Teju Vanga

Drama Inspirational

4  

Teju Vanga

Drama Inspirational

షూరిటీ

షూరిటీ

6 mins
393


షూరిటీ


"ఇదిగో మాధవ్ నీకు ఇంకో నాలుగురోజులు మాత్రమే టైమ్ ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు నా అప్పు తీర్చలేదో నేనేం చేస్తానో నీ ఊహకి అందదు. గుర్తుపెట్టుకో నాలుగురోజుల్లో నా అప్పు తీర్చాలి." అని నోటికొచ్చిన నాలుగు తిట్లు తిట్టి వెళ్ళిపోయాడు సుబ్బారాయుడు.

సుబ్బారాయుడు వడ్డీవ్యాపారస్తుడు. అధికవడ్డీలు వసూలు చెయ్యడు, ధర్మ వడ్డీకే డబ్బులు ఇస్తాడు. కానీ షూరిటీ లేకుండా ఇవ్వడు. బంగారం, వెండి, ఇల్లు,పొలం ఇలా ఏదో ఒకటి తనఖా పెట్టుకుని అప్పు ఇస్తాడు. ఇవేమి లేకపోతే గౌర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తి షూరిటీ సంతకం పెడితేకాని అప్పు ఇవ్వడు. చేసేది వడ్డీ వ్యాపారమే అయినా నీతిగా వుంటాడు కాబట్టి, ఊళ్ళో చాలామంది అవసరం కోసం సుబ్బారాయుడి దగ్గరే చేయిచాస్తారు.

        @@@@@@@@@@@

సుబ్బారాయుడు వెళ్ళిపోయాక దిగులుగా సోఫాలో కూర్చున్న మాధవ్ దగ్గరకు వచ్చింది భార్య.

"ఏవండీ దబ్బు సర్దుబాటు అవ్వలేదా?"

"ఎక్కడ అవుతుంది సరోజ. అదేమన్నా రూపాయా? పాపాయా? పదిహేను లక్షలు. ఎక్కడినుండి తేవాలి అంతడబ్బు. పైగా అందులో ఒక్కరూపాయి కూడా నేను వాడుకోలేదు. గట్టిగా ఏడవలేకపోతున్నాను సరోజ. స్నేహితుడని నమ్మి షూరిటీ పెట్టినందుకు నన్ను నట్టేటముంచి పారిపోయాడు. వాడెక్కడ వున్నాడో తెలియదు. కానీ ఈ సుబ్బారాయుడు మాత్రం నా పీక మీద కత్తి పెట్టాడు."

"పోనీ ఒకసారి రాణి వదిన దగ్గరకు వెళ్ళిరాకపోయారా. అన్నయ్యగారి గురించి ఏమన్నా తెలిసేది."

" ఇంకా గారు ఎందుకులే సరోజ. వాడు చేసినపనికి నరికి ముక్కలు చెయ్యాలన్నంత కోపం వస్తుంది. కానీ వాడేమో అయిపులేకుండా మాయం అయ్యాడు. అక్కడ ఆ రాణి గారేమో వెళ్ళగానే అన్నయ్యగారు ఆయన జాడ ఏమయినా తెలిసిందా అని నన్నే అడుగుతుంది. ఇంకా ఆ రాజేష్ గురించి నాకేం చెప్తుంది."

"మరి ఇప్పుడేం చేద్దామండి."

" అదే అర్ధం కావటంలేదు సరోజ. పోనీ లోన్ అన్నా పెడదామా అంటే ఉద్యోగంలో చేరి సంవత్సరం కూడా అవ్వలేదు. ఇప్పటికిప్పుడు లోన్ రావాలంటే చాలా టైమ్ పడుతుందని అంటున్నారు."

"పోనీ మావయ్యగారితో ఒక మాట చెప్దామా?"

"అప్పుడు కానీ నా చెమడాలు వలిచేయడు."

------------

"పోనీ మా నాన్నని ఏమయినా సర్దుబాటు చెయ్యమని అడగనా?" తండ్రి దగ్గర అంత సొమ్ము ఉండదని తెలిసినా, భర్త బాధ చూడలేక అడిగింది. ఏమో తండ్రి ఎక్కడన్నా అప్పుగా దబ్బు ఇప్పిస్తాడేమో అని.

"నీకు పెళ్ళిచెయ్యటానికే మీ నాన్న దగ్గర దబ్బు లేదు ఇంకా నాకు ఎక్కడ నుండి సర్దుబాటు చేస్తాడు అని గట్టిగా అరిచేసాడు." కానీ తనేమన్నాడో గుర్తొచ్చి భార్య మొహం చూసాడు.

అప్పటికే కళ్ళనిండా నీళ్లతో నిలబడిన సరోజని చూసి,

"సారీ బంగారం ఏదో కోపంలో అనేశాను" అంటూ తనని దగ్గరకు తీసుకుని పక్కనే కుర్చోపెట్టుకున్నాడు.

"సారీ సరోజ ఆ రాజేష్ మీద కోపంతో అలా అనేశాను. అంతేకాని నిన్ను తక్కువ చెయ్యాలని కాదు. నన్ను క్షమించు."

"ఏవండీ అలా మాట్లాడకండి.మీరు టెన్షన్ లో వున్నారని నాకు తెలుసు. మీరు అలా అన్నారని నేను బాధపడటంలేదు ఎందుకంటె అది నిజం కనుక. నా తల్లితండ్రులు నాకు పెళ్లి చేయలేని స్తోమతలో ఉన్నా, కేవలం నేను నచ్చాను అన్న కారణంతో మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి అన్ని ఖర్చులు మీరే పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకున్న గొప్ప మనసు మీది. అంత చేసిన మీకు ఈ సమయంలో ఏ సాయం చేయలేకపోతున్నాను అన్న బాధతో ఏడుపొస్తుంది కానీ మీరు నా పుట్టింటివారిని అన్నారని కాదు అంటూ భర్త కౌగిట్లో ఒదిగిపోయింది."

భార్యని దగ్గరకు తీసుకుని ఆలోచనల్లో మునిగిపోయాడు మాధవ్.

మాధవ్ మృధుస్వభావి. తల్లితండ్రిల మీద భయభక్తులు కలవాడు. పెళ్లివయసు వచ్చినా గౌర్నమెంట్ ఉద్యోగం వచ్చేవరకు పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడు.తీరా ఉద్యోగం వచ్చేసరికి ముప్పై రెండేళ్లు వచ్చేసాయి. ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టినా వయసు చూసి ఎవరు ముందుకురాలేదు. మాధవ్కి కూడా ఎవరు నచ్చలేదు. చివరికి పెళ్లిళ్ల పేరయ్య దగ్గర సరోజ ఫోటో చూసి ఇష్టపడ్డాడు కానీ సరోజ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే అని తెలియటంతో తల్లితండ్రుల్ని ఒప్పించి పెళ్లి ఖర్చులు కూడా తనే పెట్టుకుని సరోజని భార్యగా చేసుకున్నాడు. పెళ్ళికి ఖర్చులకోసం చేసిన రెండు లక్షల అప్పు తీర్చటం కోసం పొదుపుగానే సంసారాన్ని లాక్కొస్తున్నాడు.

తమ పరిస్థితి అర్ధం చేసుకుని పెళ్ళిఖర్చులు కూడా తనే పెట్టుకుని తనని పెళ్లి చేసుకున్నాడన్న కృతజ్ఞతతో పాటు మాధవ్ అంటే ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్న సరోజ కూడా భర్త చాటు భార్యగా ఉంటూ అక్కరలేని వైషమ్యాలకి పోకుండా ఉత్తమఇల్లాలుగా నడుచుకుంది. పెళ్లి అవ్వగానే ఉద్యోగం చేసేదగ్గరకు మకాం మార్చిన మాధవ్ కి సాయంగా ఉన్న పక్కింటి రాజేష్ వల్ల వచ్చింది ఇప్పుడు చిక్కు.

కొత్తకాపురానికి సాయంగా ఉండటమే కాకుండా అన్నయ్యగారు సరోజ ని నేను చూసుకుంటానులే మీరు నిశ్చింతగా వుండండి అంటూ వచ్చినకొత్తలోనే కలుపుకుపోయిన రాణి వల్లే రాజేష్ కూడా పరిచయం అయ్యారు. మొదట పలకరింపులతో మొదలయిన ఒకరింట్లో మరొకరు భోజనం చేసేవరకు వెళ్లాయి స్నేహాలు.

అప్పుడే రాజేష్ చేసే వ్యాపారం దెబ్బతినటంతో బ్యాంక్ కి కట్టాల్సిన లోన్ కట్టకపోవటంతో ఇప్పుడు మొత్తం కట్టమని లేదంటే అరెస్ట్ చెయ్యాల్సొస్తుందని నోటీసులు పంపారని, డబ్బు అవసరమని చెప్పాడు. అలా ఎక్కడెక్కడో తిరిగిన డబ్బు దొరకలేదని చెప్పాడు ఒక వారం తరువాత.

మరుసటి రోజు మాధవ్ ఇంటికొచ్చి బ్యాంక్ డబ్బు కట్టాల్సిన గడువు అయిపోయిందని ఇంకా డబ్బు కట్టపోతే తనని అరెస్ట్ చెయ్యటం ఖాయమని అప్పుకోసం తిరుగుతూ సుబ్బారాయుడి దగ్గర అప్పు తీసుకోవాలంటే షూరిటీ కావాలని, తన దగ్గర ఆస్తిపాస్తులేమీ లేవని, ఇప్పుడు నువ్వే దిక్కని మొగుడు,పెళ్ళాం ఇద్దరు మాధవ్ కాళ్ళ మీద పడ్డారు.

"అరే రాజేష్ ఏం చేస్తున్నావ్. నా కాళ్ళమీద పడటం ఏంటి? లే ముందు."

"లేదు మాధవ్ ఈ సమయంలో నువ్వు మాత్రమే నాకు సాయం చెయ్యగలవ్. నువ్వు సాయం చేస్తానంటేనే నేను లేస్తాను. లేదంటే చావటం తప్ప నాకు మార్గం లేదు."

"రాజేష్ నావల్ల అయ్యేసాయం అయితే నేను తప్పకుండ చేస్తాను. ముందు లేవండి."

"రాజేష్ పైకి లేస్తూనే నీవల్ల అవుతుంది మాధవ్. నువ్వు సాయం చేస్తే నాతోపాటు నా కుటుంబాన్ని కూడా రక్షించునవాడివి అవుతావు మాధవ్. ప్లీజ్ మాధవ్ నాకు సాయం చెయ్యి."

"రాజేష్ నీకు సాయం చెయ్యాలని నాకు వుంది కానీ నేనే అప్పుల్లో వున్నాను నీకెలా సాయం చేస్తాను చెప్పు. పైగా నీకు ఇవ్వటానికి కూడా నా దగ్గర అంత డబ్బులేదు."

"నువ్వు నాకు డబ్బు సాయం చెయ్యక్కరలేదు మాధవ్. మాట సాయం చెయ్యి చాలు."

"మాట సాయమా?"

"అవును మాధవ్.నీకు తెలుసుగా సుబ్బారాయుడి గురించి. ఆయన డబ్బు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు కాకపోతే ఆయన షూరిటీ లేకపోతే డబ్బు ఇవ్వడు. నా దగ్గర షూరిటీ పెట్టడానికి ఏం లేదు. అందుకే నువ్వు సాయం చేస్తే నా పని అవుతుంది మాధవ్."

"ఆయన  డబ్బు ఇవ్వటానికి నేనేలా సాయం చెయ్యగలను రాజేష్. నా దగ్గర మాత్రం ఆస్తులు లేవు కదా."

"నీ ఆస్తులు అక్కరలేదు మాధవ్. ఒక్క సంతకం చాలు. నీ ఒక్కసంతకం వల్ల ఆయన డబ్బు అప్పుగా ఇస్తాడు."

"నేను సంతకం చేస్తే నీకు అప్పు ఎలా ఇస్తాడు."

"ఆయనకు ఏదయినా షూరిటీ కావాలి. ఆస్తి పాస్తులు లేకపోతే గౌర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి షూరిటీ సంతకం పెడితే అప్పు ఇస్తాడు. నువ్వు ఒక్క సంతకం పెట్టు చాలు మాధవ్."

"అదేంటి సంతకం పెడితే అప్పు ఇవ్వటం ఏంటి."

"అంటే ఒకవేళ అప్పు తీసికున్న వాళ్లు తిరిగి డబ్బు ఇవ్వకపోయినా వడ్డీ కట్టకపోయినా మధ్యలో షూరిటీ ఉన్న వ్యక్తిది రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఆయన అప్పు ఇస్తాడు. కానీ నా విషయంలో నీకు భయం అక్కరలేదు. నేను నెల నెల వడ్డీ కట్టడమే కాకుండా ఆరునెలల్లో ఆయన అప్పు కూడా తీర్చేస్తాను. నా మీద నమ్మకం వుంచు మాధవ్."

ఈ వ్యవహారం అంతా అయోమయంగా అనిపించి భర్త వంక చూసింది సరోజ.

భార్య కళ్ళలో భయం చూసి ముందడుగు వెయ్యలేకపోయాడు మాధవ్.

అయితే సరోజ కళ్ళలో భయం చూసి ఆమెను సమీపించింది రాణి.

"సరోజ ఇవి చేతులు కాదు కాళ్ళనుకో నువ్వయినా చెప్పు సరోజ. మా గురించి నీకు తెలుసుగా."

"అది కాదు ఒదిన అంత డబ్బుకి షూరిటీ గా వున్నాడని మావయ్యగారికి తెలిస్తే మాట వస్తుంది. అందుకే ఒక్కసారి మావయ్యగారికి చెప్పి అప్పుడు ఆయన సంతకం చేస్తారు."

"చెల్లెమ్మ నువ్వు భయపడటంలో తప్పులేదు. కానీ నా మీద నమ్మకం ఉంచండి. ఆరునెలల్లో మిమ్మల్ని ఆ టెన్షన్ నుండి బయటపడేస్తాను. ప్లీజ్ మాధవ్ ఒప్పుకో" అంటూ మాధవ్ కి ఆలోచించుకునే వ్యవదిలేకుండా మొగుడు పెళ్ళాం ఇద్దరు ఎన్నిరకాలుగా బ్రతిమాలలో అన్నిరకాలుగా ప్రయత్నించి చివరికి విజయం సాధించారు.

వచ్చినప్పటినుండి తమకు సాయం చేసే రాజేష్ దంపతులు మంచివారే అన్న నమ్మకంతో స్వతహాగా మృధుస్వభావి అయినా మాధవ్ చివరికి సంతకం పెట్టడానికి రాజేష్ వెనుక వెళ్ళాడు.

పెద్ద పెద్ద మీసాలతో ఖద్దరు బట్టలు వేసుకుని మెడలో లావుగా వుండే బంగారు చైన్, రెండు చేతులకి కలిపి పదికన్నా ఎక్కువే ఉన్న బంగారు ఉంగరాలతో భారీ శరీరంతో వుండే సుబ్బారాయుడిని చూసి ఒకింత భయపడిన మాధవ్, డబ్బు ఇచ్చి తన చేత షూరిటీ సంతకం పెట్టించుకునేటప్పుడు "అతను వడ్డీ కట్టకపోయిన ఇస్తానన్న టైమ్ కి డబ్బు ఇవ్వకపోయినా డబ్బు కట్టాల్సిన బాధ్యత నీదే" అని చెప్పిన మాటలయితే తన చెవుల్లో మారుమ్రోగుతూనే వున్నాయి.

డబ్బు చేతికొచ్చాక రాజేష్ వాళ్ళ ప్రేమాభిమానాలు మరింత ఎక్కువయ్యాయి. కొన్నాళ్ళకి ఆ డబ్బు గురించి, సుబ్బారాయుడు మాటల గురించి మర్చిపోయాడు మాధవ్.

అయితే నాలుగు నెలల తరువాత సుబ్బారాయుడు ఇంటి మీదకు వచ్చేవరకు తెలియలేదు రాజేష్ వడ్డీ కట్టలేదన్న విషయం.

వెంటనే రాజేష్ తో మాట్లాడటానికి రాజేష్ ఇంటికి వెళ్ళాక తెలిసింది రాజేష్ ఇంటికి వచ్చి వారం అయ్యిందని. బిసినెస్ పని మీద ఊరు వెళ్తున్నాని వెళ్లినవాడు ఇంటికి రాలేదని తెలిసింది. కనీసం ఫోన్ కూడా తియ్యటంలేదని తెలిసి ఏం చెయ్యాలో పాలుపోలేదు.

నెల రోజులు ఆగిన సుబ్బారాయుడు ఇంకా తన ఇంటిమీదకు వచ్చి డబ్బు మొత్తం కట్టాలని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అక్కడికి రాజేష్ కనిపించటంలేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు కానీ ప్రయోజనం లేదు.

మళ్ళీ ఇవాళ సుబ్బారాయుడు వచ్చి గడువు ఇచ్చి వెళ్ళాడు ఏం చెయ్యాలో పాలుపోక ఆలోచనలో మునిగిపోయాడు.

తన కౌగిలిలో ఉన్న సరోజ ఒక్కసారిగా లేచి బెడ్రూమ్లోకి వెళ్లటంతో ఆశ్చర్యంగా చూసాడు.

బెడ్రూంలో ఏవో తీసుకుని దేవుడిపటాల దగ్గరకు వెళ్లి తెల్లదారానికి పసుపు రాస్తుంది. తన ప్రయత్నం ఏమిటో అర్దమయ్యి సరోజ దగ్గరకు వెళ్ళాడు మాధవ్.

"సరోజ ఒద్దు."

"లేదండి ఈ నగలతో పాటు నా మెళ్ళో బంగారు తాళిని కూడా అమ్మేస్తే మూడు లక్షలయిన వస్తాయి కదా. ముందు అవి కట్టేసి ఆ పెద్దాయన్ని గడువు అడిగితే ఇస్తారు కదా. అప్పుడు మెల్లగా వడ్డీ కడుతూ మీకు లోన్ వచ్చాక కట్టొచ్చు."

"అందుకని మెళ్ళో తాళిబొట్టు కూడా అమ్మేస్తావా."

"మీరు మళ్ళీ నాకు చేపించరా ఏంటి. అయినా బంగారంతో చేస్తే తాళి అవుతుందా. పసుపు తాడు కూడా తాళిబొట్టె. ముందు ఇది నామెడలో కట్టండి."

"ఒద్దు సరోజ."

"ముందు మీరు కట్టండి." అని భర్త చేతుల్లో పసుపుతాడు పెట్టి తనే కట్టించుకుంది.

మెళ్ళో ఉన్న బంగారు తాళిబొట్టుని తియ్యబోతుంటే, "ఆగమ్మ" అన్న మాట వినిపించి వెనక్కి చూసారు మొగుడూపెళ్లాలు ఇద్దరు.

గుమ్మంలో నిలబడి ఉన్న సుబ్బారాయుడిని చూసి ముందు భయపడినా తరువాత తేరుకుని,

"మీ పనిమీదే వున్నారండి అయన్నేం అనకండి. ఇప్పటికే చాలా బాధపడుతున్నారు ఒక్క గంటలో మీకు కొంత డబ్బు ఇస్తారు. మిగిలినది కూడా మెల్లగా ఇచ్చేస్తామండి" అని చేతులు రెండు జోడించి ఏడుస్తూ చెప్పింది సరోజ.

"అవసరంలేదమ్మా మీరు ఆ డబ్బు కట్టక్కరలేదు." అంటూ సరోజ చేతులను పట్టుకుని, "నన్ను క్షమించమ్మా మిమ్మల్ని చాలా బాధపెట్టాను. కానీ నా వృత్తే అది. వాడు డబ్బు ఎగ్గొట్టి వెళ్లిపోవటంతో మీరే కట్టాలని పట్టుపట్టాను కానీ ఇప్పుడు మీ మాటలు విన్నాక అర్ధమయ్యింది మీ మంచి మనసు ఏంటో."

"మాధవ్ నువ్వు ఇంత మెత్తగా ఉన్నావ్ కాబట్టే ఆ రాజేష్ నిన్ను మోసం చెయ్యాలనుకున్నాడు. "

"ఏంటి రాజేష్ నన్ను మోసం చెయ్యాలనుకున్నాడా?"

"అవును కావాలనే నాటకం ఆడి నీ చేత సంతకం పెట్టించాడు. మెల్లగా జారుకుని సమయం చూసి భార్య పిల్లల్ని కూడా ఇక్కడినుండి తీసుకెళ్లిపోవాలనుకున్నాడు. నాకు ఆ విషయం తెలిసిన వాడు ఎక్కడ వున్నాడో తెలియక నీమీద కావాలనే అరిచాను. ఇంకా డబ్బు నిన్నే కట్టమని అల్టిమేటం జారీ చేసానని భార్య రాయబారం పంపగానే హ్యాపీగా డబ్బు మొత్తం తన సొంతం అయిపోయిందని కలుగులో ఉన్న ఎలుక బయటకు వచ్చింది. మా వాళ్ళకి చిక్కింది. ఇకనయినా ఇలాంటి యెవ్వారాల్లో తల దూర్చకుండా బంగారంలాంటి అమ్మాయితో సంతోషంగా వుండు."


"మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియట్లేదండి. నన్ను నా భార్యను మీరే ఈ కష్టం నుండి ఒడ్డున పడేసాడు అంటూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు మాధవ్."

"అరే నా కాళ్ళ మీద పడ్డావేంటయ్యా లే లే."

"లేవటం కాదు బాబాయ్ గారు మీరే మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ సరోజ కూడా ఆయన కాళ్ళమీద పడింది."

"వాళ్ళ వినయానికి మురిసిపోయి, మీలాంటి మెతకవాళ్ళని కాకుండా దడదడలాడించే గడుగ్గాయిలకి సంవత్సరం తిరిగేసరికి తల్లితండ్రిగా మారండి" అని నిండుమనసుతో వాళ్ళని దీవించారు సుబ్బారాయుడు.


         **********సమాప్తం********

ఇదేం కథ అనకండి మన చుట్టూ జరిగే కధే ఇది. రాజేష్ లాంటి వాళ్లు కోకొల్లలు కానీ సుబ్బారాయుడు లాంటి వారు ఉండరనే చెప్పొచ్చు. కథలో నీతిని గ్రహించండి. స్నేహితుడనో, బంధువనో నమ్మి షూరిటీ ఉండి మోసపోకండి....



Rate this content
Log in

Similar telugu story from Drama