Soudamini S

Drama Inspirational

4  

Soudamini S

Drama Inspirational

మేడి పండు

మేడి పండు

5 mins
3.2K


2015 సంవత్సరం డిసెంబర్ నెల:

టి. వి. లో వార్తల ముఖ్యాంశాలు వస్తున్నాయి: క్రిమి సంహారక మందులు చల్లుతూ మహారాష్ట్ర లోని యావత్మల జిల్లాలో ఇద్దరు రైతుల మృతి.

సోఫాలో కూర్చుని ఆ వార్తలు చూస్తున్న సుస్మిత మనసులో అనుకుంటోంది “మేడిపండు చూడ మేలిమై యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు” అని వేమన చెప్పినట్టు, పైకి మేడిపండులా మంచిగా ఉంటూ లోపల చీడపురుగుల లాంటి ఆలోచనలు ఉన్నవారి వల్లే ఎక్కువ ప్రమాదం.”

ఆరునెలల క్రితం:

ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరినప్పటి నుండి పురుగుల వేటలో తను దిట్ట (అదేనండీ సాఫ్ట్వేర్లో సమస్యలను బగ్గులు అంటారుగా). మూడేళ్లల్లో రెండు ఉత్తమ ఏమ్ప్లోయీ అవార్డులు ఆమె స్వంతం చేసుకుంది.

అప్పుడే ఆమెను కలిశాడు ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణ. చూడటానికి చాలా హుందాగా, తెలివైన వాడులా అనిపించాడు.

“ఈగలు తోలినట్టు ఈ బగ్గులు ఎన్నాళ్ళు తరుముతారు ? మేము ఒక వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టు చేస్తున్నాం, అక్కడ నిజమైన పురుగుల్ని తరుముదురు గాని రండి. మీరు మా టీం లో చేరితే మీకు త్వరత్వరగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. అంతే కాక చాలా మంది రైతుల జీవితాలలో మార్పులు తీసుకు వచ్చిన వారు అవుతారు. భుక్తికి భుక్తి, ముక్తికి ముక్తి ” అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు.

“వినటానికి బాగానే ఉంది. పురుగులు ఏమిటి, తరమటం ఏమిటి అసలు ఈ ప్రాజెక్టు ఏమిటి? కొంచెం వివరంగా చెప్తారా?” అని అమాయకంగా అడిగింది సుస్మిత.

“మీకు తెలుసు కదా చీడ పురుగులు మన రైతుల పంటకి హాని చేస్తాయని! గత నాలుగు సంవత్సరాల నుండి చీడ పురుగులు ప్రత్తి పంటని ఏ ప్రాంతంలో, ఏ సమయంలో దాడి చేశాయి అన్న సమాచారాన్ని రికార్డు చేశాం. ఆ వివరాల నుండి ఈ సంవత్సరం ఏ ప్రాంతంలో, ఏ సమయంలో చీడ పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో మనం ముందే కనిపెట్టాలి.” అంటూ ఫోన్ లో ప్రాజెక్టు వివరాలు చూపించాడు.

“కానీ పురుగుల మందు వాడటం వల్ల పర్యావరణానికి, మనుషులకు హానికరం అంటున్నారు కదా. అందుకే అందరూ సేంద్రీయ వ్యవసాయం లోకి దిగుతున్నారు కదా. .. మళ్ళీ మనం అదే పురుగుల మందును ప్రోత్సాహిస్తే ఎలా?” నోటి మీద వేలు వేసుకుంటూ అతడికేసి సూటిగా చూస్తూ ప్రశ్నించింది సుస్మిత.

“ఓహ్ ఆదా మీ సందేహం. మనం ఈ ప్రయోగం ప్రత్తి పంటకు మాత్రమే చేస్తున్నాం. ప్రత్తి మనం తింటామా ఏమిటి? పైగా ముందుగా మనం ఒక జిల్లాకు మాత్రమే ఈ సందేశాన్ని అందిస్తాం. ఆ ఫలితాలు బాగుంటేనే మనం నెమ్మదిగా దేశ వ్యాప్తంగా విస్తృతి చేస్తాం. “ అని నవ్వుతూ నుంచున్నాడు.

తను అడిగిన ప్రశ్న అంత మూర్ఖంగా ఉందా అని సుస్మిత మనస్సు ఒక సారి చివుక్కుమంది. మళ్ళీ తమాయించుకుని “అంటే మనకి అన్నం పెట్టె చేతిని మనమే నరుక్కోకూడదు కదా అందుకని అడిగాను.” అని సమర్థించుకుంది.

“చూడండి. పురుగుల మందు వాడకపోతే రైతు దిగుబడికి ఎంత నష్టమూ తెలుసా? పురుగుల మందులు షాపుల వాళ్ళు కూడా అమాయకపు రైతులకు చైనా వాళ్ళ దొంగ పురుగుల మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారుట. దాని వల్ల పంటకు ఏమీ సహాయం ఉండదు కదా, పై పెచ్చు భూమి పాడు అవుతుంది. అందుకనే మనం అందించే సమాచారంతో మన దేశపు పురుగుల మందులే వాడతారు. దాని వల్ల రైతులకు, మన దేశానికి కూడా సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇలాంటి టెక్నాలజీ అమెరికా, కెనడా వంటి దేశాలలో ఇప్పటికే ఉంది. దీనిని మన దేశానికి తీసుకురావటమే మన కంపనీ ముఖ్య ఉద్దేశ్యం. అందులోను మీ లాంటి తెలివైన వాళ్ళే ఈ సమస్యని పరిష్కరించగలరు అని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను.” అంటూ చేతులు దులుపుకున్నాడు.

బహుశా ఆ చివరి మాటకు ఆమె పడిపోయింది. “సరే ఒక వారంలో మీకు సమాధానం చెప్తాను. “, అంటూ లేచి నుంచుంది.

రామకృష్ణ వెళ్ళిపోగానే ఆమె ప్రక్క సీట్ లో ఉన్న కొలీగ్ ఉపేంద్ర అన్నాడు, “మేడమ్, మీరు ఏమీ అనుకోనంటే నాదొక సలహా. మా నాన్న కూడా ఒక ప్రత్తి రైతు. నాకు వ్యవసాయం మీద అవగాహన ఉంది. మీరు ఈ ప్రాజెక్టు ముట్టుకోకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం”.

ఆమెకు రామకృష్ణ చెప్పిన దానిలో తప్పు కనిపించలేదు. పైగా తనను వెతుక్కుంటూ వచ్చాడు. టెక్నాలజీ వినియోగాన్ని మన దేశంలో పెంచితేనే కదా మన వ్యవసాయం వృద్ధి చెందేది. ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు, తను ఎదగాలి అనుకున్నప్పుడు కొందరు ఇలాగే అడ్డు పడతారు అనిపించింది. రామకృష్ణకు మరునాడే తన అంగీకారాన్ని తెలిపింది.

*********************

అలా మూడు నెలలు గడిచింది.

ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయమని రామకృష్ణ నుండి ఒత్తిడి మొదలయ్యింది.

“ఎంటోమాలజీ అనేది పురుగులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రం. పురుగుల పెరుగుదల ఆ ప్రదేశంలోని గాలిలో తేమ, ఉష్ణోగ్రత, వర్షపాతం.. ఇలా చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది అని తెలుసుకున్నాను. ఇంకా మనకి అర్థం కాని కారణాలు చాలా ఉన్నాయి. ఒకొక్క పురుగుది ఒకొక్క తీరు. ఇవన్నీ సమగ్రంగా అవగాహన చేసుకుని, దానిని ప్రోగ్రంగా మార్చాలంటే కనీసం ఆరు నెలలు అయినా పడుతుంది. ” అని రామకృష్ణ తో ఖచ్చితంగా చెప్పింది.

“మీరు అలా అంటే ఎలా? ఈ ప్రాజెక్టు మీ చేతులలోనే కదా పెట్టాం. ఇంకొక పది రోజుల్లో రబీ మొదలు అవుతుంది. ఈ లోగా మనం ప్రాజెక్టు పూర్తి చేయాలి”, అని రామకృష్ణ కోపంగా అరిచాడు.

తను తొందరగా చేయలేకపోవటం తన అసమర్థతగా భావించింది సుస్మిత. ఒక వారం పాటు పగలు, రాత్రి కష్టపడి, రకరకాల ప్రయోగాలు చేసిన తరువాత సుస్మిత రామకృష్ణను కలిసింది.

“ఇవిగో సర్ ఫలితాలు. ఇందులో పెద్ద సమస్య ఉంది. ప్రోగ్రామ్ ఫలితాలని, ఈ సంవత్సరం నిజంగా ఆ ప్రాంతం లోని చీడ పురుగుల ఉనికిని బేరీజు వేస్తే మన ఫలితాలు సరిపోవట్లేదు. మనం పురుగుల ఉనికిని ఖచ్చితంగా ముందే కనిపెట్టగలం, కానీ పురుగులు లేని కొన్ని గ్రామాలలో కూడా మన ప్రోగ్రామ్ పురుగులు వస్తాయని సిఫార్సు చేస్తోంది. దీని వల్ల రైతులు ఎక్కువ పురుగుల మందు వాడే అవకాశం ఉంది. అది మన రైతుకి చాలా నష్టం. నేను అయితే ఈ సాఫ్ట్వేర్ సిఫార్సు చేయలేను”, అని నిఖారసుగా చెప్పింది.

రామకృష్ణ నవ్వుతూ తలూపాడు.

*************

ఒక రోజు రామకృష్ణ ఆమె ఆఫీసులోనికి హడావిడిగా పరిగెత్తుకుని వచ్చాడు.

ఏదో జరిగినది కానీ ఏమీ జరిగిందో సుస్మితకి అర్థం కావట్లేదు.

“మేడమ్ కాఫీ”, అన్నాడు పక్క సీట్లో కూర్చొన్న ఉపేంద్ర.

“సరే పద” అని వెళ్ళిన సుస్మిత కు టి. వి. లో న్యూస్ చూసి తల దిమ్మ తిరిగిపోయింది.

ఆ తర్వాత ఉపేంద్ర ద్వారా అసలు విషయం తెలుసుకుంది సుస్మిత.

రామకృష్ణ తను రూపొందించిన సాఫ్ట్వేర్ ను ఒక ఎరువుల కంపనీ వాళ్ళకు అమ్మాడని, ఆ సాఫ్ట్వేర్ పురుగుల ఉనికిని ఎక్కువగా ఉంటుందని భయపెట్టడం వల్ల అక్కడి రైతులను ఎక్కువ పురుగుల మందులు వాడేలా ఎరువుల కంపెనీలు బలవంత పెట్టాయని, అలా  ఎక్కువగా పురుగుల మందుని పిచికారి చేయటం వల్లే రైతులు చనిపోయారని తెలుసుకుంది. ఎంత లేదన్నా తనకు కూడా ఈ పాపం లో బాధ్యత ఉంది కదా అని సుస్మిత తల్లడిల్లి పోయింది.

సుస్మిత, ఉపేంద్ర కలిసి ప్రయాణిస్తున్న బస్ ఒక గ్రామంలో ఆగింది.

ఆ ఊళ్ళో ఎటు చూసినా ఎర్రటి నేల. పంట పొలాల వరకు నడుచుకుంటూ వెళ్లారు. ఆ రోజు రైతులు విత్తనాలు నాటే రోజు. సుస్మిత, ఉపేంద్ర కూడా అందులో పాలు పంచుకున్నారు. ఆ కార్యక్రమం అయ్యాక రచ్చబండ వద్ద రైతులు కూర్చొన్నారు.

“మేడమ్ మన ఊళ్ళో ప్రత్తి సాగు సమయంలో ఏ పురుగులు దాడి చేసే ప్రమాదం ఉంటుందో ముందే కనిపెడతారు”, అంటూ ఉపేంద్ర సుస్మితని పరిచయం చేశాడు.

“మీకు చీడపురుగులు ముందే దాడి చేస్తాయని తెలిస్తే మీరు పంటని ఎలా కాపాడుకుంటారు?” అని అడిగింది సుస్మిత.

“దాని కోసం మేము వేప ఆకు, ఆవు మూత్రాలతో చేసుకున్న సేంద్రీయ మందు ఉంది. అదే వాడతాం.” అని రైతులు ముక్తకంఠంతో చెప్పారు.

“అంటే మీకు పురుగుల మందులు అసలు అవసరం లేదా?”, ఆశ్చర్యపోతూ అడిగింది సుస్మిత.

“అమ్మా, పురుగుల మందు వాడకుండా పెంచటానికి ఎక్కువ శ్రమ కావాలి. ఒక సారి వాడటం మొదలు పెడితే పురుగులు వాటిని కూడా తట్టుకుని నిలబడతాయి. అప్పుడు ఇంకా అంత కంటే ఎక్కువ శక్తివంతమైన మందులు వాడాలి. అందుకే మందులు వాడకుండా ఉంటేనే మంచిది”, అంటూ అందులో ఒక రైతు సమాధానం చెప్పాడు.

“అదే మేడమ్, డార్విన్ సిద్ధాంతం, “survival of the fittest” అన్నాడు ఉపేంద్ర.

సుస్మితకు వెంటనే రామకృష్ణ గుర్తుకొచ్చాడు. రైతులకు సహాయపడే వాడిగా హుందాగా నటించిన అతడి మనసులో ఎంత కుట్ర? తమ బిజినెస్ ని త్వరగా అభివృద్ధి చేయాలి అన్న దురాశ కోసం రైతులను పావులుగా వాడుకున్నాడు. ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని కనిపెట్టిన వాడిగా పేరు సంపాదించాలి అనే స్వార్ధం కోసం సుస్మితను పావుగా వాడుకున్నాడు.

రామకృష్ణని ఉద్యోగంలో నుండి వెంటనే ఊడబీకారు. సుస్మితకి కూడా తెలిసో తెలియకో ఆ పాపంలో భాగం ఉండటం వల్ల ప్రాయశ్చిత్తంగా తను కూడా ఆ ప్రాజెక్టుని వదిలేసి ఈ సేంద్రీయ వ్యవసాయం లోకి అడుగు పెట్టింది. తన వంతు బాధ్యతగా, శాస్త్రీయంగా పురుగులను కూకటి వేళ్ళతో నిర్మూలించే పనిలో పడింది.

పైకి కనిపించే పురుగులను తరమటం సులువే, కానీ మేడిపండు లాగా ఉన్న మనుషులలో గూడు కట్టి ఉన్న చీడపురుగులను తరమటమే కష్టం అనుకుంది సుస్మిత.



Rate this content
Log in

Similar telugu story from Drama