ఉగాది
ఉగాది
శ్రీ క్రోధి నామ సంవత్సర ప్రారంభం
{యుగాది} ఉగాది విశిష్టత:_***
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఈ పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.
కొత్త సంవత్సరాదైన ఉగాది నుండే వసంతకాలం మొదలవుతుంది. వాతావరణం ఈ రోజు నుండి ప్రత్యేక అందాలను సంతరించుకొంటుంది. ఈ సమయంలో వృక్షాలు కొత్త ఆకులు, పూలతో చూపరులను ఆహ్లాదపరుస్తాయి.
ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి. “యుగ” అనగా కాలమని “ఆది” అంటే ఆరంభం అని అర్ధం. తెలుగువారు “ఉగాది” అని కన్నడిగులు “యుగాది” అని మరాఠీలు “గుడి పాడ్వా” గా ఈ పండగని జరుపుకుంటారు. ప్రవాసులు తమ తమ దేశాల్లో “ఉగాది”ని ఆచారాలకనుగుణంగా నిబద్ధతతో జరుపుకొని విదేశీయుల దృష్టిని ఆకర్షిస్తుంటారు.
ఉగాది రోజున కొత్త పనులు, నిర్ణయాలు ప్రారంభించే సమయమని తెలుగు ప్రజలు నమ్ముతారు. అంతే కాకుండా ఈరోజు కొత్త వస్తువులను కూడా కొని ప్రారంభించటం ఆనవాయితీ.
ఉగాది చరిత్ర కోణం:-**
బ్రహ్మ విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజునే ఉగాది పండగ అని పురాణాల ప్రవచనం. ఈ ఉగాది పండగ చారిత్రిక వివరాలను కూడా కలిగి ఉంది. ఉగాది పండగ శాలివాహనుల కాలం నుండి ఆచరణలో ఉన్నాదని చరిత్రకారుల మాట. అప్పటి శాలివాహనుల రాజు “గౌతమీపుత్ర శాతకర్ణి”గా పేర్గాంచిన రాజా శాలివాహన ఉగాది పండగకు శ్రీకారం చుట్టారు.
చాంద్రమాన కాలం ప్రకారం ఒక యుగానికి 60 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకొనే ఉగాదికి ఒక పేరు చొప్పున 60 పేర్లు పెట్టినట్లు చరిత్ర చెపుతోంది. ఈ 60 ఉగాది నామ సంవత్సరాల తరువాత వచ్చే ఉగాదికి తొలి సంవత్సరపు ఉగాది పేరుతొ తిరిగి ప్రారంభం అవుతుంది.
ఉగాది ఆచరణ విధానం:_***
ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం…మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.
(1) తైలాభ్యంగనం:_*
తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు
అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.
(2) నూతన సంవత్సర స్తోత్రం:-**
అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.
(3) ఉగాడి పచ్చడి సేవనం:_**......
ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!
అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను.
ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.
(4) పూర్ణ కుంభదానం:_***
ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం.
ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.
_(5) పంచాంగ శ్రవణం**"..
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.
ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు.
ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.
లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి
ఉగాది సంవత్సరాల నామాలు – వివరణ:_***...
ఉగాది నూతన సంవత్సరం భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజల కొత్త సంవత్సర వేడుక. ప్రతి యుగానికి 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ప్రతి ఉగాదికి జ్యోతిష శాస్త్ర ప్రభావాల ఆధారంగా పంచాంగంలో ఒక ప్రత్యేక పేరు ఉంది. ఈ ఉగాది నామ సంవత్సరం ఆ యొక్క సంవత్సరపు ప్రత్యేకతని తెలుపుతుంది. ఇలా 60 సంవత్సరాల పేర్లు ఉన్నవి. ఆ ఉగాది పేర్లు మీకోసం దిగువన ఇవ్వబడ్డాయి. అయితే ఈ 2021 ఉగాది ప్లవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది.
1.ప్రభవ, 2.విభవ, 3.శుక్ల, 4.ప్రమోద్యూత, 5.ప్రజోత్పత్తి, 6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భావ, 9.యువ, 10.ధాత, 11.ఈశ్వర, 12.బహుధాన్య, 13.ప్రమాధి, 14.విక్రమ, 15.వృష, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ , 19.పార్థివ, 20.వ్యయ, 21.సర్వజిత, 22.సర్వధారి, 23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ, 28.జయ, 29.మన్మధ, 30.దుర్ముఖి, 31.హేవళంబి, 32.విళంబి, 33.వికారి, 34.శార్వరి, 35.ప్లవ, 36.శుభకృత, 37.శోభకృత, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ, 41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య, 44.సాధారణ, 45.విరోధికృత, 46.పరిధావి, 47.ప్రమాదీచ, 48.ఆనంద, 49.రాక్షస, 50.నల, 51.పింగళ, 52.కాళయుక్తి, 53.సిద్ధార్థ, 54.రౌద్రి, 55.దుర్మతి, 56.దుందుభి, 57.రుధిరోద్గారి, 58.రక్తాక్షి, 59.క్రోధన, 60.అక్షయ.
ఉగాది ప్రత్యేక వంటకాలు:_****
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో “బొబ్బట్లు”, “పూర్ణం బూరెలు” విధిగా చేస్తారు.ఈ రెండు వంటకాలు తెలుగు ప్రజల పూజల్లో “పవిత్ర వంటకాలు”గా నిలుస్తాయి. తెలుగు ప్రజలు ఈ రెండు వంటకాలను తాజా ఆవు నెయ్యిని జోడించి ఆరగిస్తారు.
ఉగాది పచ్చడి విశిష్టత:__-***
“ఉగాది”నాడు చేసుకొనే పచ్చడి ఎంతో ప్రాముఖ్యమైనది. షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు) రుచులు మిళితమై ఉంటాయి.
ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే సంతోషం(తీపి), దుఃఖం(చేదు), కోపం(కారం), భయం(ఉప్పు), విసుగు(చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం. అంతేకాకుండా ఈ ఆరు రుచులు ఆరు రకాలైన లాభాలను కలుగచేస్తున్నవి.
కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది.
చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.
_పచ్చిమిరపకాయలు శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది.
మామిడిముక్క జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది._
వేపపువ్వు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది._
ఉగాది పచ్చడి తాయారు చేసే విధానం:_-**"
ఒకటిన్నర కప్పు నీరు.
రెండు టేబుల్ స్పూన్ల మామిడి తరుగు.
కొద్దిపాటి వేప పువ్వులు.
మూడు టేబుల్ స్పూన్ల బెల్లం.
తగినంత ఉప్పు.
రెండు సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు
_ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం.
ఉగాది పంచాంగ శ్రవణం:_---***
ఈ రోజు యుక్త వయస్కులు, నడివయస్కులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు ఎంతో శ్రద్ధగా వారి వారి స్థాయిల్లో పంచాంగ శ్రవణం చేయటం పరిపాటి. వారి రాశి ఫలాలను నూతన సంవత్సరాదిన ఎలా ఉండబోతుందో మిక్కిలి ఆశక్తితో జ్యోతిష్య పండితులు చేసే పంచాంగ పఠనాన్ని ఎంతో జాగ్రత్తగా ఆశక్తితో వింటారు.
_ హరాక్షర 3074
