STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Tragedy Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Tragedy Inspirational Others

సోది కావాలి

సోది కావాలి

7 mins
332

వెంకటరత్నం ,రమ దంపతులకు పెళ్లయి 25 సంవత్సరాలు పైనే అయింది....పిల్లలు లేరన్న బెంగ తప్ప ,వేరే బాధ లేకుండా హాయిగా బతికేస్తున్నారు ఇద్దరూ....

కానీ ఈ మధ్య రమఆఫీస్ అంటూ సంధ్య పిన్ని అరుగు మీదే కనిపిస్తుంది...చుట్టూ ఓ పాతికమంది ఆడాళ్లు...వాళ్ళ సోది తో మా పిన్ని వాళ్ల అరుగు కాకుల గోలలా ఉంటుంది....

రోజు అనుకుంటాడు అంత చేటు సోది ఏం ఉంటుంది చెప్పుకోవడానికి..?.

వీళ్ళకి సోదిఆస్కార్ ఇవ్వొచ్చు....

సోది కాంపిటీషన్ పెడితే ఈ మంద అన్ని బహుమతులను తన్నుకుపోతుంది....

అందరూ సెటైర్ వేసుకునేవాళ్ళు....

పొద్దున్నే పేపర్ ముందేసుకుని కాఫీ తో పాటు న్యూస్ ని కూడా చప్పరిస్తున్న వెంకటరత్నానికి ,గొంతులో కషాయం కానీ దిగుతుందా అన్నట్టు భయపడి,ఆదిరిపడి కప్ లోకి ఓ మాటు తరచి చూసేడు...

కాఫీ నే..... ?!

ఒసేవ్ భార్యమణి!.... నా రత్నాలగని....రమాదేవి .....ఒ మాటు ఇటొచ్చి పో....

ఇది తాను చూసింది నిజమో ,కాదో తెలుసుకోవాలన్న పరిశోధన కోసమే...

పొద్దున్నే ఏం మునిగిపోయింది....అరుపులు ,కేకలు అంటూ....చెంగుకు చేతిని తుడుచుకుంటూ వచ్చింది...

వచ్చావు...?.ఈ పేపర్ చూడు ఒకసారి... అంటూ భార్య ముందు పెట్టేడు పేపర్.

పైన ఆషాడం మెగా డిస్కౌంట్ .....అనే పేజీ చూసి...చాల్లేండిసంబరం ....అంటారు కానీ తీసుకెళ్ళరు,

మొన్న సూరమ్మ పిన్ని కూడా, చందన బ్రదర్స్ కి పోతే ఇంచక్క నేను కూడా 1000 కి 4 చీరలు తెచ్చుకునే దాన్ని,ఇంకా అంత పాత చీరలు చూపించేడని ఒక అరడజను మంది మా ఆడాళ్లు అంత కలిసి ధర్నా చేస్తే గంటలో అండర్గ్రౌండ్ నుంచి స్టాక్ తీయించేరట....షిఫాను,క్రేపు,జార్జిట్ చీరలు ఒకటి మించి ఒకటి ఎంత బావున్నాయని.!?...

సూరమ్మ పిన్ని తన కోడలికి కూడా ఓ పట్టు చీర కొంది ఒకటి కొంటె ఒకటి ఫ్రీ....

ఫ్రీ అన్న పదాన్ని పైన కింద పళ్ళల్లోంచి ఒక దుక్కుడు గాలి వదులుతూ చెప్తున్న భార్య కేసి చూసిన వెంకట రత్నానికి కళ్ళు తిరిగి ,కాఫీ బయటకు వచ్చినంత పనయింది....

మళ్ళీ ఆ...మనం గరళ కంఠుడు సైన్యం కదా ...

అనుకుని మింగేసాడు...

ఎమ్మా !ఈ వెంకాయికు కట్టపెట్టబడిన రమా"రత్నం".

పొద్దున్నే ఇంకో కప్పు కాఫీ అడిగితే పూజ,స్నాక్స్ ఏమన్నా వందవే అంటే అష్టోత్తరం, సాయంత్రం కూరలు రెండు వందవే అంటే సహస్రనామలు ఎత్తుకుంటావ్....నీకు అలుపు రాదేవిటి...?

భర్త సున్నం కానీ వేస్తున్నాడా ఏంటి !?పొద్దున్నే అనిపించింది రమకి

నాకో సందేహం వచ్చింది రమాదేవి...తీర్చే ఓపిక ఉందా కుర్చీ కి జారబడ్డాడు....

చాలా బావుంది... పొయ్యి మీద పాలు పెట్టేను, ఇంకో పొయ్యి మీద కూర,మీరు పిలిచేరని రైస్ కుక్కర్ ఆన్ చెయ్యకుండా వచ్చెను....అసలే కొత్త బియ్యం కొద్దిగా నానిన ,అన్నం సంకటి అవుతుంది....పోన్లే గంజి పోసి తినేద్దామా అనుకుంటే ,ఎంచక్కా పప్పుచారు చెయ్యవే రాగి సంకటి అనుకుని తినేస్తాను అంటారు..అక్కడితో ఆగదుగా బండి ఉప్పుమీరపకాయలు,లేకపోతే వడియాలు....నంజు లోకి ఆవకాయబద్ద....ఇదంతా చాలదు అని మజ్జిగ లోకి మళ్ళీ మాగాయ పళ్లానికి అంటించుకుని నాకడం...అబ్బా....అబ్బబ్బో....నావల్లకాదు.... ఒక్కనిమిషం కూడా ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు....

లేకపోతే వెళ్ళు.... ఇంకా ఇక్కడే నుంచున్నావే...?

రత్నం రుసరుసలకి బ్రేక్ వెయ్యలనుకుంది ...వెంటనే విషయం ఎంటో చెప్పండి....ఇదిగో ఇపుడే చెప్తున్న బాక్స్ కట్టడం ఆలస్యం అయింది....పళ్ళెంలో అన్నం పెట్టడం ఆలస్యం అయింది అంటే ఊరుకోను...10 నిమిషాల సమయం ఇస్తున్నాను మాట్లాడుకోండి....అంటూ కొంచెం గర్వాంగా నుంచుంది..

నీ గర్వాన్ని గదిలో పెట్టి తాళం వెయ్య...నీ పది నిమిషాలు అవసరం లేవు,కానీ నా ప్రశ్న చాలా క్లియర్ ,కానీ నీకే సమాధానం చెప్పడానికి సమయం పడుతుంది ....

ఎం పర్వాలేదు... అడగండి...

సోది మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పవే రమా..

సోది అంటే సోయ దించేది అని అర్థం....అందులో రకాలు నాకు తెలీవు కానీ,సోది లో మాత్రం ఒక అద్భుతం ఉంది....ప్రపంచం....ప్రపంచాన్ని మర్చిపోతాం....కొంతమందయితే వాళ్ళ ఊపిరి అనుకునే బంగారం,చీరలు లాంటి విషయాల్ని కూడా సోది లో పడ్డారా....అంతే.... లోకం మర్చిపోతారు...ఇంట్లో వంట ఇత్యాది కార్యక్రమాలు లేకపోతే కొంతమంది సోది లో యుగాలు కూడా గడిపేయ్యొచ్చు...ఎంచక్కా...ఈమధ్య మేమంతా ఆఫీస్ లో ...

ఆగాగు... !ఆఫీసా....?నువ్వా.?...ఎక్కడ?ఆడిరిపడ్డాడు భర్త

ఆఫీస్ అంటే మన సంధ్యత్త అరుగు....మేమంతా దాన్ని అలా పిలుచుకుంటాం లే...

ఆహా! మళ్ళీ ఈ దౌర్భాగ్యనికి ఆఫీస్ అని పేరొకటి...

ఏ....మీరు పెట్టుకోలా....పారాయణం అని పేకాటకి పోరా...మేము ఎప్పుడన్నా ఇలా వెక్కిరించామా...

సర్లే ....సోది అంటే నిజంగా నువ్వు చెప్పేదేనా....లేక భవిష్యత్తు చెబుతామని వస్తారు ....వాళ్ళు చెప్పేదా....

ఎహె ....వాళ్లకేం తెలుసు ....వీధి చివర రెండు మూడు ఇళ్లగురించి enquiry చేసి ,మన ఇంటి ముందుకు వచ్చి ఫలానా వారింట్లో ఇలా జరిగింది ,నీకు ఇలా జరగకూడంటే అని బ్లాక్మెయిల్ చెయ్యరండి....మీరు అనుకునే సోది వేరు, మా సోది బహువేరు....

అయితే మీ సోది వల్ల సమాజానికి నష్టం లేదంటావ్...

నష్టమా...మొన్న చందన బ్రదర్స్ కి వెళ్లిన సూరమ్మత్త ,మన ఊరి నుంచి రెండు పెళ్లి బేరాల్ని,12 వరకు ఆఫర్ చీరలకి జనాల్ని పంపింది...

ఆవిడవల్ల దగ్గరదగ్గర 2లక్షల ఆదాయం వచ్చింది వారంలో అని,మళ్ళీ కూపన్లుమీద ఫోన్ నెంబర్ తో ఆవిడని పిలిచి 5వేలు పట్టుచీర,వెండి కుంకుమ భరిణ ఫ్రీ గా ఇచ్చారట...

సంధ్యత్త చిన్నకూతురు సురేఖ గుర్తుందా...హైదరాబాద్ లో దాని పని అదేనంట.... షాపుల్లో చీరలు కొనడానికని వెళ్తుంది ...అన్ని చూసొచ్చి అందరికి చెప్తుందట....దానికో ఛానల్ ఓపెన్ చేసిందంట యూట్యూబ్ లో....పలానా చోట కొనండి ,తర్వాత కామెంట్ పెట్టండి,పెట్టిన వారికి 5percent కేష్బ్యాక్ లాంటివి కూడా ఉంటాయట....దీనికి గాను ఆ షాప్ ల వాళ్ళు కమీషన్ కూడా ఇస్తారట....

ఇలారండి..మీ చెవిలో సీక్రెట్ చెపుతాను...

అక్కడినుంచి చెప్పు ,

ఇదేమి అంబానీ ఆస్తి వీలునామా ఏంటి...?వెటకరించేండు రత్నం

సర్లే ....అసలు 500 ఉండే చీర విలువ ఒక నలభై యాభై రూపాయలు ఉంటుందట....కానీ తయారీ దగ్గర్నుంచి నడిచి మన దగ్గటకి వచ్చేసరికి నీరసం వచ్చి రేట్ పెరుగుతుంది అట...

సంతోషం... ఈ విషయాన్ని చాలా సూక్ష్మంగా రోజు మేముకూడచెప్తూనే ఉంటాం....

కానీ మీరంత వివరంగా చెప్పరుగా....

సోది గురుంచి అడిగితే ఇంత సోది చెప్తావా....అంటూ వాచ్ చూసుకుని అయ్యబాబోయ్.... అంటూ ఒక్క ఉదుటున లేచేడు వెంకతరత్నం....

వెళ్లబోయేవాడల్లా ఆగి ....కానీ సోదిలో ఏదో మహత్యం ఉందోయ్.... సాయంత్రం కొంచెం తీరిగ్గా మాట్లాడుకుందాం ....అని తొందరగా స్నానానికి బయలుదేరేడు....

ఇంత సోది చెప్పిన మా ఆయన తిట్టలేదేంటి అనుకుంటూ కింద పడ్డ పేపర్ టీపై మీద పెట్టి బాక్స్ కట్టే పనిలోకి జారుకుంది....

సాయంత్రం ఇంటికి వస్తూనే...నా రమారత్నం.... ఎక్కడ నీ దర్శనం ...అంటూ గదులన్నీ గాలిస్తే చివరికి దొడ్డి వైపు వరండా లో కనిపించింది...

రమ ....నువ్ చాలా కాలం నుంచి జాబ్ చెయ్యలనుకుoటూన్నావ్ కదా....నీకో మంచి జాబ్ చూసేను అన్నాడు...

నిజమే ...?గిల్లుకుంది..రమ..

ఎం ఉద్యోగం అండీ.?..జీతం ఎంత రావొచ్చు...?

అవన్నీ తరువాత ముందు నువ్వు మంచి చీర కట్టుకుని తయారవ్వు బయటకు వెళ్దాం....

ఈ టైం లోనా...?

అవును...తొందరగా....అంటూ బండి రోడ్ ఎక్కించి ఇంక హార్న్ మొదలు...

ఏమొచ్చిన పట్టలేము...ఎటుకాని టైంలో బయటకి...ఇదిగోముందే చెప్తున్నాను...సాయంత్రం లేట్ అయితే ఒక కూరే వండుతా ..బాగా లేట్ అయితే పాలు తాగేసి పడుకోవాల్సిందే....లేదంటే....

లేదుl....లేదు...కాదు లేదు...బండెక్కు ముందు....

బండి 10 నిమిషాల ప్రయాణం తర్వాత ఒక ఆఫీస్ ముందు ఆగింది...బోర్డ్ చూసీ నోరెళ్ళబెట్టడం రమ వంతయింది....

ఆపకు ...నీ వాక్ప్రవాహాన్ని అస్సలు ఆపకు ...దానితోనే ఇపుడు పని...పద...లోపలికి ....

మామ్ నమస్కారం,సర్ నమస్కారమ్....ఎవరు జాబ్ లో జాయిన్ అయ్యేది మీ ఇద్దరిలో,మాకు చాలా మంది కాంటాక్ట్ లో ఉన్నారు...కానీ మంచి మాటకారి కోసం వెతుకుతున్నాం ...అప్రతిహతంగా గంట మాట్లాడేవాళ్ళుదొరకడం లేదు సర్...మేము వారి మాట్లాడి అలసిపోకుండా ఉండడానికి fruits,స్నాక్స్ వగైరా లాంటి చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాం సర్..చూడండి సర్ ఇవన్నీ ఏసీ రూమ్స్,హైజీన్ వాష్రూమ్స్,వింటర్ లో రూమ్ హీటర్స్ వాడతాం సర్...

3 టైమ్స్ ఫుడ్ సర్వీస్ దట్ టూ వారి ఛాయిస్..అంతా సీసీ అండర్ ,మాకు she టీం హెల్ప్ 24/7 ఉంటుంది...

కానీ ఎవ్వరు వారం మించి ఉండలేక పోతున్నారు...పైనుంచి మాకు ప్రెషర్ ఉంది సర్ ....కనీసం ఆరు నెలల అగ్రిమెంట్ అయిన మాకు ఓకే సర్...అసలు మేము వన్ ఇయర్ కి అగ్రిమెంట్ చెయ్యాలని రూల్ పెట్టాం ,కానీ సడలిస్తున్నాం సర్....

రమ కి బయట బోర్డ్ లోపల వ్యవహారానికి సింక్ అయింది అనిపించింది....

నేను కాదు సర్....మా ఆవిడ జాయిన్ అవుతుంది..పక్క పల్లెటూరి నుంచి వచ్చింది...అద్భుతమైన వాక్ధాటి ....మీరు ఆపమన్న వాగుడు ఆపదు.....

భర్త తన గౌరవం తీస్తున్నాడన్న కోపంతో లోపలే రగిలిపోతుంది రమ....

ఈ లోపులోనే....వ్వా....వ్.....మేడం..... కం హియర్....అంటూ ఒక సెంట్రల్ ఏసీ రూమ్ లోకి తీసుకువెళ్ళేరు....

సర్ మీరు రావొచ్చు లేదా బయట వెయిట్ చెయ్యొచ్చు...

అక్కడ రమ కి జరుగుతున్న మర్యాదల్ని చూసి ఆశ్చర్యం వేసింది...అక్కడ రిసెప్షన్ లో అమ్మాయి చెప్తున్న విషయాలకు మతిపోయినంత పనయింది...

దేశం దరిద్రం లో ఉందని తెలుసు కానీ మరీ ఇంత దీన స్థితి లో ఉందని తలుచుకుంటే ,ఇదీ ఒక సమస్యేనా అనిపిస్తుంది....

బోర్డ్ చూడగానే నవ్వొచ్చింది ...అంతకన్నా ముందు పొద్దున్న పేపర్ లో యాడ్ చూడగానే చిరాకొచ్చింది....అసలే రోజుకో రేపు,మర్డర్ ...రాజకీయ కప్పగంతులు,తుక్కు రోడ్ పై వెలుగు బస్ ల గెంతులు అని ఊదరగొడుతూ ,నెల తిరిగేసరికి 300 నిలువు అడ్డ నామాలు పెట్టించుకుంటున్నాము....మధ్యలో ఇలాంటి అప్రస్తుత ప్రకటనలకి పిచ్చ మామూలుగా రాలేదు....

అనుకుంటుండగా...ఎదురుగా టీవీ లో నా రమ తాలూకు ఛాయ లా కనిపించింది.....కాదు నా రమే...

చాలా ఆక్టివ్ గా,చేతులు ఊపేస్తూ, కళ్ళు పెద్దవి చేస్తూ,నవ్వుతూ ఏంటో చెప్పేస్తోంది...

సర్....రమా మామ్ ఈస్ బ్రిలియంట్....రిసెప్షన్ అమ్మాయి మెచ్చుకోలుతో.....అది నా రమ అని గర్వించేను....

...తెగ మాట్లాడేస్తోంది...ఇంటర్వ్యూ చేసే ఆయన కూడా చాలమ్మ....సరిపోతుంది ఈ మాత్రం మాటల ధాటి అన్నా, ఆపడం లేదు....

ఆమె చుట్టూ 4 మంది ...అంతా 70 ..80 వయసు మధ్య ఉన్న న్యాయనిర్ణేతలు ఉన్నారు...

వారు మధ్య మధ్య లో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు...

వీళ్లా... జడ్జిలు ...దేనికి....అనుకుంటూ తలపట్టుకున్నాడు...

క్రికెట్ లో లాగా స్క్రీన్ మీదే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు.....రమా మామ్....1....

2....

3...

ఈస్ సెలెక్టెడ్.....హా.  ......

అందరూ ఒకరికొకరు చేతులు కలుపుకుంటున్నారు చాలా సంతోషంతో....

రమా మామ్ ....అంటూ సాదరంగా బయటకి తీసుకొచ్చారు ఇంటర్వ్యూ గది లోంచి....

మా ఆవిడని అందరూ అక్కడ రాణి లా చూస్తున్నారు.... బయటకి వెళ్తుంటే అడిగేడు రమని... ఎంటట సోది గొడవ...

నేను కూడా అలానే అనుకున్నానండి....కానీ మీకు టీవీ లో చూపించని చిన్న కథ ఉంది అక్కడ...

నా ఉద్దేశ్యంలో ....అంటూ చెప్పబోతున్న రమని ...ఇంటికెళ్లాక మాట్లాడుకుందాం అని ఆపేసేడు ..

దారంతా అయ్యగారు మౌనంగానే బండి నడిపేరు.

రమా.... ఇవ్వాళ దోసల పిండి ఉందిగా...అట్లు వేసెయ్యి....తొందరగా టిఫిన్ కానిచ్చి చాలా మాట్లాడుకోవాలి..

అద్భుతం...మా ఆయన వంటకి సెలవు ప్రకటించారా...

టిఫిన్లు కానిచ్చి హాల్లో కూర్చున్నారు...

టీవీ పెట్టబోతున్న రమని ఆపేడు భర్త...

అసలు ఆ సోది కావలెను...కాన్సెప్ట్ ఏంటంటావ్....

మా ఆయన....నా...చేత....అడిగి మరీ సోది చెప్పించుకుంటున్నారా.....ఆశ్చర్యపోతూ....విషయాన్ని చెప్పడం మొదలు పెట్టింది.....

పూర్వం లాగా ఇపుడు మంచి చెడు ఎదురుపడి మనుషులు మాట్లాడుకోవడం లేదంట అండీ....అన్ని విషయాలు ఫోన్లోనే అంట.... చివరికి చివరి మాటలు కూడా ఫోన్ లొనే వింటున్నారట చాలా మంది... వాళ్ళ ఉద్యోగాల విషయాల్లో పడి, సంపాదనలో పడి, ఈ స్మార్ట్ ఫోన్ ల వల్ల రకరకాల వికారల్లో పడి,ఇంటి మనుషుల మధ్యే మాటలు కరువు అయిపోయినియ్యంట.... దాన్ని వాడడం వచ్చిన వాళ్ళు సరే ,మరి మనలాంటి ఇష్టపడని వారు,కొంచెం వయసు పై బడ్డవారు...ఒంటరిగా ఉండిపోతున్నారట...ఫోన్ లో కనిపించే రంగులు,మనుషుల మధ్య బంధాల్ని హంగు అని వెక్కిరిస్తున్నాయట...బటన్ నొక్కితే అన్ని రకాల విషయాలు కాళ్ళ దగ్గరికి వచ్చి వాలుతుంటే,,, స్మార్ట్ సిటీ ల సీనియర్ సిటిజన్స్ ఇంట్లోవాళ్ళకి భారంగా అనిపిస్తున్నారట....వాళ్ళతో మాట్లాడడానికి ఇంట్లో ఎవ్వరు ఉండరట.... మొగుడు పెళ్ళాలు ఆఫీస్ కి,పిల్లలు పొద్దున్నే స్కూల్ కి,మధ్యాహ్నం ట్యూషన్ కి,సాయంత్రం డాన్స్ లు వగైరా క్లాస్ లకి వెళ్లిపోతుంటే,వీళ్ళని చూడడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన తల్లిదండ్రులు, వీళ్ళే ఇంటికి కాపలా కావాలని తెచ్చుకున్న వాళ్ళు,బయట ఆశ్రమలకి పంపితే పరువు పోతుందనుకునే గొప్పింటోళ్లు అందరూ కలిసి ....వెటకారంగానే ఈ ప్రోగ్రాం మొదలెట్టేరంట....చాలా మెట్రో సిటీ ల్లో ఇది బాగా క్లిక్ అయిందట...మన ఊరికి కూడా వచ్చింది...పాపం ఈ చుట్టుపక్కల అలాంటివారెవరో .....నిట్టూరుస్తూ ఆపింది..కానీ విచిత్రం మా స్టాఫ్ ఇండియా మొత్తంలో 12 వేలమంది ఉన్నారంటండి......

ఇంతకీ అక్కడ నీ పని ఏంటి...ఆతృతగా అడిగేడు

సోది చెబుతానోయమ్మా...సోది చెబుతాను... అంది నవ్వుతూ...

నీకు ముత్యాల హారం కొనాలని ఉందే రామా.... కొంచెం ఆ పళ్ళు రాలగొట్టనిస్తావా....కొట్టడానికన్నట్టు చెయ్యి లేపేడు.. .

అంత అదృష్టం నాకు వద్దు.... ఇంకో పదేళ్ళవరకు జంతికలు తినాలి...

విషయం ఏంటంటే ఈ ఇళ్లల్లో ఉండిపోతున్న ముసలివాళ్ళు పగలంతా ఒంటరిగా,మాట్లాడేవారు ఎవరూ లేక బాధ పడుతున్నారట....మనం చేయాల్సిందల్లా వాళ్ళింట్లో వాళ్ళు ,వాళ్ళ ఉద్యోగాలకు పోయిన తర్వాత మన ఉద్యోగం మొదలవుతుంది...ఇంకా సోది చెప్పుకుంటూ పోవడమే...ఏమైనా చెప్పొచ్చు....కొంతమంది పురాణాలు అవి చదివించుకుంటారట....నవ్వొచ్చింది నాకు కొంతమంది టీవీ సీరియల్స్ కూడా చెప్పించు కుంటారట...

రమ నువ్ సీరియల్స్ చూడవుగా ...ఎలా చెప్తావు ....

అదో పెద్ద సమస్యా..... మనూరిలో ఎదో కధ అక్కడ చెప్పేస్తాను...మా ఆఫీస్ లో అపుడపుడు వీటి చర్చ జరగడం వల్ల కొంచెం కధ మన టచ్ లో ఉంటుంది మరి....దాదాపు పోజ్ కొట్టింది....

చివరిగా మా కస్టమర్ నవ్వుతూ మాతో ఫోటో దిగాలి.... అవే మాకు బోనస్ పాయింట్లు అంట....

ఎవరికి బోర్ కొడుతుందో వాళ్ళు మా ఆఫీస్ ని కాంటాక్ట్ చేస్తారు...లేదా వాళ్ళింట్లో వాళ్లే స్వయంగా మా ఆఫీస్ కి ఫోన్ చేసి....ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంట్లో ఉండం.... ఎవరినైనా సోదికి పంపండి అని ....ఇందులో వీక్లీ,మంత్లీ, ఇయర్లీ ప్యాకేజీ కూడా వుందండీ....

ఎందుకంటే కొంతమంది పల్లెటూరి వారికి తప్పనిసరిగా వారం పదిరోజుల పని పడి ఉండాల్సి వస్తే ,వాళ్ళకి మంత్లీ బిల్ మొత్తం వేస్ట్ కదా....మనకి కావాలంటే అక్కడే వండుకు తినొచ్చు... లేదా మన బాక్స్ పట్టుకెళ్ళొచ్చు....కానీ మా సోదికంపెనీ వాళ్ళు midday మీల్స్. వాళ్లే పెట్టుకుంటున్నారు...వాళ్లే మనల్ని ఇళ్లదగ్గర దించుతారు...తీసుకొచ్చి ఆఫీస్ లో వదులుతారు.... ఆఫీస్ నుంచి మాకు బస్ ఉంటుంది....

ఇదంతా చెప్తుంటే 12 అయిందన్న విషయమే తెలీలేదు....నిజంగా సోది లో మంచి శక్తి ఉంది....బయటకి అనేసేడు..

చూసారా....నిన్నటి వరకు మమ్మల్ని సోది బడి బ్యాచ్ అనేవారు...ఇపుడు మా దారికి వచ్చేరు...అంది నవ్వుతూ....

2 గంటలకి కూడా భర్త అటు ఇటు కదలడం చూసి,సంగతి అడిగితే .. ..అయితే రమా మీ అమ్మ నాన్న,మా అమ్మ నాన్న ఈ బాధితులేనా....రేపటినుంచి మనం "సోది కావాలి" ఆఫీస్ మెట్లు ఎక్కాలంటావా....

అబ్బబ్బే ....మనవాళ్ళకి అంత ఖర్మ లేదులెండి... కావాలంటే వాళ్లు కూడా నాతో పాటు ఉద్యోగానికి వచ్చేఅంత ఆక్టివ్ గా ఉన్నారు...మీరు హాయిగా బెంగలేకుండా పడుకోండి....

అంతే కదా ......అయినా రేపో సారి మా అమ్మకి ఫోన్ చెయ్యాలి అనుకున్నాడు..ఇంకోటి కూడా అనుకున్నాడు....ఇంక నా రమ పిల్లలు లేరని బాధ పడదు అని....

ప్రతి హైటెక్ ఉద్యోగి ఇలా పడుకునే ముందు ఇంట్లోకి తొంగి చూడాలి, ఆలోచించాలి అనుకుందాం....



Rate this content
Log in

Similar telugu story from Tragedy