు అలా అనకుండా ఉండాల్సింది...వాడికి మూతి పగిలేదీ కాదు, నాకు వీపు చిట్లేదీ కాదు..

ఆరేళ్ళ వయసులో రెండో తరగతి చదువుతూన్న నాకూ తెలియదు..నాలుగేళ్లు కూడా నిండని నా చెల్లెలికి తెలియదు.. వాడ్ని అంతగట్టిగా కొట్టామని -వాడి కింది పెదవి చిట్లి రక్తం కారే దాకా..

రక్తం కనపడగానే వాడు ఒక్కపెట్టున గట్టిగా గుక్కపెట్టి ఏడవడం మొదలు పెట్టాడు.

ఇంతలోనే  ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్పడం..వాడి అమ్మమ్మ వచ్చి నన్ను తిట్లకి లంకించుకోవడం..అదంతా చూస్తూ మ్రాన్పడిపోయిన మా టీచర్ వాడి అమ్మమ్మ శాపనార్ధాలనుండి నన్ను రక్షించడానికి నా వీపు మీద ఒక్కటి చరిచారు..అంతే అసలే అర్భకంగా తెల్ల తోలుతో ఉన్న నేను కిందపడి కళ్ళు తేలేసి గిలాగిలా కొట్టుకున్నానట..అప్పటిదాకా గైగయి మంటున్న వాడి అమ్మమ్మ నన్ను భుజానికేసుకుని బడి అరుగుల మీద పడుకోబెట్టి నీళ్లు, మజ్జిగ, సోడా.. ఇన్ని పట్టించి పైట చెంగుతో విసురుతూ అరగంట సేపు ఆపసోపాలు పడితే గానీ తేరుకోలేదట.. తీరా నేను తెప్పరిల్లి లేచి చూసేసరికి ఏడుకొండలు గాడు ఒక చేత్తో నిక్కరు పైకి లాక్కుంటూ హనుమంతుడి మూతిలా వాచిపోయిన ఆ నోటితో అమ్మమ్మా లేచిందే..పాపగారు  లేచిందే....అంటున్నాడు .  నా  పక్కనే కూర్చున్న నా చెల్లెలు జేబు నిండా బఠానీలు తో, చేతిలో బంక చాకెలెట్ తో ( బహుశా దాని ఏడుపు ఆపడానికి వాళ్ళు అవి కొని ఇచ్చి ఉంటారు) కళ్ళు విప్పార్చి నన్నే చూస్తోంది...

నన్ను లేవదీసి వొళ్ళో కూర్చొబెట్టుకుని మా టీచర్ అడిగారు ..ఇంతకీ రబ్బరు బంతితో వాడి మూతి మీద ఎందుకు కొట్టావ్ అని..అప్పుడు మా చెల్లి చేతికంటిన చోకలెట్ బంక ని చీకుతూ..

"మరేమో వాడు ఒక కొబ్బరుండ అక్కకి, ఒకటి నాకు ఇచ్చి మా అమ్మమ్మ చేసింది చాలా బాగుంటుంది తిను అన్నాడు..అక్కేమో మా గణపారం అమ్మమ్మ కూడా బాగా చేస్తుంది అంది..మరి మీ తాత ఒక్కడే ఉంటాడు కదా..మీ అమ్మమ్మ చచ్చిపోయిందని మా నాన్న చెప్పాడులే అన్నాడు ..మాకు ఐదు అమ్మమ్మలు ఉంటే వాడేందుకు అలా అనాలి అందుకే అక్క వాడిని కొట్టింది." అని చెప్పింది గుక్క తిప్పుకోకుండా .


టీచర్ ఏదో అనేలోపే మూతి పగిలిన ఏడుకొండలుగాడి పిర్రమీద వాడి అమ్మమ్మ ఒక్కటిచ్చి ..పంతులుగారి మనవరాలిని  అలా అనొచ్చా.. హన్నా...అంటూ వాడి    రెక్కపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది.. 


 మాకు  అమ్మమ్మ లేనిలోటు తెలియకుండా తమ గుండెలకు హత్తుకున్న ఆ గొప్ప తల్లులను తలచుకొన్నప్పుడు, అమ్మమ్మా అని పిలిచే ప్రతి సారీ.....వారితో గడిపే ప్రతీ క్షణం ..నాకు ఈ సంఘటన గుర్తుకు వస్తుంది.


కొసమెరుపు ఏమిటంటే అంత ప్రేమ గల ఆ అమ్మమ్మలలో ఒకరు నాకు అత్తమ్మ గా మారి

నాకు అంత అనురాగాన్నీ ఆత్మీయంగా పంచడం.


Rate this content
Log in

Similar telugu story from Drama