మూగమనసులు
మూగమనసులు
అది రామాపురం అనే పేరు గల పచ్చని పల్లెటూరు. పట్నానికి చాలా దూరంగా ఉన్న ఆ ఊర్లో సదుపాయాలు కూడా చాలా తక్కువే.
ఉన్న ఊర్లో వసతులు అవసరాల్ని తీర్చేలా లేకపోయేసరికి ప్రజలు పట్నం వెళ్ళడానికి మొగ్గు చూపుతూ ఉండేవాళ్ళు.
పట్నం వెళ్ళడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకునే వాళ్ళు కాదు.
చదువు సంధ్యల గురించి పూర్తిగా అవగాహన లేకపోయినా బాగా చదివి మంచి ఉద్యోగం వస్తే తమ కొడుకులు పట్నం పోయి హాయిగా జీవిస్తారని వాళ్ళలా కూలి నాలి చేస్తూ బ్రతకాల్సిన అవసరం రాదని ప్రభుత్వం తరుపున వచ్చిన వాళ్ళు ఇంటింటికి వెళ్ళి నచ్చజెప్పేసరికి ప్రభుత్వ పాఠశాలలో తమ కొడుకుల్ని చేర్చడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపడం మొదలు పెట్టారు.
బంధువుల వద్ద చెప్పుకోవడానికి బాగుంటుంది అని కొందరు కట్నం బాగా తెచ్చే పిల్లను పట్టొచ్చు అని కొందరు ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు వాళ్ళ కొడుకుల్ని అయితే బడిలో చేర్చారు.
కాని ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితం అనే భావం తరాలుగా వాళ్ళ మనసు లోతుల్లో నిలిచిపోయి ఆడపిల్లల్ని చదివించడానికి ఎవరు ముందుకు రాలేదు.
"చదువుకున్న పిల్ల అణిగి మణిగి ఉంటుందా" అని ఒకరు.
"చదువుకున్న పిల్లకు సంబంధాలు వస్తాయా" అని ఇంకొకరు.
"మేము అయితే చదువుకున్న అమ్మాయిలను మా ఇంటికి తెచ్చుకోవడానికి ఇష్టపడము...మరి మా ఇంటి ఆడపిల్లల్ని చదివిస్తే వాళ్ళని చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు" అని ఒకరు.
"ఆడపిల్ల చదివి మమల్ని ఉద్దరించల్సిన పరిస్థితిల్లో మేము లేము...ఏ మా కొడుకులు చేతకానోల్లా....అబ్బాయిలు సంపాదిస్తే అమ్మాయిలు ఇంటిని చక్కదిద్దుకోవాలి...అప్పుడే ఇల్లు సమాజం అంతా బాగుంటుంది...అమ్మాయిలకు వంటపని ఇంటిపని నేర్పితే చాలు...చదువులు అని మనమే వాళ్ళని చెడగొట్టకూడడు" అని ఇలా ఒక్కొకరు ఒక్కొక్క మాట అనుకొని ఆడపిల్లల్ని బడికి పంపడానికి ఇష్టపడలేదు.
అలాంటి ఆ ఊర్లో ఒక కుటుంబం రాఘవయ్య గారిది.
వాళ్ళకి తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులే చాలా ఉన్నాయి.వాటిని తరాలుగా కాపాడుకొస్తూ వ్యవసాయాన్నే నమ్ముకున్న కుటుంబం అతనిది.
భర్తకు తగ్గ ఇల్లాలు జానకమ్మ. భర్త మాటే వేదంగా భావిస్తూ ఎప్పుడు ఒక మాట ఆయన ముందు ఎక్కువ మాట్లాడలేని మృధు స్వభావి.
సజావుగా సాగుతున్న వారి కాపురంలో ఉన్న ఒకే ఒక సమస్య పిల్లలు కలగకపోవడం.
ఆ కాలంలో లోపం ఎవరిలో ఉన్న తప్పు ఇంటి ఇల్లాలిదే.
పిల్లలు లేకపోవడంతో జానకమ్మకు అత్తగారి పోరు మామూలుగా ఉండేది కాదు.
ఆవిడ అదృష్టం బాగుంది ఊర్లో పడిన మెడికల్ క్యాంప్ లో చూపించుకున్న కొన్ని నెలలకే ఆవిడ కడుపు పండింది.
అప్పటి నుంచి నెలలు నిండేవరకు జానకమ్మకి అత్తగారి పోరు తప్పింది.
కాని కాన్పు అయినప్పటి నుంచి ఆడపిల్లను కన్నది అని జానకమ్మని ఒకటే సాధించేది తన అత్తగారు.
లేక లేక పుట్టిన బిడ్డ కాబట్టి మొదటి సారికే ఎవరైతే ఏమిటిలే శుక్రవారం నాడు మహాలక్ష్మి పుట్టింది నాకు అని ఊరంతా మిఠాయిలు పంచి సంబరపడ్డారు రాఘవయ్య గారు.
రేపో మాపో పోయే అత్త ఎలా ఉన్న కడదాకా తోడు ఉండాల్సిన భర్త బాగుంటే ఏ ఆడపిల్ల అయినా అత్తగారింట్లో సంతోషంగా సర్దుకుపోగలదు అనే మాటను జానకమ్మ గారు నిరూపించారు.
"నందిత" అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు.
రోజులు గడుస్తున్నాయి....జానకమ్మ గారు మళ్ళీ నెల తప్పిన వార్త విని "ఈసారి ఇంటికి వారసుడ్ని కనలేకపోతే నా కొడుక్కి ఇంకో పెళ్ళి చేస్తాను" అని మొదటి నుంచి బెదిరిస్తూ వచ్చింది ఆమె అత్తగారు.
పుట్టేది అమ్మాయా లేక అబ్బాయా అని నిర్ణయించేది భార్య కాదు భర్త అని తెలియని మనుషులు.
తెలిసినా కొడుకుని ఎందుకు అనుకుంటారు...ఏమైనా ఉంటే కొడల్నే అనాలి...ఎంతైనా కోడలు అంటే బయట నుంచి వచ్చిన పిల్లాయే....ఎన్ని అన్నా పడాలి అనుకునే మనుషులు.
జానకి తనకు సొంత మేనకోడలు అయినా తమ ఇంటి రక్తాన్ని కడుపులో మోస్తుంది అని కూడా లేకుండా తన అత్త తనను బెదిరిస్తూ వచ్చింది.
నెలలు నిండే కొద్ది జానకమ్మలో భయం కలగసాగింది. ఈసారి ఆడపిల్ల పుడితే కచ్చితంగా తన అత్త అన్నంత పని చేసిన చేస్తుంది అని మగపిల్లాడు పుట్టాలని మొక్కని దేవుడు లేదు.
కాని ఆవిడ దురదృష్టం మళ్ళీ ఆడపిల్లకే జన్మనిచ్చింది. తనకి ఆడపిల్ల పుట్టిందని తెలిసి తన అత్త ఏం చేస్తుందో అనే భయంతో బీపి పెరిగిపోయి తన శరీరం సహకరించక కన్ను మూసింది జానకి.
ఆ క్షణం ఆవిడ అత్త పెట్టే పోరు గురించి కాకుండా తల్లి లేని ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుందో తలచుకొని ఉండి ఉంటే బాగుండేది.
అప్పటికి నందిత వయసు ఆరు మాత్రమే.
అప్పటి వరకు తనతో బానే ఉన్న నాన్నమ్మ ఇద్దరు ఆడపిల్లల్ని కని మా మీదకు వదిలేసి వారసుడిని ఇవ్వకుండానే పోయింది మీ అమ్మ అనే కోపం మనవరాలి మీద చూపించడం మొదలు పెట్టింది.
అసలే తల్లి లేక ఇబ్బంది పెడుతున్న పిల్లను దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి మనవరాలు అని కూడా లేకుండా తన మాటల సాధింపులు పెట్టేది.
మొదట్లో భార్య పోయిన బాధలో ఉన్న రాఘవయ్య ఇంట్లో సంగతులు ఎలా ఉన్నాయో పట్టించుకోలేదు.
తల్లి గురించి పూర్తిగా తెలిసి ఉన్న రాఘవయ్య చెల్లి శారదమ్మ భర్తతో మాట్లాడి కొన్నాళ్ళు అక్కడే ఉండడానికి వస్తుంది.
అక్కడ అంతా తను ఊహించినట్లే ఉండేసరికి తల్లిపై కోప్పడి నందితను దగ్గరికి తీసుకొని అమ్మలా ఓదార్చింది.
రోజులు కూడా లేని పసిపిల్లను గాలికి వదిలేసి తన పని తాను చేసుకుంటున్న తల్లిను ఏం అన్నా ప్రయోజనం ఉండదు అనుకొని తను అక్కడ ఉన్నంత కాలం ఆ బిడ్డను సాకి అమ్మలా చూసుకున్న వదినమ్మ రుణం తీర్చుకోవాలి అనుకుంది శారదమ్మ.
రాఘవయ్య జానకి గారి గురించి మెల్లిగా మర్చిపోతూ మనుషుల్లో కలవడం మొదలు పెట్టడం ఆలస్యం నీకేం వయసు అయిపోయింది రా ఇంకో పెళ్ళి చేసుకోని సుఖంగా ఉండక అని కొడుక్కి చెప్పడం మొదలు పెడుతుంది తల్లి శకుంతల.
తల్లి మాటలను అన్నయ్య ఎక్కడ తలకి ఎక్కించుకొని పిల్లలకి సవతి తల్లిని తెస్తాడో అనే భయం పట్టుకుంది శారదకు.
అప్పటికే తను వచ్చి నెల పైనే అవుతుంది. త్వరగా రమ్మని భర్త కబురు కూడా అందింది.
తనైన ఎన్నాళ్ళని అన్నయ్య పిల్లలను చూసుకుంటూ తను కన్న పిల్లల్ని అక్కడే వదిలి ఉండగలదు.
"తల్లిని చంపుకొని పుట్టిన ఈ దరిద్రం మనకి ఎందుకు రా... చక్కగా ఇంకో పెళ్ళి చేసుకొని భార్య పిల్లలతో నువ్వు సుఖంగా ఉంటే చూస్తూ చస్తాను రా...కన్న పాపానికి పైటేసే వరకు పెంచుకొని పెళ్ళి చేసి పంపితే భారం దిగిపోతుంది" అని అంటున్న తల్లి మాటలకు "అమ్మ నా కూతుర్ల గురించి ఇంకో మాట తప్పుగా అంటే తల్లివి అని మర్చిపోవాల్సి వస్తుంది" అని బదులు ఇచ్చిన అన్నయ్యను చూసి శారద మనసు స్థిమిత పడింది.
కాని ఆ పిల్లల పరిస్థితే అర్థం కానట్లు ఉండిపోయింది.
శారదమ్మను ఉన్న ఊర్లో ఇచ్చుకున్నా తన భర్త శ్రీధర్ ఉద్యోగ రిత్యా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది.
నందిత గురించి పక్కన పెడితే నెలల పసికందు "రాధ" పరిస్థితికి అందరికి జాలి వేసేది.
భర్త నుంచి ఉత్తరాలు ఎక్కువ అయ్యేసరికి కొన్నాళ్ళకి శారదకు వెళ్ళక తప్పలేదు.
అన్నయ్యకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. భర్తకు ఎలా అయినా నచ్చజెప్పుకొని పిల్లల్ని తమ దగ్గర పెంచుకోవాలి అనుకొని భర్తతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు "నా టీచర్ ఉద్యోగాన్ని మన ఊరికి మార్చుకున్నాను...ప్రభుత్వ ఉద్యోగం కదా మన పరిస్థితి వివరించి ఉత్తరాలు రాసినా ఇన్ని వారాలు పట్టింది...సామాన్లు సర్దడానికి ఇబ్బంది అవుతుంది అని నిన్ను రమ్మని హడావిడి చేసాను" అని చెప్తాడు.
భర్త మాటలకి శారద కళ్ళు చెమ్మగిల్లాయి.
"నాకు మాత్రం ఎవరున్నారే...నువ్వు ,అమ్మ ,మన పిల్లలు తప్పా...జానకి నన్ను సొంత అన్నయ్యలానే చూసింది...చెల్లి కుటుంబం కష్టాల్లో ఉంటే అన్నగా చూస్తూ ఉండగలనా...ఊర్లో మనింటిని శుభ్రం చేయించమన్నాను... రేపే వెళ్దాం సామాన్లు సర్దు" అని శారద కళ్ళు తుడిచి వెళ్ళిపోతాడు.
"మా అమ్మ చేసిన మంచి పని ఏదైనా ఉందంటే నన్ను ఈయనకు ఇచ్చి చేయడమే..." అనుకుంది శారద.
పెళ్ళై వారం కాకముందే తన మావయ్య, మరిదులు, ఆడపడుచు ఇంకా మొత్తం కుటుంబం ఎక్కిన బస్సుకు ఆక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోతే బంధువులు అందరూ "కొత్త కోడలు అడుగు పెట్టిన వేళ విశేషం" అన్నారు.
గాయాలతో బయట పడిన అత్తగారు మాత్రం "వాళ్ళ మాటలను పట్టించుకోకు తల్లి" అని తనను దగ్గరికి తీసుకుంది.
అంత ఉత్తమమైన తల్లి పెంపకంలో పెరిగిన తన భర్త ఇలానే ఉంటాడు అనుకుంది.
చదువు నేర్పిన సంస్కారం కాబోలు నా పిల్లల్ని కూడా వాళ్ళ తండ్రి అంత ఉన్నతంగా పెంచాలి అనుకునేది.
పెళ్ళైన కొత్తలో ఓసారి అత్తారింటికి వచ్చినప్పుడు పొలాలు అన్ని చూసి వస్తూ ఉండగా దారిలో బైక్ మీద నుంచి కిందపడి శ్రీధర్ కు గాయాలు అయితే సొంత చెల్లిలానే దగ్గరుండి చూసుకుంది జానకమ్మ.
ఆ రోజు జానకి చేసిన హడావిడి తనకు చనిపోయిన తన చెల్లెల్ని జ్ఞాపకం తెచ్చింది.
ఆ రోజే శారదతో "జానకి నాకు సొంత చెల్లితో సమానం" అని అన్నాడు.
ఆ మాటను ఇంత గట్టిగా గుర్తు పెట్టుకుంటాడు అని శారద ఊహించలేకపోయింది.
మనం చేసిన మంచే మన పిల్లల్ని కాపాడుతుంది అనే మాట నిరూపణ అయ్యింది.
సామాన్లతో ఊర్లోకి వచ్చిన శారద కుటుంబాన్ని చూసి ఊరంతా నోర్లు వెల్లబెట్టారు.
ఆడపడుచులు వచ్చి ఇంటి కోడళ్లపై పెట్టనాలు చేసే రోజులు అవి.
అలాంటిది ఆ ఇంటి ఆడపడుచు అయినా శారద తన అన్నయ్య పిల్లల కోసం కుటుంబంతో సహా వచ్చేసరికి "ఇదేం చోద్యం" అని ఊరంతా గుసగుసలు ఆడసాగారు.
శ్రీధర్ గారు ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు.
కొన్ని రోజులకే అక్కడ ఆ ఊర్లో ఆడపిల్లల్ని ఎవరు చదివించడం లేదు అని అర్థం అవుతుంది.
నందితకు ఇప్పుడు ఆరేళ్లు...తన కూతురు మానస వయసే...మానస బడికి వెళ్ళబట్టి సంవత్సరం అవుతుంది. కాని నందిత బడి ముఖం చూసి ఎరుగదు అని తెలుసుకొని బాధపడ్డాడు శ్రీధర్.
అప్పట్లో బంధువుల ఇంటికి రాకపోకలు ఎక్కువగా ఉండేవి కాదు. అందుకే ఈ విషయం గురించి శ్రీధర్ కు తెలియలేదు.
ఆ ఊర్లో ఆడపిల్ల అంటే ఏమిటో అర్థం అవ్వడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు.
ఇందుకేనా తన భార్య శారద తనను అంత గొప్పగా చూసేది అని అనిపించింది శ్రీధర్ కు.
శ్రీధర్ పుట్టింది అక్కడే అయినా చదువుల కోసం పట్నం వెళ్ళాడు. ఆ తర్వాత ఉద్యోగం వల్ల వేరే ఊర్లో ఉన్నాడు కాబట్టి ఆ ఊరి గురించి పెద్దగా అవగాహన లేదు.
అతను అంతకు ముందు ఉన్న ఊరు కూడా అలాంటిదే కాని ఆడపిల్లల్ని కనీసం పది వరకు అయినా చదివించేవాళ్ళు.
వీళ్ళను ఎలాగైనా మార్చాలి అనుకొని అంతకు ముందు ఒకే ఊరు అయినా అటు ఇటు తిరగడానికి భార్యకు ఇబ్బంది అవుతుంది అని గమనించి దాని గురించి ఆలోచించసాగాడు.
చివరకి రాఘవయ్య ఇంటి పక్కనతను కూతురు పెళ్ళి కోసం అయ్యే ఖర్చుల కోసం ఇల్లు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకొని ఊర్లో కొంత పొలం అమ్మి మరి ఆ ఇల్లు కొనేసాడు.
ఇక ఊర్లో వాళ్ళ మాటలకు అంతు లేకుండా పోయింది.
వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు బడికి పోతుంటే తాము ఎందుకు ఆడపిల్లలగా పుట్టామా అనే భావం ఆ ఊరి ఆడపిల్లల కళ్ళలో కనిపించేది.
మా అప్పుడైతే మగపిల్లల్ని కూడా చదివించలేదు. ఈ మధ్యే పట్నవాసంపై ఆశలు పుట్టి కనీసం వాళ్ళని అయినా చదివిస్తున్నారు అని భర్తకు చెప్పేది శారద.
ఇది ఇలానే వదిలిపెట్టకూడదు అనుకొని తన సహ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టాడు.
తన కూతురు మానసను ఉదాహరణగా తీసుకోమని చెప్తూ ఉండేవాడు.
అంత చేసినా వృధాప్రయసే అయ్యింది.
ఒకతను "ముందు మీ మేనకోడల్ని బడికి పంపగలరేమో చూడండి" అని వెటకారం ఆడాడు.
కాని శ్రీధర్ కు నిజమే అనిపించింది.
"అందరి పిల్లలు బడుల్లో చదువుతున్నారు...మన పిల్లలకి ఏం తక్కువ బావ...మగపిల్లలు మాత్రమే చదువుకోవాలి అని లేదు కదా...మీకున్న ఇంత ఆస్తిని ఎవరికి ఇస్తారు...వాళ్ళకే కదా...మరి వాటిని కాపాడుకోవాలి అంటే తగ్గిన విద్య అవసరం కదా" అని ఎలాగోలా రాఘవయ్యకు నచ్చజెప్తాడు.
కాని శకుంతలకు మనవరాలు అలా బడికి పోవడం అసలు ఇష్టం లేదు.
మగపిల్లాడు ఉండి ఉంటే రాఘవయ్య గారు కూడా కచ్చితంగా ఒప్పుకునేవారు కాదు. అలా అని జానకి గారిని మర్చిపోయి ఇంకో పెళ్ళి చేసుకోలేక పిల్లల్ని చదివించాలి అనుకున్నాడు.
తనకున్న ఆస్తిపాస్తులు వల్ల ఇచ్చుకోగలిగే కట్నం చూసి పిల్లల్ను చేసుకోవడానికి ముందుకు వస్తారులే అనుకున్నాడు.
ఎంతైనా చదువుకున్న పిల్లకు పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం అని నమ్మే రోజులు అవి.
ఎలాగైతేనేమి నందితను బడిలో చేర్చారు. శారదమ్మ నందితకు,రాధకు అమ్మ అత్త అన్ని తనే అయ్యి చూసుకునేది.
కాలం గడుస్తూ నందిత బడి చదువు పూర్తయ్యింది. తనకు ఆ పై ఇంటర్ చదవాలి అని కోరిక ఉండేది.
అందుకు పక్కూరు వెళ్ళాల్సి వచ్చేది. ఇంతకు మించిన చదువులు అవసరమా అని శకుంతల మొత్తుకుంటున్నా శ్రీధర్ గారు రాఘవయ్యకు "పొద్దున్న సాయంత్రం నేనే వెళ్ళి దించి వస్తాను బావ...మన మానస కూడా తోడు ఉంది కదా" అని నచ్చజెప్పారు.
నందిత రాధలు తమ ఇంట్లో కన్న శారద వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు.
చిన్నప్పుడు శకుంతల మాటల అర్థాలు తెలియకున్నా పెరుగుతున్న కొద్ది అర్థం అవుతూ నాన్నమ్మకు దూరంగా ఉండేది నందిత.
రాధను ఎప్పుడు "పుట్టుకతోనే తల్లిని చంపిన మహజాతకురాలు" అనేది.
నందితకు నాన్నమ్మ ప్రవర్తన నచ్చకపోయినా ఎదురు మాట్లాడితే చదువు వల్లే ఇలా తయారు అయ్యింది అని ఎక్కడ చదువు మానిపిస్తారో అనే భయంతో మౌనంగా ఉండిపోయేది.
ఏది ఎలా ఉన్నా చిన్నప్పటి నుంచి మానసతో ఏది దాచకుండా అన్ని విషయాలను తన భావాలను పంచుకునేది.
ఆ మాటలన్ని అన్నయ్య వంశీకృష్ణకు తండ్రి శ్రీధర్ కు చేరవేసేది.
చదువుకుంటున్న మాటే కాని అవి తనకి ఏ ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయి అని నిస్సహాయంగా అనుకున్నాడు శ్రీధర్.
మానస నందితలు బడికి వెళ్తున్నపుడు వాళ్ళతో ఇంకో ముగ్గురు అమ్మాయిలే చదవడానికి వచ్చేవాళ్ళు.
ఇప్పుడు రాధకు తోడుగా పదిమంది అమ్మాయిలు వరకు ఉన్నారు.
సంఖ్య పెరిగిందని సంతోషించే పరిస్థితి కాదు. ఆ సంఖ్య పెరిగే వేగానికి అందరూ అమ్మాయిలు చదువుకోవడానికి రావాలంటే ఎన్ని యుగాలు పడతాయో అనేది ఊహకి కూడా అందడం లేదు.
నందిత ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న రోజుల్లో ఒకనాడు రాఘవయ్య మిఠాయిలు తీసుకొని ఇంటికి వచ్చాడు.
ఆయన చాలా సంతోషంగా "మన నందితకు మంచి సంబంధం వచ్చిందమ్మ. అబ్బాయి మన ఊరి వాడే కాని పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి గుణవంతుడు.అబ్బాయి తల్లిదండ్రులు మన నందితను వాళ్ళ కొడుక్కి అడిగారు" అని వాళ్ళ కుటుంబం గురించి వివరాలు చెప్తున్నారు.
"అప్పుడే నందుకి పెళ్లేంటి అన్నయ్య....అది ఇంకా చిన్నపిల్లనే కదా...ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు" అంటుంది శారద.
"నువ్వు ఉండవే...మా అప్పుడైతే దాని వయసుకు పెళ్ళై పిల్లలు ఉండేవాళ్ళు. ఏ నీకు మాత్రం ఆ వయసులోనే చేయలేదా పెళ్ళి. ఇప్పటికే చదువు చదువు అని దాన్ని చెడగొట్టారు.మంచి సంబంధం అంటున్నాడు కదా. ఇంకెన్నాళ్ళు అది మనకి బరువుగా ఉంటుంది" అని శకుంతల కూతురిని కసురుకుంటుంది.
జరుగుతున్నవి తన పెళ్ళి మాటలైనా ఏవి నందితకు ఎక్కడం లేదు.
తనకి ఇప్పుడే పెళ్ళి ఆలోచనలు వద్దు అనిపిస్తుంది. తనింకా పై చదువులు చదివి తన కాళ్ళపై నిలబడాలి అనుకుంటుంది.
"నందుకు ఇష్టమో లేదో కనుక్కున్నారా బావ" అని అడిగాడు శ్రీధర్.
"అది చిన్నపిల్ల దానికేం తెలుసు బావ...మూడు ముళ్ళు పడితే తనే సర్దుకుపోతుంది" అని అంటాడు రాఘవయ్య.
"ఆడపిల్ల అంటే సర్దుకు పోవాల్సిందేనా" అని నందిత మనసు తనని ప్రశ్నిస్తుంది.
బయటికి అడిగే ధైర్యం చేయలేక తన ప్రశ్నను తనలోనే సమాధి చేసేసింది.
అప్పుడే పెళ్లెందుకు బావ అని శ్రీధర్ గారు రాఘవయ్య గారికి నచ్చజెప్పబోయారు.
"జానకి లేని లోటు వాళ్ళకి తెలియకుండా పెంచారని వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాల్లో మీ మాట కాదనలేదు బావ...ఇష్టం లేకున్నా మీ మాటకు విలువిచ్చి ఇప్పటివరకు చదవనిచ్చాము...పెళ్ళి విషయాల్లో మాత్రం మీరు జోక్యం చేసుకోకండి" అని రాఘవయ్య గారు అనేసారికి శ్రీధర్ గారు ఇంకేం మాట్లాడలేకపోయారు.
నందిత తనకి ఇప్పట్లో పెళ్ళి వద్దు అని చెప్పితే తన వంతు ప్రయత్నం చేసేవాడు.
కాని నందితకు ఆ ధైర్యం లేక మౌనంగా ఉండిపోయింది. ఆ అబ్బాయి కూడా మంచివాడు అని తెలుసుకొని పెళ్ళి తర్వాత కూడా అమ్మాయిని చదవనిస్తామనేసరికి శ్రీధర్ గారి కుటుంబానికి పెళ్ళికి అభ్యంతరం చెప్పడానికి కారణం దొరకలేదు.
అనుకున్నట్లుగానే పెళ్ళి చూపులు నిశ్చితార్దం అన్ని సజావుగా జరిగిపోయి పెళ్ళి తేదీ దగ్గరికి వచ్చింది.
పెళ్ళి రేపు అనగా ముందు రోజు రాత్రి నందిత శారద గారిని చుట్టేసి ఏడ్చేస్తుంది.
మొదటి సారి మానసతో కాకుండా నేరుగా శ్రీధర్ గారితో మాట్లాడుతుంది.
"అబ్బాయి నచ్చలేదా తల్లి" అని లాలనగా అడుగుతాడు.
"అలాంటిదేం లేదు మావయ్య...అప్పుడే పెళ్ళి అంటే భయంగా ఉంది...నాకు ఇంకా చదువుకోవాలి అని ఉంది" అని ఏడుస్తూ చెప్తుంది పదహారేళ్ళ నందిత.
"ఇప్పటికే ఆలస్యం అయ్యింది తల్లి...నిన్ను ముందు నుంచే అడుగుతూ వచ్చాను కదమ్మా....ఇంతవరకు వచ్చాక ఏం చేయలేమురా" అని అంటాడు బాధపడుతూ.
"మావయ్య...ఒకటి అడగనా" అంటుంది సందేహిస్తునే.
"అడుగమ్మ" అని ఆయన అనగానే "అందరూ ఆడపిల్లలకి మానసకు లాగా అర్థం చేసుకునే తండ్రి ఎందుకు లేరు మావయ్య" అని అడుగుతుంది.
"నేనే కాదు మావయ్య...నాకు తోడుగా చదువుకున్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు కూడా తన మనసులో భావాల్ని ధైర్యంగా తమ కుటుంబం ముందు పెట్టలేకపోయారు.
తండ్రి తాగొచ్చి తల్లిని కొడుతున్న తను మాట్లాడితే ఏం అవుతుందో అని తనలో తనే భయపడుతూ ఉండేది ఒకమ్మాయి.
ఇంకో అమ్మాయికి తన బావతో చిన్నప్పుడే పెళ్ళి అనుకున్నారంట. తన జీవితంలో కీలకమైన విషయంలో తన అభిప్రాయం అవసరం లేదా మావయ్య. ఏమైనా ఎక్కవ మాట్లాడితే అప్పటికప్పుడే పెళ్ళి చేసి పంపుతారేమో అని భయంతో చస్తుంది తను.
ఇంకో అమ్మాయి నాలానే నేనేమైనా మాట్లాడితే నా చెల్లిని నా అంత కూడా చదివించరేమో అని భయపడి పెళ్ళికి తలవంచి ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది మావయ్య" అని తలవంచుకొని చెప్పింది నందిత.
అదే మొదటి సారి నందిత అంతగా మాట్లాడడం. శ్రీధర్ గారికి తన మనసులో భావాల్ని చెప్పేసి తన ఇంటికి వెళ్ళిబోయింది.
మళ్ళీ ఆగిపోయి "మావయ్య ఒక మాట" అనింది.
నందిత మాటలకు ఆలోచనలో ఉండిపోయిన శ్రీధర్ గారు ఏంటి అన్నట్లు చూసాడు.
"నేను ఎలానో ధైర్యంగా నా మనసులో ఉన్న మాటల్ని బయట పెట్టలేకపోయాను. కనీసం రాధను అయినా నాలా కాకుండా ధైర్యంగా తిరగబడేలా పెంచండి మావయ్య...తనకి ఇప్పుడు పదేళ్లు కదా మావయ్య...ఇప్పటి నుంచి ప్రయత్నించిన నాలా కాకుండా ఉంటుందేమో" అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది.
నందిత అలా ఏడుస్తూ వెళ్ళేసరికి తన మనసంతా చేదు తిన్నట్లు అయిపోతుంది.
తనని కన్న కూతురులా పెంచుకున్నాడు. కాని ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి.
"నిజమే...నందు చెప్పేది అక్షరాలా నిజం...వాళ్ళ చదువు వాళ్ళకి ఏ ధైర్యం ఇవ్వలేనప్పుడు అది వృధనే కదా...కనీసం రాధను అయినా శివంగిలా తయారు చేయాలి" అనుకుంటాడు.
ఎలా అయితేనేం బంధుమిత్రుల సమక్షంలో నందిత పెళ్ళి ఘనంగా జరిగింది.
వాళ్ళు అన్నట్లుగానే పెళ్ళి తర్వాత నందిత ఆ ఇంట్లో కాస్త సర్దుకున్నాకా తనని డిగ్రీలో చేర్చారు.
ఆరు నెలలు తిరిగేసరికి నందిత శుభవార్త చెప్పింది. రాఘవయ్య గారింట్లో పండుగ వాతావరణం నెలకొంది.
పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. తొలి కాన్పులోనే వారసుడిని ఇచ్చేసరికి అత్తింటి వాళ్ళు సంబరపడ్డారు.
నందితకు కూడా మగపిల్లాడు అయితేనే బాగుందు అనిపించింది.
ఆడపిల్ల పుడితే ఎన్ని ఎదురుకోవాలో తనకు తెలుసు కాబట్టి తన బిడ్డ తనలా అవ్వడం తనకి ఇష్టం లేక మగపిల్లాడు పుట్టాలని కోరుకుంది.
ఈనాటి కాలానికి అలాంటి తల్లులు ఎందరో ఉన్నారు.మన చుట్టూ మన బందువర్గల్లోనే ఎందరో ఉంటారు.
నందిత నీళ్ళు పోసుకున్నప్పటి నుండే కాలేజీకి వెళ్ళడం మానేసింది.
ఇంట్లోనే చదువుకుంటూ కేవలం పరీక్షలకు మాత్రమే వెళ్ళి వచ్చేది.
తను బాగా చదువుతుంది అని వచ్చిన స్కాలర్ షిప్ అంతా అటెండెన్స్ ఫీస్ కట్టడానికే అయిపోతుంది.
బాబుకు రెండేళ్లు వచ్చేసరికి తన డిగ్రీ పూర్తి అవుతుంది. బాబును అత్తమామలకు అప్పజెప్పి తన శ్రీధర్ మావయ్యలా టీచర్ అవ్వాలి అనుకొని బీ ఎడ్ లో చేరుతుంది.
తన అదృష్టమో దురదృష్టమో మళ్ళీ నెల తప్పింది. ఈసారి పండంటి ఆడపిల్లను కన్నది.
ముందే ఒక అబ్బాయి ఉండేసరికి ఈసారి ఆడపిల్ల పుట్టిన తన అత్తింటి వాళ్ళు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.
కాని తన చదువు మళ్ళీ అక్కడికే ఆగిపోయింది.అప్పటినుంచి తన చదువులు పరీక్షలు పేరు పక్కన డిగ్రీలు పెట్టుకోవడానికే అన్నట్లు అయిపోయింది.
పాపకు రెండేళ్లు వచ్చేసరికి ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే "చదివింది చేసింది చాలు కాని పిల్లల్ని మంచిగా పెంచుకో" అని అత్తింటి వాళ్ళు అడ్డు పుల్ల వేసారు.
వాళ్ళు అడ్డు చెప్పకున్నా బాబుకి బడిలో చేరే వయసు వచ్చింది.
తల్లిగా తన బాధ్యతను విమర్శించలేదు కదా. ఇక చదువు ఉద్యోగం అనే అంశాలు తన జీవితంలో లేవని తన పిల్లల్ని అయినా బాగా చదివించాలి అనుకునేది నందిత.
అప్పుడప్పుడు తనకి "చదువు వల్ల వచ్చే ఆత్మాభిమానానికి అమ్మాయిలు అర్హులు కాదేమో" అనిపించేది.
మళ్ళీ అంతలోనే "ఛా ఛా ఇలా ఆలోచిస్తున్నానేంటి....అమ్మాయిలందరూ కాదు...ధైర్యంగా తన మనసులో మాటలు చెప్పలేని నాలాంటి ఆడపిల్లలు మాత్రమే....ఆడపిల్ల మాట్లాడాల్సిన సమయంలో తన నోరు మూగబోతే జీవితాంతం తన మనసు మూగబోవాల్సి వస్తుంది" అని సర్దిచెప్పుకునేది.
ఈ ఆరేళ్లలో మానస చదువు పూర్తి చేసుకొని బ్యాంక్ ఎంప్లాయ్ గా ఉద్యోగం సంపాదించింది.
కొన్ని నెలల క్రితమే తనకి దూరం బంధువులు బావ వరుస అయ్యే అతనితో పెళ్ళి జరిగింది.
మానస చదువు పూర్తైన తర్వాత పెళ్ళి పిల్లలు అంటే ఏమిటో అర్థం చేసుకునే వయసు వచ్చాకే తన పెళ్ళి చేసారు.
కాని నందితకు పెళ్ళి అంటేనే పూర్తిగా అవగాహన లేని వయసులో టీనేజ్ కూడా పూర్తి కాకుండానే పెళ్ళి అయిపోయింది.
అంత అర్థం చేసుకునే వయసు వచ్చేసరికి ఇద్దరి పిల్లల తల్లి అయ్యింది.
ఇప్పటికి శ్రీధర్ గారికి అమాయకంగా ఉండే నందిత మొహం తను ఏడుస్తూ అన్న మాటలు తరుచూ గుర్తు వస్తూ అతన్ని కలవరపరిచేవి.
పెళ్ళి తర్వాత నందిత పుట్టింటికి వచ్చినప్పుడు రాఘవయ్య గారి వద్ద కన్న శ్రీధర్ గారి ఇంట్లోనే ఎక్కువ ఉండేది.
నందితది తన తల్లి జానకి స్వభావమే. ఆరేళ్లు తల్లి నీడలో పెరిగిన పిల్ల కాబట్టి మొదట్లో శారద గారితో కలవలేకపోయేది.
నిదానంగా అలవాటు పడింది. రాధ మాత్రం పుట్టినప్పటి నుంచి మాటల్లో వినడం తప్ప తల్లిని నేరుగా చూసింది లేదు కాబట్టి తన మనసులో శారద గారికే ఎక్కువ స్థానం ఉండేది.
అందుకేనేమో శ్రీధర్ గారి కుటుంబంతో నందితకు కన్న రాధకే చోరువ ఎక్కువ ఉండేది.
నందితకు ఇచ్చిన మాట కోసమైనా రాధను ధైర్యంగా మాట్లాడగలిగేలా తయారు చేయాలి అనుకొని తనకి చదువుతో పాటు ఎన్నో విషయాలు చెప్తూ లోకజ్ఞానం అందిస్తూ ఆత్మ సంరక్షణ కొరకు కరాటి వంటి విద్యలు కూడా నేర్పించాడు.
అది తనకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆ వయసులో రాధకు తెలీలేదు.
రాధకు సివిల్స్ గురించి పూర్తి అవగాహన కలిగిస్తూ తనను కలెక్టర్ అవ్వడానికి మొగ్గు చూపేలా చిన్నప్పటి నుంచి ప్రేరేపిస్తూ వచ్చాడు శ్రీధర్.
మావయ్య మాటలను విని శ్రద్ధగా చదువుకుంటూ బడి చదువులు పూర్తి చేసుకుంది.
రాధ ఇంటర్ లో చేరిన మొదటి రోజుల్లోనే తనకో సంబంధం వచ్చింది.
"మంచి పట్నం సంబంధం తల్లి...నీ పెళ్ళి కూడా చేసేస్తే నా భాధ్యతలు అన్ని తీరిపోతాయి" అని ఆనందంగా చెప్పారు రాఘవయ్య గారు.
"అప్పుడే రాధకు పెళ్ళేంటి అన్నయ్య...నందితకు వద్దు అన్న అప్పట్లో తొందరపడి పెళ్ళి చేసేసారు... ఏ నా కూతురు మానసకు పెళ్ళి అవ్వలేదా....మంచి భర్త దొరకలేదా....కనీసం రాధను అయినా తన కాళ్ళ మీద నిలబడనివ్వండి" అని గట్టిగానే వాదించింది శారద.
శారద మాటలకు రాఘవయ్య ఆలోచనల్లో పడడం గమనించి తల్లి శకుంతల శారద మీదకు కయ్యుమంది.
"పుట్టుకతోనే తల్లిని మింగేసిన దానికి బంధువర్గాల్లో నుంచి చేసుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడే....అదృష్టం బాగుంది మంచి పట్నం సంబంధం వచ్చింది....ఎలాగైనా పట్నం సంబంధాలు పట్టాలి అని చూస్తున్న ఈరోజుల్లో వెతుక్కొని మరి సంబంధం వస్తే మనమే మన కాళ్ళతో తన్నేసుకుందామా" అని అరుస్తుంది శకుంతల.
అంతసేపు మౌనంగా ఉన్న రాధ "నాన్నమ్మ నేనేం నా తల్లిని చంపుకొని పుట్టినదాన్ని కాదు....నువ్వు మనవడి కోసం పెట్టిన పోరు పడలేక నీ కోడలు బీపీ పెరిగి చనిపోయింది...మా అమ్మను చంపింది నేను కాదు నువ్వే" అని ఎదురు తిరుగుతుంది.
చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన మాటలే అయినా కుక్కులే కదా మోరిగేవి అనుకొని రాధ సరిపెట్టుకునేది.
ఈసారి పెళ్ళి ప్రస్తావన కూడా ఎత్తేసరికి ఉండలేక అనేసింది.
రాధ తిరిగి మాట్లాడేసరికి శ్రీధర్ గారికి ఇన్నాళ్ళ అతని కష్టం ఫలించింది అనిపించింది.
కాని మనవరాలు తనకు ఎదురు చెప్పడం శకుంతల తట్టుకోలేకపోయింది.
"ఒరేయ్ రాఘవ....చూస్తున్నావా నీ కూతుర్ని...నన్నే ఎదిరించి మాట్లాడుతుంది రా....మనింటి పరువు తీయడానికే దాపరించింది" అని ఏడుపులు పెడబొబ్బలు పెడుతుంది.
నిజానికి రాఘవయ్యది కూడా ఆడపిల్ల అణిగి మణిగి ఉండాలి అనుకునే మనస్తతత్వమే...
అందుకే అతనికి సర్దుకుపోయే గుణం ఉన్న జానకి గారంటే అంత ఇష్టం... నందిత కూడా జానకి గారిలా నోట్లో నాలుక లేనట్లు ఉండేసరికి అతనికి ఆమంటే ఇష్టం...
నందిత పుట్టినప్పుడు స్వీటులు పంచిన ఆయనే రాధ పుట్టినప్పుడు జానకి చనిపోయేసారికి శని అనుకున్నాడు.
కాని కన్న కూతుర్ని అతనే అలా అంటే పెళ్ళి చేయాలి అనుకునే సమయాల్లో ఇబ్బంది అవుతుంది అని తల్లిని కసురుకునేవాడు.
ఆడపిల్ల నోరు తెరవడమే పాపం అనుకునే రోజుల్లో రాధ మాటలు ఆ ఇంట్లో మామూలు తుఫాను తేలేదు.
"రాధ నువ్వు ఆడపిల్లవి అని మర్చిపోతునట్లు ఉన్నావు... పెద్దవాళ్ళతో మాట్లాడే తీరేనా అది....మీ అమ్మ అక్కలు ఎంత అణుకువగా ఉండేవాళ్ళు...నువ్వు మనింటికి కళంకము అవ్వకు....నాన్నమ్మ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు....వచ్చేవారమే నిశ్చితార్దం పెట్టుకుందాం" అని అన్నారు రాఘవయ్య గారు కోపంగా.
"నేనేం తప్పు చేసానని క్షమించమని అడగాలి నాన్న..." అని అడిగి "అయినా నా చదువు ఇంకా పూర్తి కాలేదు నాకిప్పట్లో పెళ్ళి చేసే ఆలోచనలు మానుకోండి నాన్న" అని నిదానంగా చెప్పడానికి చూస్తుంది.
"ఇప్పటికి చదివిన చదువులు చాలమ్మ....ఇంకా చదివి ఇంకెన్ని మాటలు నేర్చుకుందాం అని ఈ ఆరాటం... ఆడపిల్లవు ఆడపిల్లలా ఉండు" అని అరుస్తుంది శకుంతల.
"నువ్వు ఆడపిల్లవేనని మర్చిపోకు నాన్నమ్మ" అని అంటుంది రాధ.
"అవ్వా అవ్వా....ఎంత నోరు వేసుకొని అరుస్తుంది...మా రోజుల్లో అయితే కాల్చి వాతలు పెట్టేవాళ్ళు...దీన్ని శారద అతిగారాబం చేసి చెడగొట్టింది...ఎవరైనా దీని మాటలు వింటే మనింటి పరువేం కావాలి" అని మోత్తుకుంది శకుంతల.
మాట మాట పెరిగింది. చివరికి "ఉద్యోగం చేసి ఎవరిని ఉద్దరించాల్సిన అవసరం లేదు....రేపే నిశ్చితార్దం...వచ్చే వారమే పెళ్ళి...అదే సంబంధం ఖాయం చేస్తున్న..." అని చెప్పేసి వెళ్ళిపోతారు రాఘవయ్య గారు.
నందితను ఉన్న ఊర్లో తెలిసిన కుటుంబంలోకి ఇచ్చుకున్నారు. అబ్బాయి ఉద్యోగ రిత్య పట్నంలో ఉంటున్నారు.
కాని రాధకు వచ్చిన సంబంధం బయటిది. ఎలాగోలా పిల్లల్ని పట్నం పంపాలి అనుకుంటున్న మనుషులు కాబట్టి ముందు వెనుక ఆలోచించకుండా సంబంధం ఖాయం చేసుకున్నారు రాఘవయ్య గారు.
వారసుడు లేదు కాబట్టి ఆస్తి కూతుర్లకే వస్తుంది అని కట్నం ఆశతో మీకు మంచి మంచి పట్నం సంబంధాలు వస్తున్నాయి రాఘవయ్య గారు మీ బావ గారి మాటలు విని అని శ్రీధర్ గారిని ఉద్దేశించి బంగారం లాంటి సంబంధాలను చెడగొట్టుకోకండి ఇరుగు పొరుగు వాళ్ళు బానే మెదడుకి ఎక్కించారు.
ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా కష్టాల్లో ఉన్నప్పుడు తోడు ఉండరు కాని ఇలాంటి విషయాల్లో బంధువుల మధ్య గొడవలు పెట్టడానికి మాత్రం బాగా పనికొస్తారు ఇలాంటి పనిపాట లేని మనుషులు.
రాధ మాటలకు కోపంలో ఉన్న రాఘవయ్య గారు మగ పెళ్ళివారి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్ళి ఏర్పాట్లు చేస్తారు.
"కనీసం వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మన పిల్లను ఎలా ఇస్తాము అన్నయ్య...తర్వాత ఏమైనా తేడా జరిగిన దాని తల రాత అని దాని పాటికి దాన్ని వదిలేస్తారు కాని చేరదియ్యరు కదా....అయినా సంబంధం అడిగిన వాళ్ళు రేపే నిశ్చితార్థం అంటే ఎలా ఒప్పుకున్నారు అని కూడా ఆలోచించలేకపోతున్నావా" అని నిలదీస్తుంది శారద.
ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు బాగా తలకి ఎక్కించుకున్న రాఘవయ్య గారు "నా కూతురు జీవితం బాగుండాలి అంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు...బయట వాళ్ళు జోక్యం చేసుకోకపోతే మంచిది" అనేసి వెళ్ళిపోయాడు.
ఆ మాటలను శారద తీసుకోలేకపోయింది.రాధను చిన్నప్పటి నుంచి తన కూతురులా పెంచుకుంది.
రాధ రాఘవయ్య గారింట్లో కన్న శారద వాళ్ళింట్లోనే ఎక్కువ ఉండేది.
రాఘవయ్య గారింట్లో ఉన్న కొద్ది సమయం కూడా శారద గారి బలవంతం మీదే ఉండేది.
అది కూడా పూర్తిగా సొంతోళ్ళకి దూరం చేస్తున్నారు అని అంటున్న ఊరి వాళ్ళ నోర్లకి తాళం వేయడం కోసమే.
తెలిసిన వాళ్ళంతా ఏమి ఆశించకుండా ఎవరు మాత్రం ఏం చేస్తారు ఏమో ఎవరికి తెలుసు ఆస్తి కోసం కుట్రలు పన్నుతున్నారేమో అనేవాళ్ళు.
తల్లి లేని ఆడపిల్లల్ని ఒకనాడు చూసుకున్న పాపాన పోలేదు కాని ఇలాంటి విషపు మాటలు మాత్రం బానే పండించారు.
అసలైతే నందితను వాళ్ళ కొడుకు వంశీకృష్ణకు చేసుకుంటారేమో అనుకునే వాళ్ళు ఊర్లో.
కాని శ్రీధర్ గారి కుటుంబంలో ఎవరికి అలాంటి ఆలోచనే లేదు.
ఒకానొక రోజు ఈ మాటలు ఆ నోట ఈ నోట మారి వంశీ చెవుల్లో పడ్డాయి.
అప్పుడతడు "నందితను నా చెల్లి మానసతో సమానంగా చూసాను...నాకు కాని తనకు కాని అలాంటి ఆలోచనలు లేవు...మీరు పుట్టించకండి కూడా" అని గట్టిగానే అన్నాడు.
ఇప్పుడిలానే అంటాడు కాని అప్పటికి నందితనే చేసుకుంటాడులేండి అని అప్పట్లో అందరూ చెవులు కోరుక్కున్నారు.
ఆడపిల్లపై అలాంటి మాటలు రావడం మంచిది కాదనుకొని అప్పటి నుంచి కొంత కాలం పై చదువుల కోసం పట్నం వెళ్ళిపోయాడు.
ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు. కొన్ని నెలల్లో ట్రైనింగ్ పూర్తయ్యి డ్యూటీలో చేరుతాడు.
రాధ పెళ్ళి విషయం విని నందిత మానస వంశీలు ఇంత హడావుడిగా పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని ఆశ్చర్యపోయారు.
ఉన్నఫలంగా పెట్టుకునేసరికి నందిత భర్తకు కుదరక రాలేదు. తన పిల్లలతో నందిత మాత్రమే వచ్చింది.
మానస తన కుటుంబంతో వచ్చింది.వంశీ మాత్రం రాలేదు.
"అప్పుడే రాధకు పెళ్ళి చేయాల్సిన తొందర ఏం వచ్చింది నాన్న" అని అడిగింది నందిత.
చివరికి తను కూడా అతన్ని ప్రశ్నిస్తుండేసరికి తట్టుకోలేక "ఏమ్మా....నువ్వు మాత్రం పెళ్ళి చేసుకొని భర్త పిల్లలతో సుఖంగా ఉంటావా...అత్తమామలు ఊరు వదిలి రారు. తోడికోడళ్ళ గొడవ లేదు...ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే ఆడపడుచు...పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే భర్త...వజ్రల్లాంటి ఇద్దరు పిల్లలు..ఇంకేం కావాలి నీకు...సంతోషంగానే ఉన్నావు కదా...నీ చెల్లి జీవితం ఎందుకు చెడగొట్టాలి అని చూస్తున్నావు" అని అరిచి వెళ్ళిపోతాడు రాఘవయ్య.
నందిత కళ్ళల్లో నీళ్ళు చేరాయి.
"నిజమే...ఉద్యోగం చేసి నా కాళ్ళపై నిలబడలేకపోతున్న అనే బాధ తప్ప నాకేం లోటు అనుకునే వాళ్ళే అందరూ...అయినా ఆయన నన్ను ఇంట్లోనే పడి ఉంటావుగా అన్నప్పుడు నా మనసు ఎంతలా గాయపడుతుందో నాకు తప్ప ఎవరికి అర్థం అవుతుందిలే...ఎవరితోనైనా అంటే అన్ని కాళ్ళ దగ్గరికి అందిస్తున్నప్పుడు ఇంట్లో ఉండి వండి పెట్టడానికి ఏం నొప్పి అనే వాళ్ళే కాని ఎవరు అర్థం చేసుకోరు...చేసుకోలేరు కూడా...
ఆడపిల్ల ఎన్ని సాధించాలి అన్నా పెళ్ళికి ముందే...తర్వాత చూసుకోవచ్చులే అనుకునే వాళ్ళకి నా జీవితమే ఉదాహరణ" అని నిర్లిప్తంగా అనుకొని "ఈ పెళ్ళిని ఎలా అయినా ఆపాలి" అని గట్టిగా అనుకుంది.
నిశ్చితార్థం ఇంట్లో వరకే పెట్టుకున్నారు. శ్రీధర్ గారికి ఇష్టం లేకున్నా కూతురులా పెంచుకున్న పిల్ల కదా వదులుకోలేక అక్కడికి వచ్చాడు.
తాంబూలాలు మార్చుకుని తర్వాత ఉంగరాలు మార్చుకోమనప్పుడు రాధ ఉంగరం పెట్టకుండా "నాకీ పెళ్ళి ఇష్టం లేదు" అని అందరిలో గట్టిగా చెప్తుంది.
వచ్చిన వాళ్ళంతా అవాక్కయ్యారు. శ్రీధర్ గారు మాత్రం రాధ వైపు గర్వంగా చూస్తున్నారు.
శకుంతల కోపంగా అందరిలోనే రాధ జుట్టు పట్టి లాగి ఆ చెంప ఈ చెంప చెళ్లుమనిపించింది.
శారద గారు అడ్డు వచ్చి రాధను పక్కకి తీసుకొనిపోయారు. రాఘవయ్య గారికి అంత మందిలో అతనికి అదంతా అవమానంగా అనిపించి మగపెళ్ళి వాళ్ళను జరిగిన దానికి క్షమాపణ అడిగారు.
వాళ్ళు "మరేం పర్వాలేదు...పెళ్ళి తర్వాత ఈ పోగరును ఎలా దించాలో మాకు బాగా తెలుసు" అని మరికొంత కట్నం అడిగారు.
శ్రీధర్ గారికి వాళ్ళ మాటలేమీ నచ్చలేదు.
రాధ మాత్రం "మీరా నా పొగరు దించేది... నేనేం మా అమ్మలా మెతక మనిషిని కాను...అత్తింటి వాళ్ళు పోరు పడుతూ చావడానికి...మీరు తాగే టీలో ఇంత విషం పోసి ఇస్తాను...దెబ్బకు అందరూ చస్తారు" అని అంటుంది.
రాధకు స్వతంత్రంగా తన మనసులో మాటలు బయట పెట్టే ధైర్యం ఉన్న ఇప్పుడు అనన్ని మాటలు తనకు రావు. అలా ప్రవర్తిస్తే అయినా పెళ్ళికి ముందే ఇలా ఉంది పెళ్ళి తర్వాత ఎలా ఉంటుందో అని మాకు వద్దు ఈ పిల్ల అని వెళ్ళిపోతారు అనే ఆలోచనతో అలా మాట్లాడింది.
కాని తన ఆలోచనకు విరుద్ధంగా వాళ్ళు స్పందించారు. వీలైనంత త్వరగా పెళ్ళి జరిపించండి అనేసి అనుకున్నట్లే వారం రోజులకి ముహూర్తం ఉండేసరికి అదే ఖాయం చేసుకొని వెళ్ళిపోయారు.
శ్రీధర్ గారికి మాత్రం అదంతా సరిగ్గా అనిపించలేదు.
అంతమందిలో రాధ అన్న మాటలకు ఎవరైనా సరే పెళ్ళి వద్దు అనుకొని వెళ్ళిపోతారు.
ఆ రోజుల్లో ఆడపిల్ల నోరు విప్పినట్లు అనిపించిన పెళ్ళి రద్దు చేసుకొని పోయిన గాథలు ఎన్నో ఉన్నాయి.
అలాంటిది రాధ మాట్లాడిన మాటలకు చిన్నపాటి యుద్ధమే జరిగేది.
కట్నం కోసమే ఇదంతానా అనుకొని ఆశ్చర్యపోయాడు.
"అంతమందిలో మన పరువు పోయేలా మాట్లాడినది ఇంటి నుంచి పారిపోయి మిగిలిన పరువు కూడా తీయకుండా ఉంటుందారా....దాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బంధించు" అని కొడుక్కి చెప్పుకుంది శకుంతల.
అసలే రాధ చేసిన పనికి కోపంలో ఉన్న రాఘవయ్య ముందు వెనుక ఆలోచించకుండా రాధను బాగా కొట్టి గదిలో బంధించి ఎటు వెళ్ళనివ్వకుండా కాపలా పెట్టేసాడు.
చివరికి ఎంత మొత్తుకున్నా వారం రోజులకు రాధ పెళ్ళి జరిగిపోయింది.
"మా వైపు ఆచారాలు వేరుగా ఉంటాయి...పెళ్ళికూతురుతో పాటు తోడు ఎవరు రాకూడదు...కొన్ని రోజులకి మేమే వస్తాము" అని చెప్పి కట్న కానుకలు అప్పుడే పుచ్చుకొని రాధను తీసుకొని వెళ్ళిపోయారు.
వాళ్ళు అటు కదిలిన గంటకు వంశీ కృష్ణ పోలీసులతో అక్కడికి వస్తాడు.
అప్పటికే రాధను వాళ్ళు తీసుకెళ్ళిపోవడంతో ఆలస్యం చేసానని బాధపడతాడు.
"ఏమయ్యా...చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నావు అలా ముందు వెనుక చూసుకోకుండా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేయడమేనా...అయినా పద్దెనిమిది ఏళ్ళు దాటకుండా పెళ్ళి చేయడం చట్ట రీత్యా నేరం అని తెలీదా..." అని పోలీసులు రాఘవయ్య గారిని అందరిలోనే కేకలేస్తారు.
"నా కూతురు జీవితం బాగుండాలి అనుకోవడం తప్పా" అని ఆవేశంగా అంటారాయన.
"చేతురాలా కూతురి జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ బాగుండాలి అనుకోవడం...కట్నం కూడా ఇప్పుడే పట్టుకొని పోయుంటారే" అని అంటారు వాళ్ళు.
శారద గారు కంగారుగా "ఏమంటున్నారండి" అని ముందుకొచ్చి అడుగుతుంది.
అప్పుడు ఆ పోలీస్ వాళ్ళంతా పెళ్ళి పేరుతో అమ్మాయిల కుటుంబానికి దగ్గర అయ్యి ఆచారాల పేర్లతో అమ్మాయిని ఒంటరిగా వాళ్ళతో తీసుకెళ్ళి ముందు వాళ్ళు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి డిమాండ్ బట్టి వ్యభిచార గృహాలకు లేదా ఇతర దేశాలకు అమ్మేస్తారు అని క్లుప్తంగా చెప్తారు.
"అయ్యే...నా కూతురు....నా కూతురు...." అని నేలపై కులబడిపోయాడు రాఘవయ్య.
"నా మనవరాలి జీవితం ఇలా అయిపోయింది ఏంటి దేవుడా" అని శకుంతల శోకనాథలు పెడుతుంటే "ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు నీ మనవరాలని" అని విసుకుగా అనుకుంటాడు వంశీ.
"నీ ఏడుపు నా చెల్లి కోసం కాదు మీ ఇంటి పరువు పోయిందని అని తెలియని వారు ఇక్కడ ఎవరు లేరులే నాన్నమ్మ" అని మనసులో అనుకుంటూ చెల్లి కోసం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది నందిత.
"ఇప్పుడేం చేద్దాం సార్" అని వంశీ కంగారుగా అడుగుతుంటే "ఆ అమ్మాయి జీవితాన్ని వాళ్ళు నాశనం చేసే లోపే వాళ్ళని వెతికి పట్టుకోవాలి" అని చెప్తారు పోలీస్ ఆఫీసర్.
వాళ్ళ చిరునామ అని రాఘవయ్య గారు చెప్పబోతుంటే "వాళ్ళు మీకు అన్ని సరైన వివరాలు ఇచ్చారని మీరు అనుకుంటున్నారా...ఒకసారైనా వెళ్ళి చూసి వచ్చారా..." అని ప్రశ్నించేసరికి మౌనంగా ఉండిపోతాడు.
ఆ ముఠా వెళ్ళిన వైపు వంశీ ఇంకా పోలీసులు వెళ్ళి వెతుకులాట మొదలు పెడతారు.
సరిగ్గా రెండు రోజులకు వంటి నిండ గాయాలతో ఉన్న రాధతో కలిసి ఊర్లోకి అడుగుపెడతాడు వంశీ.
పొలిమేర దాటి ఊర్లోకి వస్తున్నారో లేదో అప్పుడే అందరూ రాఘవయ్య గారి కూతురు జీవితం కుక్కలు చింపిన విస్తరి అయ్యింది అని గుసగుసలు ఆడసాగారు.
ఆ మాటలు వినలేనట్లు చెవులు మూసుకుని రాధ ముందుకు వెళ్తుంటే వంశీ చూసిన చూపులకి భయపడి మళ్ళీ వెనక్కి వచ్చి "ఈ గాయాలు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చేసిన పెనుగులాటలో తగిలినవి. వాళ్ళిప్పుడు జైలులో చిప్ప కూడు తింటున్నారు...ఎవరైనా నా గురించి తప్పుగా మాట్లాడిన తప్పుగా ప్రచారం చేసిన పరువు నష్టం కేసు కింద అందరిని జైలులో వేయిస్తాను జాగ్రత్త" అని లేని ఓపికతోనే అరిచి నీరసంగా ఇంటి దారిపడుతుంది.
ఆమె వెనుకే వంశీ వెళ్తాడు.
వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే "ఇంత జరిగిన ఈ పిల్లకున్న పొగరులో అణువంత కూడా కరగలేదు.ఇంకీ అమ్మాయి జీవితం ఏంటంటారు" అని మళ్ళీ వాళ్ళ నోర్లకి పని పెట్టుకున్నారు.
రాధ తన ఇంట్లోకి కాకుండా శ్రీధర్ గారింట్లోకి వెళ్ళి శారదమ్మను చుట్టేసి గట్టిగా ఏడ్చేస్తుంది.
రాధను క్షేమంగా చూసిన తర్వాత శారద గారి మనసు కుదుటపడింది.
ఈ రెండు రోజులు ఏడుస్తూ ఉండిపోయిన శారదకు మనమ్మాయికి ఏం జరగదులే అని ఓదారుస్తూ ఉన్న మాటే కాని శ్రీధర్ గారు కూడా బయటికి కనిపించనివ్వకుండా మౌనంగా రోధించారు.
అతని కంగారు బయటికి చూపిస్తే ఇంట్లో అందరూ డీలా పడతారు అని ఆయనలో ఆయనే మదనపడ్డారు.
ఇప్పుడు రాధను చూసాక ప్రాణం లేచి వచ్చింది.
రెండు రోజుల నుంచి ఎవరు పచ్చి మంచనీళ్ళు కూడా ముట్టలేదు.
ఎంతసేపటికి రాధ శారద గారిని పట్టుకొని ఏడవడం ఆపకపోయేసరికి "అమ్మ...అది రెండు రోజుల నుంచి ఏం తినలేదు...డాక్టర్ గారిచ్చిన మందులు వేయాలంటే ముందు తనేమైన తినాలి కదా...ముందా పని చూడు" అని చెప్తాడు వంశీ.
రాధ రావడం తెలిసి రాఘవయ్య గారు అతని తల్లితో కలిసి అక్కడికి వస్తాడు.
"అమ్మ రాధ..." అంటూ లోపలికి వస్తున్న రాఘవయ్య గారిని చూసి మానస వెనుక దాక్కుంది రాధ.
"నన్ను క్షమించు తల్లి...!!నీ జీవితం బాగుందాలనే ఇలా..." అని మాట్లాడుతుంటే రాధ వినదలుచుకోనట్లుగా మొహం పక్కకి తిప్పేసింది.
ఏడ్చి ఏడ్చి తనకు తలంతా భారంగా అనిపిస్తుంటే తల పట్టుకొని అలానే నిలబడిపోయింది.
"అది కాదు తల్లి...ఇలా జరుగుతుందని..." అని అంటుండగానే రాధకు తల నొప్పి ఎక్కువయ్యి ఇక ఉండలేక పడకగదిలోకి వెళ్ళిపోయింది.
రాఘవయ్య గారు కన్నీళ్లు పెట్టుకుంటూ "రాధమ్మ" అంటూ ఆమె వెంట వెళ్ళబోయాడు.
"తనకిప్పుడు విశ్రాంతి అవసరం మావయ్య...తనని విసికించొద్దు" అని అడ్డుపడ్డాడు వంశీ.
రాఘవయ్య గారు ఇంకేం మాట్లాడలేక బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేస్తాడు.
"భగవంతుడా..!!!చక్కగా పెళ్ళి చేసుకొని పోవాల్సిన పిల్ల జీవితం ఇలా అయ్యిందేంటి స్వామి.ఇంకెన్నాళ్ళు అది మా ఇంట్లోనే పడి ఉంటుంది" అని తనదైన శైలిలో తను అనుకుంటూ కొడుకుని అనుసరిస్తుంది శకుంతల.
"ఛీ...ఈ ముసల్ది ఎప్పటికి మారదు.ఇంత జరిగిన పట్టనట్లు మళ్ళీ పెళ్ళి పిల్లలు అని మోత్తుకుంటుంది" అని కోపంగా అనుకున్నాడు వంశీ.
"కాసేపు రాధను ఎవరు మాట్లదించొద్దు" అని చెప్పి కుర్చీలో వాలాడు.
నందిత లోపలికి వెళ్తున్నడల్ల వంశీ మాటలకి ఆగిపోయేసారికి "నువ్వు రాధకు తోడుగా వెళ్ళు నందు" అని చెప్తాడు.
మానస కూడా వెళ్ళబోతుంటే "మను...!!! అమ్మ ఒకటే ఎన్ని పనులని చేస్తుంది.వెళ్ళి సాయం చెయ్యి పో" అని చెల్లిని విసుక్కున్నాడు.
రాధను తన వడిలోకి చేర్చుకొని నిదానంగా వీపు సవారాదిస్తూ తనను నిద్ర పుచ్చుతుంది నందిత.
ఇందాక శారద గారి వడిలో రాని ధైర్యం నందిత వడిలో తనకి లభించింది.
బహుశా అది రక్తసంబంధం వల్ల కావొచ్చు. అమ్మ స్పర్శ తర్వాత ఆడపిల్లకు ధైర్యాన్ని ఇచ్చే స్పర్శ ఏదైనా వుందంటే కచ్చితంగా అది తన అక్కదే అవుతుంది.
నందిత వడిలో రాధ ప్రశాంతంగా పడుకుంది.
కాసేపటికి లోపలికి వచ్చిన వంశీ రాధను అలా చూసి చాలా బాధపడతాడు.
ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే రాధ అలా ఉండడం ఎవరు తట్టుకోలేకపోతున్నారు.
వంశీకు చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తున్నాయి.
అతనికి నందితని చూస్తే జానకి అత్తయ్యలానే అనిపిస్తుంది.
ఆ అమాయకమైన మొహం మచ్చలేని మనస్తత్వం మాట్లాడాలంటే నందిత పడే మొహమాటం అన్ని చూస్తే అతనికి ఎప్పుడు బావగా ఆమెను ఏడిపించాలి అనిపించలేదు.
వంశీ నందితలకు రెండేళ్ల వయసు తారతమ్యం ఉండేది. కాని వంశీ రాధలకు ఇంచుమించు ఎనిమిదేళ్ళ వయసు తారతమ్యం ఉంటుంది.
ఆ వయసు వెత్యాసం వల్లనేనేమో సొట్ట బుగ్గలు వేసుకొని ఎప్పుడు నవ్వుతూ ఉండే రాధను చూస్తే అతనికి ఆటపట్టించాలి అనిపిస్తూ ఉండేది.
చిన్నప్పుడు తల్లి శారద వంట పనుల్లో హడావిడిగా ఉంటే అప్పుడప్పుడు అతనే మానస నందితలకు జడలు అల్లి రిబ్బన్లు వేసేవాడు.
అలాంటిది అతనే రాధ తను స్వయంగా జుట్టు అల్లుకొని రిబ్బన్లు వేసుకొని బడికి పోతుంటే వాటిని లాగేసి ఏడిపించిన రోజులున్నాయి.
పోగు చేసుకున్న డబ్బులతో అతనితో పాటు నందితకు కూడా చిరుతిళ్ళు కొనేవాడు.
వంశీకు,మానసకు తండ్రి శ్రీధర్ అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటాడు. నందితకు కూడా ఇస్తాడు.కాని ఆమె తీసుకోదు.
అందుకే వంశీనే ఆమెకి ఇష్టమైన నారింజ మిఠాయిలు,చింతపండు చాక్లెట్లు,పల్లిపట్టి,చకోడిలు కొనిచ్చేవాడు.
కాని రాధ విషయంలో మాత్రం ఆమె పుల్ ఐస్ తింటుంటే లాక్కొని మొత్తం కరిగాకా తిరిగిచ్చి ఏడిపించిన రోజులెన్నో ఉన్నాయి.
ఇలా చాలా విషయాల్లో నందితను వెనకేసుకొచ్చినతను రాధను మాత్రం బాగా ఏడిపించేవాడు.
అలా ఆటపట్టిస్తున్నప్పుడు ఆమె చక్రాల్లాంటి కళ్ళు ఉక్రోషంతో నింపేసుకొని గుండ్రంగా తిప్పుతూ అతని మీదకు కయ్యానికి వచ్చేది.
ఆ కళ్ళు చూడడం కోసమే మళ్ళీ మళ్ళీ ఆమెను ఏడిపిస్తూ ఉండేవాడు.
ఇప్పుడవన్ని గుర్తొస్తుంటే అతని కళ్ళు చెమ్మగిల్లాయి.
అతనికి ఏ కళ్ళైతే ఇష్టమో ఆ కన్నులే ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయాయి.
రాధను అతనలా చూడలేకపోతున్నాను.రాధ నిద్రపోవడంతో నందిత తనను సరిగ్గా పడుకోబెట్టి వంశీతో కలిసి బయటికి వస్తుంది.
"ఏం జరిగిందిరా" అని శ్రీధర్ గారు వివరం అడిగేసరికి తండ్రి పక్కకు చేరి మొత్తం మొదటి నుంచి చెప్తాడు.
అవతల వాళ్ళు రేపే నిశ్చితార్థం అనగానే ఒప్పేసుకునేసరికి శ్రీధర్ గారికి మనసు ఎందుకో కీడు శంకించి వాళ్ళ గురించి వివరాలు తెలుసుకోమని వంశీకి చెప్పడంతో అతను నిశ్చితార్థానికి రాకుండా ఆ పనిలో పడతాడు.
అతను పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు కాబట్టి అతని పరిస్థితి వివరించి కొన్ని రోజులు సెలవు కోరి వస్తాడు.
అక్కడి నుంచి వచ్చి ఆ ముఠా వాళ్ళు ఇచ్చిన వివరాలను బట్టి వాళ్ళ గురించి ఎంక్వైరీ మొదలు పెడతాడు.
ఆ వివరాలు అన్ని తప్పు అని తేలాయి. అప్పటికే నాలుగు రోజులు అయిపోయాయి.
అప్పట్లో ఫోనులు ఉండేవి కావు. ఊరికి ఒక టెలిఫోన్ బూత్ ఉండేది. దాన్ని కూడా అత్యవసరం అయితే తప్ప వాడే వాళ్ళు కాదు.
అలాంటి రోజుల్లో ఫోటోలు పంపుకోవడానికి పోస్ట్ ఆఫీస్ ఒకటే వారికి మధ్యమం.
శ్రీధర్ గారి నుంచి ఆ పెళ్ళికొడుకు ఫోటోలు వంశీకి అందేసరికి పెళ్ళి రోజు రానే వచ్చింది.
పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు ఎంతో కాలంగా వెతుకుతున్న ముఠాకు సంబంధించిన వ్యక్తులని వాళ్ళ నేర చరిత్ర అంతా వంశీకి వివరిస్తూ వాళ్ళను పట్టుకోవడానికి రామాపురం వస్తారు.
కాని అప్పటికే రాధను వాళ్ళు తీసుకెళ్ళి పోయుంటారు.
వాళ్ళు రాధను తీసుకొని ఒక ఇంటికి వెళ్తారు. రాధకు ఆ మనుషులు ఆ వాతావరణం నచ్చకపోయినా తప్పక వాళ్ళు చూపించిన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది.
కొంతసేపటికి పెళ్ళికొడుకు తండ్రిగా వచ్చినతను రాధ గదిలోకి వస్తాడు.
ఇష్టం లేకుండా జరిగినా పెళ్ళి పెళ్ళే కదా దానికి కట్టుబడి ఉండాలనుకుని "మావయ్య" అని మర్యాదపూర్వకంగా లేచి నిలబడుతుంది.
కాని అతని చూపు ఆమెకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమెను చేరి బలవంతం చేయబోయాడు.
పారిపోవాలి అని చూసినా గది బయటి వైపు తలుపులు వేసి ఉండేసరికి కుదరక అతన్ని బలంగా నెట్టేసి పై అంతస్తు అయినా జెంకకుండా కిటికి నుంచి కిందికి దూకేసింది.
ఆ ఇంటి వెనుక వైపు నుంచి పారిపోవాలని చూసింది. కాని అక్కడ అయిన శబ్దానికి మిగితావాళ్ళంత వచ్చేసారు.
పై మేడ నుంచి దూకేసరికి ఒక కాలు పట్టేసిన మానప్రాణలను కాపాడుకోవాలి అని పరుగు అందుకుంది.
కొంతసేపటికి వాళ్ళ కన్ను చూపు మేర్లలో నుంచి ఆమె తప్పించుకునేసరికి తల ఒక దిక్కున వెతకసాగారు.
వాళ్ళ నుంచి తప్పించుకుంది అనుకున్న తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని వాచిపోయిన కాలుని చూస్తూ ఆమె పరిస్థితికి బాధపడసాగింది.
కాసేపటికి పెళ్ళికొడుకుగా వచ్చినతను ఆమెకు ఎదురుగా రావడం గమనించి ఉరకాలి అని ప్రయత్నించిన ఆమె కాలు ఆమెకు సహకరించలేదు.
వాడు ఆమెను సమిపించగానే ఇక ఆమె తప్పించుకోలేదు అని అర్థం అయ్యి చిన్నప్పుడు ఆమెకు శ్రీధర్ గారు ప్రమాద పరిస్థితుల్లో ఎలా ధైర్యంగా ఉండి పోరాడాలి అని చెప్పాడో గుర్తు తెచ్చుకొని ఆమె నేర్చుకున్నా కరాటీ విద్యను ఉపయోగించి వాడితో పెనుగులాడింది.
ఆ క్రమంలో ఆమెకు ఎన్నో గాయాలు అయినా ఓటమిని ఒప్పుకోలేక పోరాడింది.
అప్పటికే చీకటి పడింది.ఆమె శక్తి సన్నగిల్లి పొరడలేకపోతుంటే వాడు ఆమెను అక్రమించబోయాడు.
అప్పుడే అటుగా వెళ్తున్న వాళ్ళు రాధను గమనించి ఆమెకు సాయం చేసి వాడ్ని చెట్టుకి కట్టి పడేస్తారు.
వాళ్ళు రాధను ఆసుప్రతికి తీసుకెళ్ళిన తెలియని చోట ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్న తను మందులు తీసుకుంటే ఏ మత్తు పదార్థాలు కలిసి ఉంటుందో అనే భయంతో ఆహారం వైద్యం లాంటివి ఏం తీసుకోలేదు.
నిద్ర పోవాలన్న ఏం జరుగుతుందో అనే భయంతో నీరసంగా ఉన్న అలానే మొండిగా కూర్చుంది.
ఆసుపత్రి వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో మిగిలిన పోలీసులు ఆమెను కలిసి వివరాలు కనుక్కొగా వంశీతో వెళ్ళిన పోలీసులు వెతుకుతున్న అమ్మాయి ఇంకా ఈమె ఒకరే అని నిర్ధారణ అయ్యి వాళ్ళకి విషయం తెలియజేశారు.
వంశీ అక్కడికి రాగానే "బావ" అని అతని వద్దకు వెళ్ళి ఏడుస్తూ స్పృహ కోల్పోయింది.
అంతవరకు మొండిగా ఉన్న ఆమెకు వంశీ రాకతో వచ్చిన ధైర్యంతో వైద్యం తీసుకొని ఊరి బాట పట్టింది.
ఇదంతా విన్న అక్కడి వాళ్ళ కళ్ళు వర్షించాయి.
"ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది" అనుకుంది శారదమ్మ.
"తనకు నేర్పిన విద్య తనకు ఉపయోగపడింది" అని గర్వంగా అనుకున్నాడు శ్రీధర్.
"రాధ కాబట్టి అంత ధైర్యంగా పోరాడింది...నేనైతేనా" అని ఆ ఊహకే భయపడిపోయి తన కూతుర్ని కూడా తన చెల్లిలా పెంచాలనుకుంది నందిత.
రాధకు గాయాలు మానేవరకు అక్కడే ఉండి తనతో రోజు కొన్ని ప్రేరణ పూరితమైన మాటలు చెప్తూ చిన్నప్పటి విషయాలు గుర్తు చేస్తూ ఆమె మానసిక పరిస్థితిని కూడా మామూలు స్థితికి తెచ్చాడు వంశీ.
ఆమె మళ్ళీ కాలేజీకి వెళ్ళడం మొదలు పెట్టాక రెండు రోజులు ఉండి మళ్ళీ ట్రైనింగ్ కు వెళ్ళిపోయాడు వంశీ.
అక్కడ ఉన్నని రోజులు వంశీ కళ్ళలో రాధ పై ఇష్టం రాధ కళ్ళలో వంశీ పై ఆరాధన శ్రీధర్ గారి దృష్టిని దాటిపోలేదు.
ఆరేళ్ళ తర్వాత....
వంటికి పట్టు వస్త్రాలు మెడలో పచ్చగా మెరుస్తున్న తాళి పాపిట్లో సింధూరం సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలు బిడియంతో తడబడుతున్న అడుగులతో భర్తతో కలిసి అత్తారింట్లోకి అడుగు పెట్టింది రాధ.
కూతురి మొహంలో సంతోషాన్ని చూసి "ఇంత మంచి సంబంధం పక్కనే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను.ఇకపై నా కూతుర్లు ఇద్దరు పిల్లపాపలతో సంతోషంగా ఉంటే అదే చాలు" అని మనస్పూర్తిగా అనుకున్నారు రాఘవయ్య గారు.
జంటగా ఇంట్లోకి అడుగు పెట్టిన రాధ వంశీకృష్ణలను చూసి ముచ్చటపడ్డారు శ్రీధర్ గారి దంపతులు.
ఈ ఆరేళ్ళలో వంశీ పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తూ అదే పట్నంలో మంచి ఇల్లు కట్టుకున్నాడు.
రాధ చదువు పూర్తయి చిన్న వయసులోనే కలెక్టర్ అయినా మహిళల జాబితాలో చేరిన తర్వాత ఆమె మనసు తెలుసుకున్నాకే ఆమెను పెళ్ళి చేసుకొని అతని ఇంటి ఇల్లాలిని చేసుకున్నాడు.
"రాధకున్న ధైర్యంలో నాకు అణువంత ఉన్న ఇలా మూగబోయిన మనసుతో మిగిలిపోయేదాన్ని కాదేమో.ఆడపిల్ల జీవితం బాగుండాలంటే ఎవరో వచ్చి ఉద్ధరించాల్సిన అవసరం లేదు.తనకు ఏ పరిస్థితినైనా ఎదురించగల గుండె ధైర్యం ఉండాలి.శ్రీధర్ మావయ్య నన్ను రాధను ఒకేలా పెంచాడు.నేను ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు తను వినియోగించుకుంది.మా ఇద్దరి జీవితాల్లో అంతే తేడా.మనకు బాగుపడ్డాలి అని పట్టుదల లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు.నా మనసు మా అమ్మ మనసు మూగమనసులు అయినా కనీసం నా చెల్లి మనసైన మా మనసుల్లా ముగబోలేదు.అక్కడికి సంతోషం" అనుకుంటూ మనస్పూర్తిగా రాధ వంశీకృష్ణల జంటను దీవించింది నందిత.
స్నిగ్ధ
