vinaykumar patakala

Drama Romance Inspirational

4.5  

vinaykumar patakala

Drama Romance Inspirational

nathicharami

nathicharami

9 mins
327


   అర్ధరాత్రి అవ్వడంతో జనసంచారం లేక బిక్కు బిక్కుమంటున్నాయి రోడ్డులు, ఈ గది మూలన నక్కి దాక్కున్న నా అవస్థను ప్రతిబింబిస్తున్నట్టు. వర్షం రాబోతుందన్న సూచనగా గాలి స్తంభించిపోయింది, నేను ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేనంతగా.

కరెంటు లేకపోవడంతో గది అంతా చీకటిగా ఉంది, నా మనసులోని భయాన్ని ద్విగుణీకృతం చేస్తూ. తలుపు క్రింద నుండి వస్తున్న వెన్నెల వెలుగులో కదులుతున్న నీడను చూసి గుండె దడదడలాడింది. ఎవరో తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్న శబ్దానికి ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. అంతలో తలుపు మెల్లగా తెరచి ఒక్కొక్క అడుగు వేస్తూ లోపలకు వచ్చాడతను.

నేనెక్కడ ఉన్నానో తెలియక అటూ ఇటూ తిరుగుతూ వెతుకుతున్నాడు. చేతికి దొరికిన వస్తువులన్నీ విసిరి కొడుతున్నాడు. అందంగా సర్దుకున్న సామానంతా చెల్లాచెదురు చేస్తూ

"నువ్వు ఎక్కడ ఉన్నా ఈ రోజు నా చేతిలో నుంచి తప్పించుకోలేవు, నిన్ను చంపకుండా ఈ రాత్రి నిద్రపోను" అని వికృతంగా నవ్వుతూ అరుస్తున్నాడు.

అతని మాటలు నన్ను ఉద్దేశించే అన్న ఊహే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. చీకటిలో అతని మొహం స్పష్టంగా కనిపించనందుకు దిగులు పడాలో లేక అదే చీకటి నన్నతనికి కనపడనీయకుండా కాపాడుతుందని ఆనందించాలో అర్ధం కాలేదు నాకు.

అసహనంతో వెనుతిరిగి వెళ్ళబోతూ ఎదో స్పురించినట్టు ఆగి నేనున్న వైపు తిరిగాడు. సరిగ్గా అతడలా తిరిగిన క్షణాన మేఘావృతమై ఉన్న ఆకాశంలో, ఒకే ఒక్క క్షణం, మెరుపు మెరిసింది.

ఆ మెరుపు వెలుగులో అతను నన్ను చూసాడు. నేనూ అతనిని చూసాను. కళ్ళలో క్రోధం, చేతిలో నన్ను చంపడానికి తెచ్చిన ఆయుధం, మోముపై వికృతమైన నవ్వు.... ఇవి ఆ మెరుపు వెలుగులో నేను అతనిలో గమనించిన విషయాలు.

అవేవి నన్ను భయపెట్టలేదు. కానీ ఆ క్షణాన అప్రయత్నంగా నా గొంతులో నుండి గావు కేక వెలువడింది. ఆ వచ్చింది మరొకరెవరైనా అయితే అరిచేదాన్ని కూడా కాదేమో. నన్ను చంపడానికి వచ్చింది....... నా భర్త.

                                ****

ఉదయాన్నే మంచం పక్కన అలికిడి అవ్వడంతో తత్తరపడి లేచి ఎదురుగా ఉన్నతనని చూసి దూరం జరిగి కూర్చున్నాను. నిన్న రాత్రి ఉన్న కసి, క్రోధం లేవతని కళ్ళలో. నేను భయపడడం గమనించి మంచం మీద కూర్చుని నా నుదిటి మీద చేయి వేసి

"ఏదైనా పీడ కల వచ్చిందా అలా బెదిరిపోయావు?" అన్నాడు.

అప్పటికి మెదడుకు పట్టిన మబ్బులు వీడి వాస్తవం తెలియవచ్చింది. మూడున్నరేళ్లుగా పల్లెత్తు మాట కూడా అనకుండా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న రాకేష్ నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు అన్న ఆలోచన కూడా చేయలేకపోయాను అప్పటివరకు. ఒక్కొక్కసారి కలల ప్రభావం మనుషుల మీద ఎంత గట్టిగా ఉంటుందో ఆ సంఘటనతో అర్ధమయ్యింది నాకు. నా ఆలోచనల్లో నేనుండగా

"హలో మేడం! మీ ఆలోచనలు తెగే సరికి కాఫీ చల్లారిపోతుంది, మళ్ళీ వేడి చేసి తెచ్చే తీరిక కూడా లేదు, త్వరగా తాగి బయలుదేరండి" అని రెడీ అవ్వడానికి వెళ్ళబోయాడు రాకేష్.

అతని చెయ్యి పట్టి లాగి, అతనికో ముద్దిచ్చి, అతను తెచ్చిన కాఫీ తాగి దినచర్య ప్రారంభించాను. ఆఫీస్ లో పని ఎక్కువ ఉండడంతో సాయంత్రం ఎప్పుడయినదీ తెలియలేదు. ఉసూరుమంటూ ఇంటికి చేరేసరికి ఎనిమిది అయిపోయింది.

రాకేష్ కూడా అప్పుడే వచ్చినట్టున్నాడు. ఇద్దరం ఫ్రెష్ అయ్యి తరువాత కలిసి వండుకుని తినేశాము. అన్నీ సర్దుకునే సరికి పదవ్వడంతో పక్క ఎక్కేశాను నేను. రాకేష్ మాత్రం ఎదో పని చేసుకోవాలని హాల్ లో ఉండిపోయాడు. అలసిపోయి ఉండడం వలన వెంటనే నిద్ర పట్టేసింది నాకు.

మధ్య రాత్రి ఎప్పుడో మెలుకువ వచ్చి చూస్తే పక్కన రాకేష్ కనిపించలేదు. ఇంత రాత్రి వరకు ఏమి చేస్తున్నాడో చూడడానికని పక్క మీద నుండి లేచాను. అప్పుడు కనిపించింది.... నిన్న రాత్రి కనిపించినట్టు.... తలుపవతల కదులుతున్న నీడ.

ఒక మనిషికి ఒకే కల వరుసగా రెండో రోజు కూడా వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇది కల అవ్వడానికి ఎంత మాత్రమూ అవకాశం లేదు. తలుపవతల జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలని వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా అదే క్రోధం నిండిన కళ్ళతో నిలబడి ఉన్నాడు రాకేష్. అతని చేతిలో కిచెన్ నుంచి తెచ్చిన కత్తి ఉంది. కత్తి పట్టుకున్న చేతిని అతను కదిపే లోపే అతని ముఖం మీద తలుపు వేసి గడి పెట్టేశాను. తలుపు మీద పిడికిళ్ళతో గుద్దుతూ "తలుపు తీయవే, ఈ రాత్రి నీ రక్తం కళ్లచూడకుండా వదలను" అంటూ అరుస్తున్నాడు.

అతని అరుపులు వింటూ ఆ రాత్రి తెల్లవారే వరకు నిద్రపోకుండా అలాగే కూర్చుండిపోయాను. అలా కూర్చొని ఉండగానే ఏ తెలవారుఝామునో నిద్ర పట్టేసింది.

తలుపు తెరచిన శబ్దానికి మెలుకువ వచ్చి చూస్తే ఎదురుగా రాకేష్, కాఫీ ట్రే తో వచ్చి "గుడ్ మార్నింగ్ హనీ" అని, ట్రే పక్కన పెట్టి చిందర వందరగా పడి వున్న సామాను సర్దసాగాడు.

అతని వైఖరి చూసి పిచ్చి పట్టినంత పనయ్యింది నాకు. ఇదంతా కావాలనే చేస్తున్నాడో లేక ఆటపట్టిస్తున్నాడో అర్ధం కాలేదు.

ఆఫీస్ కి వెళ్ళానన్న మాటే కానీ పని మీద ఏకాగ్రత లేదు. మెదడంతా ఆలోచనలతో అల్లకల్లోలంగా ఉంది. రాత్రంతా నన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉదయానికి ఏమి జరగనట్టు మాములుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఎంత ఆలోచించినా అర్ధం కావడంలేదు.

"ఏంటి మేడం ఎదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?" అంటూ వచ్చింది నా కొలీగ్ ప్రసన్న.

"ఉదయమంతా ప్రేమను పంచి రాత్రులు హింసించే భర్తల గురించి" అని అనాలోచితంగానే సమాధానమిచ్చాను.

"నాకు తెలిసిన భర్తలందరూ ఉదయం హింసించి రాత్రికి పంచుతారు 'ప్రేమ' ని" అంది దీర్ఘం తీస్తూ.

తన జోకు అర్ధమయినా నవ్వే స్థితిలో లేను నేను. ఆ రోజంతా పని మీద ధ్యాస లేకుండానే గడిపేశాను.

ఆఫీస్ అయిపోగానే అందరూ ఉత్సాహంగా ఇళ్ళకు బయలుదేరుతున్నారు. నేను మాత్రం రాత్రికి చేయాల్సిన జాగరణ తలచుకొని నీరసంగా బయలుదేరాను.

యదావిధిగా నాకు మెలకువ వచ్చే సరికి తలుపు వెనుక నీడలా కదులుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని వెళ్ళి తలుపు తెరిచాను. అతనదే క్రోధపు చూపుతో నిలబడి ఉన్నాడు. చేతులు రెండూ నా మెడ చుట్టూ బిగించడానికన్నట్టు పైకెత్తాడు. ధైర్యం కూడగట్టుకొని "రాకేష్!!" అని అరిచాను గట్టిగా.

ఎదో మత్తు వదిలినట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడి "దాహంగా ఉంటే నీళ్ళు తాగడానికి వెళ్ళాను, వచ్చే సరికి బెడ్ రూమ్ తలుపు తాళం వేసి ఉంది. నిన్ను లేపడం ఎలానా అని ఆలోచిస్తుంటే నువ్వే లేచి వచ్చావు. థాంక్స్" అనేసి వెళ్ళి పడుకున్నాడు.

భర్త అంటే భరించే వాడు అని ఎవరన్నారో కానీ నా భర్త లాంటి వాళ్ళని చూసి ఉండరు అనిపించింది.

మర్నాడు ఉదయం రాకేష్ తెచ్చిన కాఫీ చూస్తే భయం వేసింది. ఖచ్చితంగా అందులో ఏ విషమో కలిపి ఉంటాడు అనిపించి, అది తాగకుండానే ఆఫీస్ కి బయలుదేరాను.

రాత్రి అతని ప్రవర్తనతో వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఆఫీస్ కి వెళ్ళగానే ముందుగా గూగుల్ ఓపెన్ చేసాను. పది నిమిషాల తరువాత అర్ధమయ్యింది. రాకేష్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ తో బాధ పడుతున్నాడన్న సంగతి. సినిమా పరిభాషలో చెప్పాలంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్..... అపరిచితుడు లో లాగా. అందుకే నేను గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి నార్మల్ గా అయిపోయాడు.

కానీ ఎప్పుడూ లేనిది హఠాత్తుగా ఈ మూడు రోజుల నుంచి మాత్రమే రాకేష్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. ఎవరైనా సైకియాట్రిస్ట్ కి చూపిస్తే మంచిది అనిపించింది, కానీ రాకేష్ కి ఏమని చెప్పి ఒప్పించాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాను. లంచ్ అవర్ లో అన్నం తింటూ పొరపాటున స్పూన్ కింద పడేశాను. వెంటనే డైనింగ్ హాల్ లో అందరూ నా వైపు వింతగా చూడడం ప్రారంభించారు. నేనేదో పెద్ద నేరం చేసినట్టు గుచ్చి గుచ్చి చూడసాగారు. అంత తప్పేమి చేశానో అర్ధం కాక ఇక అక్కడ ఉండలేక నా డెస్క్ దగ్గరకు వచ్చేసాను.

ఈ రాత్రికి ఎలాగైనా రాకేష్ తో మాట్లాడాలి అనుకున్నాను. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే విధికి వింత నాటకాలు ఆడే ఛాన్స్ దొరకడం లేదని బాధపడదూ.

సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఎదురొచ్చి "నీకో బ్యాడ్ న్యూస్" అన్నాడు రాకేష్

ఇప్పుడు నేను అనుభవిస్తున్న దానికన్నా బ్యాడ్ ఏంటో అర్ధం కాలేదు, ఏవిటన్నట్టు కళ్ళు ఎగరేశాను.

"రేపు ఉదయం మా అమ్మ వస్తుందట, దాదాపు నెల రోజుల ట్రిప్ అని చెప్పింది" అన్నాడు.

మాది ప్రేమ వివాహం అవ్వడం వలనో లేక సహజంగానే అత్తలకు కోడళ్ళపై ఉండే ద్వేషమో తెలియదు కానీ ఆవిడకు నేనసలు నచ్చను అన్న విషయం పెళ్ళయిన నాలుగు రోజుల్లోనే తెలుసుకున్నాను. ఎప్పుడు మా ఇంటికి వచ్చినా రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్లిపోయే ఆవిడ ఇప్పుడు ఏకంగా నెల రోజుల ట్రిప్ ఎందుకు పెట్టుకున్నారో నాకర్ధం కాలేదు.

మర్నాడు మా అత్తగారు వచ్చి నన్ను కొరకొరా చూస్తూ అరా కొరా మాట్లాడి ఆవిడ పనులు ఆవిడ చూసుకోసాగారు. ఆవిడ వచ్చిన దగ్గర నుండి రాకేష్ తో మాట్లాడే అవకాశమే దొరకలేదు నాకు రేదర్ మా అత్తగారు దొరకనీయలేదు. కానీ రాత్రులు ఈ ‘నరకం’ మాత్రం తప్పడంలేదు.

పది రోజులు ఎలానో ఓర్చుకోగలిగాను కానీ ఎంతకాలం ఇలా, అందుకే ఈ రోజు ఎలాగైనా అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాలని నిర్ణయించుకొని ఆఫీస్ కి సెలవు పెట్టేశాను. ఉదయం రాకేష్ కాఫీ తెచ్చినప్పుడు సగం నిద్రలో ఉన్న దానిలా లేచి ఒంట్లో బాలేదనీ ఇవ్వాళ ఆఫీస్ కి వెళ్లడం లేదనీ చెప్పాను. అతన్ని ఉండిపొమ్మని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఒంట్లో బాలేదంటే ఉదయపు రాకేష్ ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు నాకు.

ఒంట్లో బానే ఉన్నా బాలేనట్టు, నిద్ర రాకపోయినా పోతున్నట్టు నటిస్తూ పడుకున్నాను. రాకేష్ నాకు దుప్పటి కప్పి తల నిమురుతూ కూర్చున్నాడు. అంతలో మా అత్తగారు వచ్చి రాకేష్ ని పక్కకు తీసుకు వెళ్ళి

"ఎంతకాలంరా ఈ నరకం, విడాకులు తీసుకోకూడదూ?" అన్నారు.

ఆ మాట విని మబ్బులు పూర్తిగా తొలగిపోయినట్టు అనిపించింది. దీనంతటికీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏవిటో అప్పుడు అర్ధమయ్యింది. విచిత్రంగా నా మనసుకు బాధ కానీ కళ్ళలో నీళ్ళు కానీ రాలేదు అప్పుడు, స్వతంత్రంగా బ్రతకగలనన్న ధైర్యమో లేక ఈ నరకం నుండి బయటపడతానన్న ఆనందమో తెలియదు.

మనకు తెలియకుండానే మనం వేరొకరిలా ప్రవర్తిస్తే దాన్ని మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు, కానీ అన్నీ తెలిసే వేరొకరిలా ప్రవర్తిస్తుంటే దాన్ని ఏ డిజార్డర్ అంటారో మరి. అయినా ఇలా భయపెడితే ఎవరైనా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తారు కానీ విడాకులు ఇవ్వాలనుకుంటారా? రెండేళ్ళు ప్రేమించి ఏడాదిన్నరగా నాతో కాపురం చేస్తున్న వ్యక్తిని ఇంతకాలంగా సరిగ్గా అర్ధం చేసుకోలేనందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ అప్పటి వరకు మా అత్తగారి మీద ఉన్న కోపం మాత్రం కాస్త సడలింది. ఎంతైనా ఆవిడ కూడా ఆడదే కదా, సాటి ఆడది నరకం అనుభవిస్తుంటే తట్టుకోలేకపోతున్నట్టుంది.

రాకేష్ మాత్రం వెంటనే ఆవిడ చేయి పట్టుకొని బయటకు లాక్కెళ్ళాడు. వెళుతూ వెళుతూ గది తలుపు దఢాలున వేసాడు. ఇదంతా ఓరకంట గమనిస్తూనే ఉన్నాను నేను.

ఆ తరువాత నేను లేచే వరకు గదిలోకి బయటకు పచార్లు చేస్తూనే ఉన్నాడు. లేని నిద్ర నేను మాత్రం ఎంతవరకు నటించగలను, అయినా నటించి కూడా ప్రయోజనం ఏముంది, అసలు రహస్యం బయటపడిపోయాక ధైర్యంగా దాన్ని ఎదురుకోవడమే మంచిదనిపించి లేచాను.

నేను లేవగానే దగ్గరకు వచ్చి "సాయంత్రం సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళదాం రెడీగా ఉండు" అని సీరియస్ గా చెప్పేసి వెళ్ళిపోయాడు.

ఆ మాట విని నా మెదడు పనిచేయడం మానేసింది. నాకు పిచ్చెక్కిందో లేక అతను నటిస్తున్నాడో అర్ధం కాలేదు. అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని నేను డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాలనుకున్నాను కానీ విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్న తరువాత కూడా అతనెందుకు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లాలనుకుంటున్నాడు? నాకు పిచ్చి పట్టిందని నిరూపించి ఆ కారణంగా విడాకులు ఇవ్వడానికా? తెలుసుకోవాలంటే సాయంత్రం అతనితో పాటు డాక్టర్ దగ్గరకు వెళ్ళడం ఒక్కటే మార్గం అనిపించింది.

డాక్టర్ దగ్గరకు వెళ్ళాక నన్ను బయటే కూర్చోపెట్టి రాకేష్ లోపలకు వెళ్ళాడు. బహుశా నాకు పిచ్చి పట్టిందని చెప్పమని డాక్టర్ ని బ్రతిమాలుతున్నాడేమో. పావుగంట తరువాత నన్ను లోపలకు రమ్మని పిలిచారు.

"చూడమ్మా! మీ వివాహ బంధం సజావుగా సాగడం లేదని రాకేష్ చెప్పాడు, అసలు ప్రాబ్లమ్ ఎక్కడ మొదలయ్యిందో తెలుసుకుంటే కానీ నా పని సులభమవదు. దానికోసం నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను హిప్నటైజ్ చెయ్యాలి అనుకుంటున్నాను" అన్నారు డాక్టర్.

అది విని పిచ్చి పట్టిందని నిరూపించడానికి కాదు, నిజంగానే పిచ్చి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడేమో అనిపించింది నాకు. లేకపోతే విడాకులు ఇవ్వాలి అనుకున్న వాడు వివాహ బంధం సెట్ చెయ్యమని డాక్టర్ ని ఆడడగం ఎందుకు? ఇదేమైనా కొత్త ఎత్తుగడా? ముందు కల అనుకున్నాను, తరువాత అతనికి మానసిక వ్యాధి అనుకున్నాను, తరువాత విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిసింది, ఇప్పుడు వీటన్నిటికీ మించి మరేదో కారణం ఉందనిపిస్తుంది. ఏమిటది? అసలిదంతా ఎక్కడికి దారి తీస్తుందో తెలుసుకోవాలనిపించి ఒప్పుకున్నాను.

డాక్టర్ ఆఫీస్ లో ప్రశాంతమైన వాతావరణంలో హిప్నోటైజ్ చెయ్యడం మొదలు పెట్టారు.

కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వమని మంద్ర స్వరంతో చెబుతూ నన్ను సబ్ కాన్షియస్ స్టేట్ లోకి తీసుకు వెళ్ళారు.

"మీ ఇద్దరి మధ్య సమస్య మొదలయ్యి ఎంతకాలం అవుతుంది?" అని అడిగారు

"దాదాపు పది పదిహేను రోజుల నుండి డాక్టర్"

"అసలు సమస్య ఏమిటి?"

మొదటి నుండి జరిగింది అంతా వివరంగా చెప్పాను.

"నీ భర్త ఇలా ప్రవర్తించడానికి ముందు రోజు జరిగిన సంఘటలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించగలవా?" అన్నారు

"గుర్తున్నాయి డాక్టర్, ఆ రోజు ఆదివారం కావడం వలన ఇద్దరం కలిసి జూ కి వెళ్ళి, తరువాత సినిమా చూసి అటు నుంచి అటే రెస్టారెంటుకు వెళ్ళాం. భోజనం అయ్యాక కూడా నవ్వుతూ కబుర్లాడుతూనే ఇంటికి వచ్చాము" అన్నాను.

"గుడ్! జూ లో కానీ థియేటర్ లో కానీ రెస్టారెంటులో కానీ మీ మనసుకు బాధ కలిగే సంఘటలు ఏవైనా జరిగాయా?" అదే మంద్ర స్వరంతో ప్రశ్నించారు డాక్టర్.

"బాధ కలిగే సంఘటనలు ఏవీ జరగలేదు డాక్టర్".

"బాగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టం లేని వ్యక్తులను చూడడం కానీ, మీకు ఇష్టం లేని సంఘటనలు జరగడం కానీ ఏవైనా జరిగాయేమో ఆలోచించండి"

"ఇష్టం లేనివి అంటే థియేటర్ దగ్గర ముగ్గురు వ్యక్తులు వచ్చే పోయే ఆడవాళ్ళందరి మీదా కామెంట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళను చూస్తే చిరాకుగా అనిపించింది తప్ప అంతకు మించి ఇంకేం జరగలేదు డాక్టర్"

"అల్ రైట్ ! ఇప్పుడు అలాగే రిలాక్స్డ్ గా ఉంటూ ఆ ముగ్గురి ముఖాల్నీ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించండి"

"లీలగా గుర్తున్నాయి డాక్టర్"

"గుడ్! వాళ్ళలో ఎవరినైనా అంతకు పూర్వం ఎక్కడన్నా చూశారేమో గుర్తు తెచ్చుకోండి, ఈ ఊరిలోనో వేరే ఊరిలోనో.... ఈ వయసులోనో చిన్న వయసులోనో.... నెమ్మదిగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి"

గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా ఒళ్ళంతా జలదరించింది నాకు.

"గుర్తొచ్చిందా?" అడిగారు డాక్టర్.

ఆ ప్రశ్నకు కారుతున్న కన్నీరే సమాధానమయ్యింది.

                              ****

"మిస్టర్ రాకేష్!, ఇట్ ఈజ్ ఏ క్లియర్ కేస్ అఫ్ పారనాయిడ్ షీజోఫ్రెనియా, జరగనివి జరుగుతున్నట్టు ఊహించుకోవడం, ఎవరూ పిలవకపోయినా ఎవరో తనతో మాట్లాడుతున్నారు అనుకోవడం, పిచ్చి పట్టినట్టు ఇంట్లో సామాను విసిరి కొట్టడం, ఎవరో తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని భయపడడం, కారణం లేకుండా అందరూ తననే గమనిస్తున్నారు అనుకోవడం వగైరాలు ఈ వ్యాధి లక్షణాలు. మీ భార్యకు ఆరేడేళ్ళ వయసున్నప్పుడు తన ఇంట్లో పని చేసే పనిమనిషి కొడుకు ఎవరినో బలాత్కారం చేయడం చూసింది. అది గమనించిన అతను ఈమె ఎవరికైనా చెప్పేస్తుందేమో అన్న భయంతో ఈమెను చంపడానికి ప్రయత్నించాడు. ఒకసారి ప్రయత్నించి వదిలేస్తే ఇంతలా ప్రభావం ఉండేది కాదు. వివిధ రకాలుగా, అంటే ఒకసారి కత్తితో బెదిరించడం, ఒకసారి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించడం, మరోసారి ముఖం మీద దిండు పెట్టి చంపడానికి ప్రయత్నించడం, ఇలా ప్రయత్నాలు చేసేసరికి ఈవిడకు తెలియకుండానే మెదడు పొరల్లో ఎక్కడో అతను తనను చంపేస్తాడన్న భయం ఉండిపోయింది. కాలక్రమంలో అతను తిరిగి కనిపించకపోయే సరికి ఆ విషయాన్ని మర్చిపోయి జీవించసాగింది కానీ మీరు సినిమాకు వెళ్ళిన రోజు దురదృష్టవశాత్తూ అతను కంట పడే సరికి ఆమె మెదడు పొరల్లో నిక్షిప్తమై ఉన్న భయం మేల్కొంది. రాత్రి సమయాల్లో ఒంటరిగా ఉన్న కారణం చేత మీరే అతను అని ఊహించుకొని మీ నుంచే తనకు ప్రమాదం ఉందని భయపడడం మొదలు పెట్టింది. దాని పర్యవసానమే మీరు చెప్పినట్టు ఆమెను మీరు చంపబోతున్నట్టు ఊహించుకోవడం, పిచ్చి పట్టినట్టు అరవడం, చేతికందిన వస్తువులన్నీ విసిరేయడం"

డాక్టర్ గారు సమస్య రాకేష్ కి కాదు, నాకు అని చెబుతుంటే అంత బాధలో కూడా నాకు మా అత్తగారి మాటలు గుర్తొచ్చాయి. ఆవిడ మాటలలోని 'నరకం' నేను అనుభవిస్తున్నది కాదు రాకేష్ అనుభవిస్తున్నది అని తెలియగానే ఆవిడ మీద కోపం రెట్టింపు అయ్యింది. నేను ఆవిడ గురించి ఆలోచిస్తుండగా

"మరి రాత్రులు మాత్రమే భయపడడానికి కారణమేంటి డాక్టర్?" అని అడిగాడు రాకేష్.

"బహుశా అతను చంపడానికి చేసిన ప్రయత్నాలన్నీ రాత్రి పూటే చేయడం వలన ఇప్పుడు కూడా కేవలం రాత్రులు మాత్రమే మిమ్మల్ని చూసి భయపడుతుంది మీ భార్య" అని చెప్పి తరువాత నన్ను ఉద్దేశించి "యమ్ ఐ రైట్?" అని అడిగారు.

దించిన తల ఎత్తకుండానే అవునన్నట్టు ఊపాను. కళ్ళలో ధారలు మాత్రం ఆగకుండా కారుతున్నాయి.

"ట్రీట్మెంట్ అవసరమవుతుందా డాక్టర్?" అడిగాడు రాకేష్.

"ఏ వ్యాధికైనా 'కాజ్' కరెక్టుగా కనిపెట్టగలిగితే 'క్యూర్' చేయడం చాలా తేలిక. మరీ ముఖ్యంగా ఈ కేసులో ఆవిడ మనసుకు తన వ్యాధికి గల కారణమేంటో స్పష్టంగా తెలిసింది కాబట్టి పెద్దగా ట్రీట్మెంట్ అవసరం ఉండదు, కొన్ని మెడిసిన్స్ ఇస్తాను వాడండి" అన్నారు.

డాక్టర్ కి థాంక్స్ చెప్పి బయటకు వచ్చేశాము.

నా భుజం చుట్టూ చేతులు వేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్న రాకేష్ కళ్ళలోకి చూడాలంటేనే సిగ్గుగా ఉంది నాకు.

నేనే అతనిని హింసిస్తూ అతను నన్ను హింసిస్తున్నాడని ఊహిస్తూ ఏవేవో పిచ్చి పనులు చేసినా కూడా ఎంతో ఓర్పుతో అవన్నీ భరించాడు.

భర్త అంటే భరించే వాడు అని ఎవరన్నారో కానీ నా భర్త లాంటి వాళ్ళని చూసే అని ఉంటారనిపించింది.

అతని పక్కన నడుస్తూ ఏడుపువల్ల రుద్ధమైన గొంతుతోనే "నన్ను క్షమిస్తావా?" అని అడిగాను.

దానికతడు సన్నగా నవ్వి

"క్షమించాల్సినంత తప్పు నువ్వు చేసిన రోజు తప్పకుండా క్షమిస్తాను!" అన్నాడు.

ఆ ఒక్క మాటతో అతని వ్యక్తిత్వం ఏమిటో అర్ధమయిపోయింది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నా భర్త అయినందుకు గర్వంగా అనిపించింది.

ఆ క్షణంలో అతన్ని గట్టిగా కౌగిలించుకోవాలి అనిపించి, రోడ్డు మీద ఉన్నామన్న సంగతి, చుటూ వందల మంది మమ్మల్ని గమనిస్తున్నారన్న సంగతి కూడా మర్చిపోయి అతని గుండెలపై వాలిపోయాను.

పెళ్ళినాడు నా చేతిలో చేయి వేసి చేసిన వాగ్దానమే మరో మారు నన్ను తన గుండెలకు హత్తుకుంటూ చేసాడు......................................................................................................................నాతిచరామి!

  

                          🙏🏻  సమాప్తం 🙏🏻

     

నాతిచరామి అంటే .......వివాహాలలో పెళ్ళి కూతురు తండ్రి కన్యాదానం చేసి

"ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్వయైషా నాతిచరితవ్యాః" అంటారు.

అనగా ఈ రోజు వరకు నా కూతురిగా మాత్రమే ఉన్న ఈమె నేటి నుండి నీ అర్ధాంగిగా అవూచున్నది. ఈ రోజు నుండి ధర్మకార్యాలు ఆచరించటంలోనూ, ధనం సంపాదించుట, ఖర్చు పెట్టు విషయములలోనూ, కోరికలు తీర్చుకొనుటలోను నా కూతురు అభిప్రాయాన్ని అతిక్రమించక మీ దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని పెళ్ళి కుమారునితో కన్యాదాత అంటాడు.దానికి పెళ్ళి కుమారుడు మీరు చెప్పిన ప్రకారం నడుచుకుంటానని చెబుతూ 'నాతి చరామి' అని ప్రమాణం చేస్తాడు. దానికి అర్ధం అనగా 'నాతిచరామి' (న అతిచరామి) అంటే అతిగా చరించుట, న అనగా చేయను అని అర్ధం.



Rate this content
Log in

Similar telugu story from Drama