ప్రియమైన నా భర్త సుపుత్రుడికి
ప్రియమైన నా భర్త సుపుత్రుడికి
ప్రియమైన నా భర్త సుపుత్రుడికి,
నువ్వు వద్దనుకున్న నీ తల్లి నీకు రాయు చివరి లేక...నిన్ను కన్న తల్లిని అనాథాశ్రమంలో వేసి నువ్వు చాలా ఆనందంగా ఉన్నావని ఆశిస్తున్నాను అయ్యా...ఆశించడం ఏంటిలే బరువు తొలిగాక ఎవరికైనా భారం తగ్గి ఆనందంగానే ఉంటుంది...కాని అయ్యా ఇక్కడికి వచ్చాక తెలిసింది స్వేచ్ఛ నీకు కాదు నీ నుండి నాకు అని...ఈ తల్లి రాసిన లేఖ చదవడానికి విసుగ్గా ఉందా నాన్న ఈ ఒక్కసారి నువ్వు మొహంలో ఆ చిరాకు పక్కన పెట్టి ఈ ఉత్తరం చదువు నాన్న మధ్యలో ఆపకు నువ్వు అడిగిన ప్రశ్నలకి,మాటలకి సమాధానం నా ఈ ఉత్తరం..
ఏంటి ఈ పిచ్చిది ఎదో వాగుతుంది అనుకుంటున్నవులే...అవునయ్య నేను పిచ్చి దాన్నే నిన్ను,మీ నాన్నని నమ్మా చూడు నేను పిచ్చి దాన్నే..మీ నాన్నని నమ్మి నా వాళ్ళని వదిలి వచ్చా చూడు నేనే పిచ్చి దాన్నే...మాది **** అనే గ్రామం మా నాన్న గారు వీరయ్య గారు.డబ్బు లేకపోయినా ఊరిలో మంచి పేరున్న కుటుంబం మాది.ఆ కుటుంబంలో అందరికంటే చిన్నదాన్ని నేను.నా పైన ఇద్దరు అన్నలు.ఇంట్లో చిన్నదాన్ని అందులో ఇంట్లో ఒక్కటే ఆడపిల్లని కావున గారాబం ఎక్కువే.ఆ రోజుల్లోనే మా నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించి ప్రయోజకురాలిని చెయ్యాలనుకున్నారు...దానికి అనుగుణంగానే నేను బాగా చదివేదాన్ని...కానీ ఏం లాభం తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచిన్నటు నాకంటే ఐదు సంవత్సరాలు పెద్ద అయిన మీ నాన్న ముందు ఆటో డ్రైవర్గా నా జీవితంలోకి వచ్చారు ఆ తర్వాత ప్రేమ..పెళ్లి..అంటూ మాటల్లోనే ఒక అందమైన లోకం చూపించాడు మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయిన మెల్లగా నా మనసు ఆయనకి ఇచ్చేసా...
అలా మొదలైన మా ప్రేమ కథ నన్ను నేను ఆయనకి అర్పించుకునే దాకా వచ్చింది...దానికి ఫలితం పెళ్లికి ముందే నా కడుపులో నువ్వు ...నాకు ఏం చెయ్యాలో తోచలేదు...ఇంట్లో ప్రేమ పెళ్లికి ఒప్పుకోరు పైగా మా నాన్నకి తెలిస్తే చంపేస్తారు అనే భయంతో..వెళ్లి మీ నాన్నకి చెప్పా ఏమ్ పర్లేదు నీకు నేను ఉన్నా నేను చూసుకుంటా నాతో వచ్చేయి అన్నారు ఆ భరోసా వల్ల మనసులో భయం కాస్త తగ్గింది అయినా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్లడం సబబు కదానిపించింది.ఇద్దరం కలిసి వెళ్లి ఇంట్లో చెప్పాము...అనుకున్నట్టుగానే మా పెళ్లికి ఒప్పుకోలేదు.కారణం కులం,ఆస్తి,ఉద్యోగం అని చెప్తారనుకున్న అదే చెప్పారు నా అన్నలు..అమ్మకి ఏం చెప్పాలి ఇక దీనికి అనిపించిందో లేక నేను కడుపుతో ఉన్నానని పసిగట్టిందో అలానే మౌనంగా నా కడుపు వైపు నా వైపు చూస్తూ ఉన్నింది.నీ జీవితం నాశనం చేస్తాడు నా తల్లి కదా నీకు మంచి వాడిని నేను తెచ్చి చేస్తా అని మా నాన్న చిలకకి చెప్పినట్టు చెప్పారు...మీ నాన్న మీద ప్రేమ వల్లనో లేక కడుపులో ఉన్న నీ మీద మమకారం వల్లనో మా వాళ్ళ మాటల్ని కదన్నాను ఇంక మా నాన్నకు సహనం చచ్చి మొదటి సారి నా మీద చేయి చేసుకున్నారు ఇంక మీ నాన్న కోపంతో మా నాన్నతో మాట్లాడటం మాట మాట పెరగడం..మా నాన్న మీ నాన్న తేల్చుకోమనడం క్షణాల్లో జరిగాయి...మీ నాన్నతో వేరే ఊరు వచ్చేసి పెళ్లి చేసుకున్నాం.ఒకటి రెండు వారాలు సినిమాలలో చూపించినట్టు అంతా చాలా బాగుంనింది...కాని ఆ తర్వాతే మీ నాన్న నిజస్వరూపం బయటపడింది...
రోజు తాగి వచ్చేవాడు మొదట్లో నా జోలికి రాకపోయినా క్రమేనా తాగుడికి బానిసై మూడు పూట్ల తాగుతూనే ఉండే వాడు నేను ఎంత చెప్పిన ఆపలేదు దానికి తోడు కడుపుతో ఉన్నాను అని కూడా చూడకుండా బెల్ట్ తో కొట్టేవాడు.అప్పుడు కూడా తెలుసా నాన్న నన్ను కొడుతున్నాడు అనేదాని కన్నా నీకు ఏమ్ అన్నా అయితది ఏమో అన్న భయమే ఎక్కువ నాకు...అక్కడితో కూడా మీ నాన్న ఆగలేదు ఇంట్లోనే స్నేహితులని తీసుకొచ్చుకొని తాగడం..వాళ్ళ ముందు నన్ను తిట్టడం కొట్టడం చేసేవాడు...అమ్మాయిలని తీసుకొచ్చుకొని నా ముందే సరసాలాడే వాడు.చుట్ట,పేకాట,ఇలా ఎన్నో.. ఒక తల్లిగా నేను నీకు చెప్పలేనివి ఇంకా ఎన్నో జరిగాయి...పోయింది నా జీవితం మీద నమ్మకం అప్పుడే పోయింది..కేవలం నీ కోసం బ్రతకాలని నిన్ను బాగా పెంచాలని అప్పుడు భీష్మించుకుని కూర్చున్న మీ నాన్న ఎంత ఇబ్బంది పెట్టిన మొండిగా అక్కడే ఉన్న కేవలం నీకు తండ్రి ప్రేమ దొరుకుతుంది ఏమో అన్న ఆశతో..అది అలా ఉండగా ఇంట్లో డబ్బులు అయిపోయాయి చివరికి తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఆయన మందు కోసం డబ్బులు లేవని నన్ను నా శరీరాన్ని ఆయన స్నేహితుడికి అమ్మేసి డబ్బులు తీసుకుని జల్సాలకి వెళ్ళాడు.నాకు ఏం చెయ్యాలో తోచలేదు అలా అని ఏం చెయ్యకుండా ఉండి ఉంటే ఆరోజు నా పాతివ్రత్యం..నీ ప్రాణం రెండు పోయేవి..అందుకే ఏదైతే ఆదయిందని ఆ ఇంటి గడప దాటా.పంతొమ్మిదేళ్ల వయసు ఆరు నెలల గర్భవతిని.లోక జ్ఞానం సూన్యం ఎటు పోవలో తెలియదు.పోనీ పుట్టింటికి పోదాం అంటే నాకు జరిగింది చెప్పి వాళ్ళని బాధపెట్టడం ఇష్టం లేకో లేక నా సెల్ఫ్ రెస్పెక్ట్ వల్లో మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపించలేదు.కనిపించిన బస్ ఎక్కి ఈ ఊరు వచ్చేసా...
అనుకుంటాం కానీ వంటరిగా ఆడపిల్ల జీవితం గడపడం చాలా కష్టం నాన్న అందులో సిటీ ఎన్నో దెప్పిపొడుపులు,అవమానాలు,ఛీత్కారాలు.ఎక్కడా ఆశ్రయం లేక రోడ్ల మీద పడుకున్న రోజులు ఎన్నో..ఆ తర్వాత నువ్వు పుట్టేదాక గుడిలోనే ఉంనేను.నువ్వు పుట్టాక తిండి కోసం నిన్ను వీపునేసుకుని కూలి పని చేసేదాన్ని.ఆ తర్వాత నీ భవిష్యత్తు కోసం కూలి పని,ఇళ్లలో పని రెండూ చేసేదాన్ని.అలా వచ్చిన డబ్బుతో నా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కళాశాలలో టీచర్ గా చేరా..ఎక్కడా నువ్వు తక్కువ కాకుండా పెంచా.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని చేసా..అంత కష్టపడూతూ కూడా నిన్ను నేను కాదనుకోలేదు రా కాని నన్ను..
నిన్ను బడిలో నేను చేరిస్తే నన్ను అనాధాశ్రమంలో నువ్వు చేర్చవు భేష్ తండ్రిని మించిన తనయుడివి.పది నెలలు కడుపులో
..పుట్టినప్పటి నుండి ఇప్పటి దాకా గుండెల్లో మోస్తునే వున్నా కదరా..దానికంటే బరువైనా నేను నీకు.నీకు ప్రేమ పంచడానికి అందరిని నేను వడిలోస్తే..నీ సరదాలకి అడ్డుగా వున్నానని నువ్వు నన్నే వదిలేసావ్ చాలా గొప్ప పని.. నువ్వు పుట్టినప్పుడు అప్పటి దాకా నేను పడ్డ కష్టాలన్నీ మరిచా కాని రేయ్ మీ నాన్న నా మనసుని ముక్కలు చేస్తే నువ్వు నా కడుపు తరుక్కు పోయేలా చేశావ్ రా చల్లగా వుంటావ్ నువ్వు.నిన్ను పెంచిన నీ తల్లే నీకు భారం అయితే ఇక నీకు వచ్చే భార్యని ఎలా చూస్తావ్ రా. వద్దు నాన్న నువ్వు పెళ్ళైనా చేసుకోకుండా ఉండు కాని ఆడపిల్ల జీవితంతో ఆడుకుని వుసురు పోసుకోకు.కొడుక్కి తల్లి పోలిక వస్తే అదృష్టం అంటారు.కాని కాదు పోలిక కాదు బుద్దులు రావాలి.నీకు పోలిక నాది వచ్చిన బుద్దులు మీ నాన్నవి వచ్చాయ్.ఇప్పటికే ఈ అమ్మ సుత్తి విని విసుగెత్తి ఉంటావ్ ఇంకొంత సేపు రా నాన్న...ఇక ఇన్ని రోజులు బడిలో చదువు చెప్తూనే ఇదే ఆశ్రమంలో పిల్లలకి చదువు చెప్పెదాన్ని అలా నా పెంపకంలో పెరిగిన వాడే నీ లాగే సాఫ్ట్ వేర్ ఎంప్లొయీ వరున్ నన్ను ఒక అమ్మలా చూసుకుంటున్నాడు...
నువ్వు నన్ను ఆశ్రమంలో వదిలి ఇన్ని నెలలైనా ఒక్కసారి కూడా నీకు నన్ను చూడాలనిపించలేదు కదా ఒక్కసారి కూడా రాలేదు ఇక రావల్సిన అవసరం లేదు రా నేను ఇప్పుడు అక్కడ లేను వరున్ కి తల్లిగా వాడితోనే వున్న...విధి చాలా విచిత్రమైనది రా నీ కోసం నేను వదిలేసిన నా వాళ్లు నువ్వు నన్ను వదిలేసాక నాకు దగ్గరయ్యారు..అర్దం కాలేదు కదా వరున్ భార్య ఎవరో కాదు స్వయాన నా పెద్ద అన్న కూతురు...నా మేన కోడలు..వాళ్లకి ఇంకా నా మీద ప్రేమ అలానే వుంది రా...చాలా సంతోషం ఇదంతా నీ వల్లే రా..అమ్మ,నాన్న ఇద్దరు అన్నలు,వదినలు,అల్లుడు,కోడలు,నా కొడుకు వరున్ చాలా ప్రశాంతంగా వుంది జీవితం...నువ్వొక్కడివి లేవనే లోటు తప్ప నువ్వు రావాలంటే ఎప్పుడైనా నా దగ్గరకి రావచ్చు రా...ఫోన్ నంబర్ వుందిగా నన్నే మరిచినోడివి నంబర్ ఒక లెక్క ఇదిగో నా నంబర్ @@@@@@@@@@...గుర్తుంచుకో ఇదే నేను నీకు రాసే చివరి లేఖ..
ఇది బాధతో రాసానే తప్ప కోపంతో కాదు నాన్న...నీ మీద ప్రేమ ఎప్పటికి చావదు రా..పేగు బంధం కదా కడ దాకా ప్రేమ పోదు..భాదతో ఏమన్నా ఎక్కువ మాట్లాడితే ఈ మొండి తల్లిని క్షమించరా...
ఇట్లు,
నువ్వొదిలేసిన నీ తల్లి.
