ప్రియ సఖి
ప్రియ సఖి


చిన్ననాటి స్నేహితురాలికి లేఖ
తారీఖు
శ్రీకాకుళము.
నా ప్రియ సఖి ,ఇష్ట సఖి ,ప్రాణ సఖి అయిన పూర్ణిమకు,
నీ స్నేహితురాలు ప్రవీణ వ్రాయు లేఖ. ఉభయ కుశలోపరి. నిన్ను చూడాలని, నీతో మన చిన్ననాటి ముచ్చట్లు పంచుకోవాలని నా మనస్సు ఉవ్విళ్లూరుతుంది. నీకు మన పాఠశాలలో మనము గడిపిన ఆ మధురమైన రోజులు గుర్తున్నాయా............,నాకు ఇప్పటికీ ఆ దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతున్నవి .
అవి శ్రీకాకుళము విశాలాంధ్ర చిల్డ్రన్ స్కూల్ లో చదువుకునే రోజులు. నేను నా చదువును అక్కడే ప్రారంభించాను. చదువు,స్నేహితులు,పాఠశాల అంతా బాగున్నా ఏదో వెలితిగా అనిపించేది. స్నేహితులు ఉన్నా నాతో చదువులో పోటీ పడేవారే తప్పా ,నా మనసెరిగి నా భావాలను పంచుకునే స్నేహితురాలు ఎవరూ లేక మదనపడుతున్న తరుణములో నాకు ఒక దేవదూతలా నువ్వు [పూర్ణిమ] తారసపడ్డావు.నా ప్రియ సఖివైనావు,నా చేయి పట్టుకున్నావు,నన్ను సన్మార్గములో నడిపించావు,నీవు పలికిన మెత్తని కుసుమాల వంటి వాక్కులు నామదిని ఉల్లాసపరిచాయి.నా కష్టసుఖాలలో సగభాగం పంచుకున్నావు. మన స్నేహాన్ని చూసి ఓర్వలేని ఎందరో మన స్నేహాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నించి విఫలులు అయ్యారు.పాఠశాల వార్షికోత్సవము నాడు మనము ప్రదర్శించిన నాట్యాలు,ఆటల పోటీలలో మనము గెలుచుకున్న పుస్తకాలు అన్నీ నాకు గుర్తున్నాయి.పరీక్షల సమయములో టీచరుకి కనబడకున్నా కాపీ కొట్టడానికి మనము పడిన అగచాట్లు గుర్తుకొస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు.మధ్యాహ్న భోజనములో మీ అమ్మ చేసిన నువ్వుల పొడుము నేను,మా అమ్మ చేసిన చల్లపిప్పి నువ్వు భలేగా తినేవాల్లము కదా!.నీ రిక్షా వచ్చేవరకు నీకు నేను తోడుగా ఉండేదాన్ని.అప్పుడప్పుడు మనిద్దరము కలిసి మీ నాన్న గారు పని చేస్తున్న బ్యాంక్ కి వెళ్ళి చల్లటి నీళ్ళు తాగే వాల్లము. ఇద్దరిలో ఎవరు పాఠశాలకి రాకపోయిన ఇద్దరూ తల్లడిల్లే వాల్లము.నాకు నువ్వు లెక్కలు నేర్పేదానివి ,నేను నీకు సైన్స్ నేర్పించేదాన్ని.ఇలా మనము సంతోషముగా గడుపుతున్న సమయమున, మనసు లేని ఆ దేవుడు మన ఆనందాన్ని చెదరగొట్టలేక మనల్ని వేరు చేశాడు.మీ నాన్నగారికి రాజమండ్రి కి బదిలీ అయ్యింది. చెరొక వైపు చేరినాము. మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లొపోయావు.నేను నా పదవతరగతి వరకు అక్కడే చదివాను. మనము విడిపోయినా, ఉత్తరాల ద్వారా కలుసుకునే ఉందామని బాసలు చేసుకున్నాము.
నాకు పెళ్లి జరిగిన వరకు మనము ఉత్తర,ప్రత్యుత్తరాలు కొనసాగించాము. “నీ పెళ్ళికి రాలేకపోతున్నందుకు నన్ను క్షమించు” అని ఉత్తరము వ్రాసావు. అదే నీ నుండి నాకు అందిన చివరి లేఖ. ఆతరువాత ఎన్ని లేఖలు వ్రాసినా నీ వద్ద నుండి జవాబు లేదు,ఏమయిపోయావు పూర్ణి! నీ చిరునామా కోసము ఎంతగానో ప్రయత్నించాను.లేఖల ద్వారా,ఫోన్ల ద్వారా,స్నేహితుల ద్వారా ఇలా రకరకాలుగా ప్రయత్నించి అలసి పోయాను.చివరికి ఫేస్ బుక్ లోను ప్రయత్నించాను. అందులో నీ పేరుతో రెండు వేలమంది ఉన్నారు. అన్నీ ఓపికగగా,ఎంతో ఆశ గా వెతికాను. కానీ నా ఆశ అడియాస అయ్యింది. నీ జాడ తెలియలేదు.అలసిపోయాను పూర్ణి. చివరగా ఈ లేఖ ద్వారా నీ ఆచూకీ తెలుసుకుని నిన్ను చేరుకోవచ్చనే ప్రగాడమైన నమ్మకం,విశ్వాసము,ఆశయము ద్వారా ఆశగా,ఆతృతగా ఈ లేఖను వ్రాస్తున్నాను.ఈ లేఖని చదివి నీవు ఎక్కడున్నా నన్ను కలుస్తావని నా కను చివరల దాగి ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకు మిత్రమా!
ఇట్లు
నీకోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న నీ ప్రియ సఖి
ప్రవీణ.