Praveena Monangi

Drama

3.6  

Praveena Monangi

Drama

ప్రియమైన సోదరికి లేఖ

ప్రియమైన సోదరికి లేఖ

2 mins
489


సోదరికి లేఖ 

                                                            తారీఖు 

                                                           శ్రీకాకుళము 

ప్రియమైన సోదరి లతకు,

              నీ సోదరి ప్రవీణ వ్రాయు లేఖ.ఉభయ కుశలొపరి.ఏమిటి హఠార్తుగా ఉత్తరము రావడము చూసి ఆశ్చర్యపోతున్నావా! నాకే వ్రాయాలనిపించింది. ఈ మద్యన మీ బావగారు ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్ళినపుడు బీరువా సర్దుతుంటే పాత ఉత్తరాలు బయట పడ్డాయి.అవి చదువుతుంటే అప్పటి రోజులు గుర్తుకొచ్చాయి.మొబైల్ ఫోన్లు,ఫేస్ బుక్ లు వచ్చిన తరువాత ఉత్తరాలు వ్రాసుకోవడమే మానేసాము.ఉత్తరాలు వ్రాసుకోవడము,వాటిని పోస్ట్ చేయడము,జవాబు కోసం ఎదురు చూడడము వాటిలో ఉన్న ఆనందమే వేరు.ఎదురు చూపులో ఎంతో ఆరాటము,ఉత్సుకత ఉండేవి.కానీ ఇప్పుడు ఒక క్లిక్ ద్వారా జవాబు వచ్చేస్తుంది.అందులో ఆనందమేముంది.

    నీకు గుర్తుందా మా పెళ్లి కి ముందు నిశ్చితార్ధము అయిన తరువాత,మీ బావగారు వద్ద నుండి నాకు వచ్చిన ఉత్తరాన్ని ఇవ్వకుండా నువ్వు,తమ్ముడు నన్ను ఆటపట్టించిన ఆ సన్నివేశము ఇంకా నా కళ్ల ముందు కదలాడుతుంది.కానీ ఇప్పుడు పెళ్లి కుదిరిన మరు నిమిషము నుండే అబ్బాయి,అమ్మాయి ఫోన్లలో గంటలు,గంటలు మాట్లాడుకుంటున్నారు.కానీ దానిలో ఉత్సుకత ఏమి ఉంటుంది చెప్పు.మనిద్దరము వ్రాసుకున్న ఉత్తరాలు నీకు గుర్తుకున్నాయా!వాటిని ఇప్పుడు చదువుతుంటే నాకు నవ్వు వస్తున్నది.’’అక్కా!నిన్ను బావగారు బాగా చూసుకుంటున్నారా,నువ్వు అడిగినవన్నీ కొని ఇస్తున్నారా ,లేదంటే చెప్పు నేను మాట్లాడతాను’’అన్న నీ వ్రాతలు చదువుతుంటే సరదాగా అనిపించింది.నువ్వు మీ అత్తింటి కబుర్లు తెలుపుతూ నాకు వ్రాసిన ఉత్తరము ఇప్పటికీ పదిలముగా ఉంది.మరిది గారు నీపై కురిపిస్తున్న ప్రేమ,ఆయన నీకు కొనిపెట్టిన వస్తువులు తెలుపుతూ వ్రాసిన ఉత్తరము కూడా ఉంది.ఇలాంటి ఎన్నో మాటలలో చెప్పలేని భావాలను ఉత్తరాలలోనే కదా తెలుపగలము.పెళ్లి జరిగిన తరువాత మొదటి ఆషాడ మాసములో నేను మీ బావగారు దూరముగా ఉన్నపుడు మేము వ్రాసుకున్న ఉత్తరాలు నాకు మధురమైన బహుమతులు.మీ బావగారు నేను రాసుకునే ఉత్తరాలు,నేను వ్రాసిన ఉత్తరము ఆయనకు చేరేసరికి,ఆయన వ్రాసిన ఉత్తరము నాకు చేరాలి,అలా షరతు పెట్టుకుని రాసుకునే వాళ్ళము.అలా ఇద్దరము ఒకే సమయమున ఉత్తరాలకోసము ఎదురు చూసి ,వాటిని అందుకుని ,మా వీరహాన్ని అలా తెలుపుకునే వాళ్ళము.కానీ ఇప్పుడు అంతా ఫోన్లలోనే మాట్లాడేస్తున్నారు.

ఇదివరకట్లో ఎవరయినా మన ఇంటికి వస్తే ఫోటో ఆల్భమ్ చూపించేవాళ్లం ,ఇప్పుడు అంతా ఫేస్ బుక్ ,వాట్సాప్ లలో పంపుకుంటున్నారు .ఇంక కొత్తదనము,ఉత్సుకత ఏముంటుంది,అన్నీ కనుమరుగైపోతున్నాయి ఉత్తరాలలాగానే. తన మనవడు నా కడుపులో ఉన్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుతూ అమ్మ నాకు వ్రాసిన ఉత్తరము ఇప్పటికీ పదిలముగా ఉంది.అది చదువుతుంటే అమ్మ నా ప్రక్కనే ఉన్నట్లుండేది.మీ అందరికీ దూరముగా ఉన్నప్పుడూ మీరు వ్రాసిన ఉత్తరాలే నా ప్రియ నేస్తాలు.మీరందరూ నాకు గుర్తుకువచ్చినపుడు వాటిని చదువుకునేదాన్ని.ఇప్పటికీ చదువుకుంటున్నాను.నేటి తరం యువత మళ్ళీ మనలాగా ఉత్తరాలు వ్రాసుకుంటుంటే నాకు చూడాలని ఆశగా ఉంది .

      ఏది ఏమయినా మరళ మనము ఉత్తరాలు వ్రాసుకుందాము,ఏమంటావు!అలనాటి ఆ అనుభూతులను పొందాలని నాకు ఆశగా ఉంది. మరళ మనము ఉత్తరాలకి అంకురార్పణ చేద్దాము.నా ఉత్తరానికి జవాబు ఉత్తరము ద్వారానే తెలుపుతావని ఆశిస్తూ...........

                               నీ ముద్దుల సోదరి 

                                                   ప్రవీణ.


Rate this content
Log in

Similar telugu story from Drama