మంచి మనసులు
మంచి మనసులు
పడకగది రంగు రంగుల పూలతో అలకరించారు. మల్లెలు, గులాబీల సువాసన గదంతా నిండి ఉంది. ఎలాంటి వారైనా అందులోకి వెళ్తే, ఇంకేమైనా ఉందా..? మన్మధుడు ఆవహించడం ఖాయం. పరుపు పై మల్లెలు..ఎప్పుడెప్పుడు తమకి మోక్షం కలిగించే ఆ కొత్త జంట లోపలికి వస్తారా..! అని ఎదురుచూస్తున్నాయి. తలుపు మెల్లగా తెరుచుకుని, లోపలికి వెళ్ళాడు మహేష్..
పెళ్ళికి ముందు కన్న కలలు నిజం చేసుకునే ప్లేస్, టైం ఎంతో అందంగా అక్కడ ఫిక్స్ చేసారు పెద్దలు. ఆ పూల సువాసనకి మతెక్కిన మహేష్.. తన భార్య రాణి కోసం చూస్తున్నాడు. పాతిక సంవత్సరాల నుంచి తనలోని అణచుకున్న కోరికలు..ఇంక మా వల్ల కాదని.. బయటకు కేకలు పెడుతున్నాయి. ఇంకా కొంత సేపు ఆగమని వాటికి నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు మహేష్..
ఈలోపు అనేక నవ్వులతో తన భార్యని లోపలికి పంపించారు. తల దించుకుని మంచానికి ఒక వైపు వచ్చి కూర్చుంది రాణి. తనని ఇప్పటివరకూ మూడుసార్లు చూసాడు మహేష్ అంతే..!పెళ్ళిచుపులలో..ఎంగేజ్ మెంట్ లో..తర్వాత ఫోన్ లో ఒక రెండు సార్లు మాట్లాడాడు అంతే. ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడే ఒంటరిగా తనని కలవడం..అంతా అలా జరిగిపోయింది..
మంచం మీద ఇద్దరూ రెండు దిక్కులకు కూర్చున్నారు. చొరవ తీసుకుని, మాటలు మొదలు పెట్టాడు మహేష్..
"రాణీ...! ఇలా రా...నా దగ్గరకు.." అన్నాడు మహేష్
రాణీ ఎందుకో దగ్గరకు రాలేదు..ఒక రెండు అంగుళాలు జరిగిందంతే..
"ఏమైంది రాణి..నీ కంట్లో నీళ్ళా..నేను ఏమైనా తప్పన్నానా..?"
"నన్ను క్షమించండి...నేను మీకు తగను.."
"ఎందుకు అలా అంటున్నావు..?"
"నేను పూజకి పనికిరాని పువ్వుని..మీలాంటి మంచివారి పక్కన నేను ఉండడానికి తగను..మా వాళ్ళు నన్ను ఒప్పించి పెళ్ళి చేసారు.."
"ఎందుకు అలా అనుకుంటున్నావు..? అసలు ఏం జరిగింది..?"
"నా చిన్నతనంలో..ఏమీ తెలియని వయసులో..నన్ను మా దగ్గర బంధువు నన్ను వశం చేసుకున్నాడు. ఊహ తెలిసిన తర్వాత, నాలో నేను చాలా కుమిలిపోయాను..పెళ్ళి వద్దని అనుకున్నాను..కానీ మా ఇంట్లో ఒప్పించి పెళ్ళి చేసారు..నన్ను క్షమించండి.." అంది రాణి
"చిన్నతనంలో నీకు తెలియకుండా..నీ ప్రమయం లేకుండా జరిగినదానికి నిన్ను నేను తప్పుపట్టను. నువ్వు తలచుకుంటే, ఈ విషయం నా దగ్గర దాచి..నాతో మాములుగా ఉండేదానివి. కానీ, అక్కడే నీ మంచితనం తెలుస్తుంది. అంతా మరచిపోయి..నాతో కొత్త జీవితం ప్రారంభించు" అని రాణీని దగ్గరకు తీసుకున్నాడు మహేష్
********

