శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Fantasy Inspirational

4.8  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Fantasy Inspirational

సరికొత్త ప్రపంచం

సరికొత్త ప్రపంచం

3 mins
382


చాలా సేపు కుర్చీలో కూర్చుని పనిచేసినందువల్లనేమో వీర్రాజుకి కళ్ళుమండటం ప్రారంభమైంది ...దాని పైన మెడా, నడుమూ కూడా లాగేస్తున్నాయి...

కుర్చీలో వెనక్కువాలి ఒళ్ళు విరుచుకున్నాడు...తన గది కిటికీ లోంచి కనిపిస్తున్న పచ్చని చెట్లూ, ఖాళీ రోడ్లూ, దూరంగా మెరుస్తున్న పెద్ద పెద్ద భవనాలూ ఏవీ అతడిని ఆకర్షించటం లేదు....

"అది అంతా యిసుక

చరిత్రలో ఒక మసక

ఇది నశించిన ఒక గ్రామం

.విశ్వశించే ఒక స్మశానం" అనే తిలక్ గారి పదాలు గుర్తుకొచ్చాయి


ఈ లాక్ డౌన్ ముందు ఒక వరం లా అనిపించినా దరిమిలా ఒక శాపంలా అనిపిస్తోంది...కళ్ల ముందు కనిపిస్తున్న అద్భుతమైన ప్రపంచాన్నీ, ఏం జరుగుతూన్నా తన దినచర్యను మార్చుకొని ప్రకృతినీ చూడాలనే కోరిక నశించి పోతోంది...

మనిషికి మనిషి తోడు అంటే ఏమిటో అర్ధం అవుతోంది...కుటుంబం విలువ పూర్తిగా తెలుస్తోంది...

మనిషి నుంచి మనిషికి శక్తి పాతం జరుగుతుందనే ఎవరో చెప్తే ఆధునిక స్వాములు తమ గొప్పదనం చెప్పుకునేందుకు వాడే పదం అనుకునేవాడు... నవ్వొచ్చింది...

సిరివెన్నెల వారన్నట్టు జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది…

ఈ ఆధునిక జీవితంలో చాలామంది ఒంటరి జీవితాల్ని ప్రేమిస్తుండడం చాలా కాలంగా గమనిస్తున్న వీర్రాజు కొంతమందిని ఆ విషయమై అడిగాడు కూడా...

మనకో కుటుంబం ఉండటం ఒకరకమైన బంధం, అది మన స్వాతంత్య్రాన్ని అణచి వేస్తుంది...ఇప్పట్లో ఏ కుటుంబమూ లేకుండా బతకడం కుదురుతుంది...మాట్లాడాలంటే ఫోనూ, కావాల్సిన వినోదమూ, మందుల తో సహా అన్ని వస్తువులూ ఇంటికి పంపించే కంపెనీలూ, ఫోన్ లో దొరికే డాక్టర్లూ, అవసరమైతే ఆంబులెన్సులూ, ఆకలేస్తే తిండి ఇంటికే తెచ్చి ఇచ్చే కంపెనీలూ ఇవన్నీ ఉండగా మనం బంధాలు పెంచుకోవడం ఎందుకు అని వాదించేవాళ్లను చూసాడు...

ఈ ఉనికి లేని పరాన్నజీవి ఇవాళ తన ఇచ్చాపూర్వకంగా విజృంభిస్తూంటే మన ఒంట్లోని శక్తులే మనకు శత్రువులవుతుంటే, ఆ ముందు చెప్పిన ఏర్పటలన్నీ మెల్లిగా నెమ్మదిస్తుంటే బంధువులూ, స్నేహితులూ, ఇరుగు పొరుగు వాళ్ళ విలువ తెలుస్తోంది అనుకున్నాడు...

బీజాస్వాంత రివాన్కురో జగదిదం ప్రాం నిర్వికల్పం పునహ్...మాయకల్పిత దేశకాల కలనా వై చిత్రియ చిత్రీకృతం...అనే శంకరుల వారి శ్లోకం గుర్తుకొచ్చిందెందుకో...

బయటకు వెళ్లి కాసేపు పరుగెత్తాలనిపించింది అతనికి...రోజుల తరబడి ఇంట్లోనే, ఈ గదిలోనే ఉండి ఉండి అతడిని ఒకరకమైన నిరాశ ఆవహించ సాగింది

తాను ఎంతో ప్రేమగా చూసుకునే పెయింటింగులూ…తాను ఎంతో కాలంగా చేకూర్చుకున్న పుస్తకాలూ అన్నీ తనను వెక్కిరిస్తున్నట్లనిపిస్తోంది...

టీవీ పెడితే చాలు అన్నీ నిరాశాపూరితమైన విషయాలే...

"ఎప్పటినించో ఉన్నఊడలు దిగిన వట వృక్షాలు కూలిపోయి...

వాటి జటిల జటల్లోంచి నానావిధ శకుంతాలు వృంతఛ్చిన్నలలౌoతల్లా రాలిపోయి...

ప్రశాంతాశ్రమ పరిసరాల మహోపద్రవ పరిస్థితులు" అనే ఆలూరి బైరాగి గారి ఆగమ గీతి గుర్తుకొచ్చింది...


ఆలా బయటకు చూస్తున్న వీర్రాజుకు ఒక చిన్నపిల్ల కనిపించింది...అక్కడున్న ఖాళీ స్థలం లో ఎగురుతూ, అరుస్తూ ఆడుకుంటోంది...తన చుట్టూరా ఉన్న దుర్భరమైన పరిస్థితులు గానీ, కొత్తగా వచ్చిపడిన ముసుగు గానీ ఆమె ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేక పోయినట్టున్నాయి... ఒక్కర్తీ ఈ జగత్తుతో లయించిపోతూ సంతోషిస్తోంది...   

“పాపం, పుణ్యం, ప్రపంచమార్గం...

కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ...

ఏమీ ఎరుగని పూవుల్లారా,... 

అయిదారేడుల పాపల్లారా!

మెరుపు మెరిస్తే,...

వాన కురిస్తే,...

ఆకసమున హరివిల్లు విరిస్తే...

అవి మీకే అని ఆనందించే...

కూనల్లారా!" అనే మహాకవి మాటలు గుర్తుకొచ్చాయి...

అకస్మాత్తుగా ఉత్సాహం వచ్చేసింది...

కానీ బయటకు వెళ్లడం చాలా ప్రమాదం కదా...ఇంతకు ముందులా ఈ వైరస్ అక్కడా ఇక్కడా కూర్చుని మనుషుల స్పర్శ కోసం ఎదురుచూడటం లేదనీ, అవి ఇప్పుడు దుమ్ము కణాలతో బాటు ప్రయాణం చేస్తున్నాయని విన్నాడు...పూర్వం మంత్రగత్తెలూ, హ్యారీ పోటర్ లో పాత్రలూ, ఉత్తరాది లో కొందరు రాజకీయ నాయకులూ చీపుర్లు మీద కూర్చుని ప్రయాణం చేస్తున్న దృశ్యాలు కళ్ళలోకి వచ్చాయి...భయంలో కూడా నవ్వొచ్చింది...

ఇలా మెల్లిగా తాను ఈ ఒంటరితనం లోనే మరణిస్తే ఎవ్వరికీ తెలియను కూడా తెలియదు...తుఫాను తర్వాత ప్రశాంతత లాంటి సమయం వచ్చినప్పుడు నా అస్తి పంజరాన్ని తీస్తారేమో...

దుర్భరమైన ఆలోచనలతో వీర్రాజుకి కాళ్ళు చల్ల బడిపోతున్నాయి...యుగాంతం వచ్చేసిందా? మానవ జాతి ఈ వైరస్ తో ఆర్మగెడాన్ అనే అంతిమ యుద్ధం చేస్తోందా?

ఈ ఆలోచనలు అతడిని నిస్త్రాణపరిచేస్తున్నాయి…డిప్రెషన్ లోకి వెళ్ళి పోతున్నాడేమో అనే భయం అతడిని ఆవహించ సాగింది...

కాసేపు దూరాకాశంలోని నల్లని మేఘాలను చూసాడు...వర్షం పడేలా ఉంది...

ఖాళీ స్థలం లో ఆడుకుంటున్న చిన్నపిల్ల కి ఉన్నప్పటి సకారాత్మకత తనకు లేక పోవడం అతడిని బాధించింది...తల విదుల్చుకున్నాడు...

"బాటలు నడిచీ...పేటలు కడచీ...కోటలనన్ని దాటండి...నదీ నదాలు..అడవులు కొండలు...ఎడారులా మన కడ్డంకి" అనే మహాకవి మాటలు గుర్తు చేసుకున్నాడు  

ఈ ఒంటరితనం కొన్ని కొత్త అనుభవాలనుకూడా ఇచ్చింది...ఇంతకు ముందు ఎప్పుడూ తాను బతికే ఉన్నాడా లేదా అని ఆలోంచించని వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు, ఆధారం గా మాట్లాడుతున్నారు...అదో రకం తుత్తి అనుకున్నాడు నవ్వుకుంటూ

ముప్పైలలో ఆల్డస్ హక్సలీ గారు రాసిన అసమగ్ర పరిస్థుల కాల్పనిక నవల సాహసోపేతమైన సరి కొత్త ప్రపంచం (బ్రేవ్ న్యూ వరల్డ్) లోలాగా ఈ ప్రపంచం కొత్త ఆవిష్కరణల వైపుకి దృష్టి సారిస్తుందా? తద్వారా సాహసోపేతమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించుకో గలుగుతుందా? అదంతా కాల్పనిక వాదమేనా?

ఏమైనా ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న ఈ మహమ్మారి మిగిలిన ప్రపంచానికి ప్రేమ, బంధాలూ, స్నేహాలూ మన జీవితం లో ఎంత విలువైనవో తెలియజేశాయి...

మన ప్రేమను వస్తువుల నుంచి తిరిగి మనుషుల మీదకు మరల్చింది...ఇది స్మశాన వైరాగ్యం లా కాకుండా బ్రహ్మోపదేశం లా పనిచెయ్యాలనీ, విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు ఉన్నా లేకపోయినా ఒక సమగ్ర సాంఘిక జీవనం దిశగా ప్రయాణం చేయాలనీ అనుకోవడంలో తెప్పేమీ లేదోమో అనుకున్నాడు

మేం మనుష్యులం

మేం మహస్సులం

గుండె లోపలి గుండె కదలించి

తీగ లోపలి తీగ సవరించి

పాట పాటకి లేచు కెరటంలాగ

మాట మాటకి మోగు కిన్నెరలాగ

మేం ఆడుతాం

మేం పాడుతాం

అనే తిలక్ గారి మాగ్నాకార్టా ను తలచుకుంటూ తిరిగి తన కంప్యూటర్ లోకి తల దూర్చాడు వీర్రాజు...


Rate this content
Log in

Similar telugu story from Abstract