STORYMIRROR

Gajula UmaMaheswar

Drama

4  

Gajula UmaMaheswar

Drama

రహస్యం

రహస్యం

6 mins
385

స్కూటర్ పార్క్ చేసి హాస్పిటల్ లోకి అడుగుపెట్టాడు భాస్కరమూర్తి . అప్పుడే సాయంత్రపు సందర్శన వేళలు ముగిసినట్టున్నాయి.  లిఫ్ట్ దగ్గర సెక్యూరిటి సిబ్బంది పాస్ చూపిస్తేనే లోపలికి పంపుతున్నారు.

సుధాకర్ కి ఫోన్ చేసి బయట కూర్చున్నాడు.

సుధాకర్,  మూర్తి భార్యకి పెద్దమ్మ కొడుకు. రైల్వే లో పనిచేస్తాడు. తండ్రికి ఏదైనా తీవ్ర ఆరోగ్య సమస్యలొస్తే రైల్వే హాస్పిటల్ వాళ్ళనుండి ఒక లెటర్ తెచ్చుకుని ఈ కార్పొరేట్ హాస్పిటల్ లో రైల్వే వాళ్ళ ఖర్చులతో చికిత్స చేయించుకోవటం మామూలై పోయింది. ఇలా పెద్దాయన అనారోగ్యం పాలైన ప్రతిసారీ మూర్తికి ఈ పరామర్శలు తప్పవు. పైగా సుధాకర్ కి మూర్తికి పెద్ద వయో భేదం కూడా లేకపోవడం వల్ల అతను మూర్తితో అన్ని విషయాలు మాట్లాడుతూ , ఈ ఊరు గాని ఊర్లో పెద్ద రిలీఫ్ గా ఫీలవుతాడు. తను అటెండెంట్ గా వున్న నాలుగైదు రోజుల్లో కనీసం మూడు రోజులైనా మూర్తి అతనికి కంపెనీ ఇవ్వాల్సిందే.

ఎదురుగా దాదాపు నూటా యాభై వరకూ డాక్టర్ల పేర్లు , వారి స్పెషలైజేషన్ వివరాలతో పెద్ద బోర్డ్ కనిపిస్తోంది. ప్రతి కౌంటర్ ముందూ నాలుగొందల రూపాయలు కట్టి తమవంతు కోసం వందలలో రోగులు నిరీక్షిస్తున్నారు. వాళ్ళ అటెండెంట్స్  ఏ ఐ మ్యాక్స్ కో , షాపింగ్ కాంప్లెక్స్ కో వచ్చినట్టు కనిపిస్తున్నారు గానీ , రోగుల గురించిన ఆదుర్దా గానీ, కంగారూ కానీ వాళ్ళ మొహాల్లో కనబడడం లేదు. బహుశా ఇలాంటి హాస్పిటల్స్ వాళ్ళకి అలాంటి భరోసా ఇస్తున్నాయో లేక వాళ్ళే అంత స్థితప్రజ్ఞత అలవరచుకున్నారో తెలియదు.

ఐదు నిముషాల్లో సుధాకర్ వచ్చాడు. తండ్రి ఈశ్వరయ్య గురించి  

“ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందంట. షుగర్ , బి‌పి ఎట్లాగూ ఉన్నాయి. అదీగాక ఈయన సరిగా పథ్యం , గిత్యమ్ పాటించడు. మళ్ళీ పాతవన్నీ తిరగతోడినాయి. వయసయిపోయింది గదా  , ఇట్లాంటివి మామూలే.” అంటూ ఇక్కడ చేరిన కారణం చెప్పాడు.

“ఒకసారి మాట్లాడించి వస్తాను. రూమ్ నంబర్ చెప్పు” పాస్ కోసం చేయి చాస్తూ అడిగాడు మూర్తి.

 “రూమ్ నంబర్ త్రీ టు ఎయిట్ . లిఫ్ట్ దిగుతూనే ఎడమ వైపుకు మూడో రూము. అన్నట్టు భాస్కర్, మళ్ళీ నీ దగ్గర స్థలం , ఇల్లు , నా డిమాండ్లు అన్నీ మాట్లాడి నీ తల తినేస్తాడు. అవన్నీ అయ్యేవి కాదు, పొయ్యేవి కాదు. మధ్యలో  అనవసరంగా నీ టైము వేస్ట్. నేను కింద క్యాంటీన్ లో వుంటాను. త్వరగా వచ్చేయ్.”

అన్నిటికీ ఒకే సారి తలవూపుతూ, చిన్నగా నవ్వుతూ సరేలే, సరేలే, అంటూ లిఫ్ట్ లో దూరాడు మూర్తి.  

లిఫ్ట్ బయటకు రాగానే , ఎదురుగా స్ట్రెచర్ మీద తనువు చాలించిన ఒక పెద్దాయన దర్శనమిచ్చాడు. అతని చుట్టూ ఆరేడుమంది వివిధ వయసుల వాళ్ళు. ఎంత నొక్కి పెట్టుకున్నా బయటకు వస్తున్న వాళ్ళ ఏడుపుని గమనిస్తూ ‘ ఇక్కడ ఏడవొద్దమ్మా , డిస్టర్బ్ అయితదని పెద్ద సార్లు అరుస్తారు’అంటూ బాయ్స్ విసుగ్గా చెబుతున్నారు. మన ఏడుపు గూడా మనలను ఏడవనివ్వరు గదా , ఎంత నరకం ! అనుకుంటూ

తలుపు తట్టి లోపలికి తొంగి చూశాడు మూర్తి. మంచం మీద తల భాగం పైకి లేపబడిన బెడ్ మీద చిరు నవ్వు నవ్వుతూ టి‌వి చూస్తున్నాడు ఈశ్వరయ్య.  

“ఏం మామా , మళ్ళీ ఏంటి ఈ పరిస్థితి ? మీరు ఎక్కువ తిరగకూడదు. పథ్యం పాటించాలి. ఇలా ప్రతిసారి చేస్తే బావకి ఎంత ప్రయాస ?” పలకరింపుగా అన్నాడు మూర్తి.  

“ఏం అప్పుడే తనకు ప్రయాస అని చెప్పుకున్నాడా? వాడేమీ ఊరికే చెయ్యట్లేదు లేవోయ్ అల్లుడూ! అయ్యగారికి ఆ స్థలం కావాల. దాని కోసం ఏమైనా చేస్తాడు. నేనేమైనా పిచ్చోడినా ? ఒక్క సెంటు భూమి గూడ ఇవ్వనని చెప్పు” వేలు చూపిస్తూ రొప్పుతూ చెబుతున్నాడు ఈశ్వరయ్య.  

“అయ్యయ్యో , బావ నాతో ఆ విషయమే అనలేదు. నేనే ఊరికే అన్నాను” అంటూ సవరించి , ఆ తరువాత అతని కాలక్షేపం కబుర్లు విని , అందులో భాగంగా రెండు దశాబ్దాల క్రితం కొన్న స్థలంలో అతను కట్టబోయే ఇంటి గురించిన ప్లాన్ పేపర్ మీద గీస్తే చూసి, ఆరోగ్యం గురించి సలహాలు ఇచ్చి, ఒక అరగంట తరువాత గది నుండి బయటపడ్డాడు మూర్తి.

ఈశ్వరయ్య మాటలను మననం చేసుకుంటూ , ‘ఈ తండ్రి కొడుకులిద్దరూ భలే గమ్మత్తుగా వుంటారు’ అనుకున్నాడు మూర్తి. పెళ్ళైన కొత్తల్లో కళ్యాణి చెబుతుంటే వింతగా అనిపించేది. కోపంతో అరచుకుంటారు, అంతలోనే కలసి భోంచేస్తారు. మళ్ళీ ఏదో పంతాలు , పట్టింపులు వస్తాయి. ఏదో మాట మీద ఇద్దరూ మాట్లాడుకోవడం మానేస్తారు. ఒకరి గురించి ఇంకొకరి దగ్గర చెప్పకూడనంత దూరం పాటిస్తారు. అది ఎంతో కాలం ఉండదు. మనం మళ్ళీ కలిసే లోగా ఇద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుతూ కనిపిస్తారు.

ఈశ్వరయ్య సర్వీసులో ఉండగా , ఇరవయ్యేళ్ళ క్రితం పది సెంట్ల స్థలం కొన్నాడు. దాన్లో ఇల్లు కట్టుకుంటానని తండ్రి , ఆ స్థలం తనకు రాసిస్తే , తను బాంక్ లో  లోన్ తీసుకుని అక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టిస్తానని కొడుకూ వాళ్ళ వాళ్ళ ప్రణాళికలు వినిపిస్తూ వుంటారు. ఆ అపార్ట్ మెంట్ లోనే తండ్రికీ ఒక ఇల్లు ఇస్తానని కొడుకు వాగ్దానం , ఆ స్థలం ఇచ్చేస్తే తనను ఈ మాత్రం కూడా పట్టించుకోరని తండ్రి అనుమానం. ఇలానే దాదాపు ఇన్నేళ్లూ సాగింది. అందరితో ఇద్దరూ తమ తమ వాదనలు వినిపించడం, అవతలి వారితో తమదే కరెక్ట్ అనే మాట అనిపించుకోవడంతో ఆ తంతు ముగుస్తుంది.

‘భలే వింత మనుషులు’ ముసిముసిగా నవ్వుకుంటూ, గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మననం చేసుకుంటూ, మెట్లు దిగుతూ ‘కింద సుధాకర్ నా కోసం వెయిట్ చేస్తూ కనీసం రెండు మూడు సిగరేట్లైనా తాగి వుంటాడు’ అనుకున్నాడు మూర్తి.

కిందకు రాగానే సుధాకర్ ఎదురొచ్చాడు.

“ఇందాకే కింద డాక్టర్ కనబడ్డాడు. ఈ సారేదో చాలా టెస్టులు చేయాల్సి వస్తుందట . ఇంకో వారం రోజులూ ఇక్కడే ఉండాలన్నాడు. ఇప్పుడే రాముకి ఫోన్ చేశాను. తనని రేపు సాయంత్రానికెల్లా రమ్మని చెప్పాను. తను రాగానే నేను రేపు రాత్రి బస్సెక్కేస్తాను. వచ్చేవారం మళ్ళీ వచ్చి డిశ్చార్జ్ చేయించుకుని వెళతాను.” అన్నాడు.

ఇద్దరూ టీ బంకు దగ్గరకెళ్లి నిలుచున్నారు. సుధాకర్ టీ చెప్పి సిగరెట్ వెలిగించాడు.

“ఏంటో భాస్కర్ , ఈ మనిషి అర్థమే కాడు. కొన్ని పనులు ఒక వయసులో ఉన్నప్పుడే చేయగలం. ఇప్పుడు ఈ వయసులో ఆయన ఇల్లు కట్టగలడా ? కట్టినా తను ఒక్కడే అన్నీ పనులు చేసుకోగలడా ? ఇప్పుడు నాకు యాభై దగ్గర పడుతున్నాయ్. ఇప్పటికే ఓపిక ఉండడం లేదు. ఈయన కడతాను , కడతాను అనుకుంటా ఆయన కట్టక , మనకి ఇయ్యక , ఎప్పుడో చేతకాక కట్టుకొండ్రా అంటే అప్పుడు మనం కట్టే పరిస్థితిలో ఉంటామో లేదో ? మనకు గూడా వేరే బాధ్యతలు నెత్తి మీదకు వస్తాయి కదా !” అంటూ ప్రారంభించాడు.

అటు తరువాత వాళ్ళ సంభాషణ రాజకీయాలమీదకు, సినిమాల మీదుగా వారసత్వాల మీదకు, ఈ నాటి కుర్ర కారు ప్రవర్తన మీదకు , పెరుగున్న ధరల మీదకు, దానిని నియంత్రించాలన్న స్పృహ కనబరచని ప్రభుత్వం మీదకు అలా అలా తొమ్మిదిగంటల వరకూ కొనసాగింది.   

     *        *

వారం గడిచింది.

మూర్తి ఆఫీస్ లో వుండగా సుధాకర్ నుండి ఫోన్ వచ్చింది.

“భాస్కర్, నేను ఈ రోజు పొద్దునే వచ్చాను. నీ ఆఫీస్ పనులన్నీ చూసుకుని కొంచం సేపు తీరిక ఉండేలాగా రా. ఈ రోజు బయటే భోంచేద్దాం.” ఫోన్ పెట్టేశాడు.

వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని రాత్రి ఎనిమిది గంటలకు హాస్పిటల్ దగ్గరకు వెళ్ళాడు మూర్తి. ముందే ఫోన్ చేయడం వల్ల సుధాకర్ బయటే వెయిట్ చేస్తున్నాడు. ఇద్దరూ కలసి బ్లూ డైమండ్ కి వెళ్లారు.

తన పిల్లల చదువు గురించి , తన ఉద్యోగం గురించి మాట్లాడి , రెండు రౌండ్ల పిచ్చాపాటి తరువాత

సుధాకర్ టేబుల్ మీద కొంచం ముందుకు వంగి లోగొంతుకతో

‘భాస్కర్, నీకొక రహస్యం చెబుతాను. ఎవరికీ చెప్పకూడదు, కళ్యాణికి కూడా ” అన్నాడు.

మూర్తి కొంచం ఆశ్చర్యంతో ఇంకా ముందుకు వంగి ‘చెప్పనులే’అన్నట్టు తల వూపాడు.

“ఇందాక డాక్టర్ కలిశాడు. నాన్న ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందట. కిడ్నీలు , ఊపిరి తిత్తులు బలహీనంగా పనిచేస్తున్నాయట. మహా అంటే ఇంకో మూడు నెలలు, అంతే ! అని చెప్పారు.”  అన్నాడు

అతని ముఖంలో ఎలాంటి విషాద ఛాయలు లేవు.

మూర్తి మ్రాన్పడిపోయాడు. అతనికి  ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. పెద్దాయన వయసు దాదాపు ఎనభై సంవత్సరాలు. ప్రతి మనిషికి తప్పనిసరి మజిలీ. అది కొంత విచారమే అయినా అంత కంటే విషాదం ఆ తరువాత సుధాకర్ మాట్లాడిన మాటల వల్ల కలిగింది మూర్తికి. ఇంకో మూడు నెలలు ఆ స్థలం గురించి తానేమీ మాట్లాడనని, ఎలాగూ ఆ తరువాత అది తనకు దక్కేదే  కాబట్టి అనవసరంగా చెడ్డ కావడం దేనికని, ఇంత కాలం వేచివున్నవాడిని ఇంకో మూడు నెలలు వేచివుండలేనా అని మాట్లాడాడు.

ఆ తరువాత ఆ స్థలం లో తను ఎలాంటి అపార్ట్ మెంట్ ప్లాన్ చేస్తున్నాడో, ఎన్ని ఇళ్ళు కట్టబోతున్నాడో , దానికి డబ్బులు ఎలా సమకూర్చుకుంటాడో, మూర్తి సేవలు ఎలా వాడుకుంటాడో, ఇంకో రెండేళ్ల వరకు తను ఎంత బిజీగా వుండబోతాడో ,తనకు బిల్డర్ కు అగ్రీమెంట్ ఎలా వుంటే బాగుంటుందని తను భావిస్తున్నాడో అన్నీ వివరంగా చెప్పుకుంటూ పోయాడు.  

మూర్తికి తానేమి విన్నాడో  , ఏమి విన లేదో గుర్తు లేదు కానీ ఆ సందర్భంలో అతనికి సుధాకర్ ముఖం లోని హుషారు వెలుగులో పెద్దాయన నీడ కనబడుతూ వున్నింది.

మూర్తి జీవితం లో అది మరచిపోలేని రాత్రి. ఒక వింత రహస్యాన్ని కడుపులో దాచుకున్న రాత్రి.

     *         *

మూడు నెలలు గడిచాయి.    

మూర్తి ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. తిరుగు ప్రయాణం లో ఉండగా భార్య నుండి ఫోన్ వచ్చింది.

చావు కబురు.

హైదరాబాద్ కి తిరిగి వచ్చాక మూర్తి , భార్యతో కలిసి ఊరికి ప్రయాణ మయ్యాడు. దారిలో ఒకటే ఆలోచనలు. అన్నీ చావు చుట్టే ! మనిషి పుట్టుకకు కారణమేమిటి ? మరణం ఎలా నిర్ణయించబడుతుంది ? మనిషిని పోలిన మనిషిని తయారు చేయాలన్న తాపత్రయం కలిగిన మనిషి ఒక దశలో ప్రతిసృష్టి చేయగలిగిన స్థాయిని చేరుకుని చివరికి మళ్ళీ ఒక మామూలు మనిషిలా అవతారం చాలిస్తాడే ? కృత్రిమ వర్షాలు కురిపించగలిగిన మనిషి కృత్రిమ ప్రాణాలను  సృష్టించలేడా ?కొన్ని లక్షల సార్లు లబ్ డబ్ లబ్ డబ్ అని హెచ్చరించిన గుండె ఒక్క  క్షణం తన బాధ్యత మరిస్తే  దాన్ని నివారించలేమా? కళ్ళూ , కాళ్ళూ , చెవులు, చేతులూ అన్నీ రెండు రెండు కలిగిన మనిషికి గుండె ఒకటే ఉండటం మృత్యు అనివార్యతకు సంకేతమా ? ఆస్తులు, అంతస్తులూ, అధికారం , హోదా, మందీ మార్బలం ఎవరూ తప్పించలేని , కాపాడలేని ఏ వింత శక్తి అధీనంలోకి  మనిషి తోక ముడుచుకుని ప్రయాణం సాగిస్తున్నాడు ? మనిషికి , ప్రకృతికి జరుగుతున్న ఈ రహస్య పోరాటంలో మనిషి ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నాడా ?

“దిగండి” భార్య హెచ్చరికతో ఆలోచనల్లోంచి బయట పడ్డాడు.

మెల్లగా నడుస్తూ శోక గృహాన్ని చేరుకున్నారు. అందరూ విషాద వదనాలతో , ఏడ్చి ఏడ్చి ఎరుపెక్కి ఉబ్బిన కళ్ళతో , నిస్త్రాణశరీరాలతో ఎదురౌతున్నారు. మనసు నిబ్బరం చేసుకుని లోపలికి చేరుకున్నాడు మూర్తి. పార్థివ శరీరాన్ని చూసిన వెంటనే అతని గుండె బరువెక్కింది. లోపలేదో అలజడి తన్నుకుంటూ బయటకు రావాలని తొక్కిసలాడుతోంది. మూర్తిని చూడగానే

“ఎంత పని జరిగి పోయనో చూడు భాస్కర్ ! ఇంత ముసిలోన్ని వదిలిపెట్టి ఆ హార్టెటాక్ వానికే రావాల్నా ? స్థలం , స్థలం అని అడుగుతుండె. ఇప్పుడు అడగమని చెప్పు భాస్కర్ ! ఇప్పుడే, ఇప్పుడే  మొత్తం ఆ యప్పకే రాసిస్తాను , రమ్మని చెప్పప్పా ! కట్టుకోమను , ఎన్ని ఇండ్లు కడతాడో అన్నీ కట్టుకోమను . పాపం ఎన్ని మాటలన్నా , మళ్ళా తానే నన్ను హాస్పటల్ కు కొండబోతా ఉండే ! ఆ యప్పను రమ్మను , ఆయప్ప చెప్పినట్టే వింటాంలే అందరం, రమ్మను భాస్కరా , రమ్మని చెప్పు” పెద్దాయన మూర్తిని పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు.

మూర్తికి మూడు నెలల క్రితం సుధాకర్ చెప్పిన రహస్యం గుర్తొచ్చింది.

ఏది అసలు రహస్యం ? 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu story from Gajula UmaMaheswar

Similar telugu story from Drama