Soudamini S

Drama Romance Classics

4  

Soudamini S

Drama Romance Classics

శశివదనే

శశివదనే

12 mins
361


అది హంపి నగరాన్ని శ్రీ కృష్ణ దేవరాయులు పరిపాలిస్తున్న కాలం.


శివుడు విరూపాక్ష ఆలయంలో ప్రధాన శిల్పిగా ఆ రోజే నియమించబడ్డాడు. శివుడికి ఒక ఇరవై-పాతిక ఏళ్ల వయసు ఉంటుంది. అతడు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని పెదనాన్న సంరక్షణ లోనే పెరిగాడు. శివుడికి చిన్నప్పటి నుండి శిల్ప కళ మీద అభిరుచి. అతడు చేసిన శిల్పాలలో జీవం ఉట్టిపడుతుందని అందరూ గొప్పగా చెప్పుకోవటం తో ఆ వార్త రాజు గారి చెవిన పడి ఆయన నుండి పిలుపు వచ్చింది. ఆ రోజు కాలినడకన తన గ్రామం నుండి హంపి నగరానికి చేరుకున్నాడు.


అప్పటి వరకు ఆ నగరం గురించి వినటమే కానీ అదే చూడటం. ఆ మహా నగరాన్ని చూడటానికి అతడి రెండు కళ్ళు చాలటం లేదు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావటం వల్ల వీధులు దీపాల కాంతి తో మెరిసి పోతున్నాయి.


విరూపక్షుని గుడికి చేరువ అయ్యే కొద్దీ ఆ దారి వరుస లో చాలా ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల లోపల నుండి వినిపిస్తన్న కీర్తనలు వీనులవిందుగా ఉన్నాయి. విరూపాక్ష గుడికి చేరేసరికి గుడి ముందు బజారులలో వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు రాసులుగా పోసి ఉన్నాయి. ఎరుపు, పచ్చ, నీలం, తెలుపు రంగులతో నిండిన నవరత్నాలు చూస్తూనే అతడి కళ్ళు జిగేలుమన్నాయి, ఎంతైనా రాళ్ళతో అతనికి ఉన్న అనుబంధం అలాంటిది. 


శివుడు గుడిలో విరూపాక్షుని దర్శనం చేసుకున్నాక ప్రసాదం తీసుకొని తుంగ భద్రా నది ఒడ్డున కూర్చున్నాడు. అది ఎంత కార్తీక మాసం అయినా చుట్టూ రాళ్ళు, కొండల వల్ల సాయంత్రం అయినా వాతావరణం వేడిగానే ఉంది. తుంగభద్రా నది ఒడ్డున స్త్రీలు మల్లె పూలు అమ్ముతున్నారు. వాటి సువాసనలతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. పైన వినీల ఆకాశంలో చందమామ ఆ మల్లెల వన్నెలతో పోటీ పడుతున్నట్లు ఉంది. తుంగభద్రా నది నుండి వచ్చే చల్లటి గాలులు, మల్లె పూలు, చందమామ, గుడి నుండి వినిపిస్తున్న భక్తి పాటలు ఇవన్నీఅతని మనసుకి చల్లదనాన్ని సమకూరుస్తుంటే అతను హాయిగా సేద దీరుతున్నాడు. అంతలో ఎక్కడి నుండో గజ్జెల సవ్వడి.


చందమామ కు కన్ను కుట్టే అందంతో, మల్లెలకే ఈర్ష్య పుట్టే సుకుమారంతో ఒక పదిహేను పదహారేళ్ళ పడుచు నది వైపుకు నడిచి వెళ్తోంది. ఎర్రటి పట్టు పరికిణీ మీద రెప రెప లాడే పచ్చటి వోణి, మోకాలు వరకు వేలాడుతూ ఆమె ఓణి తో ఆడుకుంటున్న జడ కుచ్చులు, జడ నిండా తురిమిన మల్లెలు. చేతిలోని దీపం కాంతి ఆమె ముఖం మీద పడి ఆమె ముఖం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ముఖం చంద్ర బింబం అయితే ఆమె కళ్ళు చంద్రుని రాకతో విచ్చుకున్న కలువలు వలె ఉన్నాయి. ఆమె ముక్కు సంపెంగ పూవులా ఉంది అని ఆమెను చూసే తిమ్మన గారు పద్యం రాసి ఉంటారు. ఆమె అధరాలు సూర్యుడి మీద విరహంతో ముడుచుకున్న ఎర్రటి కమలాలు లా ఉన్నాయి. బహుశా పెద్దన గారు ఈమెను చూసే వరూధిని ని వర్ణించారా అనిపించింది శివుడికి ఆ క్షణంలో.


 ఆమె చెలియలు అనుకుంటా ఆమెని అనుసరిస్తూ సందడి చేస్తున్నారు. ఆమె, ఆమె చెలియలు నీటిలో దీపాలను వదిలి పెట్టారు. ఆకాశంలో చుక్కలతో పోటీ పడుతూ అవి నీటిలో సాగిపోతున్నాయి. ఆమె నదిలో దీపాలను వదిలి పెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ళు శివుడి కళ్ళను కట్టడి చేశాయి. అతడి శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెమటలు పడుతున్నాయి. ఇంకా కొన్నివందల చందమామలు, కొన్ని వేల మూరల మల్లెపూలు కావాలేమో అతడిని సేద తీర్చటానికి.


దీపాలు నీటిలో వదిలిన తరువాత తిరిగి వెళ్లిపోవాలన్న ఆదుర్దా లో ఆమె తలలోని చందమామ బిళ్ళ జారిపడింది.


శివుడు అది అంది పుచ్చుకుని పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమెకు పడిపోయిన చందమామని అందిస్తూ దానికి ప్రతిఫలంగా "మీ  పేరు?" అని అడిగాడు. అనుకోని ఈ సంఘటనకు తొట్రుపడి, అంతలో తేరుకొని "గి గి గిరిజ" అని చెప్పి వేగంగా అడుగులు వేస్తూ ముందుకు కదిలింది.


గుడి చివర సందులోకి తిరిగే ముందు వెనక్కు తిరిగి చూసి ఇంకా అడుగుల వేగం పెంచింది.. శివుడి కళ్ల లో నుండి ఆమె రూపం చెదిరి పోవట్లేదు. ఆ రోజు రాత్రికి గుడిలోనే విశ్రమించాడు. ఆకాశం లో పూర్ణ చందమామను చూస్తున్నంత సేపు ఆమె రూపమే కళ్ల ముందు మెదులుతోంది.


మరునాడు కార్తీక సోమవారం. శివుడు గుడిలో ప్రధాన శిఖరం పైన తన పనిలో లీనమై ఉన్నాడు. అంత ఎత్తున ఉండటం వలన దూరం నుండి గిరిజ గుడి లోనికి రావటం గమనించాడు. ఒక్క క్షణం అతని హృదయం గాడి తప్పింది. అతడు జారబోయి తమాయించుకున్నాడు.


ఆమె ను చూస్తూనే గుడిలో అందరూ ఆమెను గౌరవంగా ఆహ్వానించారు. గుడిలోని విరూపాక్షునికి ఆమె నమస్కరించి పూజ ప్రారంభించింది. 


విరూపాక్షుని కోసం ఆమె భక్తి తో పాటలు పాడుతూ నాట్యం చేస్తోంది. ఆమె పాట, దానికి తగ్గట్టు లయ బద్ధంగా కదులుతున్న ఆమె అందెల సవ్వడి తో జత కలిసి దూరం నుండి వింటున్న శివుడికి చెవుల్లో అమృతం పోసినట్లుగా ఉంది. సాయంత్రం కాగానే పూజలో గుడిలోని వారందరితో సహా శివుడు కూడా పాల్గొన్నాడు. గుడిలో పూజారి గారు విరూపాక్షుని విశిష్టత ను తెలియజేస్తున్నారు.


" పరమ శివుడు పార్వతి దేవి ని పోగొట్టుకున్న దుఃఖం లో ఇక్కడే తపస్సు చేశారు. పంపా దేవి గా పుట్టిన పార్వతి దేవి శివుడిని ఇక్కడే రోజూ ఆరాధించేది. ఆమె పార్వతి దేవి అని తెలియక, చలించని ఆ పరమ శివునిలో ప్రేమను నింపటం కోసం మన్మధుడు తన మన్మధ బాణాన్ని ప్రవయోగించాడుట. అప్పుడు మన్మధుని పై కోపం తో పరమ శివుడు తన మూడవ కంటిని తెరిచి అతడిని భస్మం చేశాడు. తరువాత రతి దేవి బ్రతిమాలి మరలా మన్మధుని బ్రతికించుకుంది. శివుడు మూడవ కంటిని తెరిచారు కనుకనే పరమ శివుడిని విరూపాక్షుడు అని మనం కొలుచుకుంటున్నాం. ఆ తరువాత పంపా దేవి భక్తిని గ్రహించి, ఆమె పార్వతి దేవి అని తెలుసుకొని ఆమెను వివాహం చేసుకునేందుకు విరూపాక్షుడు అంగీకరించాడు - అని స్థల పురాణం చెబుతోంది". 


కధ ముగించగానే అందరూ విరూపాక్షునికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ పిమ్మట తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. ఆ తరువాత అందరూ తలో దిక్కుకి వెళ్ళిపోయారు.


 శివుడికి ఆ రోజు రాత్రి తన తుండుతో శుభ్రం చేసుకొని గుడి అరుగు మీద పడుకున్నాడు. ఆకాశంలో చందమామని చూస్తూ, నువ్వే నాకు తోడు అనుకుంటూ కబుర్లు చెప్తున్నాడు. అంతలో వెనుక నుండి ఎవరో పిలవటం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. 


" మీ కోసం గుడి లోపల నాన్న గారు పడక ఏర్పాటు చేస్తున్నారు" అని పూజారి గారి చిన్న కుమారుడి మాటలు వినిపించాయి. 


ఆ పిల్లాడికి పది ఏళ్ల వయసు ఉంటుందేమో.


“ఇలా రా బాబు, నీ పేరు ఏమిటి?” అని అడిగాడు శివుడు.


“చిన్నన్న” అన్నాడు ఆ పిల్లాడు తడుముకోకుండా.


“పేరు భలే ఉంది” అన్నాడు శివుడు అతడిని దగ్గరకు తీసుకుంటూ.


“నన్ను చిన్న వాడిని అనుకుంటున్నారేమో, నేను పెద్దయ్యాక పెద్దన అంతటి వారిని అవుతాను” అని నిఖారసుగా చెప్పేసరికి శివుడుకి నవ్వు వచ్చింది. 


“మీ కోసం గుడి లోపల పడక ఏర్పాటు చేస్తున్నారు నాన్న గారు” అని చిన్నన్న మళ్ళీ చెప్పాడు.


"పరవాలేదు లే బాబు, నాన్న గారికి ఇబ్బంది ఎందుకు, రాళ్ళతో పని చేసే వాడిని ఇలా రాళ్ళ పై పడుకోలేనా?" అని శివుడు చమత్కరించాడు. 


“అట్లా అయితే రేపు ప్రసాదం లో మీ కోసం కాసిని రాళ్ళు కలపమంటారా? మీరు  రాళ్ళు కూడా అరిగించుకుంటారేమో” అని ఆ పిల్లాడి సమాధానానికి శివుడు పగలబడి నవ్వాడు.


“పిట్ట కొంచెం కూత ఘనం, చమత్కారం ఈ నేల పైనే ఉంది కాబోలు” అని మనసులో అనుకున్నాడు.


సర్లే చిన్నన్న పద అని శివుడు లేచాడు.


“అలా రండి దారికి” అని చిన్నన్న చంకలు గుద్దుకున్నాడు.


“అది సరే గాని, ఈ రోజు గుడిలో పాటలు పాడి నాట్యం చేశారే ఆమె ఎవరు?” అని శివుడు అడిగాడు.


“ఓహ్ గిరిజ అక్కా, అందరూ ఆమెను దేవదాసి అని పిలుస్తారు” అన్నాడు.


శివుడు హతాశుడయ్యాడు. అతడికి తేరుకొనటానికి కొంత సమయం పట్టింది. 

విరూపాక్ష మందిరం 



దేవదాసి గురించి కొంత విని ఉన్నాడు.


ఆలయానికి కావలసిన ధర్మ కార్యాలు చేయటానికి, ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించటానికి, స్వామి ని నాట్య గానాలతో అలరించటానికి ఆమె చిన్నతనం లోనే దేవాలయానికి అంకితం అవుతుంది.


 శివుడు పడుకున్నాడు కానీ అతనికి నిద్ర పట్టడం లేదు.


“ఇంత చిన్న వయసులో అంత భక్తి భావంతో భగవంతుని సేవకు అంకితం అయిపోవటం సాధ్యమేనా? దానికి ఎంత నిస్వార్థత, నిబద్ధత ఉండాలి” అని అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి ఆమె పై గౌరవ భావం కలిగింది.


ఆ తరువాత రోజు కూడా గిరిజ ఉదయాన్నే గుడికి వచ్చి అన్ని పూజా కార్యక్రమాలలో పాలు పంచుకుంది. సంగీత నృత్యాలతో భగవంతుని ఆరాధించినది. ఆ రోజు మద్యాహ్నం దేవుడికి నివేదన అయిపోయాక పూజారి గారు శివుడిని పిలిచి – “అబ్బాయి శివుడూ, ఈ ఊరికి క్రొత్తగా వచ్చావు కదా ఈ చుట్టు పక్కల ప్రదేశాల విశిష్టత తెలుసునా?” అని అడిగారు.


శివుడు తెలియదనట్లు తల అడ్డంగా ఊపి తల దించుకున్నాడు.


పూజారి గారు గుడిలో ఉన్న గిరిజను పిలిచి “అమ్మాయి గిరిజ, శివుడు గిరిజా కళ్యాణం ఘట్టానికి సంబంధించిన శిల్పాలు చెక్కుతాడు. అతడికి ఈ గుడి చుట్టు పక్కల ఉన్న ప్రదేశాలను చూపించి ప్రాశస్త్యాన్ని వివరించి చెప్పు” అని ప్రేమగా చెప్పారు. “అన్నట్టు తోడుగా మా చిన్నన్నను కూడా తీసుకు వెళ్ళండి”.


గిరిజ, శివుడు, ఇద్దరి మధ్యలో గెంతుకుంటూ చిన్నన్న అందరూ తుంగభద్రా నది ఒడ్డుకి చేరుకున్నారు. అక్కడి నుండి తెప్ప సహాయం తో నదిని దాటారు. ఆ పైన కాలి నడకన పంపా సరోవరం వద్దకు చేరుకున్నారు. ఆ సరస్సు నిండా విరబూసిన కలువలు, సరస్సు చుట్టూ వాలిన రకరకాల పక్షులతో ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పంపా దేవి ఆ సరస్సు గట్టు మీద కూర్చుని ఆ కలువలను పరవశం తో చూస్తోంది. శివుడు కూడా నేల మీద చతికలబడ్డాడు. ఆ కలువలను సుతారంగా తాకుతూ


“ఇది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. ఈ సరస్సు చాలా పవిత్రమైనది అని చెబుతారు. ఇక్కడే పంపా దేవి శివుని కోసం తపస్సు చేసిందిట. అంతే కాదు ఇక్కడే ఆ శ్రీ రాముడు శబరి దేవి ని కలుసుకున్నదిట. ” అని ఆ సరస్సులోని నీటిని తన నెత్తి మీద చల్లుకుంది.


అంతలో ఆ సరస్సులో నుండి ఒక హంస వచ్చి ఆమె పంచన చేరింది. ఆమె ఆ హంసని నిమురుతూ “ఎంత అందంగా ఉందో కదండీ. కానీ దురదృష్టం చూడండి, ఈ సరస్సులో ఇప్పుడు ఒక్క హంసనే మిగిలింది. హంస తూలిక తల్పాల  కోసం కొందరు స్వార్థపరులు వీటిని చంపేశారు, చంపేస్తున్నారు, ఎంత అన్యాయం కదా” అంటూ బాధ పడింది.


శివుడికి ఆమె చెప్తున్న మాటలు వినిపించటం లేదు. సరస్సులో విరబూసిన కలువల మధ్య, హంస తో ఉన్న ఆమె అతడికి ఆ క్షణం లో దేవతా స్త్రీ లాగా అనిపిస్తోంది. ఆమెని చూస్తూ కంటి రెప్ప వేయటం మరచిపోయాడు. అది పసిగట్టిన ఆమె అతడి వైపు తీక్షణంగా చూసింది. అంతే అతడు చూపుల సంకెళ్ల నుండి బయట పడి “అవును అది ముమ్మాటికీ తప్పే” సిగ్గుతో తలదించుకున్నాడు.


ఆ సంభాషణకు అంతరాయం కలిగిస్తూ ఎక్కడి నుండో చిన్నన్న కేక వినిపించింది. ఇద్దరూ వెనెక్కి తిరిగి చూసే సరికి చిన్నన్న ని ఒక వానరం అల్లరి పెడుతోంది. శివుడు గబుక్కున లేచి చిన్నన్న చేతిలోని సంచిని దూరం గా విసిరేశాడు. ఆ కోతి సంచిని వెతుక్కుంటూ అందులోని అరటి పండుని తీసుకొని పరిగెత్తింది. చిన్నన్న అప్పటికే భయంతో వణుకుతున్నాడు. శివుడు అతడిని హత్తుకుని “ఏమి భయం లేదు, అయినా ఆ సంచి ఎందుకు తెచ్చావు” అన్నాడు.


“మధ్యలో ఆకలేస్తుందని తెచ్చుకున్నా” అని చిన్నన్న ఏడుపు లంకించుకున్నాడు.


చిన్నన్న శివుడిని విడిపించుకుని గిరిజ వద్దకు పరిగెత్తాడు. “ఆ శ్రీ రాముడు శబరి దేవి దగ్గర పళ్ళు తీసుకున్నట్టు ఆ రామ బంటు నీ దగ్గర ఉన్న పళ్ళ కోసం ఆశ పడ్డాడు. చూశావా, నువ్వెంత అదృష్టవంతుడవో” అని గిరిజ చెప్పేసరికి చిన్నన్న చటుక్కున ఏడుపు మానేసి పరిగెత్తి గిరిజను కౌగలించుకున్నాడు. 


ఇప్పటి పంపా సరోవరం:


కొద్ది సేపటికి వారు అక్కడి నుండి బయలుదేరి పరమ శివుడు, పంపా దేవి కలుసుకున్న హిమ కూటం పర్వతం, అక్కడి నుండి మన్మధ పుష్కరిణి ని సందర్శించి గుడికి తిరిగి వచ్చారు.


గిరిజ రోజూ ఉదయాన్నే గుడికి వచ్చేది. శివుడు శివ పార్వతుల శిల్పాలు అ ఘట్టానికి అనుగుణంగా చెక్కేవాడు. ఆ శిల్పాలను మరింత సజీవంగా మాలచటానికి గిరిజ సలహాలు తీసుకునేవాడు. అలాగే పురాణాలకు సంబంధించిన సందేహాలు వచ్చినప్పుడు ఆమెతో చర్చించేవాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. మొదటి చూపులో ఆమె అందానికి ఆకర్షితుడైన అతడు ఇప్పుడు ఆమె భక్తికి, ప్రజ్ఞ కి, విజ్ఞానానికి ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణ నెమ్మదిగా ఆరాధన గా మారింది. దూరంగా ఉన్న చందమామని చూసి ఆనందించినట్లు అతడు ఆమెను ఆరాధించటం మొదలు పెట్టాడు. 


గిరిజ కూడా అతని శిల్పకళా నైపుణ్యానికి అబ్బురపడేది. చిన్నన్న ద్వారా అతడు సాయంత్ర సమయంలో రహస్యంగా ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నాడని తెలుసుకున్న ఆమె ఒకరోజు అతడిని అదేమిటో చూపించమని ప్రాధేయపడింది.


 అతడు ఆమెను గర్భ గుడి వెనుక నున్న మెట్లు ఎక్కించి పైన ఉన్న శాలు మండపం వద్దకు తీసుకు వెళ్ళాడు. ఆ గది చిన్నగా, చీకటిగా ఉంది. గది మూలన చిన్న చీలిక ఉంది. ఆలయ ప్రధాన గోపురం నుండి వచ్చే కాంతి ఆ చిన్న చీలిక గుండా ప్రయాణించి, మండపం లోని గోడ మీద ఆ గోపురం నీడ తలక్రిందులు గా కనిపించింది. “చూడండి ఇదే మాయ. ఆ గోపురాన్ని ఛాయా రూపం లో బంధించగలిగాము.” అని గర్వంగా చెప్పాడు శివుడు. 


అది చూసి గిరిజ ఆశ్చర్య చకితురాలు అయ్యింది. “ఇది ఎలా సాధ్యమయ్యింది చెప్పరా” అని వేడుకుంటూ గిరిజ గుడి మెట్ల మీదే కూర్చుండి పోయింది. శివుడు దాని వెనుకనున్న గణితాన్ని, విజ్ఞానాన్ని ఆమెకు విశదీకరించాడు.


రాజ గోపురం నీడ మీరు క్రింది బొమ్మలో చూడవచ్చు. ఇదే విజ్ఞానాన్ని పిన్ హోల్ కెమెరా లో వాడతారు.


అతడు వివరించిన తరువాత కొద్ది సేపటికి గిరిజ “అన్నట్టు చిన్నన్న చెప్పాడు, మీకు చిన్నప్పుడే తల్లి తండ్రి దూరం అయ్యారని - తెలిసి బాధ కలిగింది” అని అతడి కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకుంది.


“ అవునండి, తలచుకుంటే బాధే. నాన్న గారు చిన్నపుడు ఏదో తెలియని మహమ్మారి తో చనిపోయారు. ఆ తరువాత సతీ సహగమనం అనే మహమ్మారి మా అమ్మ గారిని కూడా పొట్టన బెట్టుకుంది” అతడి కళ్లల్లో నుండి తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి.


గిరిజకు అతడిని ఎలా ఓదార్చాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉండిపోయింది.


“నాన్నగారు ఎలాగో చనిపోయారు. మా అమ్మ సజీవంగా నిప్పులలోనికి దూకింది. తలచుకుంటేనే నా గుండెల్లో అగ్ని పర్వతాలు బ్రద్దలవుతాయి. అమ్మ అలా వైధవ్యం తట్టుకోలేక కావాలనే చేసిందో లేక ఈ సమాజం బలవంతం మీద చేసిందో తెలియదు. ఏదైతేనేనం ఆ తరువాత ఈ సమాజం లో ఎవరికీ దగ్గర కాలేకపోయాను.” 


“నా బాధని మరచిపోవటానికి శిలలకు ప్రాణం పోయటాన్ని వ్యాపకంగా మార్చుకున్నాను. నా తోడు, నీడ, నా ప్రాణం  అన్నీ అవే”. 


అతడి ఎర్రటి కళ్ళు అతడి గుండెల్లో అగ్ని పర్వతాన్ని చూపిస్తున్నాయి.


వాటికి చలించిన గిరిజ “మీరు అధైర్య పడకండి. ఈ గుడిలోని వారు అంతా మీ పరివారం అనుకోండి. మీ కష్ట సుఖాలలో మేము కూడా ఉన్నామని గుర్తుంచుకోండి” అని నిప్పులు చేరుగుతున్న అతడి కళ్ల లోనికి చూస్తూ చెప్పింది..


“క్షమించండి, ఎవరి వద్దా నా వ్యక్తిగత విషయాలు పంచుకోని నేను ఈ రోజు ఇలా.. . ” అంటూ అతడు భుజం మీది తుండు గుడ్డ తో కన్నీళ్ళు తుడుచుకున్నాడు.


“నాది కూడా కొంచెం మీలాంటి కధే. మీరు తల్లిదండ్రులు మరణించారని బాధ పడుతున్నారు. నన్ను మా తల్లిదండ్రులు చిన్న తనం లోనే ఈ గుడికి అంకితం ఇచ్చేశారు. అలా చేస్తే పుణ్యం వస్తుందని ఎవరో చెప్పారుట. పన్నెండు ఏళ్ల ప్రాయంలో నాకు ఈ గుడి లో పరమ శివునితో వివాహం కూడా జరిగింది. అప్పటి నుండి ఈ గుడే నాకు పుట్టిల్లు, మెట్టినిల్లు” అంది గిరిజ శూన్యం లోకి చూస్తూ.


“అవును విన్నాను. మీరు జీవితాంతం ఇలా భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటారా? మీరు ఒక వివాహం, సంసారం..” అని శివుడు మధ్యలో ఆపేశాడు.


“మీ సందేహం నాకు అర్థంఅయ్యింది” అని ఆమె చిన్న నవ్వు నవ్వింది.


“నన్ను ఇక్కడ నిత్య సుమంగళి గా గౌరవిస్తారు, ప్రతి పెళ్ళిలో నేను మంగళ సూత్రాన్ని తాకిన తరువాతే వధువుకి మాంగల్య ధారణ జరుగుతుంది. నాకు జీవితాంతం వైధవ్యం లేదు. స్వామి వారికి చేసే ప్రతి పూజా కార్యక్రమం నేను లేనిదే జరగదు. సమాజం నుండి గౌరవం, రాచ మర్యాదలతో కూడిన జీవితం. ఇంతకు మించి ఇంకేమి కావాలి?” అన్నది తనకు తాను సమాధాన పరుచుకునేటట్లు.


“సమాజం గౌరవిస్తుందనో లేక రాజ్యం కావాలనుకుంటోందనో కాదు మీ కోసం మీరు ఆలోచించుకున్నారా? మీ బాధలు, సంతోషాలు మీతో పంచుకునే వ్యక్తి ఒకరు కావాలని, వీరే కావాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా ” అని అసలు సందేహాన్ని బయట పెట్టాడు శివుడు. 


“లే లే లేదు..” అని గిరిజ అతడికి సూటిగా సమాధానం చెప్పలేక మెట్లు దిగి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.


శివుడు తాను తొందరపడి ఆమెను బాధ పెట్టినందుకు తనను తానే నిందించుకున్నాడు.


అయితే వీరి ఇద్దరినీ క్రింద నుండి పరిశీలిస్తున్న ఆలయ ధర్మకర్తను వారు గమనించలేదు.


అది ఒక అమావాస్య రాత్రి. ఆ రోజు జరిగే ఘొరం చూడలేకే నేమో బహుశా చందమామ ఆ రోజు ఆకాశంలో దాక్కుంది.


 శివుడు గుడిలో విశ్రమిస్తుండగా అతడికి ఏదో అలికిడి అనిపించి నిద్ర లేచాడు. దూరంగా అతడికి గిరిజ ఆలయ ప్రధాన మండపం వద్దకు కాగడా తో వస్తున్నట్టు కనిపించింది. గుడి లోపల నుండి కాగడా తీసుకొని బయటకు వచ్చాడు.


ఆమె కాగడా నందీశ్వరుడిని పట్టుకుని ఏడుస్తూ ఉంది. ఆమెను ఎలా ఉపశమించాలో అర్థం కాక అతడు ఆమెను చూస్తూ ఉండిపోయాడు.


కొద్ది సేపటికి ఆమె అతడిని చూసింది. చెదిరిన జుట్టు , కన్నీళ్ళు, స్వేదం తో తడిసిన ఆమె శరీరాన్ని చూడగానే అతడికి గాబరా పుట్టింది.


“క్షమించండి, మిమ్మల్ని చూడనే లేదు” అని ఆమె అతడి కేసి చూసింది. ఎంత ఆపుకుందామన్నాఆమెకు దుఃఖం ఆగటం లేదు.


“ఏం జరిగింది, భయం లేకుండా చెప్పండి.” అని శివుడు నెమ్మదిగా ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు.


“ నేను దేవుని భార్యని అని చెప్పినప్పుడు ఎంతో గర్వ పడ్డాను. సమాజం నన్ను గౌరవంగా చూస్తోందని మురిసిపోయాను. కానీ ఇలా..”


“నన్ను ఆ నీచుడు బాలాత్కరించబోయాడు.. నువ్వు దేవుడి దాసీవీ కనుక దేవాలయానికి అస్థివి, నా ఆస్థివి అనుకుంటూ నన్ను స్వాధీనపరుచుకోబోయాడు” ఆ తరువాత ఆమె గొంతు పెగలలేదు.


“ఎవరా నీచుడు?” అన్నాడు శివుడు కోపం తో ఊగిపోతూ.


“ఆ ఆలయ ధర్మ కర్త”


“నాతో ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలు చర్చించాలని వచ్చాడు. మాటల్లో నా మీద చేయి వేయబోయాడు. అతడి కళ్లల్లో, ఒంటి నిండా నాకు కామం కనిపించింది. నాకు ఆ ఉద్దేశ్యం లేదు అని నేను దూరంగా జరిగాను. అంతే నా మీద రాక్షసుడిలా పడిపోయాడు. నేను నా జడని అతడి మెడకి చుట్టి అతడు ఉక్కిరి బికకిఎరి అయ్యాక ఇలా పారిపోయి వచ్చాను” అంది జీరబోయిన స్వరం తో.


“ఆ రాక్షసుడిని ఇలా వదల కూడదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి” అని శివుడు ఆవేశంగా లేచాడు.


“మీరు ఆవేశపడకండి. తొందరపాటు వల్ల తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరిగ్గా ఉండవు. తప్పు అతనిది అని చెప్పి నలుగురిలో అతడిని నిలదీయాలి, అంతే గాని కీచకూడిలా ఎవరు దాడి చేశారో కూడా తెలియకుండా అతడు మరణించకూడదు” అని గిరిజ శివుడి ఆవేశాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది. 


శివుడు ఆ మాటకు కొంత శాంతించాడు.


 


మరునాడు ఉదయం న్యాయస్థానం లో.


న్యాయకర్త ముందు గిరిజ, ఆలయ ధర్మ కర్త, శివుడు, పూజారి నిల్చుని ఉన్నారు.


“అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పండి” అన్నారు న్యాయకర్త గిరిజ వైపు చూస్తూ.


“నన్ను, ఈ ధర్మకర్త నిన్న బాలాత్కరించబోయాడు. నేను ఎలాగో తప్పించుకుని వచ్చాను. “ అని తలవంచుకుని చెప్పింది గిరిజ.


వెంటనే ధర్మకర్త అందుకుని “ఆమె చెప్తున్నది అబద్ధం అయ్యా. హవ్వా, నేను ఇంత పరువు గలవాడిని, ధర్మ కార్యాలు చేసే పెద్ద మనిషిని నేను ఎందుకు అలా చేస్తానయ్యా. అసలు నిజం నేను చెప్తాను వినండి.


గిరిజ, శివుడు ప్రేమించుకుంటున్నారు. ఆమె దేవదాసి అయి ఉండి అలా చేయటం తప్పు అని అందరూ నిందిస్తారని ఆమె నాపై ఈ తప్పుడు నేరం మోపింది. ఇలా చేస్తే ఆమెకు ఈ గుడి బాధ్యత నుండి విముక్తి కలిగి ఆ శివుడిని పెళ్లి చేసుకోవచ్చునని పన్నాగం పన్నినది అయ్యా” అని రెండు చేతులూ జోడించి వినయం నటిస్తూ.


 న్యాయకర్త శివుడి కేసి చూసి “ఏమయ్యా, నువ్వు, గిరిజ ప్రేమించుకోవటం నిజమేనా?” అని అడిగారు.


“నేను ఆమెను ఆరాధించటం నిజమే, కానీ ఆమె నన్ను ప్రేమించటం నిజం కాదండీ. ఈ ధర్మకర్త మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు” అంటూ ధర్మకర్త వైపు వేలెత్తి చూపించాడు.


న్యాయవేత్త గిరిజ వైపు చూసి “ఏమ్మా, శివుడు చెప్పినది నిజమేనా?” అని అడిగారు.


గిరిజ అడ్డంగా తల ఊపింది.


“నాకు శివుని మీద అభిమానం ఉంది, కానీ అది నా మనసులోనే గూడు కట్టుకున్న నిజం. అది నా వృత్తి ధర్మానికి ఎప్పుడూ భగ్నం కలిగించలేదు. ధర్మకర్త నన్ను బలాత్కారం చేయబోవటం వాస్తవం. ఆ విషయానికి, శివుడికి ఏమి సంబంధము లేదు” అని ఖచ్చితంగా చెప్పింది.


న్యాయ కర్త పూజారి వైపు తిరిగి “పూజారి గారు, అసలు నిజానిజాలు ఏమిటో మీరు చెప్పండి” అన్నాడు.


“చెప్తాను అయ్యా. శివుడు, గిరిజ మధ్యన ఉన్నది ఒక పవిత్రమైన అనుబంధం. ఒకరంటే మరొకరికి అభిమానం, ఆరాధన. వారి ఇద్దరి మధ్య అనుబంధం శృతి మించటం నేను ఎప్పుడూ గమనించలేదు.  ఈ ధర్మకర్త గారికి ఎప్పటి నుండో ఈ పసి దాని మీద మనసు ఉంది. ఆమెను అతడు కామం తో చూడటం నేను గమనించాను. తండ్రి లాంటి వాడు అలా ఎలా ఆలోచిస్తాడు, నేనే భ్రమ పడ్డా నేమో నాని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. మొన్న ధర్మ కర్త శివుడు, గిరిజ మాట్లాడుకోవటం చూసి కోపం తో ఊగిపోవటం చూశాను. ఆమె తన నుండి, ఈ గుడికి దూరం అవుతుందేమో నని ఆవేశం తో ఈ పని చేసి ఉంటాడు అని నాకు అనిపిస్తోంది. నా ఉద్దేశ్యం ప్రకారం ధర్మకర్త ఈ నేరం చేసే ఉంటాడు”.


న్యాయకర్త వెంటనే ధర్మ కర్త వైపు తిరిగి “ఆలయ ధర్మకర్త వి అయి ఉండి ఇటువంటి పాడు పని చేయటానికి నీకు సిగ్గు లేదటయ్యా, వెంటనే ఇతనికి మన న్యాయ ప్రకారం గా ఒక కాలు, ఒక చేయి నరికెయ్యండి” అని ఆజ్ఞాపించాడు.


భటులు ధర్మకర్త ను బలవంతంగా తీసుకొని శిక్షించడానికి వెళ్ళి పోయారు.


ధర్మకర్త శివుడి వైపు తిరిగి “ఏమయ్యా శివుడు, ఒక వేళ నువ్వు పెళ్లి చేసుకుంటే గిరిజని గుడికి దూరం చెయ్యవు కదా.” అన్నారు


“గుడి అన్నా, గుడిలోని పరమ శివుడు అన్నా ఆమెకు ప్రాణం. ఆమె నాతో పెళ్ళికి ఒప్పుకుంటే ఆమె ప్రాణాన్ని ఆమె నుండి దూరం చేయను” అన్నాడు.


అప్పుడు ధర్మకర్త గిరిజ వైపు చూస్తూ-


“చూడమ్మా, దేవదాసి అనేది దేవునికి సేవ చేసుకునే వృత్తి. దేవుని మీద అంకిత భావం తో పని చేయటం కోసం దేవుని తో పెళ్లి అనే ఆచారాన్ని పెట్టారు. అంత మాత్రాన నువ్వు వేరొకరిని వివాహం చేసుకోకూడదని శాస్త్రం ఏమి లేదు. నువ్వు, శివుడు నిజం గానే ప్రేమించుకుంటే మీరు ఇద్దరూ వివాహం చేసుకోవటంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.” అని తీర్పు ముగించారు.


గిరిజ సిగ్గుతో తల దించుకుంది. శివుడు ఆనందంతో ఆమెకేసి చూశాడు. పూజారి గారు దూరం నుండే ఇద్దరినీ ఆశీర్వదించారు.


ఓక పౌర్ణమి నాడు గిరిజా కళ్యాణం విరూపాక్ష మందిరంలో అత్యంత వైభవంగా జరిగింది.


----------

ఆలయ ధర్మకర్తకు మంచి శిక్షే పడింది కదా, మరి అప్పట్లో ఆడ వారిని అవమానిస్తే శిక్షలు అంత కఠిన్యంగానే ఉండేవిట.


సమాజంలో ఏ ఆచారం అయినా ఒక మంచి ఉద్దేశ్యం తోనే మొదలవుతుంది. అది కొందరు డబ్బు, పలుకుబడి ఉన్న స్వార్థపరుల చేతిలో పడ్డప్పుడే అది దురాచారం అవుతుంది. పేదరికం, నిరక్షరాస్యత వల్ల దానిని గుడ్డిగా నమ్మితే అదే మూఢాచారంగా మారుతుంది. అది సమాజాన్ని పక్క దోవ పట్టిస్తోంది, మానవత్వాన్ని మట్టి కలుపుతోంది అని తెలిసినప్పుడే సంఘ సంస్కర్తలు పుడతారు, ఆ మూఢాచారాలను రూపు మాపుతారు.


దేవదాసీ వ్యవస్థ కూడా అటువంటిదే. దేవాలయాలు అప్పట్లో సాంఘిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు. దేవాలయాలలో ధర్మ కార్యాలు, దేవుని పూజ చేయటానికి, వచ్చే భక్తులను అలరించటానికి కొందరు స్త్రీలు అవసరం అని గ్రహించి దేవదాసీ వ్యవస్థ 7 వ శతాబ్దం లో ఉద్భవించింది. శ్రీ కృష్ణ దేవరాయులు కాలంలో అది ఎంతో అభివృద్ధి చెందినంది. దేవదాసి లకు సమాజం లో ఎంతో విలువ, గౌరవం, సిరి సంపదలు ఉండేవిట. అయితే కాల క్రమేణా కొందరు స్వార్థ పరులు దేవదాసి లు భగవంతుని ఆస్తి కనుక దానిని పౌరులు అందరూ అనుభవించే హక్కు ఉన్నది అని చెప్పి ఆ వ్యవస్థను ఒక నవ్వులాటగా మార్చారు. ఇప్పుడు మనకి తెలిసిన దేవదాసి అంటే ఏదో నామ మాత్రానికి దేవునితో తాళి కట్టించి ఆమె ను వేశ్యగా మార్చిన ఒక వ్యవస్థ. పైగా దేవదాసీని వివాహం చేసుకుంటే ఆ గ్రామం నాశనం అయిపోతుందనే మూఢ నమ్మకాలు. మన ప్రభుత్వం ఈ దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక బిల్లును పాస్ చేసింది. అయినా కూడా ఇంకా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఈ పిచ్చి దేవదాసి వ్యవస్థ సజీవంగా ఉంది అంటే నమ్ముతారా? 2013 లోని హ్యూమన్ రైట్స్ నివేదిక ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రాలలోనే 80 వేల మంది దేవదాసిలు ఉన్నారుట. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారిని గుర్తించి వారికి పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తోంది.


వితంతులను అగౌరవ పరిచే వ్యవస్థ కూడా అటువంటిదే. ఆ రోజుల్లో వితంతువులను సతీ సహగమనం పేరిట ఎలా సజీవంగా మంటల్లో తోసేవారో చదివితే మనుషులు అప్పుడు మృగాలుగా ప్రవర్తించేవారో అర్థం అయ్యి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కొందరు సంఘ సంస్కర్తలు పూనుకోవటం వలన ఆ ఆచారానికి తెర పడింది. ఇప్పటికీ వితంతువులను మన సమాజం అవమానిస్తూనే ఉంటుంది. మన ఆచారాలు ఒక మంచి ప్రయోజనం కోసం, ఒకప్పటి సాంఘిక వ్యవస్థ అనుసారం మొదలు పెట్టినవి. వాటి మూలాలు తెలుసుకొని మానవత్వం తో ప్రవర్తిద్దాం. అంతే గాని మూఢాచారాలు పేరిట సాటి స్త్రీల స్వేచ్చా స్వాతంత్రాలు హరించేలా, వారిని అవమానించే హక్కు మనకు లేదు.



Rate this content
Log in

Similar telugu story from Drama