చందమామ రావే
చందమామ రావే
"మా బాబు బంగారు కదూ, ఏది .. ఇంకొక్క ముద్ద , ఆఁ .. నోరు తెరవాలి... ఏది ఏది.. అమ్మ..." అమ్మ మురిపిస్తూ తినిపిస్తోంది. బాబు ముద్ద మింగాడు.
తల్లి ఇంకో అస్త్రం ప్రయోగించింది.
" అదిగో , అక్కడ ఆకాశంలో చూడు చందమామ. భలే ఉన్నాడు కదా , అచ్చం నీ లాగే... ఏది ఇంకో సారి ఆఁ , అను.." ఇంకో ముద్ద మింగాడు బాబు.
" అమ్మా.."
" ఊఁ..."
"అంత పెద్ద ఆకాశంలో చందమామ ఒక్కడికే భయమెయ్యదా?"
" ఊహూ , చంద్రుడికేం భయముండదు"
" ఎందుకుండదు ? అక్కడ వాళ్ళమ్మ లేదు కదా ?"
" ఎందుకు లేదు , ఒక్క అమ్మ కాదు , చూడు ... అక్కడ మెరుస్తున్న నక్షత్రాలున్నాయే, అవన్నీ అమ్మలే – ఇంకేం భయం ?
*****
గురు పూర్ణిమ
స్వచ్చమైన వెన్నెలలో తడుస్తూ, ఆరు బైట ధ్యాన ముద్రలో కూర్చున్న వందకు పైగా శిష్యులకు ఉపదేశమిస్తున్నాడు జ్ఞానబోధానంద
"అందరూ భక్తి భావం తో కళ్ళు మూసుకుని చీకటినే చూస్తూండండి- ముందు కొంచెం వెలుతురు.. తరువాత అంతా చీకటి. అందరూ చీకటిని చూస్తున్నారా?"
అందరూ కళ్ళు మూసుకొని చూస్తున్నామన్నట్టుగా తలలూపారు.
ఇప్పుడు ఒక్కొక్క చీకటి పొరనే చీల్చుకుంటూ, అంతర్దృష్టితో తెరలను తొలగించుకుంటూ అలాగే లోనికి, మరింత లోనికి , తదేకంగా మరింత లోనికి చూస్తూ వెళ్ళండి- చీకటి గుహలో ప్రయాణిస్తున్నట్టుంటుంది– అలాగే నేరుగా ముందుకు సాగండి- సూచనలిస్తున్నాడు జ్ఞానబోధానంద.
శంకర్ రావు అలాగే – గురువుగారు చెప్పినట్టుగానే చిమ్మచీకటిలో తడుముకుంటూ,దారి వెతుక్కుంటూ నడుస్తున్నట్టుగానే లోలోనికి దృష్టి సారిస్తున్నాడు.
"ఇప్పుడు మెల్లగా ఆ చీకటి సొరంగాన్ని దాటి బయటకు వస్తారు. తెల్లవారు ఝామున నల్లని చీకటి నుండి కొంచెం వెలుతురు ప్రభవించి, చీకటిని దూది పింజల్లాగా తేల్చేసే తెలుపును అనుభవించండి- అక్కడ మీకు మసక మసకగా ఒక రూపం కనపడుతుంది.
శంకర్రావు చూస్తున్నాడు.
అంతర్నేత్రాల వెలుగులో చీకటి గుహల లోకి చొచ్చుకొని చూస్తున్నాడు. "అవును ఒక రూపం కనబడుతోంది"
మసకమసకగా ఒక ఆకారం రూపు కడుతోంది. ఒక్కొక్క క్షణం గడుస్తున్నకొద్ది మంచు తెరలు విడివడి స్పష్టమైన
రూపాలు దర్శనమిచ్చినట్టు కాళ్ళు,చేతులు, తల.... ఆఁ !, ఆఁ!, ఎవరో స్త్రీ కూర్చుని వుంది.
ఇంకొంచెం తీవ్రంగా పరిశీలించి చూశాడు.
అవును ఆ.... స్త్రీ – ఆ.. స్త్రీ -- తన తల్లే – రామలక్ష్మమ్మ. చివరి రోజుల్లోని రూపం.
ఆ కూర్చున్న భంగిమ -- నడుములు కూలబడి, మోకాళ్లు అరిగిపోయి, లేవలేక కూర్చున్న చోటునుండి దేక్కుంటూ, దేక్కుంటూ ఎక్కడికో వెళుతోంది. "ఎక్కడికే ముసల్దానా? ఏం పనుందని పాకులాడ్తాండావ్?అని అన్నకొడుకు కసురుకుంటున్నాడు. 'బేదులు పట్నాయిరా, జాలాడ్లోకి పోతాండ!'
అలాగే కూచుని చేతుల ఆసరాతో శరీరాన్నీడుస్తూ బయటికెళ్లింది.
నడుము నొప్పి వచ్చినప్పటినుండి లెట్రిన్ కు బయటికి వెళ్లలేకపోతోంది. ఎనభై ఏళ్ల వయసులో చెంబు పట్టుకొని కంప చెట్ల వెనకాలకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంట్లో లెట్రిన్ లేదు.ఐదుగురు అన్నదమ్ముల మధ్య ఊర్లో వున్న వుమ్మడి ఆస్తి ఆ ఇల్లు. పెద్దన్న ఆ ఇంట్లో వుంటూ మెట్ట భూమి మీద వచ్చే కౌలు డబ్బులే జీవనాధారంగా బతుకుతున్నాడు. మిగతా నలుగురికి ఉద్యోగాలున్నాయి. శంకర్రావ్, పెద్ద తమ్ముడు మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో వున్నారు. ఒకటి,రెండు సార్లు తల్లి ఇబ్బంది చూసి శంకర్రావు 'ఊర్లో ఒక లెట్రిన్ కట్టిస్తే అమ్మకు బయటికి వెళ్ళే బాధ తప్పుతుంది కదా!? అని భార్య తో విచారించాడు. భార్య కస్సుమంది . 'ఆమెకు ఐదు మంది కొడుకులుంటే తమకే ఏం పట్టింది' అన్నది. 'కట్టించాక అది ఆ ముసలామె ఒక్కతే వాడుతుందా? అందరూ వాడతారు కదా? పైగా రేపు ఆ యిల్లు భాగాలైనప్పుడు ఆ లెట్రిన్ తమ వాటాకే వస్తుందని గ్యారెంటీ ఏంట' ని ప్రశ్నించింది?
పెళ్ళాంతో వాదన చేయడం ఎప్పుడో మానుకున్న శంకర్రావు మారు మాట్లాడలేదు.తల్లి రామలక్ష్మమ్మ అలా దేక్కుంటూ , దేక్కుంటూ జాలాడి ముందుకొచ్చింది. లోపలేవరో స్నానం చేస్తున్నారు. ఎనభైయేళ్ళ వయసులో ఇంద్రియాల మీద ఏమాత్రం అదుపు లేని పరిస్థితిలో పాపం అక్కడికక్కడే చీరలోనే లెట్రిన్ చేసింది. తన నిస్సహాయ పరిస్థితికి తన మీద తనే జాలి పడుతూ, ఎవరైనా తోడొచ్చి తనని కడిగి చీర మారుస్తారని, దీనంగా ఎదురు చూస్తోంది. అప్పుడే బయట్నుంచి వచ్చిన శంకర్రావ్ వదిన రుసరుసలాడుతూ రామలక్ష్మమ్మను చూసి "మళ్ళా ఏరుక్కున్నవా ముసల్దానా? ఇంకెన్నాళ్ళు సతాయించుకుంటావో మమ్ములను" అంటూ తప్పనిసరి గుదిబండగా భావించి జాలాడి ఖాళీ అవగానే కడిగించి చీరమార్చింది.
దాదాపు రెండేళ్ళ కింద వరకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్ట పడిన రామలక్ష్మమ్మ తన దురదృష్టానికి లోలోనే దుఃఖిస్తోంది. డెబ్బై ఏళ్ల వయసులో కూడా 'ఇంట్లో ఏం కూచుంటాం , ఒక కూలీ తగ్గినా తగ్గినట్టే కదా' అని చేన్లో కెళ్లింది. ఇంటికి రాగానే కనబడని కళ్లని పొడుచుకొని చూస్తూ ఇస్తర్లు కుట్టింది. ముప్పై రెండేళ్ళ వయసులో భర్త చనిపోతే ఒక్కతే సంసారాన్ని ఒడ్డు కీడ్చింది. ఉద్యోగాలు సంపాదించుకుని కొడుకులు ఉన్నత స్థానాలకెళితే అది వాళ్ళ ప్రయోజకత్వమే తప్ప, అందులో తన గొప్పేమీ లేదంది. ఇప్పుడైనా - తన పని తను చేసుకోగలదు- ఈ లెట్రిన్ సమస్యే తనని ఇబ్బంది పెడుతోంది. శంకర్రావుకి చివరి జ్ఞాపకం మెదులుతోంది. నాన్న తద్దినానికి వెళ్ళిన రోజు అందరూ కూర్చున్నప్పుడు 'ఈ ఇంట్లో ఒక లెట్రిన్ కట్టించండ్రా' అని అభ్యర్తిస్తే అందరూ యథాలాపంగా ఎవరి పద్ధతిలో వాళ్ళు 'ఆఁ , అవును.. కట్టించాలి' అంటూ నొక్కులు నొక్కారు. శంకర్రావుకు భార్య రాద్దాంతం గుర్తొచ్చి మౌనం వహించాడు.
ఆ తరువాత రెండు వారాలకు రామ లక్ష్మమ్మ చివరి శ్వాస విడిచింది. ఆమె మలవిసర్జనను బలవంతంగా ఆపుకోవడంవల్ల కడుపులో తీవ్ర వత్తిడి పెరిగి కండరాలు ఉబ్బడం వల్ల చనిపోయిందన్నారు డాక్టర్లు.
"మీరిప్పుడు చాలా హాయిగా వున్నారు. ఆ అలౌకిక ఆనందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నారు. మీ ఆనందం అవధులు లేనివి.. అనుభవించండి." జ్ఞానబోధానంద చెబుతున్నాడు. శంకర్రావుకు, తల్లి చివరి సారిగా ప్రాధేయ పడుతూ అడిగిన కోరిక గుర్తొచ్చింది.
అవును .. ఇప్పుడు తనకు గోచరిస్తున్న రూపం అదే – అప్పటిదే...
శంకర్రావుకు దుఃఖం తన్నుకుని బయటికి వస్తోంది.
తన సర్వీసు చివరి రోజుల్లో డూప్లెక్స్ హౌస్ కొన్నాడు. కానీ మోకాళ్ళ నొప్పుల వల్ల ఇద్దరూ కిందే వుంటారు.
ఫస్ట్ ఫ్లోర్ లో వాడకుండా బూజుపట్టిపోయిన రెండు లెట్రిన్లు వెక్కిరిస్తూ మనోఫలకం మీద మెదిలాయి.
శంకర్రావుకు నవ్వు,కోపం, విరక్తి,పశ్చాత్తాపం అన్నీ కలగలిసి కన్నీరై బుగ్గల మీద నుండి ధార కట్టాయి. "క్షమించమ్మా," "క్షమించమ్మా"! అని హాలంతా ప్రతిధ్వనించేలా,ప్రపంచమంతా వినిపించేలా అరవాలనుకున్నాడు, గొంతు పూడుకుపోయి పెగలడం లేదు.
"శంకర్రావు గారు పరాకాష్ఠకు చేరుకున్నట్టున్నారు. వారికి ఆనంద భాష్పాలు ఆగకుండా అలా కారుతూనే ఉన్నాయి." జ్ఞానబోధానంద మిగతా వారితో చెబుతున్నాడు.
**********
ఆపరేషన్ థియేటర్లో ...
ఎదురుగా వెలుగుతున్న బల్బుకేసి చూస్తూ మౌనంగా వెయిట్ చేస్తున్నాడు వెంకటరెడ్డి.
భార్య పిల్లలు బయట వుండివుంటారు .
సర్జన్ ఇప్పుడే వచ్చినట్టున్నాడు.
హడావిడి మొదలైంది..ఓ.టి స్టాఫంతా టకటకామని పొజిషన్స్ తీసుకున్నారు.
"సార్, మీకిప్పుడొక చిన్న ఇంజెక్షన్ ఇస్తున్నాను. ఇది అనస్తీషియా. మీకు మత్తుగా ఉంటుంది. నొప్పి తెలియ కుండ ఇస్తున్నాను. కళ్ళు మూసుకోండి" అంటూ వెన్ను మీద చిన్నగా గుచ్చాడతను.
అతని చివరి మాటలు వినబడుతున్నట్టే అనిపిస్తున్నాయి. కానీ అప్పటికే వెంకటరెడ్డి కళ్ళు విపరీతమైన బరువు తో మూసుకు పోయాయి. అలా మూసుకున్న కళ్ల లోపలనుండి ... తనలోని ఒక అంశ రివ్వుమని గగనం లోకి ఎగసిపోయి రాకెట్ లాగా అనంతం లోకి దూసుకు పోతుంది. అదేంటో తెలియదు. బహుశా అది తనేనా? ప్రయాణించి ప్రయాణించి ఒక గేట్ ముందు ఆగింది. అవతల ఒక స్త్రీ ఆశగా, ప్రేమగా ఎదురు చూస్తోంది. అవును – ఆమె – అమ్మ... 'అమ్మా ', 'అమ్మా', గట్టిగా అరిచాడు వెంకటరెడ్డి.
"ఒక్కరవ్వ నొప్పిగా వుంటుంది వెంకట రెడ్డి గారూ! కొంచెం ఓర్చుకుంటే చాలు. డోసు కరెక్టేనా ?"
"కరెక్ట్ గానే ఇచ్చాను సార్, మీరు చెప్పినంతే.... అతనికే ఏదో గుర్తొచ్చినట్టుంది".
వెంకటరెడ్డి కి గుర్తొచ్చింది. తను ఇప్పుడు నిజంగా పిలిచాడా ? తనకి మాట పడిపోయి నెల దాటింది. ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ మాట గురించే! వెంకటరెడ్డి తనలో ఏదో గొణుక్కుంటున్నాడు .
'మాట' –'మాట'- మాటలు- మాటలు మానేశాను – అవును- అమ్మతో మాటలు మానేశాను.
ఒక రోజా, రెండ్రోజులా? ఒక నెలా, ఒక సంవత్సరమా? ఇరవై ఏళ్లు – అమ్మతో మాటలు లేవు. పిచ్చి తల్లి ముసలి వయసులో ఎంత బాధ పడిందో ఏమిటో? తమ్ముడు పెద్దగా చదువుకోలేదు. బొటాబొటి సంపాదన- ముగ్గురాడపిల్లలు. తనది మంచి ఉద్యోగం. ఇద్దరు మగపిల్లలు. అమ్మ తమ్ముణ్ణి గురించే ఆలోచిస్తుంది- ఆస్తుల [పెద్దగా ఏమి లేకపోయిన] పంపకాలప్పుడు ఊర్లో పెద్ద మనుషులను ఒప్పించి తమ్ముడికి ఎక్కువ వాటా ఇప్పించింది. చిన్నప్పుడు ఎవరైనా 'ఎవరిష్టమమ్మా' అని అడిగితే నా ఇద్దరు బిడ్డలు రెండు కండ్లమ్మా! అని చెప్పిన మాటతో అమ్మను దెప్పి పొడిచాడు.
అమ్మ ఏమన్నది – అవున్రా ఇప్పటికీ మీరిద్దరు రెండు కండ్లే! ఎడమ కంటికి చూపు తగ్గితే కుడి కంటికి ఆపరేషన్ చేస్తామా? లేదు కదా! అన్నది. అంతే – అది మొదలు అమ్మతో మాట్లాడ్డం లేదు. గుజరాత్ కు ట్రాన్స్ఫరైతే క్యాన్సిల్ చేయించు కోకుండా వెళ్ళి పోయాడు. అక్కడే ఇరవయ్యేళ్లు గడిపిన తరువాత తమ్ముడు ఫోన్ చేశాడు అమ్మకు సీరియస్ గా వుందని , హాస్పిటల్లో చేర్పించాము, నీ గురించి కలవరిస్తోందని. తను ఆగమేఘాలమీద బయలుదేరాడు. వచ్చే సరికి కోమాలోకి పోయింది. అందరూ అదోలా చూశారు. దుఖం ఎగ తన్నుతోంది కానీ తను ఏడ్వ లేదు. అంత మంది ముందు ఏడ్వడానికి కూడా సంకోచమేసింది. అప్పట్నుంచి గూడు కట్టుకున్న దుఃఖపు చెలమ లోలోపలే చెరువుగా మారి ఇప్పుడు పారుతోంది. 'చిన్నోడు వుట్టి తుళువ, పెద్దోడే ఒందిక' అని ఏ పనికైనా తననే తీసుకొని వెళ్ళేది. కూరగాయలు,సరుకులు,బట్టలు ఒక్కటేమిటి, అలా తిరిగిన, తిరిగి లోకాన్ని చూసిన తను, తన లోపలకి చూసుకోలేక అమ్మ మనసు తెలుసుకోలేక పంతానికి పోయాడు. ఛ , ఛ , ఎన్నో అవకాశాలొచ్చాయి. తమ్ముడి కూతురి పెళ్లిలో, చిన్నాన్న చనిపోయినప్పుడు - అయ్యో! ఒకటేమిటి చాలా సార్లు తను గుజరాత్ నుండి వచ్చిన ప్రతి సారి తమ్ముణ్ణి కలిశాడు.కానీ తల్లి తో మాత్రం మాట్లాడలేదు. వయసు మీదున్న అహంకారం నన్ను మాట్లడనీయ లేదు. అదిగో ఆ గేటుకి అవతలి వైపు ఎదురు చూస్తోంది. 'అమ్మ! అమ్మ! క్షమించు. తప్పైంది. ఎలా వున్నావు? ఎలా వున్నావమ్మ?' గబగబా మాట్లాడేస్తున్నాడు.
"జాగ్రత్త నాయనా!" అంటూ చేయి ఊపుతూ అటు తిరిగి వెళ్ళి పోయింది అమ్మ.
"రెడ్డి గారు,రెడ్డి గారు.... కళ్ళు తెరవండి".
"ఆ! ఆ! అల్లాగే..." అమ్మతో మాట్లాడుతున్నాడు.
"ఆ! గుడ్. మీ ఆపరేషన్ అయిపోయింది. రెండు గంటలు పోస్ట్ ఆపరేషన్ కేర్ లో వుంచుతారు. కొంచెం కాళ్ళు బాగా బరువనిపిస్తాయి. స్పృహ వచ్చిన తరువాత అన్నీ సర్దుకుంటాయి. ఓ.కె. జాగ్రత్త!"
"సరే నమ్మ.. సరే అలాగే".
***************
"ఎక్కడికి బయలు దేరారు ?" ప్రశ్న విని ఆగి పోయారు మోహన్రావు.
"అమ్మని పిలుచుకొని రావాలి. వూరెళుతున్నాను." సమాధానం చెప్పాడు.
తెల్లటి బట్టలు వేసుకొని, చేతిలో సంచి పట్టుకొని గడప దాటుతుంటే పనమ్మాయి 'వాచ్ మ్యాన్ ఆటో తెస్తాడు, వెళుదురుగానీ. కూర్చోండి" అని చనువుగా చేయి పట్టుకొని కుర్చీలో కూర్చోపెట్టింది.
డెబ్బై ఏళ్ల మోహన్రావు కుర్చీ లో కూర్చొని గాల్లోకి చూస్తున్నాడు. అప్పుడప్పుడు ట్రైన్ మిస్ అవుతుందన్న బెంగ తో గడియారం వైపు చూస్తున్నాడు.
భార్య పక్కింటావిడతో చెబుతుంది.
"ఇది మాకలవాటే. ఎప్పుడో పాతికేళ్ళ క్రితం వెళ్లిపోయింది మహాతల్లి. ఈయనకేమీ గుర్తుండదు. ఆల్జీమర్స్. ఏవో కొన్ని విషయాలు మనసులో పాతుకుపోయినవే అలా జ్ఞాపకంలో వుంటాయి. కొత్త సంఘటనలేవీ గుర్తుండవు."
మోహన్రావు కు చిరాకు పుట్టింది. "ఈవిడకు తనంటే ఎంత చులకన. తనకు ఏవి గుర్తుండవని చెబుతుందేంటి? కరెక్టుగా ఆర్నెల్ల క్రితం ఈవిడ మాట వినే కదా, డిసెంబర్ లో అమ్మను తమ్ముడి దగ్గర ఊర్లో వదిలివచ్చాను . మళ్ళీ ఇప్పుడు వేసవి సెలవులకు పిలుచుకొని వస్తామని కదా అనుకున్నాము. మరిప్పుడు వేసవి శెలవులని టీ. వీ. లో చెప్పారు కదా! అమ్మని పిలుచుకొని వస్తానంటే ఇలా మాట్లాడుతుందేంటి ఈవిడ? అంతకు ముందు జరిగిన సంఘటన జ్ఞాపకమొచ్చింది ఆయనకి.
ఆ రోజు రాత్రి – భార్య సాధింపు మొదలు పెట్టింది-
'మీ అమ్మని మీ తమ్ముడింట్లో వదిలి రండి. ఇక్కడుంటే పిల్లల చదువులు చెడగొడుతుంది. ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళ మూడ్ పాడుచేస్తోంది. నేరుగా చెబితే మీకు ఇంత మయిన కోపం.'
"ష్ ..ష్ , గట్టిగా అరవకు. అమ్మకు వినిపిస్తుంది"
"వినపడననీయండి – నేనేమీ తప్పు మాట్లాడడం లేదు కదా"
ఉన్న పళంగా చెప్పడం ఎలాగ? మధన పడుతున్నాడు, గింజుకుంటున్నాడు.
తల్లి వుంటే నష్టమేంటో అర్థం కాదు. అదే నసిగాడు.
'మీకు తెలియదు – మీరు ఆఫీసులో వుంటారు'- ఇంకేమీ మాట్లాడలేదు.
రేప్పొద్దున వాడికి ఒక్క మార్కు తక్కువ వచ్చినా తల్లి కారణమనొచ్చు.
ఉదయం తల్లితో ఎలా చెప్పాలో మల్ల గుల్లాలు పడుతూ, ఏ కారణాలు చెప్పాలా అని ఆలోచిస్తూ పడుకున్నాడు.
ఉదయం లేచే సరికి బుట్ట సర్దుకుని ప్రయాణానికి సిద్ధంగా వుంది తల్లి.
"ఎక్కడికమ్మా ?" నీరసంగా, బలహీనంగా అడిగాడు, పొరపాటున భార్య నేరుగా చెప్పిందేమోనని.
"చిన్నోడు గుర్తుకొస్తున్నాడ్రా, రాత్రి కూడా మన శివాలయం పూజారి కలలో గుర్తుచేశాడు. డిసెంబర్ వచ్చింది కదా, నగర సంకీర్తనలు , అవీ వుంటాయి కదా.."
తనకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"నాకు అక్కడ ఆరోగ్యం బాగలేక, నయం చేయించుకునేందుకు ఇక్కడకొచ్చాను.ఇక్కడే ఉంటాను" అని మొండికెయ్యట్లేదు.
"నా కొడుకింట్లో నాకు అధికారం లేదా ?" అని దబాయించట్లేదు.
"నీ భార్య నామీద ఇన్ని ఆరోపణలు చేస్తుందా?" అని నిలదీయట్లేదు.
"పిల్లల జోలికి వెళ్లకుండా నా పాటికి నేనుంటానులే"అని అభ్యర్థించట్లేదు.
కొడుకు మానసికంగా నలిగిపోకూడదని,పదిమంది లో మాట పడకూడదని, భార్య ముందు మరింత పలుచన కాకూడదని, హుందాగా , పెద్దరికంతో, గుంభనంగా తన పరువు కాపాడే ప్రయత్నం చేస్తోంది.
"ఆమె ఆరోగ్యం కోసమే ఇక్కడకు వచ్చింది. ఆమె వల్ల పిల్లల చదువులేమీ చెడిపోవు" అని గట్టిగా అరిచి ఆమె బుట్ట లాక్కొని ఇంట్లో పెట్టేయాలని మనసు తెగ ఆరాటపడుతోంది. కానీ మాట పెగలడం లేదు – చేయి కదలడం లేదు.
లక్ష్మణుడు సీతమ్మను అడవులలో దింపొచ్చినట్ట్లు అమ్మని ఊర్లో దింపొచ్చాడు.
అప్పటినుంచి రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు. పిల్లల పరీక్షల హడావుడి, ఆ సెట్, ఈ సెట్ అన్నీ అయిపోయాక సెలవుల్లో ఊరెళ్లి అమ్మను పిలుచుకొని వద్దామనుకున్నాడు- ఇప్పుడు సెలవులిచ్చారని టి.వి. లో చెప్పారు. త్వరగా ఊరెళ్ళాలి. లేచాడు . లేచి సూట్కేస్ తీసుకొని గడప దాటి చెప్పులేసుకొంటున్నాడు.
మళ్ళీ పనమ్మాయి వచ్చింది.
"ఇంకా ఆటో రాలేదండి. వస్తుంటుంది. మీరు కూర్చోండి. మళ్ళీ అమ్మగారు కోప్పడతారు".
అనునయిస్తూ చేయి పట్టుకొని కూర్చోబెట్టింది.
భార్య వచ్చింది. "ఇప్పుడెక్కడికీ వెళ్ళే పని లేదు. బట్టలు మార్చుకోండి. మీ రిజర్వేషన్ రేపు ,ఈ రోజు కాదు."
"ఓహో ! రేపా ?ఓ.కె. ఓ.కె. రేపు తప్పకుండా గుర్తుచేయి. నాకు గుర్తుంటుంది. కానీ మళ్ళీ మర్చిపోతానేమోనని చెబుతున్నాను. అసలే ఈ మధ్య పనుల వత్తిడిలొ మతి మరుపు వచ్చేస్తోంది. ఉరెళ్లి అమ్మను తీసుకొని రావాలి". పనమ్మాయికి చెప్పాడు మోహన్రావు.
************
"కొడుకులందరూ దొంగ నా కొడుకులు"
పదిరోజుల క్రితం భార్యను పోగొట్టుకున్న బాధలో మూడో రౌండ్ తరవాత గోపాల్రావ్ నోటి వెంట వచ్చిన ఆ మాటలు వెంకట రమణ ఇప్పటికి ఎన్ని సార్లు విన్నాడో !!
ఒంటరి స్నేహితుడిని ఓదార్చేందుకు కొన్ని రోజులుగా అతనితోనే ఉంటున్నాడు వెంకటరమణ . నలభయ్యేళ్ళ స్నేహం మరి ! నెలరోజుల క్రితమే ఇండియా కు వచ్చి అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసి వెళ్లినందువల్ల ఇప్పుడు తల్లి అంత్యక్రియలకు రాలేనని చెప్పాడు గోపాల్రావ్ కొడుకు.అన్నీ కార్యాలు స్నేహితుడి సహాయంతో గోపాల్రావే చేశాడు.
మూడో రౌండ్ తరువాత వెంకటరమణ పరిస్థితి అదుపు తప్పుతోంది.
గోపాల్రావ్ భార్య , కొడుకు ఉన్న ఫోటో చూపించి 'వాణ్ణి' పిచ్చిగా ప్రేమించిందిరా' అని అంటున్నట్టుంది.
మాటలు వినబడుతున్నాయి , కానీ, అర్థం కావట్లేదు. కళ్ళు చూస్తున్నాయి, కానీ, బొమ్మ స్పష్టం కావట్లేదు. లోపల్లోపలేదోఅలజడి జరుగుతోంది. ఎగదన్ను కుంటూ ఏదో పైపైకొస్తోంది. గోపాల్రావ్ తిట్లన్నీ తనకే తగులుతున్నాయి.
ఆ ఫోటో లో మనిషి... గోపాల్రావ్ భార్య. తనకి ఇంకేదో రూపం గోచరిస్తోంది . ఆ కళ్ళు, విశాలమైన నుదురు, ఎప్పుడూ తీవ్రమైన ఆలోచనలేవో చేస్తున్నట్టు ముఖం, చూపుల్లో గడ్డ కట్టుకు పోయిన విషాదం... ఆ... ఆ .. మే అటెండర్ సుశీల.
అయిదునెలల గర్భవతిగా వున్నప్పుడు భర్త చనిపోతే ప్రసవం వైపు కొందరు , గర్భస్రావం వైపు కొందరు సలహాలిస్తుంటే, బిడ్డను కని, బ్రతుకునీడుస్తానని ప్రతిన బూని మరీ తనను కన్న – అటెండర్ సుశీలమ్మ.
తల్లికి చదువు లేకపోయినా తను సరస్వతీ పుత్రుడయ్యాడు. ఆ తర్వాత లక్ష్మీ దేవి అల్లుడయ్యాడు.
" గొప్ప ఆత్మాభిమానం గల మనిషిరా. బతికుంటే చాలా బాధ పడేది" గోపాల్రావ్ కుర్చీలోకి జారగిలబడుతూ చెప్పాడు.
అవును, తను ఆమె ఆత్మాభిమానాన్ని అపార్థం చేసుకున్నాడు. పెళ్ళయిన కొత్తల్లో ఊరికొచ్చిన చుట్టం " అదేంటి అటెండర్ సుశీల అంటారు మీ అమ్మని , అదేదో పెద్ద కలెక్టర్ జానకి లా " అంటూ వ్యంగిస్తే , పెళ్లి ఫోటోలలో అమ్మని చూపిస్తూ "ఈవిడెవరు, అందమైన మొహానికి దిష్టి చుక్కలాగా ?" అని ఎవరో వెటకరిస్తే ....
నేనెందుకమ్మా న్యూనతగా ఫీలయ్యాను ? దాంట్లో నీ తప్పేమీ లేదే ?
మనుషులను మనుషులుగా చూడనందుకు వాళ్ళను తిట్టాల్సింది పోయి మొట్ట మొదటి సారి నీతో "కొంచెం కట్టూ బొట్టూ మార్చుకుంటే బాగుంటుంది కదమ్మా " అని చెబినందుకు ఒక నవ్వు నవ్వావు. అప్పుడు నాకు కోపం వచ్చింది. ఇప్పుడు , ఈ అరవై ఆరేళ్ళ వయసులో అర్థమౌతుంది ... ఆ నవ్వు ...
ఇలాంటి సందర్భాలెన్నో ! అవకాశం వచ్చినప్పుడెల్లా భార్య ఎగతాళి , వెటకారాలు, సూటిపోటి మాటలు అన్నీ తల్లి మీద కోపంగా మారాయి. వేసవి సెలవల్లో – ఆ రోజు ఇంటికి రాగానే ' ఒక ఆఫీసర్ తల్లి గా ఉంటేనే ఆమెను ఈ ఇంట్లో ఉండమని చెప్పండి. పని వాళ్ళతో సమానంగా కబుర్లు పెట్టుకునే పాటైతే నేను మా ఇంటికి పోతాను' అంటూ తల్లి మీద కంప్లయింట్.
"ఈ రోజు కొంచెం ఎక్కువైనట్టుంది రమణా . బాగా ఎక్కేస్తోంది"
"కరెక్ట్ గా చెప్పావురా. నిజం. అధికారం నెత్తికెక్కింది. కళ్ళు మూసుకు పోయాయి. ఆఫీసర్ తల్లి అటెండర్ అవడం నాకు ముందు ఏమీ అనిపించక పోయినా తరువాత్తరువాత చాలా కించ పడుతూ పోయాను. ఎక్కడైనా చెప్పవలసి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేది. అప్పుడు నేనామెను ఎంతో దర్పంగా 'ఇంకా ఆ పల్లెటూర్లో ఏముంటావ్ , ఇక్కడ మంచి క్వార్టర్ , చేతికింద పనిమనుషులు ఉన్నారు, ఉద్యోగం మాని ఇక్కడకే వచ్చేయ్' అని ఎంత బలవంత పెట్టినా ఆ ఉద్యోగం మానలేదు. ఆ తరువాత నేను చాలా కృతఘ్నుడైపోయాన్రా. అమ్మను ఉపేక్షించడం మొదలు పెట్టాను. తలచుకుంటే ఒళ్ళు కంపరమెత్తుతోంది. ఒక్క కూతురి ఓణి ఫంక్షన్ కి అమ్మ రాకూడదని కోరుకున్న విశ్వాస ఘాతకుణ్ణి."
గోపాల్రావ్ తన లోకం లో తనున్నాడు.
"వాడి మనసు తెలుసుకుని చివరికి ఇంటర్ కాస్ట్ మేరేజ్ కి కూడా నన్ను ఒప్పించిందిరా... "
"అవున్రా గోపాల్ , అమ్మలకన్నీ తెలుసు... మనమెలా ఆలోచిస్తామో, ఎలా సంతోషంగా ఉంటామో అన్నీ తెలుసు. అందుకేరా తను రాలేదు. తనకు ఒంట్లో బాగాలేదని వేరే మనిషి ద్వారా మనుమరాలికి బట్టలు పంపింది. డబ్బు , అధికారం చెడ్డవిరా !
కళ్ళు మూతలు పడుతున్నాయి. అయిపోయింది . అంతా అయిపోయింది. క్షమించమ్మా , క్షమించు . 'అమ్మా క్షమించమ్మా'... అని వేడుకుంటే ఇంటికొచ్చేదేమో . ఇంకొక్క అవకాశం కోసం మళ్ళీ నీ కొడుకుగా పుడతానమ్మా .... మాటలు ముద్ద ముద్ద గా వస్తున్నాయి.
" వాడికి క్షమించమని అడిగే మొహం లేదురా.."
ఒక అటెండర్ తన పట్టుదలతో కృషితో మొక్కవోని ఆత్మ విశ్వాసంతో తనను తయారు చేసింది అని సన్మానం చేసి , చెప్పగలిగిన అవకాశాన్ని కోల్పోయాను. అయిపోయింది . అమ్మా .. ఇప్పుడైనా క్షమించానని చెప్పమ్మా ... మనసులో ప్రతిధ్వనిస్తున్న మాటలు పెదవి దాటితే నిశ్శబ్దమౌతున్నాయి.
"పద రమణా , బాగా లేటయింది."
"అవున్రా, ఒక జీవిత కాలం లేటయింది." దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్నాడు రమణ.
"కొడుకులందరూ దొంగ నా కొడుకులు" చివరిమాట చెబుతున్నట్టు చెప్పాడు గోపాల్ రావ్
" అవును గోపాలం. కొడుకులందరూ దొంగ నా కొడుకులే, నాతో సహా."రుద్ద కంఠం తో గొణిగాడు రమణ.
*******
మాటలు చెబుతూ చెబుతూ అమ్మ అన్నమంతా తినిపించేసింది.
చూస్తూ చూస్తుండగానే ఓ నాలుగు నక్షత్రాలు ఆకాశం నుండీ నేలకు రాలాయి.
ఇంకా వేలాది , లక్షలాది నక్షత్రాలు ఆకాశంలోనే తమ వంతు కోసం నిరీక్షిస్తున్నాయి.
