Kalyani B S N K

Drama

3.6  

Kalyani B S N K

Drama

రూపాయి వెనుక..

రూపాయి వెనుక..

4 mins
432


అక్కా నాకూ పిప్పరమెంటు బిళ్ళలు కొనూ... ఊఊ..ఎవ్వరికీ వినపడకుండా గారంగా నా చెవిలో రాగం తీస్తోంది నా చెల్లెలు..

తెలుగు వాచకం లో "తొలకరి" అనీ నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పాఠం చెప్తున్నారు మా టీచర్...నేలబల్ల మీద ముందువరస లో కూర్చున్నా .పక్కనే నా నేస్తం మల్లీశ్వరి కీ నాకూ మధ్యలో కూర్చుంది చెల్లి. చేతిలో గులాబీరంగులో సగం చప్పరించిన పిప్పరమెంటు బిళ్ళ..ఫ్..ఫ్..అని గాలి లోపలకి పీల్చుకుంటూ మధ్య మధ్య చప్పరిస్తూ ..నా చెవిలో ఏదో చెప్తూ..ఒక పది నిమిషాలనించి ఇదే పని తనకి.. 

పాస్బెల్ అప్పుడు అందరూ పాండు కొట్లో బఠానీ లో, బంక చాకలెట్లో , పిప్పరమెంటు బిళ్ళలో కొబ్బరుండలో కొనుక్కుని తింటుంటారు..పావలా జేబులో ఉంటే ఇంకో ఇద్దరికి అప్పచ్చులు  కొనిపెట్టి పోజులు కొట్టొచ్చు..ఎందుకంటే అలా కొనిపెట్టేవాడే అసలు మిత్రులని అనుకొనే వయసది మరి.

నిజానికి నాకూ అలా కొనుక్కోవాలని వుంది కానీ అలా కొనుక్కుని తినటం సదాచారం కాదని బామ్మ, తాతయ్య ఒప్పుకొనేవారు కాదు.ఒకవేళ కొన్నా అవి నాన్నో అమ్మో ఏలూరు నుంచి కొని తెచ్చి డబ్బాలో పోసి సాయంత్రం బడి నుంచి ఇంటికెళ్లాక కాళ్ళూ చేతులూ కడుక్కుని బట్టలు మార్చుకుని తినాలి...అంతే తప్ప బడిలో తినటం , కొనుక్కోవటం ప్రసక్తే లేదు...నాకైతే కొంత ఊహ ఉంది కాని మరీ చిన్నది నా చెల్లెలు . అందుకే బాజీ వెనుక, మల్లీశ్వరి తోనూ చనువుగా ఉండే తనకి వాళ్లే ఏదో ఒకటి పెట్టేవారు.

అలా ఎప్పుడూ తనే తీసుకోవటం వాళ్ళకి ఏమీ ఇవ్వకపోవటం నచ్చలేదు చెల్లికి ...అందుకే పొద్దుటినుంచి గొణుగుతోంది. 

తర్వాత రోజు ఆదివారం..అమ్మ తలంట్లు పోసి మా పొడుగాటి జుట్లకు తువ్వాలుతో పిడప పెట్టి ముందు వసారా సీడీల మీద ఎండలో కూర్చోమంది..జలుబు చేయకుండా ఉంటుందని. ఇంతలో తాతయ్య వచ్చి నన్ను పిలిచి చేతి వేళ్ళతో నొప్పి లేకుండా నా జుట్టు చిక్కు తీస్తున్నారు...ఉదయం పది గంటలకల్లా భోజనం చేసేసే అలవాటు మా ఇంట్లో..అందుకే అమ్మ మడిగా వంట చేసుకునే పనిలో పడింది.. బామ్మ బియ్యంలో వచ్చిన నూకలు తిరగలి లో వేసి రవ్వ విసురుతోంది. ఒక కాలు మడత వేసి మరో కాలు నుంచోబెట్టి కూర్చున్న నా చెల్లెలు బాలజ్యోతి పుస్తకం లో కథలు పైకి చదువుతున్న అన్నయ్య ముఖం లోకే తదేకంగా చూస్తోంది. వడ్రంగి సుబ్బారావు ఇంటికెళ్లి వచ్చిన నాన్న కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కొంటూ.. అమ్మలూ ..ఎవరో ముష్టతను వచ్చాడు ఓ పావలా వెయ్యి ..అన్నారు. ఒక్క గెంతులో వరండా నుంచి మధ్య హాల్లోకి వెళ్లి టేబుల్ డ్రాయర్ లో తాతయ్య చిల్లర దాచే పాండ్స్ క్రీమ్ డబ్బా తెచ్చాను.. తాతయ్య అందులోంచి ఒక పావలా బిళ్ళ తీసి ఇవ్వగానే బిచ్చగాడికి నేనే వేసి ఆ డబ్బా లోపల పెట్టటానికి వెళ్ళాను..నిన్న ఉదయం చెల్లి అడిగిన విషయం గుర్తొచ్చింది..మళ్ళీ ఆ డబ్బా మూత తీసి పది పైసలు బిళ్ళ కోసం వెతికాను..ఊహు.. లేదు..అన్నీ పావలా బిళ్లలే.. తీసుకుంటే తాతయ్య నా వీపు విమానం మోత మోగించేస్తారు..అడిగే ధైర్యం లేదు..అంతే ఒక బిళ్ళ తీసుకుని ఆ డబ్బా టేబుల్లో పెట్టేసి పావలా బిళ్ళ నా పెన్సిల్ బాక్స్ లో పెట్టేసి నేను మళ్ళీ తాతయ్య దగ్గరకి వరండా లోకి వెళ్లిపోయా చిక్కు తీయించుకోటానికి.

మర్నాడు ఉదయం పాస్బెల్ టైం లో పాండు కొట్టు ముందు నేను, నా చెయ్యి పట్టుకుని నా చెల్లెలు, ఇంకా చుట్టూ నేస్తాలు.. నాకు ఏదో భయం, కొంచెం సంతోషం, బోల్డంత గర్వం ..చొక్కా జేబులోంచి పావలా తీసి పాండుకి ఇవ్వగానే పాపగారూ మీరేంటి ఇక్కడ..అంటూనే నాకు, చెల్లికి, నా నేస్తాలకి జేబునిండా బఠాణీలు పోసి తలకో పిప్పరమెంటు బిళ్ళా చేతిలో పెట్టాడు..ఆనందంగా బడికి వచ్చేసాం అందరం..ఆ రోజు బడిలో నా నేస్తాలందరూ నన్ను గొప్పగా చూసినట్టు నాకనిపించింది.

బడి తర్వాత ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తున్నామా ...ఇంకో రెండు నిమిషాల్లో ఇంటికి వెళ్తామనగా నా చెయ్యి ఒక్కసారిగా విదిలించుకుని మా చెల్లి ఇంటివైపు పరుగో పరుగు...ఆ వెనుకే పొడుగాటి పుస్తకాలసంచి మోకాలికి తగులుతున్నా సరే పట్టించుకోకుండా నేనూ పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాను..అప్పటికే జరగవల్సింది జరిగిపోయింది.. ఇంకా వగరుస్తూనే గట్టిగా అరచి చెప్తోంది చెల్లి..

"మరేమో అక్క ఈ రోజు బళ్ళో నాకు, తన ఫ్రెండ్స్ కి బఠానీ లు, పిప్పరమెంటు బిళ్ళలు కొనిపెట్టింది..."అంటూ..

ఒక్కసారిగా ముచ్చెమటలు పట్టేసాయి..కాళ్ళలో వణుకు..అలా మ్రాన్పడిపోయాను.

"ఎక్కడివే డబ్బులు...హవ్వ..అలా బయట కొనుక్కొనితినటం మన ఇంటా వంటా ఉందా..అటుకులో, వేరుశనక్కాయలో, పాలకోవా బిళ్ళలో ఏవో ఒకటి మీ అమ్మ డబ్బాలో పోసి బల్లమీద పెట్టే వెళ్తోందాయే..అవి తినొచ్చుగకదా..అయినా పొట్టనిండా అన్నం తినండి అంటే తినరు.. ఇవన్నీ ఎందుకు... ఉండు మీ నాన్న రానీ మీ పని చెప్తాను.." బామ్మ మాటల ప్రవాహం ఆగటంలేదు. నా మొహంలో రంగులు మారటం ఆవిడ గమనించలేదు. ఆవిడకు అంతగా చూపు ఆనదు..అందుకు. తాతయ్య ఏదో అనే లోపే అమ్మ వంటింటి లోంచి నా వైపు గబగబా వచ్చి నా జబ్బ పట్టుకుని నీళ్ల తొట్టి దగ్గరకు తీసుకెళ్లిపోయింది. కాళ్ళు, కళ్ళు కడిగి బట్టలు మార్చుకోడానికి పక్క గదిలోకి నన్ను పంపి, బామ్మతో చెప్తోంది.." రాత్రి కొంచెం దగ్గు వచిందండీ అత్తయ్యగారూ పెద్దదానికి.. అందుకే వేరుశనక్కాయలు ఎందుకులే బఠాణీలు కొనుక్కోమని నేనే చెప్పాను" అమ్మ ఠక్కున అబద్ధం చెప్పేసింది. లోపల ఉన్న నేను గతుక్కుమన్నాను..అప్పటికే డబ్బుల డబ్బా చేత్తో పట్టుకుని నా వైపు వస్తున్న తాతయ్య కూడా అమ్మ మాటలు విని , విషయం అర్ధం చేసుకుని అక్కడే ఆగిపోయారు ఏదో ఆలోచిస్తున్నట్లుగా.

రాత్రి భోజనాలు కూడా తాతయ్య కి, బామ్మకి, పిల్లలకి అంటే మాకు అమ్మ ఏడుగంటలకే పెట్టేసేది. టీవీ కొనకముందు అయితే ఇంకా పెందరాడే తినేసేవాళ్ళం. నాన్న ఏలూరు నుంచి మా ఊరు అంటే కొప్పాక ఇంచుమించు పది పన్నెండు మైళ్ళు సైకిల్ తొక్కుకొని వచ్చేసరికి రాత్రి ఏడు దాటేది. అందుకే అమ్మ నాన్న వచ్చేదాకా చూసి ఆయనతో కలిసి భోంచేసేది.

ఆ రోజు నాన్నకి ఇంకా ఆలస్యం అయినట్లుఉంది. ఈ లోపే నేను నిద్రపోయాను. ఎందుకో మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే చీకటి..కరెంట్ పోయినట్లుంది. ఫ్యాన్ తిరగట్లా. కోడిగుడ్డు లాంతరు వెలిగించి ఆ వెలుగులో అమ్మ, నాన్న భోజనం చేస్తూ లో గొంతుక లో మాట్లాడుకుంటున్నారు..."ఏంటోనండీ నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు ..మనపిల్లలు దొంగతనంగా డబ్బులు తీసుకోవడమేంటి...అవసరమైతే అడగొచ్చుగా...మవయ్యగారికి కోపమొస్తే దాని వీపు అంటుకుపోయేది..అసలే అర్భకప్రాణి ..భయమేసి పెరట్లోకి లాక్కు పోయాను" కొంచెం వణుకుతున్న గొంతు తో అమ్మ మాట్లాడుతోంది నాన్నతో.

పకపకా నవ్వేసారు నాన్న. " మరీ అంత పెద్ద పదా లెందుకు లక్ష్మీ..దాన్ని దొంగతనం అనకూడదు. అందరూ కొనుకుంటూంటే వాళ్ళకీ కావాలనిపించిందేమో.. మీ రాద్దాంతం చూసి చంటిది ఎంత భయపడిందో ఏమిటో...దగ్గరకు తీసుకొని పడుకో.." నాన్న మనసు ఎంత విశాలమో రెండో తరగతి చదువుతున్న నా ఊహాలకి అందలేదు..

అప్పుడే నిర్ణయించుకున్నా....అడగకుండా ఏ వస్తువూ వాడకూడదని, డబ్బులైతే అసలే ముట్టుకోకూడదని.

మరుసటి రోజు ఉదయం మా ఇంట్లో ఆ విషయమే జరగనట్లు అంతా అతి మామూలుగా జరిగిపోయింది...

మా నాన్న ఒక గొప్ప మనస్తత్వ శాస్త్రజ్ఞుడు అయి ఉంటారు..ఎంతైనా బడిపంతులు కదా...

ఆయన ఒక మనసున్న మాంత్రికుడు కూడా...ఏ మంత్రమో వేసే ఉంటారు నా కాపుదలకి..

బహుశా మా ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయం గుర్తుండి ఉండదు...నాకు తప్ప..

ఇంత పెద్దయ్యాకా... ఇద్దరు పిల్లల తల్లయ్యకా కూడా అది నాకు ప్రతిక్షణం గుర్తుకొచ్చే గుణపాఠం.



Rate this content
Log in

Similar telugu story from Drama