Kalyani B S N K

Drama

3.4  

Kalyani B S N K

Drama

పట్టెమంచం

పట్టెమంచం

2 mins
406


పట్టెమంచం ..

పదం నాకెందుకో కొన్ని జన్మల నుంచి పరిచయమున్న పదం లా అనిపిస్తుంది. అమ్మపడుకునే గదిలోకి కొత్తరకం డబల్ కాట్ రాకముందు నాలుగు ఎత్తు రాళ్ళ మీద కుదురుగా కుదురుకున్న ఆ పట్టెమంచం...దానిమీద బూరుగు దూది పరుపు...ఇంకా పైన బామ్మ పాత నేతచీరలతో

తాానే స్వయంగా కుట్టిన మెత్తటి బొంత, ఆ పైన తెల్లని సైను గుడ్డ తో కూడిన దుప్పటి...

నాలుగేళ్ళ పసి వయస్సులో నేను రెండేళ్ల నా 

చెల్లెలు పావని ని కూర్చోబెట్టుకుని ఆ పట్టెమంచం మీద చెప్పిన పచ్చిమిరపకాయ్ బుడ్డోడి కథ, ఎర్ర జుట్టు కోడిపుంజు కథ... బాలజ్యోతి పుస్తకంలో బొమ్మలను చూస్తూ అన్నయ్య చదివే కథలను కన్నార్పకుండా మేమిద్దరం ఊ కొడుతూ వినటం..

ఆ మంచం పక్కన కిటికీ లోంచి ప్రహరి గోడ మీదుగా వీధిలో వెళ్ళేవాళ్ళని గమనించడం, మరి ముఖ్యంగా వర్షపు రాత్రులలో మెరుపులు, ఉరుములు వచ్చినప్పుడు అర్జునా ఫల్గునా అంటూ దుప్పటిలో తల కూడా దూర్చేసి ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడం...

ఓహ్..పట్టెమంచం నా బాల్యపు మధురోహలను ఎన్నింటినో తనలో ఇముడ్చుకుంది.


పట్టెమంచం తో నాకున్న అనుభవాలన్నీ నాకిష్టమైనవే అనికూడా చెప్పలేను..ఎందుకంటే 

అప్పట్లో అమ్మకు ఎక్కువగా వచ్చే ఆ వింత తలనొప్పి కి ఆముదం ఆకు తెచ్చి నాన్న కట్టు కడుతున్నప్పుడు అమ్మకి ఇంకా వాంతులై పోతుంటే నీరసంగా  ఆ మంచం మీదే అతుకున్నట్టు గా పడుకుని ఉండేది...నిజం చెప్పొద్దూ.. అలాంటి చాలా సార్లు నాకు అమ్మ చనిపోతుందేమో అని చాలా భయం వేసేది.

తెల్లవారి లేచి అమ్మ నాన్నతో కబుర్లు చెపుతూ కాఫీ తాగుతున్నప్పుడు ..అప్పుడు నాకు తిరిగి ఊపిరి అందినట్లనిపించేది..

మరోోసారి ఇలాగే  వెం తాతయ్య తో బొకారో లోో  నెల్లూరు వెళ్ల వలసిన అన్నయ్య ఆ పట్టేమంచం చివరన నుంచుని కాళ్ళెత్తి స్విచ్ వేస్తున్నప్పుడు కిందపడి తలకి గాయమై గిద్దెడు రక్తం కారి ఆ రాత్రి మాకు కాళరాత్రి చేసింది...


ఏది ఏమైనా పట్టెమంచం అనగానే నాకు వర్షపు సాయంత్రాలలో ఆ మంచపు పక్కనున్న కిటికీలోంచి మధు మాలతి, సన్నజాజుల పరిమళాల కలబోతను ఆస్వాదిస్తూ అమ్మ పెట్టిన వేడి వేడి పకోడీలను తిన్న అద్భుతమైన క్షణాలు కళ్ళముందు మెదులుతాయి..నన్ను తిరిగి నా బాల్యం లోకి నెట్టేస్తాయి.


నేేననుకుంటాను ...

బొమ్మరిల్లు దగ్గరినుంచి, కొబ్బరాకు బూరదాకా.. 

చొక్కా బొత్తం దగ్గరినుంచి కాకెంగిలి పప్పు ఉండ దాకా .. 

చమ్కీ పూసల నుంచి తిరగలి రాళ్ళ దాకా..

ప్రతీ వస్తువు నా చిన్నతనపు జ్ఞాపకాల చిరునామా అని..

నా ఈ జ్ఞాపకాల చిట్టా లో పట్టెమంచం దే   ప్రధమ తాంబూలం మరి.


Rate this content
Log in

Similar telugu story from Drama