Harianiketh M

Abstract Classics Inspirational

3.4  

Harianiketh M

Abstract Classics Inspirational

ప్రేమకై తపన

ప్రేమకై తపన

3 mins
398


జీవితం సుఖదుఃఖాల కలయిక ఎలాగో!లెక్కించలేని బంధు,స్నేహగుణాల మెలిక కూడా..అందర్నీ సంతోషపెట్టాలంటే దుఃఖాన్ని మాత్రమే జీవితపు బ్యాంకులో ఋణం తీసుకోవాలి..ఈ ఋణాన్ని వాళ్ళు తీర్చుకుంటారో లేదో తెలీదు!అసలు అవసరాన దన్నుగా నిలబడతారో లేదో కూడా విదాయకం లేదు..

చిన్నపుడు మౌళి లాంటివాడిని చూస్తే,ఏవిటి కష్టాలన్నీ నెత్తిన మోస్తున్నట్టు ఫోజు కొడుతున్నాడు అనిపించేది.వయసుతో పాటు పెరిగిన జ్ఞానం ,మౌళి కష్టాలు రీలువి కావని,రియల్వని తెలియచెప్పింది..

మౌళి మధ్యతరగతి కుటుంబాన నాలుగో కొడుకు.ముందు ముగ్గురిలో ఇద్దరు అమ్మాయిలు,అందరికీ ఓ అన్నయ్య..ఇంట్లో తండ్రి చెల్లెలు ఉమ, తెలీని కారణాలతో భర్తని వదిలేసి వచ్చి ఉండిపోయింది.ఇది నీకు భారమౌతుందా గంగా!అంటూ కొడుకుని ఎదో మాయ చేసి ఉంచేసింది..కూతురు,అమ్మ కలిసి పొద్దు పొడిచింది మొదలు చుక్క పొడిచేవరకూ కోడలు హైమవతిని వైపుకు తినడమే పనిగా పెట్టుకున్నారు.

హైమ,గంగాధరం ఓ సాధారణ జంటే..ఆశలు మాత్రం ఎక్కువ.ఆడపిల్లలకు పది అవగానే పెళ్లిళ్లు చేసి పంపడంలో అన్నయ్య శివ సాయం మరువలేనిది..అయినా ఆ ఇంట్లో ఆడాళ్ళకి ఉన్న గౌరవం మగాళ్ళకి లేదు..ఊళ్ళో ఏ అమ్మ అయినా,పిల్లాడు శివమ్!ఎంత బాగా ఆందోచ్చేడు వదినా మీకు అంటే,

మగాళ్లు కష్టపడి సంపాదించి, ఇలాంటివి చక్కబెట్టడం పెద్ద విషయమా వదినా అనేది హైమ.

దిష్టి తగలకుండా ఇలా అంటుందేమో అనుకున్నారు అంతా..పోను పోను శివానికి తెచ్చిన సంబంధం చూసి ముక్కున వేలేసుకున్నారు..లోపం ఉండడం మనిషి తప్పు కాకపోవచ్చు,కానీ డబ్బు కోసం లోపంఉన్న అమ్మాయిని వెతికి మరీ పెళ్లి చేస్తున్న హైమ దంపతుల్ని ఊరి పెద్ద అడిగేడు..

గంగాధరం నీకు బుద్దున్దా అసలు!?అమ్మాయిని ఏమీ అనలేము.కానీ అబ్బాయి సరదాలు కూడా ఆలోచించాలి కదా!మీరు దాటిరాని జీవితమా ఇది ..

ఇది మా ఇంటి విషయం అని నా ఉద్దేశ్యం బాబాయ్..మీరు అర్దోక్తిలో ఆగేడు.

గట్టు మీద జనం ఊరిపెద్దనే అంత మాట అన్నాడంటే!?,అనుకుని మొహాలు చూసుకున్నారు.

పెళ్లి అయింది.శివమ్ భార్యని మార్చుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారీ కోడలు చరిత,అత్తమాటకే ఓటేసేది.ముందు ఇంట్లో అందాలు సంగతి చూడండి అనేది.వయసయ్యాక బాధపడి లాభం ఉండదని అర్థమయ్యేలా చెప్పినా..డబ్బు చూపెట్టని సుఖాలుంటాయా!?అని వాదించేది.లోపం ఉన్నవారికి ఈ గుణం సహజం అని తన స్నేహితుల మాటకు విలువిచ్చినా,ఇంటికి సరదాగా వచ్చిపోతున్న చెల్లెళ్లు భావల సంతోషాల్లో,తాను అంతగా కలవలేకపోయాడు.

ఇటు మౌళి పీజీ చేసి,ఉద్యోగానికి సిటీ కి వెళ్తానన్నాడు.

తల్లిదండ్రి సంతోషపడ్డాడు ఆ మాటకి.జీతం సరాసరి ఒకటి అటూ ఇటూలో బ్యాంకులో వేసేయాలి అన్నారు.

అమ్మా!ఇంకా జాబ్ రాలేదు నాకు..వెళ్లి వెతుక్కోవాలి అన్నాడు మౌళి.

ఊరి పెద్ద కొడుకు అమెరికా నుంచి వచ్చిన వార్త చెవుల్లో సీసం పోసినట్టు అయింది.అందుకే నువ్వు అమెరికా వెళ్ళు,సిటీకి కాదంటూ పట్టుబట్టారు.అనుకున్నదే తడవు వివరాలు కనుక్కొచ్చాడు గంగాధర్

సిటీ లో ఎదో చదవాలి,దానికి ఓ లక్ష అవుతుందట.మరేం చేద్దామనుకుంటున్నావ్ అని అడుగుతున్న నాన్న వంక విచిత్రంగా చూసేడు.

పొలం పంట అమ్మితే కొంచెం సర్దుకుంటుంది కదా నాన్నా!,ఈలోపు ఎదో ఉద్యోగం చూసుకుని,మిగతా మొత్తం సద్దుకుంటాను అన్నాడు.

పంట డబ్బులో పైసా ఇచ్చేది లేదన్నాడు..

అక్కలకి బంగారం కావాలంటే కొంటావు కదా!అన్నాడు ఉక్రోషంగా

నాకు అటువైపు నుంచి మాట వస్తుంది.మాట పడే వంశం కాదు మాది అంటున్న తండ్రితో,నాదీ నీ రక్తమే నాన్నా అన్నాడు మౌళి.చెంప పగిలింది అని అర్థమవడానికి సమయం పట్టింది.

ఆ దెబ్బకి ఎక్కిన బస్సు నాలుగేళ్లయినా ఊరి దారి వెళ్లలేదు.ఇపుడు అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది.ఓసారి అమ్మానాన్నల్ని అన్నయ్య అందరనీ చూద్దాం అని బయలుదేరేడు.

వచ్చావురా!ఎంత నాన్న కొడితే,నాలుగేళ్ళ శిక్షా మాకు.అమ్మ ఏడుస్తోంది.ఏరా!మనవడా!నాన్నమ్మ ఉందో

పోయిందో తెలుసుకోవాలి అనిపోయించలేదా ఎపుడూ!?

నాన్న అంటే అంత కోపం ఎందుకురా..నేనోమాట అనుకోకూడదా నా రక్తాన్ని!?చింతలూరు...సర్!ఈ ఊర్లో మీరొక్కరే దిగాలి..సార్...పిడుగులా వినపడ్డ పిలుపుకి అదిరిపడ్డాడు..

ఆ!...ఏంటి బాస్..

చింతలూరు సర్..

మా ఊరు వచ్చేసిందా!?మురిసిపోతూ చుట్టుపక్కల జనాల్ని పలకరించుకుంటూ...ఇంటికి చేరుకున్నాడు..అరుగు మీద అక్క,బావలు పిల్లలు సందడిగా ఉంది ఇల్లు.లోపలికి అడుగు పెడుతున్నా ...రా!అని పిలవడం లేదు ఎవరూ..

వివరం తెలుసు కాబట్టి,అమెరికా వెళ్తున్నాను..మీ ఆశీర్వాదం తీసుకు వెల్దామని..ఆగేడు.

నాకు తెలుసు నువ్వంత ప్రయోజకుడు అవుతావని,రా!రా!లాక్కుపోయింది తల్లి.

జీతం వివరాలు ఆరాతీయబోయింది..ముందే అందుకున్నాడు మౌళి.నేను పంపిన డబ్బులు సరిపోయాయా అమ్మా!..

ఎం ఉందిలేరా!వేన్నీళ్లకి చన్నీళ్ళలా ఏవో అలా...ఈ మధ్య మీ అక్క కూతురు పుష్పవతి అయింది.ఓ తులం గొలుసయినా పెట్టాలి అంది వియ్యపురాలు..మనకేం తక్కువ ,అందుకే..నాలుగు కాసులు పెట్టి హారమే కొన్నాను.నువ్వు పంపినవి,అన్నయ్య ఇచ్చేవి బానే ఉన్నాయి కదా!...

బావున్నావా!తమ్ముడూ అక్కలు పలకరించారు..

మన సరళ,మౌళి కి సరిపోతుందేమో కదా!వదినా నవ్వింది చరిత.

ఊరుకోవదినా!దానికి ఊళ్ళోనే కోట్ల ఆస్తి ఉన్న చుట్టరికాలు వస్తున్నాయి.ఎం ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతున్నాం..ఆ!తమ్ముడూ..నువ్వెలాగో అమెరికా వెళ్తున్నావు కదా!సరళ పెళ్లికి వడ్డాణం నువ్వే పెట్టాలి.మేనమావ వడ్డాణం పెట్టాడని రేపు అత్తింట్లో చెప్పుకుంటే ఎంత గొప్పగా ఉంటుందీ!?ఊహల్లో తేలుతూనే భోజనానికి వెళ్ళిపోయింది అక్క.

నేను రేపే బయలుదేరాలి.అన్నాడు అన్యమనస్కంగా మౌళి.

ఆ!నీ సామాను సిటీ లోనే ఉంది కదా!ఇక్కడినుంచి శాల్తీలేమీ లేవు కదా!పద..నువ్వూ భోజనం చేసేస్తే ఓ పని అయిపోతుంది.లోపలికి వెళ్ళింది హైమ

బావున్నావా మౌళి!అన్నయ్య శివ పలకరించేడు

ఆ అన్నయ్యా!అమెరికా వెళ్తున్నానని చెప్పాను కదా!వెళ్లేముందు అందర్నీ చూద్దామని..

ఇక్కడ నువ్వు నేను చూసి సర్దేంత విషయాలు ఏమీ లేవు..అక్కడే నీ మనసుకు నచ్చిన అమ్మాయిని చూసి చేసుకో మౌళి.అమ్మ కుదిర్చిన సంబంధం అస్సలు వద్దు కన్నీరే తక్కువయింది శివకి.

వీళ్ళకి ఎందుకో!బంధాలకు విలువ ఇచ్చేవాళ్ళు ఇపుడు నచ్చరు.దానికీ ఓ సమయం ఫిక్స్ చేస్తారు.ఏ అనారోగ్యమో!మంచాన పడ్డపుడో పలకరించేవాడు ఉంటే బావుణ్ణు అనుకుంటారు.మిగతా సమయంలో మనం డబ్బు ఉత్పత్తి చేసే యంత్రాలమే!మీకోసమే మా జీవితం ధారపోసాం అంటారు.

మనల్ని ఉన్నచోటినుంచి బయటకి గెంటేసి,రాశులు పోగేసేవరకూ మనసులకి దూరంగా ఉంచుతారు.వాళ్ళకి ఆయాసం వచ్చాక ఓ మంచిమాట చాలు అంటారు.ఇప్పటిదాకా వాళ్ళు మనలో పం(పెం)చని ఆ రుచిని,వీళ్ళకేలా తెలిసేలా చేసేది?.నాకు కట్టబెట్టారు ఓ మాలోకంని!..నీ పరిస్థితి అలా వద్దు,నిన్ను తెలిసి,నీతో అన్ని సమయాల్లో ఉండే అమ్మాయిని నువ్వే ఎంచుకో!లేకపోతే నీ మనసుకు ఎవరికోసం తపించాలో కూడా తెలీని దుస్థితికి చేరుకుంటావ్..

ఆ సాయంత్రం అన్నతో,ఒంటరిగా బస్ ఎక్కుతున్న మౌళి పరధ్యానాన్ని చూసి,గంగాధర్ ని అడిగేడు ఊరిపెద్ద

ఏరా!కొడుకుని బస్ ఎక్కించే ఖాళీ కూడా లేదా!?

అల్లుళ్ళు ఇంట్లో ఉన్నారు.వాళ్ళ సరదా పాడుచేయడం ఎందుకు!?అయినా వాడు వెళ్ళేది అంతరిక్షానికి కాదు,అమెరికాకు...నవ్వేసేడు గంగాధర్..



Rate this content
Log in

Similar telugu story from Abstract