Thanneeru Sasi

Drama

4  

Thanneeru Sasi

Drama

మీరు మరచిన ఒక ప్రేమ

మీరు మరచిన ఒక ప్రేమ

2 mins
701


ఎలా వచ్చేస్తారో ఈ బుజ్జి బంగారాలు💕 నన్ను అమ్మమ్మను చేస్తూ,ఎప్పుడో కోల్పోయిన అమ్మతనం కనకుండానే ఒడి చేరిన బిడ్డలను చూసి పట్టుచీరల్లో దాచిన పాత చింతాల్ పరిమళం లాగా గుప్పుమంటూ మనసు నుండి లేస్తుంది.అప్పటి దాకా ఉద్యోగం,ఇల్లు ఇవే పెద్ద పని అని పరుగులు తీసే నేను ఇదిగో ఈ చిరునవ్వుల రాకతో కొత్త రెక్కలు కట్టుకుని ఎగిరాను,ముని వేళ్ళ నిమిరింపులో అదిగో ఆ స్వర్గాన్ని తాకి వచ్చాను.రాత్రి మొత్తం వాళ్ళతో నిద్ర లేక పోయినా ,నిద్ర పోయే బిడ్డను అలాగే చూడకు అన్నా,అలాగే చూడటం పెరిగిన మా అమ్మాయి మళ్లీ అచ్చు అదే ముక్కు,బుగ్గలతో నా ఒడిలోకి వచ్చినట్లు.వాళ్ళు నవ్వితే నాకు నవ్వు,వాళ్ళు ఏడిస్తే కాలి బొటనవేలుకు ఎదురురాయి తగిలినంత నొప్పి!చేతుల్లోనే,కళ్లలోనో బుజ్జి పిట్టలకు గూడు కట్టి పిట్ట సాకినట్లు ఐదు నెలల కంటిపాపలుగా మోసాను.తాతయ్య సంబరాలు,పిల్లల ఊ కొట్టడాలు, గుండ్రంగా తిరగడాలు,వెచ్చటి లాలలు,తియ్యటి జోలలు,వెన్నతో మర్దన,సాంబ్రాణి దూపాలు ఎన్ని రాచమర్యాదలో ఈ నా బుజ్జి వరాల కొండలకు.గుర్తు పట్టేస్తున్నారు ఇంకా పేరు పెట్టక పోతే ఎలా అని,రండహో అని పిలుపులు పిలిచి అందరికి విందు భోజనాలు పెట్టడం.ఫంక్షన్ హాల్ మొత్తం రంగుల బూరలతో ,వాళ్ళ ఫ్లెక్సి లతో నిండి ,ఆల్చిప్ప ఉయ్యాలలో ఊగుతూ ఉంటే చూసేవాళ్ళకి అందం అలంకరణ లో కాదు నా కళ్ళలో కనిపించింది.శ్రీ వేద్, మహన్య అని పేర్లు పెట్టి దీవించి బంగారు మెడలో వేస్తూ ఉంటే వారి ముందు బంగారే విలువ తక్కువ అనిపించింది. చూస్తుండగానే మెల్లిగా బోర్లా పడిపోయారు.ముత్తైదువులను పిలిచి బక్ష్యాలు పంచితే వేడుక మొత్తం వాళ్ళ నవ్వులు,నా నవ్వులు.అందరి ముందు వాళ్ళు బోర్ల పడగానే ఎవరెస్టు ఎక్కినంత చప్పట్లు అందరి నుండి......ఆనందానికి కూడా కామా ఉంటుందని ఐదో నెలలో తెలిసింది.చీపురు పుల్లలు అంత చేతులతో,గుడిలో అయ్యవారు చేసిన చక్ర పొంగలి అంత మెత్తటి పసికందులుగా నా ఒడిలోకి వచ్చారు.ఈ రోజు బూరెల బుగ్గలతో నన్ను గుర్తు పట్టి నవ్వుతూ ఉంటే.... ఎంత వాళ్ళ పిల్లలు అయితే మాత్రం గుండె కోసి వాళ్ళ చేతిలో పెట్టినట్లు వాళ్లకు ఎలా ఇచ్చేస్తాము.మాకు హక్కు లేదే అనుకో,వాళ్ళ ఇంటి పేరే అనుకో,కనక పోయినా కన్నతల్లి లాగా సాకితిమే, ఎలా వదిలి పెట్టేది?దూడను వదిలి ఆవును లాగేస్తున్నంత బాధ.ఏమిటో పిచ్చి అమ్మమ్మలం!ఇరవై ఏళ్ళ సాకిన అమ్మాయినే ఆడ...పిల్ల అని అక్కడకు పంపించాము. ఐదు నెలల బిడ్డ ఏ పాటి బంధం!అసలు కంటే వడ్డీ ముద్దు అని ఇందుకే అంటారు కాబోలు."వెళ్లి రండిరా పాపలు. సెలవులకు మీ అమ్మమ్మ వాకిలికే కళ్ళు అతికించి ఎదురు చూస్తూ ఉంటుంది అని మర్చిపోకండి.మీకు ఆకలి అయినపుడు మీ అమ్మలాగా నాకు లోపల పాలు పొంగక పోవచ్చు కానీ మీ మాటలు వింటే మనసు ఉప్పొంగిపోతుందిరా!త్వరగా వచ్చెయ్యండి"......ప్రేమతో...💕🎉మీ అమ్మమ్మ


Rate this content
Log in